master chef india
-
గృహిణి అంత చులకనా? అందుకే ఇలా చేశా!
‘కలలు కనడం మానవద్దు. కలలను సాకారం చేసుకోవాలంటే కష్టపడాలని మరువద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆశలకలను త్యాగం చేయవద్దు’ అంటోంది అరుణా విజయ్. తోటి గృహిణులకు ఆమె ఇస్తున్న సందేశం ఇది. గృహిణి అంటే ఏ పనీ రానివాళ్లనే అపోహతో కూడిన వెక్కిరింతకు చెంప చెళ్లుమనిపించింది అరుణ. ఏ సోషల్‌మీడియా అయితే ఆమెను తక్కువ చేసి మాట్లాడిందో అదే సోషల్ మీడియాలో ఇప్పుడామె ఒక ఇన్ఫ్లూయెన్సర్. మాస్టర్ షెఫ్ టాప్ 4 గా నిలిచి ప్రశంసలందుకుంటోంది. ఆమె వంటలకు వ్యూస్, లైక్స్‌తో విజేతగా నిలిచింది. అపోహ తొలగింది! చెన్నైలో పుట్టి పెరిగిన అరుణ 22 ఏళ్లకు పెళ్లి చేసుకుని ఇంటికి పరిమితమైంది. పదిహేనేళ్ల వయసు నుంచే వంటగదిలో ప్రయోగాలు చేసిన అరుణ భార్యగా, తల్లిగా ఇంటి బాధ్యతల నిర్వహణలో విజయవంతమైన మహిళ అనే చెప్పాలి. ఆమెది ఉద్యోగం చేసి డబ్బు సం పాదించాల్సిన అవసరం లేని జీవితమే. కానీ గృహిణి అనగానే తేలిగ్గా పరిగణించే సమాజం ఆమెకు చేసిన గాయాలెన్నో. తాను ఏదో ఒకటి సాధించాలనే కోరిక రగులుతూనే ఉండేదామెలో. ఆ కోరికే ఆమెను మాస్టర్ షెఫ్ ఇండియా 2023పోటీలకు తీసుకెళ్లింది. పోటీదారుల మీద రకరకాల కామెంట్లు రువ్విన సోషల్ మీడియా అరుణను ‘ఈవిడా... ఈవిడ గృహిణి’ అంటూ చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదనే భావంతో తేలిక చేసింది. మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్లలో అరుణకు ఎదురైన చేదు అనుభవం ఇది. దక్షిణ భారత వంటలు ఇడ్లీ, దోశెలతో ఆమె ప్రయోగాలు న్యాయనిర్ణేతల నోట్లో నీళ్లూరించాయి. పోటీదారుల్లో నాలుగవ స్థానంలో నిలిచింది. పోటీ పాల్గొన్న నాటికి టాప్ ఫోర్లో నిలిచిన నాటికి మధ్య ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ‘‘సోషల్ మీడియా కామెంట్లకు మనసు గాయపడి కన్నీళ్లతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని’ చెప్పింది. మన సమాజంలో ‘గృహిణి అంటే ఏమీ తెలియని వ్యక్తి’ అనే అభిప్రాయం బలంగా ముద్రించుకుపోయి ఉంది. ఆ అపోహను తుడిచి పెట్టగలిగాను. గృహిణుల మనోభావాలకు నేను గళమయ్యాను’’ అంటోంది అరుణా విజయ్. View this post on Instagram A post shared by Aruna Vijay (@aruna_vijay_masterchef) -
కుకింగ్ ఈజ్ థెరపిటిక్
ఆకాష్ మురళీధరన్‌కు చిన్న వయసులోనే వంటలపై ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోయి ప్రపంచ వంటకాల గురించి కూడా తెలుసుకునేలా చేసింది. ప్రపంచ వంటకాల గురించి కాచి వడబోసిన చెన్నైకి చెందిన ఆకాష్ దక్షిణ భారతీయ వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి నడుం కట్టాడు. ‘మాస్టర్ చెఫ్ ఇండియా’ టైటిల్ గెలుచుకున్నాడు. ‘కుకింగ్ ఈజ్ థెరపిటిక్’ అంటున్న ఆకాష్‌కు వంటలు చేయడం పాషన్ మాత్రమే కాదు. ప్రాణవాయువు కూడా...వంటగదిలో బామ్మ స్వీట్ తయారు చేస్తుంటే చిన్నప్పుడెప్పుడో చూశాడు ఆకాష్. ‘ఇక్కడ నీకు ఏం పని?’ అని గద్దించలేదు బామ్మ. ‘ఈ స్వీటును ఇలా తయారు చేయాలి నాయనా’ అంటూ వివరించింది. ఇక అప్పటి నుంచి రకరకాల వంటలు. స్వీట్ల తయారీపై ఆకాష్‌కు ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తి, నేర్చుకున్న విద్య ఊరకే పోలేదు. బెంగళూరులో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో బాగా ఉపయోగపడింది. తనకు ఇష్టమైన వంటలు చేసి ఆ రుచులను ఆస్వాదించడంతో పాటు వంటల్లో రకరకాల ప్రయోగాలు చేసేవాడు.రుచుల ఆస్వాదనలో ఆనందమే కాదు వంట చేస్తున్న సమయంలో ఏకాగ్రత పెరగడం, మనసు ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉండడం గమనించాడు ఆకాష్. ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేసిన ఆకాష్ ఒక ఆర్కిటెక్చర్ ఫర్మ్‌లో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. యానిమేషన్లో డిప్లామా కూడా చేసిన ఆకాష్ ఆ తరువాత వంటలపై తన పాషన్ను సీరియస్‌గా తీసుకున్నాడు. కొత్త కొత్త వంటకాల గురించి మరింత ఆసక్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టాడు.ఇటలీలోని మిలాన్‌లో ఫుడ్ డిజైన్‌లో మాస్టర్స్ చేశాడు. పాత వంటకాలకు కొత్త ఫ్లేవర్ జోడించడాన్ని తన ప్రత్యేకతగా చేసుకున్నాడు. యూరప్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఎన్నో వంటకాల గురించి తెలుసుకునే అవకా«శం వచ్చింది. ఇది తన భవిష్యత్ బాటకు బాగా ఉపయోగపడింది. ‘ఇండియాకు ఆవల ఫుడ్‌ను ఎలా చూస్తారు?’ అనే విషయాన్ని లోతుగా తెలుసుకోవడానికి కూడా తన ప్రయాణాలు ఉపయోగపడ్డాయి.నెదర్లాండ్స్‌లో ఒక ఫుడ్ డిజైనర్‌తో కలిసి పనిచేశాడు. ‘ప్రపంచంలోని ఎన్నో వంటకాల గురించి తెలుసుకున్న నాకు దక్షిణ భారత వంటకాల రుచులను ప్రపంచానికి పరిచయం చేయాలని గట్టిగా అనిపించింది’ అంటాడు ఆకాష్. మనం ఆస్వాదించే వంటకాలకు సంబంధించిన ఆసక్తికరమైన కథలను ఆధునిక పద్ధతులలో చెప్పడానికి ‘విజా మెడై’ పేరుతో మల్టీడిసిప్లినరి స్టూడియోను మొదలు పెట్టాడు. ఈవెంట్ డిజైన్, డెకర్, మెనూ క్యురేషన్, ఔట్ఫిట్ డిజైన్, స్టైలింగ్, క్రియేటివ్ డైరక్షన్లు ఈ స్టూడియో ప్రత్యేకత.తన ‘100–డే కుకింగ్ ప్రాజెక్ట్’లో భాగంగా మనం మరచిపోయిన ఎన్నో కూరగాయలను వెలుగులోకి తెచ్చాడు. సౌత్ ఇండియన్ ఫుడ్ రుచుల గురించి వివరంగా చెప్పడానికి ‘మాస్టర్‌చెఫ్ ఇండియా–తమిళ్’ షోలో పాల్గొన్నాడు. ఆకాష్ వంటనైపుణ్యానికి ఫిదా అయిన జడ్జీలు స్టాండింగ్ వొవేషన్ ఇచ్చారు. ‘మాస్టర్‌చెఫ్ ఇండియా–తమిళ్’ టైటిల్ గెలుచుకున్నాడు ఆకాష్. చిన్నప్పుడు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్(ఏడీహెచ్‌డీ)తో బాధ పడిన ఆకాష్‌కు వంట చేయడం అనేది చికిత్సలా ఉపయోగపపడింది. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. -
Nikitha Umesh: స్ట్రాంగ్‌గా ఉంటేనే మనుగడ
సాధారణంగా ఇళ్లలో ఆడవాళ్లే వంటలు చేస్తారు. వృత్తిపరంగా చూస్తే మగ చెఫ్‌లే ఎక్కువ కనిపిస్తారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉంటున్న చెఫ్ నిఖితా ఉమేష్‌ను అడిగితే... ‘‘నేను చెఫ్‌గా ఈ వృత్తిని ఎంచుకోవాలనుకున్నప్పుడు ‘గిన్నెలు కడగడానికి వెళుతున్నావా’ అని వ్యంగ్యంగా అన్నవాళ్లే ఇప్పుడు నా వంటలు రుచి చూసి చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు’’ అని వివరించారు. మాస్టర్ చెఫ్ ఇండియా (తెలుగు) జ్యూరీ ప్యానెల్లో స్థానం దక్కించుకున్న నిఖిత ఉమేష్ ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు. ‘‘చదువుకునే రోజుల్లో టీవీలో మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా చూసేదాన్ని. ఇంట్లో రకరకాల వంటలు ప్రాక్టీస్ చేసేదాన్ని. ఆ ఆసక్తితోనే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను. దుబాయ్, సింగపూర్లలో శిక్షణ కోసం రెండేళ్లపాటు పనిచేశాను. పేస్ట్రీ ప్రొఫెషనల్ అండ్ మాస్టర్ చాకోలేటియర్గా హైదరాబాద్‌లో ఏడేళ్లు పని చేశాను. అలా హైదరాబాద్ పేస్ట్రీ చెఫ్‌గా, క్యుజిన్ డిజైనర్‌గా పేరొచ్చింది. ఏడాది క్రితం హైదరాబాద్‌లో మావారితో కలిసి మూడు పేస్ట్రీ బ్రాంచ్‌లు ఏర్పాటు చేశాను. ఏ రంగమైనా మనల్ని మనం నిత్యం నిరూపించుకుంటూనే ఉండాలి. అందులోనూ ఆహారం విషయానికి వస్తే మరీ ప్రత్యేకం. ఇంట్లో తిన్నవారు ఆ వంట రుచి చెప్పేంతవరకు వంట వండినవారు ఒక తెలియని ఒత్తిడిని పీలవుతుంటారు. అలాగే, మేం ప్రతి రోజూ మా పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఎంతోమందికి చేరవవుతుంటాం. కాబట్టి, ఈ రంగంలోనూ ఒత్తిడి ఉంటుంది. నైపుణ్యంతోపాటు రుచిగా అందించాలనే భావన కూడా మమ్మల్ని గెలిపిస్తుంటుంది. వర్క్ బాగుంటేనే... ఐటీసీ హోటల్స్‌లో చెఫ్‌గా వర్క్ చేసినప్పుడు నా వయసు 22 ఏళ్లే. టీమ్‌లో పద్దెనిమిది మంది చెఫ్స్ ఉండేవారు. అందరూ మగవాళ్లే. అందులో సీనియర్స్ కూడా ఉండేవారు. నా వర్క్ బాగుంటేనే వారందరూ నన్ను గౌరవిస్తారు. ఈ విషయంలో ఎప్పుడూ నేను అలర్ట్‌గా ఉండేదాన్ని. వారికి తగిన సూచనలు ఇస్తూ ఏడేళ్లు పనిచేశాను. ఈ వర్క్‌లో శారీరక శ్రమతో పాటు టైమ్‌కు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది కాబట్టి కుటుంబం కూడా సపోర్ట్‌గా ఉండాల్సి ఉంటుంది. నిజానికి ఇళ్లలో వంటలు చేసేవాళ్లు ఆడవాళ్లే కానీ. హోటల్స్‌లో వృత్తిపరంగా చెఫ్‌లుగా ఉన్న మహిళల శాతం మాత్రం తక్కువగానే ఉంది. కొత్తగా నేర్చుకుంటూ.. నేను బెంగళూరులో పుట్టి పెరిగాను. అమ్మ ప్రభ డిఫెన్స్‌లో సీనియర్ అడ్మిన్ ఆఫీసర్, నాన్న ఉమేష్ ఎల్ఐసీ రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్. నేను కన్నడ అమ్మాయిని కాబట్టి తెలుగు రాదు. మాస్టర్ చెఫ్ ఇండియా అవకాశం వచ్చాక తెలుగు నేర్చుకున్నాను. అందుకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. చెఫ్ కమ్యూనిటీ నుంచి ఎవరో నన్ను రికమండ్ చేసి ఉంటారు. ఆ విధంగా నాకు జ్యూరీలో సభ్యురాలిగా ఉండే అవకాశం లభించింది. పనిలో చూపించే శ్రద్ధ, తపన మనల్ని విజయమార్గంలో తప్పక నడిపిస్తుంది’’ అని వివరించారు ఈ మాస్టర్ చెఫ్. ఆమె అనుభవ పాఠాలు మరికొందరికి విజయ సోపానాలు అవుతాయి కదా... – నిర్మలారెడ్డి -
వైరల్: అవునండీ... ఇది బిర్యానీ టీ
వేడి వేడిగా బిర్యానీ తింటే ఎంత మజా? ఆ తరువాత వేడి వేడిగా టీ తాగుతుంటే ఎంత మజా! ఆ మజాను ఈ మజాను మిక్స్ చేసి ‘బిర్యానీ టీ’ తయారుచేసింది ‘మాస్టర్ చెఫ్ 4’ విజేత నేహాదీపక్షా. టీ ఆకులు, దాల్చిన చెక్క, సోంపు, నల్లమిరియాలు, యాల కులు... మొదలైన వాటితో నేహా తయారు చేసిన ఈ ‘బిర్యానీ టీ’ చవులూరిస్తూ నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా నెటిజనులు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ‘ఆహో ఓహో!’ అని పొగడ్తల దండకం అందుకుంటే, మరి కొందరు ‘బిర్యానీ టీ అంటే ఏమిటో కాదు వేడి వేడి బిర్యానీని వేడి వేడి టీలో కలపడం’ అని జోక్ చేస్తున్నారు. ఐస్‌క్రీమ్ రోల్ మేకర్ కూలింగ్ పాన్‌ను ఉపయోగించి ఒక చెఫ్ తయారుచేసిన ‘స్క్రీమ్టీ’కూడా ఈమధ్య నెట్‌లోకంలో హల్చల్ చేసింది. -
కుమారులకి వంట నేర్పిస్తే.. ఏం జరుగుతుందో ఈ అమ్మ చూపించింది!
బహుశా ‘మాస్టర్ చెఫ్‘ విజేతగా 25 లక్షలు ఇంటికి తీసుకొస్తాడు. అబ్బాయిలు వంట గదిలోకి వస్తే ‘ఏంట్రా ఆడపిల్లలాగా‘ అని మందలిస్తారు. కాని వంట స్త్రీలకూ, పురుషులకూ రావాలి. పిల్లలు ఎంత బాగా చదువుకున్నా వారికి కొద్దో గొప్పో వంట తెలిసుండాలి. ‘మాస్టర్ చెఫ్’ తాజా విజేత ఆషిక్ మా అమ్మ నేర్పిన వంట వల్లే గెలిచాను అన్నాడు. మంగళూరులో చిన్న జ్యూస్ షాప్ నడుపుకునే ఆషిక్ ఇంత పెద్ద గెలుపుతో ప్రపంచాన్ని ఆకర్షించాడు. ‘సోనీ లివ్’ చానల్ వారి ప్రఖ్యాత రియాలిటీ షో ‘మాస్టర్ షెఫ్’ సీజన్ 8 ఆడిషన్స్ రౌండ్లో ఆషిక్ చేసిన మంగళూరు స్టయిల్ ఫిష్ ఫ్రైను జడ్జీలు వెంటనే ఓకే చేయలేదు. ‘కొంత బాగుంది కొంత బాగలేదు. మళ్లీ చెప్తాం’ అన్నారు. కాని ఆ తర్వాత ఆషిక్‌కు అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 8 ఫైనల్స్ వరకూ ఆషిక్ చేసిన వంటకాల ప్రయాణం ఉద్వేగభరితంగానే సాగింది. ఎందుకంటే అతడు వంటను శాస్త్రోక్తంగా నేర్చుకోలేదు. అమ్మ దగ్గర ఇంట్లో వంటగదిలో నేర్చుకున్నాడు. 24 ఏళ్ల కుర్రాడు మంగళూరుకు చెందిన ఆషిక్ వయసు 24 ఏళ్లు. దిగువ మధ్యతరగతి కుటుంబం. ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేద్దామనుకున్నాడు. కాని ఫీజు కట్టే పరిస్థితి లేక కట్టలేదు. ఏం చేయాలి. వంట బాగా వచ్చు. యూ ట్యూబ్‌లో చూసి రకరకాల వంటకాలు చేయడం నేర్చుకున్నాడు. దానికి కారణం చిన్నప్పటి నుంచి అతని ఆటలన్నీ వంట గదిలోనే సాగేవి. నానమ్మ వంట చేస్తుంటే అక్కడే కూచుని చెంబులు తప్పేళాలతో ఆడుకునేవాడు. అమ్మ హయాం వచ్చేసరికి వంటలో సాయం పట్టడం మొదలెట్టాడు. తల్లి – ‘ఏమిటీ ఆడంగి పనులు’ అని తిట్టకుండా కొడుకును ప్రోత్సహించింది. ఇంటికి ఎవరొచ్చినా ఆషిక్ వంట చేసే పద్ధతి చూసి ఆశ్చర్యపోయేవారు. ఆ ఆత్మవిశ్వాసంతో మంగళూరులో ‘కులుక్కి’ పేరుతో చిన్న జ్యూస్ షాప్ పెట్టాడు ఆషిక్. అయితే అది సగటు జ్యూస్షాప్ కాదు. ఆషిక్ కనిపెట్టిన రకరకాల ఫ్లేవర్లు, మిక్స్డ్ కాంబినేషన్లు అందులో దొరుకుతాయి. జనం బాగా కనెక్ట్ అయ్యారు. అతని జ్యూస్ షాప్ మంచి హిట్. కాని ఇంకా జీవితంలో సాధించాలి అంటే ఏదైనా పెద్దగా చేయాలనుకున్నాడు ఆషిక్. ‘మాస్టర్ షెఫ్’ అందుకు వేదికగా నిలిచింది. విఫలమైనా ముందుకే 2022 మాస్టర్ షెఫ్ ఆడిషన్స్‌కు వచ్చిన ఆషిక్ రిజెక్ట్ అయ్యాడు. ‘చాలా డిప్రెషన్లోకి వెళ్లాను. మళ్లీ ఏమీ వండలేననే అనుకున్నాను. కాని సాధించాలి... మనసుపెట్టి పోరాడాలి అని నిశ్చయించుకున్నాను. 2023 ఆడిషన్స్ వచ్చేవేళకు చాలా కష్టపడి తర్ఫీదు అయ్యాను సొంతగా. షో ముందుకు వెళ్లేకొద్దీ సవాళ్లు ఎదురైనా ఛేదిస్తూ విజేతగా నిలిచాను’ అన్నాడు ఆషిక్. ఫైనల్స్ ఎపిసోడ్లో ఆషిక్ తల్లిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆమె సమక్షంలోనే ఆషిక్‌ను విజేతగా ప్రకటించారు. కొడుకు విజేత అవుతాడో లేదోనని ఆమె ఉత్కంఠగా ఎదురు చూసింది. ఆపై కొడుకు విజయానికి పులకించిపోయింది. కాగా ఈ సీజన్లో మేఘాలయాకు చెందిన స్కూల్ ప్రిన్సిపల్ నంబి మొదటి రన్నర్ అప్‌గా, జమ్ము–కశ్మీర్‌కు చెందిన రుక్సర్ అనే ఫుడ్ టెక్నిషియన్ సెకండ్ రన్నర్ అప్‌గా నిలిచారు. ప్రసిద్ధ షెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్, గరిమా అరోర జడ్జీలుగా వ్యవహరించారు. రొయ్యలతో ఆషిక్ చేసిన ‘క్రిస్పీ ప్యారడైజ్’ అనే వంటకాన్ని రుచి చూసిన జడ్జ్ రణ్వీర్ బ్రార్ తన సంతకం కలిగిన కిచెన్ నైఫ్ బహూకరించడం విశేషం. హోటల్ రంగంలోగాని, స్వయం ఉపాధికిగాని పాకశాస్త్రం నేడు చాలా అవసరంగా ఉంది. మంచి షెఫ్‌లకు చాలా డిమాండ్ ఉంది. అదెలా ఉన్నా తెల్లారి లేస్తే మూడుపూట్లా తినాలి కనుక, వంట కేవలం ఆడవారి వ్యవహారం అనే భావన పోయి, ఇకమీదైనా అబ్బాయిలకు తల్లులు కనీసం అవసరమైనంత వంట నేర్పడం మంచింది. ఏమో... వారు ఇంకా బాగా నేర్చుకుంటే మరో మాస్టర్ షెఫ్ అవుతారేమో. ఏ ప్లేట్‌కు ఏ పదార్థం రాసి పెట్టుందో ఎవరు (రుచి) చూసొచ్చారు కనుక. (చదవండి: ఆ మహిళ కడుపునొప్పే షాకివ్వగా..బయటపడ్డ మరో ట్విస్ట్ చూసి కంగుతిన్న వైద్యులు) -
Rukhsar Saeed: టేస్ట్ ఆఫ్ కశ్మీర్
కశ్మీర్ పేరు చెప్తే అందమైన ప్రదేశాలే గుర్తొస్తాయి. కాని ఆ లోయలో దాగిన రుచులు అన్వేషిస్తే తప్ప తెలియదు. శాకాహారమైనా మాంసాహారమైనా స్వచ్ఛమైన దినుసులతో గుమ్మెత్తిస్తారు. ‘మేము ఎలా వండుతామో నా వంట చూసి తెలుసుకోండి’ అని కశ్మీర్ వంట చేసి చూపుతోంది రుక్సార్ సయీద్. కశ్మీర్ మహిళలు పెద్దగా పాల్గొనని ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ తాజా సిరీస్‌కు రుక్సార్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. పోటీని తట్టుకుని టాప్ 12లో నిలిచిన ఆమెను చూసి కశ్మీర్లో ఆడవాళ్లు గర్విస్తున్నారు. సోనీ లివ్‌లో ప్రసారమవుతున్న తాజా సీజన్ ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ కోసం రుక్సార్ సయీద్ (33) ‘షబ్ దేక్’ అనే కశ్మీరీ వంట చేసింది. ‘ఇది మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు, మా అమ్మ నుంచి నాకు అందిన వంట. ముదురు గుమ్మడికాయ, నాటుకోడి, ఆల్‌బకారా ఎండుగుజ్జు వేసి చేస్తాం. చాలా బాగుంటుంది’ అంది. జడ్జీలుగా ఉన్న ప్రముఖ షెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్, పూజా ధింగ్రా... కొద్దిగా రుచి చూసి ‘అద్భుతం’ అన్నారు. ఆమె ఇంకో ఎపిసోడ్లో ‘షికారా రైడ్’ అనే అల్పాహారం చేసింది. మటన్ కోఫ్తాను, పుదీనా మసాలాతో రంగరించి చేసింది. టేస్ట్ అదిరిందని వేరే చె΄్పాలా? ‘కశ్మీర్ లోయంతా రకరకాల మసాలా దినుసులు, మేం మాత్రమే తినే ఆకుకూరలు, కాయగూరలు ఉన్నాయి. వాటిని వండే పద్ధతి అందరికీ తెలియదు. మాస్టర్ షెఫ్ ద్వారా దేశమంతటికీ ఆ రుచులను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది రుక్సార్ సయీద్. ఆమె సంకల్పం గట్టిదిలాగుంది. తాజా సీజన్లో మహా మహా వంటగాళ్లు, వంటగత్తెలు పోటీ పడితే తుది జాబితాలో 22 మంది ఉంటే, వారిలో చాలామందిని అధిగ‘మించి’ టాప్ 12కు చేరింది రుక్సార్. దాంతో కశ్మీర్లో ఇప్పుడు ఈ షోను అక్కడి స్త్రీలు చూస్తున్నారు. రుక్సార్‌ను తమ ప్రతినిధిగా, తమ సామర్థ్యాలకు కొలమానంగా చూస్తున్నారు. ‘ఆ సంతోషం చాలు నాకు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలు ముందుకు రావాలి’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో డాక్టరేట్ రుక్సార్ సయీద్‌ది పుల్వామా జిల్లాలోని పామ్పోర్ అనే ్రపాంతం. నిత్యం మంచు కురిసే ఈ ్రపాంతంలో కవులు ఎక్కువ. ‘నేను కవిత్వం రాయను. కాని ప్లేట్లో పదార్థమే ఒక కవిత్వమంత అందంగా అమర్చగలను’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేసిన రుక్సార్ అందరిలా ఏ లెక్చరర్ పోస్ట్‌కో వెళ్లలేదు. ‘నాకు ఆహారం మీద సంపూర్ణ అవగాహన ఉంది. ముఖ్యంగా ఫ్రోజెన్ ఫుడ్‌ను సరిగా అమ్మగలిగితే తక్షణం వేడి చేసుకుని తినాలనుకునేవారికి మేలు జరుగుతుంది. కాని ఆహారంలో కల్తీ ఎక్కువ. ఈ కల్తీ విషంతో సమానం. అందుకే నేను ఏ కల్తీ లేని ఫ్రోజెన్ ఫుడ్‌ను అమ్మాలని ఖాలిస్ ఫుడ్స్ పేరుతో చిన్న సంస్థను మొదలుపెట్టాను. చికెన్ ఉత్పత్తులను కశ్మీర్లో అమ్ముతున్నాను. కశ్మీర్లో ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగాలు కల్పించడమే ఎక్కువ అవసరం అని నేను భావిస్తాను. నిరుద్యోగం పోవాలంటే ఇలాగే చేయాలి. నా సంస్థ బాగా నడుస్తోంది. కాని దేశవ్యాప్తంగా పంపాలంటే కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ లోపు నేను, నా బ్రాండ్ తెలియడానికి మాస్టర్ షెఫ్ ్రపోగ్రామ్‌కు వచ్చాను’ అని తెలిపింది రుక్సార్. అంతే తేడా ‘వంట అందరు ఆడవాళ్లూ చేస్తారు. కాని ఫుడ్ షోలలో ఆ వంటను శాస్త్రీయంగా చేయాలి. అంతే తేడా. కశ్మీర్లో వంట తెలిసిన యువతీ యువకులు బాగానే ఉన్నారు. నేను ఈ షో ద్వారా గడించిన అనుభవంతో వారికి సాయం చేయాలనుకుంటున్నాను. ఆహారం తయారు చేయడంలో మెళకువలు తెలిపి వారు ఫుడ్ జాయింట్లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చూడాలనుకుంటున్నాను. ఇందుకు కావాల్సిన సామాగ్రి నేనే సమకూరుస్తాను’ అంది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న రుక్సార్ తన భర్త సాదిక్ అహ్మద్ సహకారం వల్లే ఇలా షోకు వచ్చినట్టుగా తెలిపింది. ‘ఆడవాళ్లూ.. ప్రయత్నించండి. ఓడిపోవద్దు’ అనేది రుక్సార్ సందేశం. -
వంటలతో షురూ చేసి రూ. 750 కోట్లకు అధిపతిగా, ఊహించని నెట్‌వర్త్
మిలియనీర్, బిలియనీర్ కావాలంటే అంతే స్థాయిలో పెట్టుబడులు కావాలి..బడా పారిశ్రామిక వేత్తో కావాలి అని అనుకుంటాం సాధారణంగా. కనీసం ఏ ఐఐటీ లేదా ఐఐఎం డిగ్రీ సాధించి పెద్ద కంపెనీలో కీలక ఎగ్జిక్యూటివ్‌గా ఉండాలి అనుకుంటాం. కానీ ఇవేమీ లేకుండానే రూ. 750 కోట్ల సంస్థకు అధిపతి అయ్యాడు. ఆయన మరెవ్వరో కాదు ఇండియన్ టాప్ రిచెస్ట్ చెఫ్ సంజీవ్ కపూర్. ఆయన సక్సెస్ స్టోరీ ఒకసారి చూద్దాం. ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అత్యంత ధనిక చెఫ్‌లలో ఒకడిగా మరతానని బహుశా సంజీవ్ కపూర్ ఊహించి ఉండరు. పలు రకాల రెసిపీలతో మొదలు పెట్టి, టాప్ చెఫ్‌గా, హోస్ట్‌గా, రైటర్‌గా చివరికి వ్యాపారవేత్తగా గ్లోబల్‌గా పాపులర్ అయ్యాడు.1992లో ఒక టీవీ షో హోస్ట్ చేయడం ప్రారంభించి 18 సంవత్సరాలు నడిపించిన ఘనత ఆయకే సొంతం. సోషల్‌మీడియాలో మిలియన్ల కొద్దీ ఫోలోవర్లున్నారు. Bahut logon ne mujhe poocha ki millets ki quality kaise check karte hai, store kaise karte hai? Isiliye the next stop on our #MilletKhazana journey is easy tips and tricks to store millets. Do let me know how you store them at home?#MilletKhazana #MilletToMeals #India #Millets pic.twitter.com/rE7NhrCckE — Sanjeev Kapoor (@SanjeevKapoor) June 3, 2023 అంతేకాదు 120 దేశాలలో ప్రసారమై 2010లోనే 500 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. జనవరి 2011లో ఫుడ్ ఫుడ్ అనే 24 గంటల ఫుడ్ అండ్ లైఫ్ స్టయిల్ ఛానెల్‌ని ప్రారంభించిన ప్రపంచంలోనే తొలి చెఫ్. సంజీవ్ కపూర్ హోస్ట్ చేసిన ఖానాఖజానా ఇండియన్ టెలివిజన్ అకాడమీ (ITA) ఇండియన్ టెలీ అవార్డ్స్ నుండి బెస్ట్ కుకరీ షో బహుమతిని పలుమార్లు అందుకుంది. (ఆషాఢంలో శుభవార్త: తగ్గుతున్న బంగారం,వెండి ధరలు) పంజాబ్, అంబాలాలో 1964 ఏప్రిల్ 10, సంజీవ్ కపూర్ పుట్టారు. న్యూ ఢిల్లీలోని పూసాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ అండ్ న్యూట్రిషన్ నుండి హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా పూర్తి చేశాడు. అలియోనా కపూర్‌ను వివాహం చేసుకున్నాడు. 1984లో తన వృత్తిని ప్రారంభించి అద్భుతమైన రెసిపీలు, చక్కటి వాచకం, అంతకుమించిన యాంకరింగ్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. వండర్‌చెఫ్ అనే కంపెనీని స్థాపించాడు. ఈ సంస్థ ఆదాయం గత ఏడాది రూ. 700 కోట్లు. అంతకుముందు ఏడాది కంపెనీ రూ.560 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ విస్తరణ ప్లాన్‌లో భాగంగా మార్కెటింగ్‌ను పెంచడానికి కంపెనీ 100 కోట్ల రూపాయలపెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. 40 శాతం విదేశీ పెట్టుబడిదారులున్నారు. సంజీవ్ కపూర్ ఇండియాతోపాటు, ఇతర పలు దేశాల్లో రెస్టారెంట్స్ చెయిన్స్‌ను నిర్వహిస్తున్నారు. సోడెక్సో మాజీ సీఈవోతో కలిసి 1998లో దుబాయ్‌లో ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ద్వారా వ్యాపారవేత్తగా అవతరించాడు. ఈ కంపెనీ విలువ రూ.750 కోట్లు. వంటగది ఉపకరణాలు, ఇతర వంటగది సామాగ్రిని 14 దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. (థ్యాంక్స్ టూ యాపిల్ స్మార్ట్ వాచ్, లేదంటే నా ప్రాణాలు: వైరల్ స్టోరీ) వార్షిక సంపాదన 2022లోనే సంజీవ్ కపూర్ నికర విలువ రూ. 1000 కోట్లుగా ఉంది. వార్షిక సంపాదన రూ. రూ. 25 కోట్లు. వండర్ చెఫ్‌లో అతని పెట్టుబడి, ఎల్లో చిల్లీ వంటి రెస్టారెంట్ చెయిన్ల నుండి, టీవీ షోలు బ్రాండ్ స్పాన్సర్షిప్లతోపాటు, స్వయంగా అతనురాసిన అతని పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చిన రాయల్టీలు ఇవన్నీ ఇందులో భాగం. బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలోని బ్రాండ్లలో ఏరియల్, డెట్టాల్, దావత్ బాస్మతి రైస్, స్లీక్ కిచెన్ లాంటివి ఉన్నాయి. ప్రతి బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం రూ. 30 రూ. 40 లక్షలు చార్జ్ చేస్తాడు. దీనితోపాటు సంజీవ్ కపూర్ ముంబైలోని జుహు ప్రాంతంలో ఒక సంపన్నమైన ఇంటిలో నివసిస్తున్నారు. 1500 చదరపు అడుగులు డ్యూప్లెక్స్‌లో ఉంటారు. స్టాటిస్కా రిపోర్ట్ ప్రకారం 2019లో 24.8 కోట్ల ఆదాయంతో కపూర్ భారతదేశంలో అత్యంత ధనిక చెఫ్‌గా నిలిచారు. (వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్: ఒకేసారి 32 మందితో) ప్రేమ వివాహం 1992లో సంజీవ్ కపూర్ తన ప్రేయసి అలియోనాను వివాహమాడాడు. సంజీవ్, వందన కలిసి ఢిల్లీ ఐటీడీసీ హోటల్లో పనిచేసేవారు. కానీ ఎపుడూ కలుసుకోలేదు. అయితే అనుకోకుండా ఒకసారి రైలులో జరిగిన వీరి పరిచయం ప్రేమగా మారింది. నాలుగేళ్ల డేటింగ్ తరువాత పెళ్లి చేసుకున్న జంటకు ఇద్దరు కుమార్తెలు న్నారు. పెద్ద కూతురు రచిత. చిన్న కూతురు కృతి. (టాప్ డైరెక్టర్ రాజమౌళి కొత్త అవతార్: హీరోలకు షాకే!?) అవార్డులు 2017లో భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు న్యూ ఢిల్లీలోని వరల్డ్ ఫుడ్ ఇండియాలో 918 కిలోల ఖిచ్డీని వండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (2017) హార్వర్డ్ అసోసియేషన్ ప్రచురించిన సంజీవ్ కపూర్‌పై కేస్ స్టడీ ఐటీఏ అవార్డు - పాపులర్ చెఫ్ & ఎంటర్ప్రెన్యూర్ (జైకా-ఇ-హింద్) (2015) ఐటీఏ అవార్డు ఉత్తమ వంట (ఖానా ఖజానా) (2010, 2004, 2002) భారత ప్రభుత్వ 'బెస్ట్ చెఫ్ ఆఫ్ ఇండియా' జాతీయ అవార్డు ఇండియా అత్యంత విశ్వసనీయ వ్యక్తులలో 100 మంది రీడర్స్ డైజెస్ట్ జాబితాలో 31వ స్థానం ఫోర్బ్స్ 'టాప్ 100 భారతీయ ప్రముఖుల జాబితాలో 34వ స్థానం -
MasterChef India 7: Nayanjyoti Saikia: వంటకోసం ప్రాణం ఇస్తాడు
వంట అమ్మ చేయాలి.. అది రూలట. తర్వాత అమ్మాయి చేయాలి.. అది పెంపకం అట. కాని అబ్బాయి చేస్తే? అబ్బాయి నేర్చుకుంటే? వంట ద్వారానే విజేతగా మారితే? అస్సాంలో టీ తోటల్లో కార్మికుడిగా ఉన్న నయన్జ్యోతి సైకియా వంట మీద ధ్యాస పెట్టాడు. మునివేళ్ల మంత్రం నేర్చాడు. మాస్టర్ చెఫ్ పోటీలో విజేతగా నిలిచి 25 లక్షల ప్రైజు సాధించాడు. అమ్మ ఊరికెళితే కర్రీ పాయింట్ వైపు అడుగులు వేసే పుత్రరత్నాలు ఇతని నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. 27 ఏళ్ల నయన్జ్యోతి సైకియాకు రాని వంట లేదు. మూడు నెలల పాటు ముంబైలో ‘మాస్టర్ షెఫ్’ రియాలిటీ షో కోసం ఉండి, రకరకాల వంటలు చేసి, భేష్ అనిపించుకుని, వారం క్రితం 25 లక్షల రూపాయల మొదటి ప్రైజ్ గెలిచాక ఎగువ అస్సాంలో ఉండే అతని ఊరి ప్రజలు ఉత్సవం జరుపుకుంటూ, ట్రోఫీతో తిరిగి వస్తున్న అతనికి స్వాగతం చెప్పడానికి రకరకాల వంటలు చేయిస్తూ ‘ప్రత్యేకంగా ఏం చేయించమంటావ్’ అని అడిగితే నయన్జ్యోతి సైకియా ‘ఏం వద్దు... మా ఇంట్లో చేసే టొమాటో చేప కూర చాలు’ అన్నాడు. దాదాపు రెండు వేల మంది అతనికి స్వాగతం చెప్పడానికి ఊరిలో జమ అయితే ఈ కూర నాలుకకు తగిలాకే ‘అమ్మయ్య... ఇప్పటికి మన ఊరు చేరినట్టయ్యింది’ అని నవ్వాడు. ఇవాళ నయన్జ్యోతి సైకియాను అస్సాం అంతా తనవాడు అని గర్వంగా చెప్పుకుంటోంది. అతను ఆస్కారో నోబెలో తేలేదు. కేవలం వంట ద్వారానే తన ప్రాంతం తల ఎత్తుకు తిరిగేలా చేశాడు. మెకానికల్ ఇంజనీర్ నయన్జ్యోతి సైకియా సొంత ఊరు తిన్ సుకియ. ఇది గౌహతికి 490 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సైకియా తండ్రి టీ ఎస్టేట్లలో పని చేస్తాడు. రైతు. 2018లో గౌహతిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సైకియా ఊరికి తిరిగి వచ్చి టీ ఎస్టేట్‌లో తండ్రి పనికి సాయంగా ఉంటూ వచ్చాడు. నిజానికి చిన్నప్పటి నుంచి ఇంట్లో వంట విషయంలో సాయం చేస్తూ వచ్చిన సైకియాకు వంట మీద రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోయిందని ఇంటి వాళ్లు గుర్తించలేదు. అది ఒక ముఖ్య ఉపాధి అని కూడా భావించలేదు. కాని సైకియా మాత్రం తన బెడ్రూమ్లో ఒక మూల చిన్న స్టవ్‌ను ఏర్పాటు చేసుకొని రకరాల వంటలు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్ వరకూ ఇది కొంత రహస్యం గా సాగినా ఇంజనీరింగ్ కోసం గౌహతికి వెళ్లాక ఆ నాలుగేళ్లు అతని ప్రయోగాలకు అడ్డు చెప్పేవారు లేకపోయారు. ఇంటర్నెట్ గురువు ‘నాకు గురువులు లేరు. వంట శాస్త్రం కాలేజీకి వెళ్లి చదువుకోలేదు. నాకు వచ్చిందంతా ఇంటర్నెట్లో రకరకాల షెఫ్‌లను ఫాలో అయి నేర్చుకున్నదే. నేను మంచి ఫొటోగ్రాఫర్‌ని. నేను చేసిన వంటలను చాలా ఆకర్షణీయంగా ఫొటోలు తీసి ఇన్‌స్టాలో పెట్టేవాణ్ణి. అలా అందరి దృష్టి నా మీద పడింది. ప్రఖ్యాత షెఫ్ వికాస్ ఖన్నా నా ఇన్‌స్టా పేజీలో నా వంటలను చూసి నన్ను వెతుక్కుంటూ అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మా ఊరు వచ్చారు. మా ఇంట్లో మా సంప్రదాయ వంటలు వండి చూపించారు. నన్ను మాస్టర్ షెఫ్ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్‌గా తీసుకెళతానని అడిగారు. గట్టిపోటీలో ఈశాన్య రుచులు చూపి ‘మాస్టర్ షెఫ్’ రియాలిటీ షో అంటే మాటలు కాదు. కొమ్ములు తిరిగిన పార్టిసిపెంట్లు వస్తారు. అనుభవం సంపాదించుకున్నవారు వారిలో ఉంటారు. వారందరితో తలపడి మొదటి స్థానానికి వెళ్లడం చాలా గొప్ప. అదీ గాక జడ్జీలను మెప్పించాలి. ఈ షోకు జడ్జీలుగా వచ్చిన రణ్వీర్ బ్రార్, గరిమ అరోర, వికాస్ ఖన్నాను ఆకట్టుకున్నాడు సైకియా. ‘అందుకు కారణం నేను నా వంటల్లో మా ఊరి దినుసులను దాదాపుగా వాడటం. వాటితో ప్రయోగాలు చేయడం.’ అంటాడు సైకియా. ఎన్నో అడ్డంకులున్నా ఇంత విజయం సాధించాక పెద్ద పెద్ద రెస్టరెంట్లే అతణ్ణి భాగస్వామిని కమ్మని అడుగుతున్నాయి. విజయం అంటే ఇది. కోరుకున్న కలను ఛేదించాలంటే ఇలాంటి పట్టుదలే ఉండాలి. ‘నేను జీవితంలో ఇప్పటికీ పెద్ద రెస్టరెంట్‌కు వెళ్లలేదు. మా ఊళ్లో లేకపోవడం వల్ల. అంత డబ్బు లేకపోవడం వల్ల. కాని పెద్ద రెస్టరెంట్లలో చేసేవన్నీ నేను అంతకన్నా బాగా చేయడం నేర్చుకున్నాను’ నార్త్ ఈస్ట్ అంటే మాంసాహారం అని ఎక్కువమంది అనుకుంటారు. నేను శాకాహారం రెసిపీలు కూడా చేసి చూపించాను. మణిపూర్ నల్లబియ్యంతో సంగటి వొండితే వారికి బాగా నచ్చింది. ఇక రకరకాల పాస్తాలు చేయడంలో నన్ను మించినవారు లేరు. – నయన్జ్యోతి సైకియా -
గెలుపు ఘుమఘుమలు@ 78
గట్టిగా అనుకుని ఆచరణలో పెడితే చాలు తలుచుకున్న పని తప్పక సఫలం అవుతుంది అనే మాటలకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారు బామ్మ ఊర్మిళా అషేర్. ఎనిమిది పదుల వయసుకు చేరువలో ఉండి తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో లక్షలాది అభిమానులను ఘుమఘుమలతో కట్టిపడేసింది.ఆటుపోట్ల జీవనాన్ని అధిగమించి తన సత్తా చూపుతోంది. కష్టాలు తాత్కాలికమే, జీవితంపై నమ్మకం కోల్పోకూడదు. విపరిణామాలు మనపైన ప్రభావం చూపకుండా ఉండేందుకు ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ధైర్య స్థైర్యాలతోనే జీవితాన్ని గెలవాలి. – ఊర్మిళా అషేర్ ‘‘మొన్న అప్లోడ్ చేసిన నా 200 వ వీడియోతో యూ ట్యూబ్ చానెల్ లక్ష మంది అభిమానులను సంపాదించింది. ఇటీవలే దేశవ్యాప్తంగా టీవీలో ప్రసారమవుతున్న ‘రసోయి షో’లో పాల్గొన్నాను. మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్ 7లో పోటీదారుగా చేరడంతో మీ అందరికీ పరిచయం అయ్యాను. ఇదంతా మీ అభిమానం వల్లే కలిగింది’ అంటూ ఆనందంగా చెబుతోంది ఊర్మిళ అషేర్. ముంబైలో ఉంటున్న ఊర్మిళ అషేర్ గుజరాతీ కుటుంబీకురాలు. తన కుటుంబం ఆర్థిక కష్టాలు తీరాలంటే ఏదో ఒక సాయం చేయాలనుకుంది. అందుకు తనకు వచ్చిన పాకశాస్త్ర ప్రా వీణ్యాన్ని పెట్టుబడిగా పెట్టింది. తన మనవడు హర్ష్‌తో కలిసి మూడేళ్ల క్రితం ‘గుజ్జు బెన్ న నాస్తా’ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఏడాదికి రూ.45 లక్షల టర్నోవర్ సాధిస్తూ 78 ఏళ్ల వయసులోనూ ‘గ్రేట్ బామ్మా’ అనిపించుకుంటోంది. కోల్పోనిది ధైర్యమొక్కటే.. ఊర్మిళా అషేర్కు పద్దెనిమిదేళ్ల వయసులో పెళ్లయ్యింది. భర్త చిరుద్యోగి. ముగ్గురు పిల్లలు. ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. రెండున్నరేళ్ల వయసులో కూతురు మూడవ అంతస్తు మీద నుంచి కింద పడి మరణించింది. భర్త తెచ్చే జీతం డబ్బులతో ఇంటిని నడుపుకుంటూ వచ్చింది. పెద్ద కొడుకుకి పెళ్లి చేసింది. కరోనాకు ముందు ఇద్దరు కొడుకుల్లో ఒకరు గుండెపోటుతో, మరొకరు బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించారు. ఆ తర్వాత భర్త మరణించాడు. ఈ ఎదురు దెబ్బలు ఆమెను నిత్యం గట్టిపరుస్తూనే ఉన్నాయి. ‘మరణం అనేది పరమసత్యం. దాని గురించి ఎన్ని రోజులని ఏడుస్తూ కూర్చుంటాం. నేనెప్పుడూ నా వద్ద ఉన్న శక్తితోనే ఏం చేయగలను అనేదానిపై దృష్టిపెడతాను. ఉన్న సమస్యలు చాలవన్నట్టు నాలుగేళ్ల క్రితం నా మనవడు హర్ష్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో పై పెదవి పూర్తిగా దెబ్బతిని, ఇంటికే పరిమితం అయ్యాడు. అతను నడుపుతున్న దుకాణాన్ని కరోనా మహమ్మారి కారణంగా మూసేశాం. దీంతో ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కష్టాలు తాత్కాలికమేనని, జీవితంపై నమ్మకం కోల్పోకూడదని తెలుసు’ అని చెప్పే ఊర్మిళ ఈ విపరిణామాలు మనవడిపైన ప్రభావం చూపకుండా ఉండేందుకు ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదని, ధైర్య స్థైర్యాలతోనే జీవితాన్ని గెలవాలని చెబుతూ ఉంటుంది. ఆమె మనో నిబ్బరం, ఆత్మవిశ్వాసాలే నేడు ఏడాదికి రూ.45 లక్షల టర్నోవర్‌కు చేరుకునేంతగా ఫుడ్ బిజినెస్‌లో ఎదిగేలా చేశాయి. కష్టం వచ్చినప్పుడు ఇంకాస్త గట్టిగా ఉండాలని తన కథనే ఉదాహరణగా ఇతరులతో పంచుకుంటోంది ఈ దాదీ. వ్యాపార విస్తరణ కోడలు, మనవడితో ఉండే ఊర్మిళ తన చేతి రుచి గురించి చెబుతూ– ‘‘నాకు చిన్నప్పటి నుంచి వంటలు బాగా చేస్తాననే పేరుంది. మమ్మల్ని మేం బతికించుకోవడానికి ముందుగా గుజరాతీ చిరుతిళ్ల వ్యాపారాన్ని ప్రా రంభించాం. ఆర్డర్లు వచ్చినదాన్ని బట్టి 20–25 రోజుల్లో 500 కిలోల పచ్చళ్లను రెడీ చేశాం. దీంతోపాటు తేప్లా , ఢోక్లా, పూరన్ పోలీ.. వంటి ఇతర స్నాక్స్ కూడా అమ్మడం మొదలుపెట్టాం. డిమాండ్‌ను బట్టి పనివాళ్లను ఎక్కువ మందిని నియమించుకున్నాం. ఒక సంవత్సరం తిరిగేసరికల్లా మా జీవితాలే మారిపోయాయి. నేనిప్పుడు టెడెక్స్ స్పీకర్‌ని కూడా. నా కథలను ఇతరులతో పంచుకుంటూ, ఇతరులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటూ వివిధ నగరాలకూ ప్రయాణిస్తున్నాను. ఇప్పుడు మా ఆలోచన ఒక్కటే! నేను, మా మనవడు కలిసి అంతర్జాతీయ విమానాశ్రయాలలో ‘గుజ్జుబెన్ నాస్తా’ను ఏర్పాటు చేయాలని. అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుండి కూడా ఆర్దర్లు తీసుకుంటున్నాం. వ్యాపారాన్ని ఇంకా విస్తరిస్తేనే కదా మరింత మందికి చేరువ అయ్యేది... మా ఊరగాయలను ఆన్లైన్ ΄్లాట్ఫారమ్లలో పెట్టడానికి కావలసిన లాంఛనాలు కూడా పూర్తయ్యాయి’ అని ఉత్సాహంగా వివరించే ఊర్మిళ మాటలు నేటి యువతకూ స్ఫూర్తినిస్తాయి. -
తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు
Reason Behind Tamannah Bhatia Replacement In Masterchef Show: మిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్‌గా ప్రారంభమై ‘మాస్టర్ చెఫ్’షో నుంచి ఆమెను తొలగించిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలోకి ప్రముఖ యాంకర్ అనసూయను తీసుకున్నారు నిర్వాహకులు. దీంతో ఈ షో ప్రొడక్షన్ హౌజ్‌కు తమన్నా లీగల్ నోటీసులు పంపించింది. తమన్నా లీగల్ యాక్షన్‌పై షో నిర్వాహకులు తాజాగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమన్నా వల్ల దాదాపు 5 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని నిర్వాకులు అంటున్నారు. మొత్తం 18 ఎపిసోడ్లకు గాను తమన్నాతో రూ. 2 కోట్ల పారితోషికంతో ఆగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. చదవండి: మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడకండి: సామ్ ఆసక్తికర పోస్ట్ అయితే ఇతర కమిట్మెంట్స్ కారణంగా తమన్నా కేవలం 16 రోజుల షూటింగ్‌కు మాత్రమే వచ్చిందని, మిగతా రెండు రోజులు రాలేదని షో నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఆ రెండు రోజులు రాకపోవడంతో 300 మంది టెక్నిషియన్లు పనిచేస్తున్న తమ షోకు రూ. 5 కోట్లు నష్టం వచ్చిందని చెబుతున్నారు. అప్పటికే తమన్నాకు కోటిన్నర రూపాయలు ఇచ్చామని, మిగతా రోజుల షూటింగ్ కూడా పూర్తి చేసుంటే మొత్తం డబ్బులు చెల్లించేవారమని వారు పేర్కొన్నట్లు సమాచారం. అంతేగాక అగ్రిమెంట్ ప్రకారం షూటింగ్ పూర్తి చేయకుండా... సెకండ్ సీజన్ అడ్వాన్స్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అసలు సెకండ్ సీజన్‌కు ఆమెను తీసుకోవాలని తాము అనుకోలేదని నిర్వాహకులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఆ ఫోటో చూసి సెట్స్‌లో నాతో విచిత్రంగా ప్రవర్తించారు: హీరోయిన్ తమన్నా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ షో ప్రారంభమైంది. అయితే వివిధ కారణాల వల్ల సడెన్‌గా ఆమె స్థానంలోకి ప్రముఖ యాంకర్ అనసూయని తీసుకొచ్చారు షో నిర్వహకులు. దీంతో ఈ విషయం కాస్తా చర్చనీయాంశం అయ్యింది. తన స్థానంలోకి అనసూయను తీసుకోవడమే కాకుండా, తనకు ఇస్తానన్న రెమ్యునరేషన్ కూడా షో నిర్వాహకులు ఇవ్వలేదంటు తమన్నా మాస్టర్ చెఫ్ నిర్వాహకులపై లీగల్ యాక్షన్‌కు దిగినట్లు తెలుస్తోంది. కాగా ఆగస్టు 27న ప్రారంభమైన మాస్టర్ చెఫ్ తొలి మూడు షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత క్రమంగా ఈ షో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చదవండి: Master chef: అనసూయ ఎంట్రీ.. షో నిర్వాహకులకి షాకిచ్చిన తమన్నా! -
అనసూయ ఎంట్రీ.. షో నిర్వాహకులకి షాకిచ్చిన తమన్నా!
టాలీవుడ్ పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకుని ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇటీవల వెబ్ సిరీస్‌లోనూ అడుగుపెట్టి తన హవాని అక్కడ కూడా కొనసాగిస్తోంది ఈ అమ్మడు. తాజాగా టెలివిజన్‌లో ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ షోతో ప్రేక్షకుల మందుకు తమన్నా వచ్చింది. అయితే పలు కారణాల వల్ల ఈ షో నుంచి ఆమెను తప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రోగ్రాం విషయంలో తమన్నా కోర్టను ఆశ్రయించి ప్రొడక్షన్ హౌజ్‌కి షాకిచ్చిందట. వివరాల్లోకి వెళితే.. తమన్నా హోస్ట్‌గా టీవీలో ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ కార్యక్రమం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ షో రేటింగ్స్ విషయానికి వస్తే.. మొదట్లో బాగానే వచ్చినా, ఇటీవల మాత్రం ఆశించినంతగా రేటింగ్ లేకపోవడంతో తమన్నాను తప్పించి టాప్ యాంకర్ అనసూయను తెరపైకి తీసుకొచ్చింది ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ. అనసూయ ఎంట్రీతో ఈ షోకి మళ్లీ మంచి రేటింగ్ సాధిస్తుందని ప్రొడక్షన్ హౌస్ నిర్వాహకులు ఆశాభావంతో ఉన్నారు. ఇదిలా ఉండగా తనను తొలగించడంపై అసంతృప్తితో ఉన్న మిల్కీ బ్యూటీ.. ఆమెకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రొడక్షన్ హౌజ్‌కు లీగల్ నోటీసులు పంపించింది. ఈ అంశంపై తమన్నా తరపు లాయర్ మాట్లాడుతూ.. మాస్టర్ చెఫ్ కార్యక్రమం కోసం తమన్నా పలు ప్రాజెక్టులు వదులుకొన్నారు. ఈ షోకు సంబంధించిన తొలి సీజన్‌ను పూర్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన పనులను కూడా ఆమె రద్దు చేసుకోవాల్సి వచ్చింది. తన క్లయింట్‌తో షో నిర్వాహకులు అన్ ప్రొఫెషనల్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా తన క్లయింటతో ప్రొడక్షన్ హౌస్ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కమ్యునికేషన్ కూడా ఆపివేశారని వెల్లడించారు. చదవండి: తమన్నా ప్లేస్‌లో అనసూయ, బ్లాక్ సూట్, హాట్ లుక్స్‌తో అదుర్స్ -
తమన్నా ప్లేస్‌లో అనసూయ..బ్లాక్ సూట్‌తో జిగేల్..ఫోటోలు వైరల్
Anasuya Bharadwaj: బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో యాంకర్లలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. బుల్లితెరపై సుమ తర్వాత అంతటి ఫాలోయింగ్, క్రేజీ సంపాదింకున్న యాంకర్ అనసూయ మాత్రమే అనడంతో ఎలాంటి అతిశయోక్తిలేదు. మాటలతోనే కాదు తన అందచందాలతో ప్రేక్షకులను అలరించేతెలుగింటి ముద్దుగుమ్మ యాంకర్ అనసూయ. ఈ ఒకవైపు బుల్లితెరపై అలరిస్తూనే.. వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది. అయితే వరుస సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. బుల్లితెరను మాత్రం వీడేది లేదని తెగేసి చెబుతోంది ఈ హాట్ యాంకర్. తాజాగా అనసూయ మరో క్రేజీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. తమన్నా తొలిసారిగా హోస్ట్ వ్యవహరించిన షో `మాస్టర్ చెఫ్ తెలుగు`. భిన్నమైన వంటల రుచులను తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేయబోతున్న కుకింగ్ షో ఇది. జెమిని టీవలో ప్రసారమయ్యే ఈ షోకి ఇన్నాళ్లు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించింది. తాజాగా ఆమె స్థానంలో అనసూయను తీసుకొచ్చారు షో నిర్వాహకులు. అయితే తమన్నా హోస్ట్ చేసే ఈ షోకి అంతగా పాపులారిటీ, రేటింగ్ రావడం లేదట. దీంతో బుల్లితెరపై క్రేజ్ ఉన్న అనసూయని దింపారని తెలుస్తుంది. ప్రతి శుక్రవారం, శనివారం ప్రసారమయ్యే ఈ షో కోసం అనసూయ ప్రత్యేకంగా రెడీ అవుతున్న అనసూయ.. ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ సూట్లో దర్శనమిచ్చి కుర్రకారు మైండ్ బ్లాంక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
మన వంటింటి గరిట పట్టుకున్న విదేశీ భామ
సౌకుమార్యమే అక్కడ ప్రధాన అడుగు. జిగేల్మనే కాంతుల మధ్య మెరవడమే అసలైన లక్ష్యం. అలాంటి చోట తనను తాను నిరూపించుకుంది సారాటాడ్. మోడలింగ్‌లో విజయవంతంగా ఎదిగిన ఈ విదేశీయురాలు ఇప్పుడు మన భారతీయ వంటింటి మహారాణిగా వెలుగొందుతోంది. ఇక్కడి ప్రాంతీయ వంటకాలు ‘మహాభేష్’ అంటూ మాస్టర్ చెఫ్‌గా రాణిస్తోంది. విదేశీయురాలు.. అందులోనూ మోడల్. భారతీయ ఆహారం పట్ల మక్కువ పెంచుకోవడమే కాకుండా ఆ వంటల్లో ప్రావీణ్యం సంపాదించాలనుకోవడం సాధారణ విషయమేమీ కాదు. సారాటాడ్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ నివాసి. 18 సంవత్సరాల వయస్సులో, మోడలింగ్ కోసం సిడ్నీకి వెళ్లింది. మోడలింగ్‌లో సక్సెస్ సాధించింది. ఐదేళ్లుగా సెలబ్రిటీ చెఫ్‌గా ప్రసిద్ది చెందింది. భారతీయ వంటకాల పట్ల మక్కువ పెంచుకుంది. పాకశాస్త్ర ప్రావీణ్యం సాధించింది. మాస్టర్ ఛెఫ్‌గా గోవాలో తన మొదటి రెస్టారెంట్ ప్రారంభించి భారత్‌పై తనకున్న ప్రేమను చాటుకుంది. పదార్థాలను తెలుసుకుంటూ.. భారతీయ వంటకాల గురించి సారా మాట్లాడుతూ– ‘ఇక్కడ ప్రతీ రాష్ట్రానికి, గ్రామీణ ప్రాంతాల ఆహారానికీ సొంత ప్రత్యేకత ఉంది. నేను అస్సాం నుండి కాశ్మీర్– గోవాకు ప్రయాణిస్తున్న ప్రతిసారీ, ఇక్కడ ఆహారంలో ఉపయోగించే పదార్థాలు, పద్ధతులను చాలా దగ్గరగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. వాటిని నేను తీసుకునే ఆహారంలో ఉపయోగిస్తుంటాను. భారతదేశం వైవిధ్యభరితమైనది. ఇక్కడే ఉంటూ ప్రాంతీయ వంటకాల రుచిని ఆస్వాదిస్తూ, ఎంతో మందికి వాటిని పంచాలనుకుంటున్నాను. ఈ విధానం ద్వారా ఇక్కడ ఆహారంలో ఉపయోగించే పదార్థాలు, ఆహార సాంకేతిక పరిజ్ఞానం గురించి ఎంతో తెలుసుకోవచ్చు’ అని వివరించింది సారాటాడ్. అపోహలు తొలగించాలి ఈ మాస్టర్ చెఫ్ గోవా తర్వాత మరో రెస్టారెంట్‌ను ఢిల్లీలో ప్రారంభించాలనుకుంటోంది. భారతీయ ఆహారం గురించి ప్రజలలో ఉన్న అపోహలను తొలగించాలని కోరుకుంటున్నట్టుగా చెబుతోంది. ‘భారతీయ ఆహారం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే, అది హోటళ్లలో వండినది. కానీ భారతీయుల ఇళ్లలో తింటున్న ఆహారం గురించి విదేశీయులకు అంతగా తెలియదు. యోగా పద్ధతులు, ఆయుర్వేద వంటకాలకు ప్రసిద్ధి ఈ దేశం. ఆరోగ్య దృక్పథం నుండి చూస్తే ఈ ఆహారం అత్యంత ఉత్తమమైనది, శక్తిమంతమైనది. భారతీయ ఆహారం నా వంట శైలిని పూర్తిగా మార్చివేసింది. ఈ ఆహారంలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వాసన, రుచి ప్రత్యేకమైనవి. ఈ సుగంధ ద్రవ్యాలు లేకుండా నేను ఏ వంటకాన్నీ వండలేకపోతున్నాను. అంతగా వీటితో మమేకం అయ్యాను’ అని తెలిపింది సారాటాడ్. అంతేకాదు, విదేశాలలో భారతీయ ఆహారం గురించి ప్రజలలో ఉన్న అపోహలను తొలగించాలనుకుంటున్నట్టుగా కూడా చెబుతోంది. ఏమైనా మన దేశీయ వంటగది, అందులో వండే వంటకాలు ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తాయో.. వాటి పట్ల విదేశీయులు ఎంత ఆసక్తిని చూపుతారని సారాటాడ్ని కలిస్తే తెలిసిపోతుంది. విదేశీయురాలై ఉండి భారతీయ వంటకాలను ప్రేమగా నేర్చుకుంటున్న సారాటాడ్ లాంటి వాళ్లను చూస్తే ఇక్కడి యువత మన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కొంతైనా తప్పక వంటబట్టించుకుంటారు. -
‘ఇండియాస్ గాట్ టాలెంట్’ పోస్ట్ ప్రొడ్యూసర్ మృతి
ముంబై: ‘ఇండియాస్ గాట్ టాలెంట్’, ‘మాస్టర్ చెఫ్ ఇండియా’ కార్యక్రమాల పోస్ట్ ప్రొడ్యూసర్ సోహాన్ చౌహాన్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం రాత్రి ముంబైలోని రాయల్ పామ్ సొసైటీకి చెందిన చెరువులో అతని మృతదేహం దొరికింది. సోహాన్ చౌహాన్ చనిపోయి మూడు రోజులు గడుస్తున్నా మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. చౌహన్ టీవీ షోలకు పోస్ట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతని భార్య ప్రస్తుతం ఢిల్లీలో ఉండగా, అతను ముంబైలో ఒంటరిగా జీవిస్తున్నారు. సోహాన్ చౌహాన్ జూన్ 13 వరకు సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారు. అంతకుముందు జూన్ 9న ‘సరిగమప లిటిల్ చాంప్స్’ ఫైనల్స్ కోసం పోస్ట్ కూడా చేశారు. చౌహాన్‌ను చివరిసారిగా శనివారం అతని ఇంట్లో పని చేసే వ్యక్తి చూశాడు. సోహాన్ ప్రమాదవశాత్తూ మరణించారా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు -
మాస్టర్ చెఫ్
భక్తి అరోరా.. ఈ సీజన్ మాస్టర్ చెఫ్ ఇండియాకు ఎంపికైన ఏకైక హైదరాబాదీ. ఆ కార్యక్రమంలో ఏడుగురు పార్టిసిపెంట్స్‌లో ఈమె ఒకరు. అందరూ ‘ఝాన్సీ కి రాణి’, ‘భక్తి కి శక్తి’ అని పిల్చుకునే ఈ అమ్మాయి ఫ్లేవర్-ఇ-ఆజమ్ రుచులతో ఇప్పటికే జడ్జెస్ మనసు గెలుచుకుంది. హైదరాబాద్ ఆడిషన్స్‌లో మిస్సయినా... బై నుంచి ప్రయత్నించి, ఎంపికై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ..:: కట్ట కవిత షోలో పాల్గొన్నవాళ్లందరూ పాకశాస్త్రంలో ప్రవీణులే. అయితే కాంపిటీషన్ వేరు కదా! ఇచ్చిన టైమ్‌లోనే వంటల్ని ది బెస్ట్‌గా చేసి చూపాలి. ఆ టైమ్‌ను ఎలా మేనేజ్ చేస్తున్నామన్నదే ప్రధానం. ఇంట్లో తాపీగా వండటం తప్ప... ఇలా షోస్‌కి వెళ్లింది లేదు కాబట్టి మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే చుట్టూ కెమెరాలు, మనం చేస్తున్న దాన్ని ఎంతో మంది చూస్తున్నారన్న స్పృహ వెరసి కొంత కంగారు. కానీ తరువాత సెట్ అయ్యాను. కలినరీ స్టూడియో... కుకింగ్ మీద ప్యాషన్‌తో ఉద్యోగాన్ని సైతం వదిలేసి ముంబైలో ‘బెల్ పెప్పర్’ రెస్టారెంట్ ప్రారంభించాను. కేవలం పార్టీ ఆర్డర్స్ మాత్రమే తీసుకునేవాళ్లం. భవిష్యత్‌లో హైదరాబాద్‌లో ఓ కేఫ్, కలినరీ స్టూడియో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నా. అమ్మ పోరు పడలేక.. ఎనిమిదేళ్లప్పటి నుంచే వంట నేర్చుకున్నాను. మా అమ్మ వంట నేర్చుకోమని ఎప్పుడూ నా వెంటపడేది. ‘భవిష్యత్‌లో ఎవరి మీదా ఆధారపడకూడదంటే నువు కచ్చితంగా వంట నేర్చుకోవాలి’ అనేది. అయితే నేను అమ్మాయిని కాబట్టి అలా అనేది అనుకోకండి. ఎందుకంటే మా బ్రదర్‌ను కూడా వంట నేర్చుకోమని పట్టుబట్టేది. అప్పుడు అలా అమ్మ పోరాడి నేర్పిన వంటి ఇప్పుడు ఇలాపనికొస్తోంది. ఆయన ప్రోత్సాహం... మాది ముంబై. పెళ్లి తరువాత హైదరాబాద్‌కు షిఫ్టయ్యాం. నా హజ్బెండ్ సురేందర్ మానేకర్ ఆడిషన్స్‌కు వెళ్లాలని నన్ను ప్రోత్సహించారు. నేను కచ్చితంగా ఎంపికవుతానని తన నమ్మకం. తను డయాబెటిక్. దాంతో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న రైస్, పొటాటోస్ ఎక్కువగా తీసుకోకూడదు కదా! అయితే... వాటిని రిప్లేస్ చేస్తూ కొత్త ప్రయోగాలతో వంటలు చేయడం ప్రారంభించాను. నేను వంటల్లో ఆరితేరడానికి అదీ ఒక కారణం.