
రెండు రోజులపాటు సదస్సు నిర్వహణ
హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ఫోకస్
సదస్సును ప్రారంభించనున్న సీఎం రేవంత్, కేంద్రమంత్రి పీయూష్
సాక్షి, హైదరాబాద్: బయో ఏషియా సదస్సుకు హైదరాబాద్ ముస్తాబైంది. మంగళవారం నుంచి రెండు రోజులపాటు నగరంలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో జరగనున్న బయో ఏషియా 22వ ఎడిషన్ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 50 దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతి నిధులు హాజరుకానున్నారు. ఈసారి బయో ఏషియా సదస్సుకు ‘క్యాటలిస్ట్ ఆఫ్ ఛేంజ్..ఎక్స్‌పాండింగ్ గ్లోబల్ హెల్త్‌కేర్ ఫ్రాంటియర్స్’(మార్పు సాధిద్దాం..ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దాం) అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు.
సదస్సు ప్రారంబోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, క్వీన్స్‌ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జీనెట్‌యంగ్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, జీ20 షెర్పా అమితాబ్‌కాంత్‌లు పాల్గొంటారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సంస్థల అధిపతులు, సంబంధిత రంగాల్లో నిపుణులు, ఆవిష్కర్తలు ఈ వేదికపై జరిగే చర్చలు, సమావేశాల్లో పాలుపంచుకుంటారు.
లైఫ్‌సైన్సెస్ రంగంలో వస్తున్న అధునాతన మార్పులు, శాస్త్ర పురోగతిపై చర్చిస్తారు. హెల్త్‌కేర్ రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, లైఫ్‌సైన్సెస్ భవిష్యత్‌ను నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ తదితరాలను ఎజెండా అంశాలుగా నిర్ణయించారు.
బయో ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, వైద్య పరికరాలు, అధునాతన చికిత్స విధానాలు, అత్యాధునిక వైద్యం, ఆరోగ్య సంరక్షణ విధానాలపై చర్చించనున్నారు. ప్రపంచస్థాయిలో హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ హబ్‌గా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వైద్య పరిశోధనలు, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఎక్సలెన్స్‌లో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో బయో ఏషియా–2025 సదస్సు లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్ రంగంలో మరో మైలురాయిగా నిలవనుంది.
ఇన్నోవేషన్ జోన్ ప్రత్యేకం
ఈ సదస్సులో ప్రత్యేకంగా ఇన్నోవేషన్ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలతో రూపొందించిన దాదాపు 700 స్టార్టప్‌లు దీనికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో ఎంపిక చేసిన 80 స్టార్టప్‌లను ఈ సదస్సులో ప్రదర్శించేందుకు అవకాశం కల్పించారు. హెల్త్‌కేర్ రంగంలో మెడికల్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, డిజిటల్ హెల్త్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే లక్ష్యానికి అనుగుణంగా వీటిని ఎంపిక చేశారు. కొత్త స్టార్టప్లకు ప్రపంచస్థాయి గుర్తింపుతోపాటు, అద్భుతమైన అవకాశాలను ఈ సదస్సు అందించనుంది. పరిశ్రమల వృద్ధి, సహకారం, అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించేందుకు బయో ఏషియా సదస్సు సరికొత్త మార్గదర్శనం అందించనుంది.
ఇది అత్యంత ప్రభావంతమైన సదస్సుగా నిలుస్తుంది : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
చరిత్రలోనే ఇది అత్యంత ప్రభావవంతమైన సదస్సుగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. ప్రపంచస్థాయి ఆవిష్కరణలు, ఆలోచనలన్నీ ఒకే వేదికపై పంచుకునే అరుదైన అవకాశాన్ని బయో ఏషియా అందిస్తుందన్నారు.
– ఈ సదస్సుకు కొత్త సార్టప్‌ల నుంచి అంచనాలకు మించిన స్పందన వచ్చిందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు. పేరొందిన కంపెనీలు, ప్రముఖ సంస్థలు ఈ సదస్సులో భాగస్వామ్యం పంచుకోవటం ఉత్సాహంగా ఉందన్నారు.
– లైఫ్‌సైన్సెస్ రంగంలో తెలంగాణ ఇప్పటికే ముందంజలో ఉందని బయో ఏషియా– 2025 సీఈఓ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తెలిపారు. ఈసారి సదస్సు ల్యాండ్‌మార్క్ ఎడిషన్ ఉండబోతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment