అభిరుచినే వృత్తిగా చేసుకునే అవకాశం కొందరికే దొరుకుతుంది. ఆ కొందరిలో ఫ్యాషన్ డిజైనర్, స్టయిలిస్ట్ ప్రజన్య ఆనంద్‌ను చేర్చవచ్చు! అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలకు రూపం ఇస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో తన సిగ్నేచర్‌ను క్రియేట్ చేసుకున్న ఆమె గురించి..
చెన్నైకి చెందిన ఒరు పెన్ (ఒక వనిత) ప్రజన్య. ఆమెకు ఫ్యాషన్ అన్నా, ప్రయాణాలు అన్నా చాలా ఇష్టం. చిన్నప్పుడు తన తోబుట్టువులకు, ఫ్రెండ్స్‌కి రకరకాల జడలువేసేది. మేకప్ చేసి వాళ్లను మురిపించి, తాను మురిసిపోయేది. ఊహ తెలిశాక ప్రయాణాల్లోని మజాను ఆస్వాదించసాగింది. కాలేజ్ డేస్ నుంచి సోలో ట్రావెల్‌ను స్టార్ట్ చేసింది. అలా ప్రయాణాల్లో తనకు పరిచయమైన కళలు, తెలుసుకున్న సంస్కృతి, కనిపించిన ఒరవడి అన్నిటితో స్ఫూర్తి పొంది సరికొత్త డిజైన్స్‌కు రూపమిచ్చేది. అప్పుడనుకుంది తన కాలింగ్ ఫ్యాషనే అని! సెకండ్ థాట్ లేకుండా పర్ల్ అకాడమీలో చేరింది.
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర ఇంటర్న్‌గా జాయిన్ అయి పనిలో మెలకువలను నేర్చుకుంది. తర్వాత అవకాశాల వేట మొదలుపెట్టింది. నాలుగేళ్లు ఫ్యాషన్ ఇండస్ట్రీ కారిడార్‌లోనే గడిపింది. అవకాశాలను అందుకోవడం అంత సులువుకాదని గ్రహించింది. దాంతో దాన్నో సవాలుగా తీసుకుంది. ప్రతి అడ్డంకిని లక్ష్యానికి మెట్టుగా మార్చుకుంది. ఆ పట్టుదలకు చాన్స్‌లు చలించి.. ప్రజన్య చెంత చేరాయి. తన డిజైన్స్‌కున్న ప్రత్యేకతను చూపింది.
కాస్ట్యూమ్స్‌లోనే కాదు జ్యూల్రీ, మేకప్, హెయిర్ స్టయిల్.. ఇలా స్టయిలింగ్‌కి సంబంధించిన ప్రతి రంగంలోనూ తనకున్న పట్టును ప్రదర్శించింది. నాలుగేళ్ల నిరీక్షణ విలువేంటో చాటింది. ‘ప్రజన్య’ పేరుతో లేబుల్‌నూ లాంచ్ చేసి, బాలీవుడ్ సెలబ్రిటీలను ఆకర్షించింది. తన అద్భుతమైన డిజైన్స్‌తో ఐశ్వర్యా రాయ్, నయనతార, హృతిక్ రోషన్‌ల మెప్పు పొందింది. ఇంకెందరికో అభిమాన స్టయిలిస్ట్ అయింది. ‘డిజైన్డ్ స్టూడియో’ పేరుతో ఫ్యాషన్ స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ ఇవ్వటమూ ప్రారంభించింది. ఔత్సాహికుల కోసం వర్క్‌షాప్స్‌ను కూడా నిర్వహిస్తోంది ప్రజన్య.
Comments
Please login to add a commentAdd a comment