గృహిణుల గొంతుక
‘కలలు కనడం మానవద్దు. కలలను సాకారం చేసుకోవాలంటే కష్టపడాలని మరువద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆశలకలను త్యాగం చేయవద్దు’ అంటోంది అరుణా విజయ్. తోటి గృహిణులకు ఆమె ఇస్తున్న సందేశం ఇది. గృహిణి అంటే ఏ పనీ రానివాళ్లనే అపోహతో కూడిన వెక్కిరింతకు చెంప చెళ్లుమనిపించింది అరుణ. ఏ సోషల్‌మీడియా అయితే ఆమెను తక్కువ చేసి మాట్లాడిందో అదే సోషల్ మీడియాలో ఇప్పుడామె ఒక ఇన్‌ఫ్లూయెన్సర్. మాస్టర్ షెఫ్ టాప్ 4 గా నిలిచి ప్రశంసలందుకుంటోంది. ఆమె వంటలకు వ్యూస్, లైక్స్‌తో విజేతగా నిలిచింది.
అపోహ తొలగింది!
చెన్నైలో పుట్టి పెరిగిన అరుణ 22 ఏళ్లకు పెళ్లి చేసుకుని ఇంటికి పరిమితమైంది. పదిహేనేళ్ల వయసు నుంచే వంటగదిలో ప్రయోగాలు చేసిన అరుణ భార్యగా, తల్లిగా ఇంటి బాధ్యతల నిర్వహణలో విజయవంతమైన మహిళ అనే చెప్పాలి. ఆమెది ఉద్యోగం చేసి డబ్బు సం పాదించాల్సిన అవసరం లేని జీవితమే. కానీ గృహిణి అనగానే తేలిగ్గా పరిగణించే సమాజం ఆమెకు చేసిన గాయాలెన్నో. తాను ఏదో ఒకటి సాధించాలనే కోరిక రగులుతూనే ఉండేదామెలో. ఆ కోరికే ఆమెను మాస్టర్ షెఫ్ ఇండియా 2023పోటీలకు తీసుకెళ్లింది. పోటీదారుల మీద రకరకాల కామెంట్‌లు రువ్విన సోషల్ మీడియా అరుణను ‘ఈవిడా... ఈవిడ గృహిణి’ అంటూ చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదనే భావంతో తేలిక చేసింది. మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్‌లలో అరుణకు ఎదురైన చేదు అనుభవం ఇది.
దక్షిణ భారత వంటలు ఇడ్లీ, దోశెలతో ఆమె ప్రయోగాలు న్యాయనిర్ణేతల నోట్లో నీళ్లూరించాయి. పోటీదారుల్లో నాలుగవ స్థానంలో నిలిచింది. పోటీ పాల్గొన్న నాటికి టాప్ ఫోర్‌లో నిలిచిన నాటికి మధ్య ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ‘‘సోషల్ మీడియా కామెంట్‌లకు మనసు గాయపడి కన్నీళ్లతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని’ చెప్పింది. మన సమాజంలో ‘గృహిణి అంటే ఏమీ తెలియని వ్యక్తి’ అనే అభిప్రాయం బలంగా ముద్రించుకుపోయి ఉంది. ఆ అపోహను తుడిచి పెట్టగలిగాను. గృహిణుల మనోభావాలకు నేను గళమయ్యాను’’ అంటోంది అరుణా విజయ్.
Comments
Please login to add a commentAdd a comment