గట్టిగా అనుకుని ఆచరణలో పెడితే చాలు తలుచుకున్న పని తప్పక సఫలం అవుతుంది అనే మాటలకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారు బామ్మ ఊర్మిళా అషేర్. ఎనిమిది పదుల వయసుకు చేరువలో ఉండి తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో లక్షలాది అభిమానులను ఘుమఘుమలతో కట్టిపడేసింది.ఆటుపోట్ల జీవనాన్ని అధిగమించి తన సత్తా చూపుతోంది.
కష్టాలు తాత్కాలికమే, జీవితంపై నమ్మకం కోల్పోకూడదు. విపరిణామాలు మనపైన ప్రభావం చూపకుండా ఉండేందుకు ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ధైర్య స్థైర్యాలతోనే జీవితాన్ని గెలవాలి. – ఊర్మిళా అషేర్
‘‘మొన్న అప్‌లోడ్ చేసిన నా 200 వ వీడియోతో యూ ట్యూబ్ చానెల్ లక్ష మంది అభిమానులను సంపాదించింది. ఇటీవలే దేశవ్యాప్తంగా టీవీలో ప్రసారమవుతున్న ‘రసోయి షో’లో పాల్గొన్నాను. మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్ 7లో పోటీదారుగా చేరడంతో మీ అందరికీ పరిచయం అయ్యాను. ఇదంతా మీ అభిమానం వల్లే కలిగింది’ అంటూ ఆనందంగా చెబుతోంది ఊర్మిళ అషేర్. ముంబైలో ఉంటున్న ఊర్మిళ అషేర్ గుజరాతీ కుటుంబీకురాలు.
తన కుటుంబం ఆర్థిక కష్టాలు తీరాలంటే ఏదో ఒక సాయం చేయాలనుకుంది. అందుకు తనకు వచ్చిన పాకశాస్త్ర ప్రా వీణ్యాన్ని పెట్టుబడిగా పెట్టింది. తన మనవడు హర్ష్‌తో కలిసి మూడేళ్ల క్రితం ‘గుజ్జు బెన్ న నాస్తా’ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఏడాదికి రూ.45 లక్షల టర్నోవర్ సాధిస్తూ 78 ఏళ్ల వయసులోనూ ‘గ్రేట్ బామ్మా’ అనిపించుకుంటోంది.
కోల్పోనిది ధైర్యమొక్కటే..
ఊర్మిళా అషేర్‌కు పద్దెనిమిదేళ్ల వయసులో పెళ్లయ్యింది. భర్త చిరుద్యోగి. ముగ్గురు పిల్లలు. ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. రెండున్నరేళ్ల వయసులో కూతురు మూడవ అంతస్తు మీద నుంచి కింద పడి మరణించింది. భర్త తెచ్చే జీతం డబ్బులతో ఇంటిని నడుపుకుంటూ వచ్చింది. పెద్ద కొడుకుకి పెళ్లి చేసింది. కరోనాకు ముందు ఇద్దరు కొడుకుల్లో ఒకరు గుండెపోటుతో, మరొకరు బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించారు. ఆ తర్వాత భర్త మరణించాడు.
ఈ ఎదురు దెబ్బలు ఆమెను నిత్యం గట్టిపరుస్తూనే ఉన్నాయి. ‘మరణం అనేది పరమసత్యం. దాని గురించి ఎన్ని రోజులని ఏడుస్తూ కూర్చుంటాం. నేనెప్పుడూ నా వద్ద ఉన్న శక్తితోనే ఏం చేయగలను అనేదానిపై దృష్టిపెడతాను. ఉన్న సమస్యలు చాలవన్నట్టు నాలుగేళ్ల క్రితం నా మనవడు హర్ష్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో పై పెదవి పూర్తిగా దెబ్బతిని, ఇంటికే పరిమితం అయ్యాడు. అతను నడుపుతున్న దుకాణాన్ని కరోనా మహమ్మారి కారణంగా మూసేశాం. దీంతో ఆర్థికంగా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ కష్టాలు తాత్కాలికమేనని, జీవితంపై నమ్మకం కోల్పోకూడదని తెలుసు’ అని చెప్పే ఊర్మిళ ఈ విపరిణామాలు మనవడిపైన ప్రభావం చూపకుండా ఉండేందుకు ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదని, ధైర్య స్థైర్యాలతోనే జీవితాన్ని గెలవాలని చెబుతూ ఉంటుంది. ఆమె మనో నిబ్బరం, ఆత్మవిశ్వాసాలే నేడు ఏడాదికి రూ.45 లక్షల టర్నోవర్‌కు చేరుకునేంతగా ఫుడ్ బిజినెస్‌లో ఎదిగేలా చేశాయి. కష్టం వచ్చినప్పుడు ఇంకాస్త గట్టిగా ఉండాలని తన కథనే ఉదాహరణగా ఇతరులతో పంచుకుంటోంది ఈ దాదీ.
వ్యాపార విస్తరణ
కోడలు, మనవడితో ఉండే ఊర్మిళ తన చేతి రుచి గురించి చెబుతూ– ‘‘నాకు చిన్నప్పటి నుంచి వంటలు బాగా చేస్తాననే పేరుంది. మమ్మల్ని మేం బతికించుకోవడానికి ముందుగా గుజరాతీ చిరుతిళ్ల వ్యాపారాన్ని ప్రా రంభించాం. ఆర్డర్లు వచ్చినదాన్ని బట్టి 20–25 రోజుల్లో 500 కిలోల పచ్చళ్లను రెడీ చేశాం. దీంతోపాటు తేప్లా , ఢోక్లా, పూరన్ పోలీ.. వంటి ఇతర స్నాక్స్ కూడా అమ్మడం మొదలుపెట్టాం. డిమాండ్‌ను బట్టి పనివాళ్లను ఎక్కువ మందిని నియమించుకున్నాం.
ఒక సంవత్సరం తిరిగేసరికల్లా మా జీవితాలే మారిపోయాయి. నేనిప్పుడు టెడెక్స్ స్పీకర్‌ని కూడా. నా కథలను ఇతరులతో పంచుకుంటూ, ఇతరులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటూ వివిధ నగరాలకూ ప్రయాణిస్తున్నాను. ఇప్పుడు మా ఆలోచన ఒక్కటే! నేను, మా మనవడు కలిసి అంతర్జాతీయ విమానాశ్రయాలలో ‘గుజ్జుబెన్ నాస్తా’ను ఏర్పాటు చేయాలని.
అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుండి కూడా ఆర్దర్లు తీసుకుంటున్నాం. వ్యాపారాన్ని ఇంకా విస్తరిస్తేనే కదా మరింత మందికి చేరువ అయ్యేది... మా ఊరగాయలను ఆన్‌లైన్ ΄్లాట్‌ఫారమ్‌లలో పెట్టడానికి కావలసిన లాంఛనాలు కూడా పూర్తయ్యాయి’ అని ఉత్సాహంగా వివరించే ఊర్మిళ మాటలు నేటి యువతకూ స్ఫూర్తినిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment