
కొత్త దారి
కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి చాలా మంది ఇష్టపడరు. ‘ఎందుకొచ్చిన రిస్కు’ అని కొందరు భయపడతారు. ‘ఏమైనా సరే’ అని కొందరు ధైర్యంతో బయటికి వస్తారు. విజేతలుగా నిలుస్తారు. టీవీ స్టార్ తేజస్వీ ప్రకాష్ సెలబ్రిటీ మాస్టర్ చెఫ్‌లో భాగం కావడం ద్వారా కొత్త దారిలోకి వచ్చింది.
‘సెలబ్రిటీ చెఫ్ ద్వారా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి అవకాశం వచ్చింది. పరిచయం లేని వంటకాలతో ప్రయోగాలు చేయడం సరదాగానే కాదు కష్టంగానూ ఉంటుంది. అయితే సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తప్పకుండా సక్సెస్ కాగలం’ అంటుంది తేజస్వి.
సోనీ టీవి ‘మాస్టర్‌చెఫ్ ఇండియా’ పుణ్యమా అని మరచి పోయిన ఎన్నో వంటకాలను, వంట లకు సంబంధించి బాల్య జ్ఞాపకా లను గుర్తు చేసుకునే అవకాశం ఆమెకు వచ్చింది. టీవీ స్టార్ తేజస్వి ‘చెఫ్ స్టార్’గా కూడా బోలెడు పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.