దెబ్బకు ఠా.. దొంగల ము ఠా..
నీరూస్ జంక్షన్ వద్ద కాల్పుల కలకలం
మెట్రో కార్మికుడికి బుల్లెట్ గాయాలు
భయభ్రాంతులకు గురైన స్థానికులు
పోలీసుల అదుపులో దుండగులు
సిటీబ్యూరో: హైటెక్ సిటీ... మాదాపూర్... జూబ్లీహిల్స్... ఈ ప్రాంతాలు ప్రముఖ దుకాణాలు, కార్యాలయాలకు నెలవు. ఈ మార్గం వీఐపీలు... సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల రాకపోకలతో ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంటుంది. ఈ ప్రాంతంలోనే ఉన్న జూబ్లీహిల్స్ నీరూస్ జంక్షన్ వద్ద గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. మెట్రో కార్మికుడి ఛాతీలోకి బుల్లెట్ దూసుకపోవడం... మిగతా కార్మికులు ఏకమై దొంగలను పట్టుకునేలోపు పోలీసులు అప్రమత్తమై వారిని అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి.
రెక్కీకి వచ్చి: చార్మినార్‌లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో భారీ దోపిడీ చేయాలన్నది మీర్జా మహమ్మద్ అబ్దుల్లా ముఠా ప్లాన్. ఈ లక్ష్యంతోనే వారు ఐదు రోజుల క్రితం నగరానికి వచ్చారు. గుల్బర్గాకు వలస వెళ్లిన మీర్జా మహమ్మద్ అబ్దుల్లాకు టోలిచౌకిలో ఇల్లు ఉంది. అక్కడే వీరు ఉంటున్నారు. తొలి మూడు రోజులు నగల దుకాణం వద్దనే రెక్కీ నిర్వహించినట్టు పోలీసులకు సమచారమందింది.ఈ మేరకు వారిపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా వేశారు. మాదాపూర్ బిగ్‌సీ మొబైల్ షాప్ వద్ద గురువారం రెక్కీ నిర్వహించేందుకు మీర్జా మహమ్మద్, అబ్దుల్ ఖదీర్ వస్తున్నారని... గుల ్బర్గాలో ఉంటున్న లంగర్‌హౌస్ వాసి మహమ్మద్ సమీయుద్దీన్‌ను నీరూస్ షాప్ వెనకాల ఉన్న ప్రాంతంలో కలుసుకుంటారని పోలీసులకు పక్కా సమాచారం అందింది.
12.45: బిగ్‌సీ నుంచి బయలుదేరి నీరూస్ షాప్ సమీపంలో మహమ్మద్ సమీయుద్దీన్‌ను కలిసేందుకు బయలుదేరారు. అప్పటికే మఫ్టీలో ఉన్న పోలీసులు బైక్‌పై వెళుతున్న వీరిని వెంబడించారు.
12.55: మాదాపూర్ పోలీసు స్టేషన్ వద్ద తృటిలో తప్పించుకున్నారు.
12.57: నీరూస్ జంక్షన్ వద్ద సిగ్నల్ పడినా ముందుకెళ్లారు. అప్పటికే అక్కడే ఎదురుగా మాటువేసిన పోలీసులు వాహనాన్ని ఆపడంతో కిందపడ్డారు. మూడు నిమిషాల పాటు వీరి మధ్య భారీ ఘర్షణ జరిగింది. మీర్జా మహమ్మద్ అబ్దుల్లా పోలీసులతో చేసిన పెనుగులాటలో అతడి ఎడమ కాలి షూ ఎగిరి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10 మార్గం వైపు పడింది.
1.00: మీర్జా మహమ్మద్ అబ్దుల్లా నాటు తుపాకీ తీసి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. తొలి బుల్లెట్ డీసీఎం వ్యాన్‌లో ఉన్న మెట్రో కార్మికుడికి తగి లింది. రెండోది గాల్లోకి వెళ్లింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
1.03: వెంటనే తేరుకున్న పోలీసులు మెట్రో కార్మికుల సహకారంతో మీర్జా మహమ్మద్, అబ్దుల్ ఖదీర్‌లను పట్టుకున్నారు.
1.05: సమీపంలోనే మహమ్మద్ సమీయుద్దీన్‌ను చాకచాక్యంగా పట్టుకున్నారు.
ఏం చేశారంటే...
మధ్యాహ్నం 12 నుంచి 12.45 గంటల వరకు బిగ్‌సీ మొబైల్ షాప్ వద్ద నిందితులు రెక్కీ నిర్వహించారు. రోడ్డుపై ఉన్న ఓ కొట్టులో టీ తాగారు. మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ అనుమానాస్పదంగా కనిపించారు. ఓ వ్యక్తి రోజూ అక్కడికి వచ్చి... కలెక్షన్ డబ్బులను తీసుకుని జూబ్లీహిల్స్‌లోని ప్రధాన బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్నారు. శుక్రవారం వద్దామనుకుని నిర్ణయించుకున్నారు.