వంట అమ్మ చేయాలి.. అది రూలట. తర్వాత అమ్మాయి చేయాలి.. అది పెంపకం అట. కాని అబ్బాయి చేస్తే? అబ్బాయి నేర్చుకుంటే? వంట ద్వారానే విజేతగా మారితే? అస్సాంలో టీ తోటల్లో కార్మికుడిగా ఉన్న నయన్‌జ్యోతి సైకియా వంట మీద ధ్యాస పెట్టాడు. మునివేళ్ల మంత్రం నేర్చాడు. మాస్టర్ చెఫ్ పోటీలో విజేతగా నిలిచి 25 లక్షల ప్రైజు సాధించాడు. అమ్మ ఊరికెళితే కర్రీ పాయింట్ వైపు అడుగులు వేసే పుత్రరత్నాలు ఇతని నుంచి నేర్చుకోవాల్సింది ఉంది.
27 ఏళ్ల నయన్‌జ్యోతి సైకియాకు రాని వంట లేదు. మూడు నెలల పాటు ముంబైలో ‘మాస్టర్ షెఫ్’ రియాలిటీ షో కోసం ఉండి, రకరకాల వంటలు చేసి, భేష్ అనిపించుకుని, వారం క్రితం 25 లక్షల రూపాయల మొదటి ప్రైజ్ గెలిచాక ఎగువ అస్సాంలో ఉండే అతని ఊరి ప్రజలు ఉత్సవం జరుపుకుంటూ, ట్రోఫీతో తిరిగి వస్తున్న అతనికి స్వాగతం చెప్పడానికి రకరకాల వంటలు చేయిస్తూ ‘ప్రత్యేకంగా ఏం చేయించమంటావ్’ అని అడిగితే నయన్‌జ్యోతి సైకియా ‘ఏం వద్దు... మా ఇంట్లో చేసే టొమాటో చేప కూర చాలు’ అన్నాడు. దాదాపు రెండు వేల మంది అతనికి స్వాగతం చెప్పడానికి ఊరిలో జమ అయితే ఈ కూర నాలుకకు తగిలాకే ‘అమ్మయ్య... ఇప్పటికి మన ఊరు చేరినట్టయ్యింది’ అని నవ్వాడు.
ఇవాళ నయన్‌జ్యోతి సైకియాను అస్సాం అంతా తనవాడు అని గర్వంగా చెప్పుకుంటోంది. అతను ఆస్కారో నోబెలో తేలేదు. కేవలం వంట ద్వారానే తన ప్రాంతం తల ఎత్తుకు తిరిగేలా చేశాడు.
మెకానికల్ ఇంజనీర్
నయన్‌జ్యోతి సైకియా సొంత ఊరు తిన్ సుకియ. ఇది గౌహతికి 490 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సైకియా తండ్రి టీ ఎస్టేట్‌లలో పని చేస్తాడు. రైతు. 2018లో గౌహతిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సైకియా ఊరికి తిరిగి వచ్చి టీ ఎస్టేట్‌లో తండ్రి పనికి సాయంగా ఉంటూ వచ్చాడు. నిజానికి చిన్నప్పటి నుంచి ఇంట్లో వంట విషయంలో సాయం చేస్తూ వచ్చిన సైకియాకు వంట మీద రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోయిందని ఇంటి వాళ్లు గుర్తించలేదు. అది ఒక ముఖ్య ఉపాధి అని కూడా భావించలేదు. కాని సైకియా మాత్రం తన బెడ్‌రూమ్‌లో ఒక మూల చిన్న స్టవ్‌ను ఏర్పాటు చేసుకొని రకరాల వంటలు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్ వరకూ ఇది కొంత రహస్యం గా సాగినా ఇంజనీరింగ్ కోసం గౌహతికి వెళ్లాక ఆ నాలుగేళ్లు అతని ప్రయోగాలకు అడ్డు చెప్పేవారు లేకపోయారు.
ఇంటర్‌నెట్ గురువు
‘నాకు గురువులు లేరు. వంట శాస్త్రం కాలేజీకి వెళ్లి చదువుకోలేదు. నాకు వచ్చిందంతా ఇంటర్‌నెట్‌లో రకరకాల షెఫ్‌లను ఫాలో అయి నేర్చుకున్నదే. నేను మంచి ఫొటోగ్రాఫర్ని. నేను చేసిన వంటలను చాలా ఆకర్షణీయంగా ఫొటోలు తీసి ఇన్‌స్టాలో పెట్టేవాణ్ణి. అలా అందరి దృష్టి నా మీద పడింది. ప్రఖ్యాత షెఫ్ వికాస్ ఖన్నా నా ఇన్‌స్టా పేజీలో నా వంటలను చూసి నన్ను వెతుక్కుంటూ అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మా ఊరు వచ్చారు. మా ఇంట్లో మా సంప్రదాయ వంటలు వండి చూపించారు. నన్ను మాస్టర్ షెఫ్ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్‌గా తీసుకెళతానని అడిగారు.
గట్టిపోటీలో ఈశాన్య రుచులు చూపి
‘మాస్టర్ షెఫ్’ రియాలిటీ షో అంటే మాటలు కాదు. కొమ్ములు తిరిగిన పార్టిసిపెంట్‌లు వస్తారు. అనుభవం సంపాదించుకున్నవారు వారిలో ఉంటారు. వారందరితో తలపడి మొదటి స్థానానికి వెళ్లడం చాలా గొప్ప. అదీ గాక జడ్జీలను మెప్పించాలి. ఈ షోకు జడ్జీలుగా వచ్చిన రణ్‌వీర్ బ్రార్, గరిమ అరోర, వికాస్ ఖన్నాను ఆకట్టుకున్నాడు సైకియా. ‘అందుకు కారణం నేను నా వంటల్లో మా ఊరి దినుసులను దాదాపుగా వాడటం. వాటితో ప్రయోగాలు చేయడం.’ అంటాడు సైకియా.
ఎన్నో అడ్డంకులున్నా ఇంత విజయం సాధించాక పెద్ద పెద్ద రెస్టరెంట్లే అతణ్ణి భాగస్వామిని కమ్మని అడుగుతున్నాయి. విజయం అంటే ఇది. కోరుకున్న కలను ఛేదించాలంటే ఇలాంటి పట్టుదలే ఉండాలి.
‘నేను జీవితంలో ఇప్పటికీ పెద్ద రెస్టరెంట్‌కు వెళ్లలేదు. మా ఊళ్లో లేకపోవడం వల్ల. అంత డబ్బు లేకపోవడం వల్ల. కాని పెద్ద రెస్టరెంట్‌లలో చేసేవన్నీ నేను అంతకన్నా బాగా చేయడం నేర్చుకున్నాను’
నార్త్ ఈస్ట్ అంటే మాంసాహారం అని ఎక్కువమంది అనుకుంటారు. నేను శాకాహారం రెసిపీలు కూడా చేసి చూపించాను. మణిపూర్ నల్లబియ్యంతో సంగటి వొండితే వారికి బాగా నచ్చింది. ఇక రకరకాల పాస్తాలు చేయడంలో నన్ను మించినవారు లేరు.
– నయన్‌జ్యోతి సైకియా
Comments
Please login to add a commentAdd a comment