మొదటికే మోక్షం లేదు!
సాక్షి, సిటీబ్యూరో: ‘చెప్పేవారికి వినేవారు లోకువ’ అనే నానుడి కొన్ని సందర్భాల్లో నిజమేననిపిస్తుంది. ఈ అంశం అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ప్రధాన రహదారుల మార్గాల్లో సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్‌ఎంపీ) కాంట్రాక్టు ఏజెన్సీల గడువు ముగిసిపోవడంతో తదుపరి చర్యల కోసం జీహెచ్‌ఎంసీ రోజుకో ఆలోచన చేస్తోంది. రోడ్లన్నీ బాగున్నందున ఇప్పటికిప్పుడు సీఆర్‌ఎంపీ అవసరం లేదని తొలుత భావించారు. జీహెచ్‌ఎంసీయే సాధారణ నిర్వహణ, గుంతల పూడ్చివేతల వంటి పనులు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఆర్‌ఎంపీ కింద చేపట్టిన పనులన్నీ పూర్తి కానిదే బిల్లులు చెల్లించవద్దని, అన్ని పనులూ పూర్తయిందీ లేనిదీ నివేదిక పంపాలని ఆదేశించినా పూర్తి చేయని పనులను పట్టించుకోలేదు. ఒప్పందం మేరకు ఫుట్‌పాత్‌లు, స్వీపింగ్, గ్రీనరీ తదితర పనులన్నీ చేయాల్సి ఉన్నా అవి పూర్తి కాలేదు. రీకార్పెటింగ్ తప్ప మిగతా పనులు నూరు శాతం పూర్తయిన దాఖలాల్లేవు. నిర్ణీత వ్యవధిలో పనులు చేయనందుకు ఏమేర పెనాల్టీలు విధించారో తెలియదు. గడువు ముగియ వస్తుండగా మార్కింగ్‌లు వంటివి చేపట్టారు. పూర్తి చేయని పనులేవో వెల్లడించి, పూర్తి చేయించాల్సి ఉండగా, వాటిని పట్టించుకోకుండా ఆర్నెల్ల నిర్వహణకు అని కొత్త టెండర్లు పిలిచారు.
రెండు ప్రతిపాదనలు..
తాజాగా స్టాండింగ్ కమిటీ ఆమోదం కోసమంటూ మరో అయిదేళ్లు సీఆర్‌ఎంపీ రెండో దశకు అంటూ రెండు రకాల ప్రతిపాదనలు ఉంచారు. అందులో ఒకటి దాదాపుగా పాత రోడ్లనే తిరిగి మళ్లీ నిర్వహణకు ఇవ్వడం. రెండోది వాటితో పాటు కొత్త రోడ్లను అదనంగా చేర్చడం. పాత రోడ్లకే అయితే 744 కి.మీ. నిర్వహణకు అంచనా వ్యయం రూ.2491 కోట్లు కాగా, కొత్త రోడ్లు కూడా కలిపి 1142 కి.మీ. నిర్వహణకు రూ.అంచనా వ్యయం రూ.3825 కోట్లు.
డీసిల్టింగ్ కూడా..
మొదటి దశలో స్వీపింగ్, ఫుట్‌ఫాత్‌లు, గ్రీనరీ పనులే చేయకపోగా రెండో దశ కింద అవసరమైన ప్రాంతాల్లో వరద కాల్వల నిర్మాణం, ఆధునికీకరణ పనులతో పాటు వాటి నిర్వహణ కూడా చేస్తాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఇప్పటికే ఉన్న వరద కాల్వల నిర్వహణతో పాటు పూడికతీత పనులు కూడా చేస్తాయన్నారు. ప్రత్యేంగా పూడికతీత టెండర్లు పొందిన ఏజెన్సీలే ఆ పనులు సవ్యంగా చేయడం లేదు. గడచిన అయిదేళ్లుగా సీఆర్‌ఎంపీ ఏజెన్సీలు స్వీపింగ్, ఫుట్‌ఫాత్‌ల పనులే చేయకపోగా కొత్తగా ఎంపికయ్యే ఏజెన్సీలు డీసిల్టింగ్ కూడా చేస్తాయనడం కేవలం అంచనా వ్యయం పెంచేందుకే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రతిపాదనల్లో ఏదో ఒకటి ఖరారు చేసి అవసరమైన నిధులకు పరిపాలన అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదించాల్సిందిగా గురువారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందుంచనున్నారు.
సీఆర్‌ఎంపీ మార్గాల్లో పూడిక కూడా తీస్తారట!!
ఇప్పటికి గ్రీనరీ, స్వీపింగ్‌లకే దిక్కూ దివాణంలేదు
గడువు ముగిసినవాటి నిర్వహణకు ఆర్నెల్లకు టెండర్లు
Comments
Please login to add a commentAdd a comment