ఆకాష్ మురళీధరన్‌కు చిన్న వయసులోనే వంటలపై ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోయి ప్రపంచ వంటకాల గురించి కూడా తెలుసుకునేలా చేసింది. ప్రపంచ వంటకాల గురించి కాచి వడబోసిన చెన్నైకి చెందిన ఆకాష్ దక్షిణ భారతీయ వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి నడుం కట్టాడు. ‘మాస్టర్ చెఫ్ ఇండియా’ టైటిల్ గెలుచుకున్నాడు. ‘కుకింగ్ ఈజ్ థెరపిటిక్’ అంటున్న ఆకాష్‌కు వంటలు చేయడం పాషన్ మాత్రమే కాదు. ప్రాణవాయువు కూడా...
వంటగదిలో బామ్మ స్వీట్ తయారు చేస్తుంటే చిన్నప్పుడెప్పుడో చూశాడు ఆకాష్. ‘ఇక్కడ నీకు ఏం పని?’ అని గద్దించలేదు బామ్మ. ‘ఈ స్వీటును ఇలా తయారు చేయాలి నాయనా’ అంటూ వివరించింది. ఇక అప్పటి నుంచి రకరకాల వంటలు. స్వీట్‌ల తయారీపై ఆకాష్‌కు ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తి, నేర్చుకున్న విద్య ఊరకే పోలేదు. బెంగళూరులో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో బాగా ఉపయోగపడింది. తనకు ఇష్టమైన వంటలు చేసి ఆ రుచులను ఆస్వాదించడంతో పాటు వంటల్లో రకరకాల ప్రయోగాలు చేసేవాడు.
రుచుల ఆస్వాదనలో ఆనందమే కాదు వంట చేస్తున్న సమయంలో ఏకాగ్రత పెరగడం, మనసు ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉండడం గమనించాడు ఆకాష్. ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చేసిన ఆకాష్ ఒక ఆర్కిటెక్చర్ ఫర్మ్‌లో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. యానిమేషన్‌లో డిప్లామా కూడా చేసిన ఆకాష్ ఆ తరువాత వంటలపై తన పాషన్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు. కొత్త కొత్త వంటకాల గురించి మరింత ఆసక్తిగా తెలుసుకోవడం మొదలుపెట్టాడు.
ఇటలీలోని మిలాన్‌లో ఫుడ్ డిజైన్‌లో మాస్టర్స్ చేశాడు. పాత వంటకాలకు కొత్త ఫ్లేవర్ జోడించడాన్ని తన ప్రత్యేకతగా చేసుకున్నాడు. యూరప్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఎన్నో వంటకాల గురించి తెలుసుకునే అవకా«శం వచ్చింది. ఇది తన భవిష్యత్ బాటకు బాగా ఉపయోగపడింది. ‘ఇండియాకు ఆవల ఫుడ్‌ను ఎలా చూస్తారు?’ అనే విషయాన్ని లోతుగా తెలుసుకోవడానికి కూడా తన ప్రయాణాలు ఉపయోగపడ్డాయి.
నెదర్‌లాండ్స్‌లో ఒక ఫుడ్ డిజైనర్‌తో కలిసి పనిచేశాడు. ‘ప్రపంచంలోని ఎన్నో వంటకాల గురించి తెలుసుకున్న నాకు దక్షిణ భారత వంటకాల రుచులను ప్రపంచానికి పరిచయం చేయాలని గట్టిగా అనిపించింది’ అంటాడు ఆకాష్. మనం ఆస్వాదించే వంటకాలకు సంబంధించిన ఆసక్తికరమైన కథలను ఆధునిక పద్ధతులలో చెప్పడానికి ‘విజా మెడై’ పేరుతో మల్టీడిసిప్లినరి స్టూడియోను మొదలు పెట్టాడు. ఈవెంట్ డిజైన్, డెకర్, మెనూ క్యురేషన్, ఔట్‌ఫిట్ డిజైన్, స్టైలింగ్, క్రియేటివ్ డైరక్షన్‌లు ఈ స్టూడియో ప్రత్యేకత.
తన ‘100–డే కుకింగ్ ప్రాజెక్ట్’లో భాగంగా మనం మరచిపోయిన ఎన్నో కూరగాయలను వెలుగులోకి తెచ్చాడు. సౌత్ ఇండియన్ ఫుడ్ రుచుల గురించి వివరంగా చెప్పడానికి ‘మాస్టర్‌చెఫ్ ఇండియా–తమిళ్’ షోలో పాల్గొన్నాడు. ఆకాష్ వంటనైపుణ్యానికి ఫిదా అయిన జడ్జీలు స్టాండింగ్ వొవేషన్ ఇచ్చారు. ‘మాస్టర్‌చెఫ్ ఇండియా–తమిళ్’ టైటిల్ గెలుచుకున్నాడు ఆకాష్. చిన్నప్పుడు అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్(ఏడీహెచ్‌డీ)తో బాధ పడిన ఆకాష్‌కు వంట చేయడం అనేది చికిత్సలా ఉపయోగపపడింది. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment