
విధ్వంసకారుడు
చరిత్రను సమాధి చేసిన చంద్రబాబు
మస్కతీ డెయిరీకి మల్వాల ప్యాలెస్..
భాగ్యనగరంలో నాలుగు వందల ఏళ్ల సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలు కూలిపోయాయి. ఆ దుష్కీర్తిని మూటగట్టుకున్న చంద్రబాబునాయుడు గురించి తాలిబాన్లకు తెలియదు. తెలిసుంటే అఖండ భారతావనిలో తమకూ ఓ ప్రతినిధి ఉన్నాడని మురిసిపోయేవారు. బాబు హయాం చారిత్రక మహా విధ్వంసానికి నిలువెత్తు సాక్ష్యం. పాఠ్యపుస్తకాల్లోనే కాదు... విశ్వవిద్యాలయాల్లో చరిత్ర శాఖ ను తొలగించాలని పట్టుబట్టిన ఘనత ఆయనది.
పర్యావరణంపై ‘హైటెక్’ దాడి
హైటెక్ సిటీ నిర్మాణానికి విలువైన రాతి సంపద విధ్వంసం జరిగింది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని అందమైన కొండలు, గుట్ట లు, రాతిశిలలను సమూలంగా తొలగించారు. నగర పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీసేలా వేల ఏళ్ల వయసున్న రాతి శిలలు, వృక్షాలను తొలగించడంపై పర్యావరణవేత్తలు అప్పట్లో తీవ్ర నిరసన తెలిపారు.
మల్వాల ప్యాలెస్ నేలమట్టం
చారిత్రక చార్మినార్ సమీపంలోని ఖాన్‌మైదాన్ ఖాన్ రోడ్డులో ఉన్న అద్భుతమైన కట్టడం మల్వాల ప్యాలెస్. ఆసఫ్‌జాహీల కాలంలో కట్టించిన ఈ రాజమందిరంలో నిజాం నవాబులకు ఆర్థిక సలహాదారులుగా వ్యవహరించిన ఉన్నతాధికారులు ఉండేవారు. ఆకట్టుకునే కళాత్మకమైన నిర్మాణశైలి, కర్రతో రూపొందించిన వరండా, కర్రతో చేసిన గేట్ ఈ భవనం ప్రత్యేకతలు. దీనిని ప్రభుత్వం గ్రేడ్-1 భవనంగా గుర్తించింది. అలాంటి చారిత్రక వారసత్వ కట్టడాన్ని బాబు నేలమట్టం చేసి మస్కతీ డెయిరీకి ధారాదత్తం చేశారు.
ముష్క్ మహల్
కుతుబ్‌షాహీల శైలిలో కట్టించిన ఈ భవనం బహదూర్‌పుర సమీపంలో ఉంటుంది. అబుల్ హసన్ తానీషా కాలంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా, కమాండర్‌గా ఉన్న మియాన్ ముష్క్ ఈ భవనాన్ని కట్టించాడు. చుట్టూ ప్రహరీ, చక్కటి ఉద్యానవనాల నడుమ, ఓ కాలువతో పాటు ఎన్నో ఆరుబయలు ప్రదేశాలతో అందంగా కట్టించిన అతిపెద్ద ముష్క్‌మహల్ చంద్రబాబు కాలంలో నామరూపాల్లేకుండా పోయింది.
ఆదిల్ అలాన్ మాన్షన్ (గద్వాల్ మాన్షన్)
నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గద్వాల్ మహారాజులు కట్టించిన ఈ చారిత్రక కట్టడం అప్పటి నిర్మాణ శైలికి ప్రతిబింబం. విశాలమైన ఈ భవనం సైతం చంద్రబాబు హయాంలోనే నేలమట్టమైంది.
రవిబార్
ఉర్దూగల్లీ రోడ్డును, ట్రూప్‌బజార్ రోడ్డును కలిపే ప్రదేశంలో రవిబార్ ఉండేది. ఈ భవనం నిజాం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అబ్దుల్ రహీం ఆధీనంలో ఉండేది. భవనం ముందు భాగంలో ఇండో యురోపియన్ నిర్మాణ శైలితో ఆకర్షణీయంగా ఉండేది. దీన్ని రవి బార్ యజమాని కొనుగోలు చేశారు. కొంతకాలం పాటు బార్ కొనసాగింది. ఆర్కిటెక్చర్ విలువల దృష్ట్యా దీనిని వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చారు. హెరిటేజ్ కమిటీకి ఎలాంటి సమాచారం లేకుండానే చంద్రబాబు ప్రభుత్వం దీనిని కూల్చేసింది. బేగంపేట్‌లోని కంట్రీక్లబ్‌లో ఒక భాగమైన చారిత్రక విలాయత్ మంజిల్ సైతం బాబు కాలంలో నేలమట్టమైంది.
మరికొన్ని...
1. మూడో నిజాం కాలంలోని అశ్విక దళపతి, రాజ్‌పుత్ యోధుడు జాంసింగ్ పేరుతో కార్వాన్‌లో జాంసింగ్ ఆలయాన్ని నిర్మించారు. పదిహేను అడుగుల ఎత్తయిన రాతి ద్వారబంధం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అలాంటి ఈ ఆలయాన్ని కూల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వారసత్వ కట్టడాల పరిరక్షకులు అడ్డుకున్నారు.
2. సచివాలయంలోని జీ బ్లాక్‌ను కూడా కూలగొట్టేందు కు ప్రయత్నించారు.
3. బహీర్‌బాగ్‌లోని గాంధీ వైద్య కళాశాల కూల్చివేతకు వ్యతిరేకంగా పలు సంస్థలు పెద్ద ఎత్తున పోరాడాయి.
4. మలక్‌పేట్‌లోని మహబూబ్ మాన్షన్ బాబు హయాం లోనే పూర్తిగా శిథిలమైంది.