ప్రకాశం జిల్లా: వైఎస్ హయాంలో జలసిరులు-ఆయన మరణంతో నిలిచిన నిర్మాణాలు
చంద్రబాబు హయాంలో చతికిలపడిన ప్రకాశం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు వైఎస్ ఊతమిచ్చారు. అధికారంలోకి రాగానే వాటి నిర్మాణానికి నిధులు కేటాయించి రైతుల్లో ఆశలు చిగురింపజేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తిచేసి 30వేల ఎకరాలకు సాగునీరందించిన అపర భగీరథుడాయన. వైఎస్ మరణానంతరం ఆయన ఆశ, ఆశయం నీరుగారిపోయాయి. ఆ తరువాత
అధికారంలోకి వచ్చిన పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి.
బాబు హయాంలో..
- చంద్రబాబు హయాంలో జిల్లాలో దాదాపు 36 మండలాలు కరవుతో అల్లాడిపోయేవి. ఏటా భూగర్భ జలమట్టం 1,000 అడుగుల లోతుకు వెళ్లేది. దాదాపు 2 వేల మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. ఏటా 20 గ్రామాల్లో పూర్తిగా, మరో 50 గ్రామాల్లో పాక్షికంగా వలసలు ఉండేవి.
- ఖరీఫ్, రబీ కలిపి కూడా జిల్లాలో 30 శాతం వ్యవసాయం జరగడం గొప్ప. నీళ్లులేక బీళ్లు పడిన భూములను అమ్ముకుందామన్నా కొనే దిక్కులేదు. చాలామంది రైతులు ఎకరం రూ.30 వేలలోపు కూడా తెగనమ్ముకున్న సందర్భాలున్నాయి.
- వ్యవసాయం దండగ అని చంద్రబాబే స్వయంగా చెప్పడంతో రైతులు మనోధైర్యం కోల్పోయారు. పశు సంపద కబేళాలకు వెళ్లింది. పశుగ్రాసం లేకపోవడంతో మూగజీవాలు రోదించాయి.
- పాజెక్టుల నిర్మాణం దిశగా రైతు సంఘాలు అనేక విజ్ఞప్తులు చేసినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.
వైఎస్ హయాంలో...
హా వైఎస్ పాలనలో ప్రకాశం జిల్లా జలకళ సంతరించుకుంది. గుండ్లకమ్మ గలగలా పారింది. మెట్ట భూములన్నీ సస్యశ్యామలమయ్యాయి. 2009 లోనే ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు వైఎస్. ఇప్పుడు 30వేల ఎకరాల్లో రెండు పంటలు పండుతున్నాయి. పనులు మొత్తం పూర్తయి ఉంటే ఖరీఫ్‌లో 62,368, రబీలో 80,060 ఎకరాలకు నీరందేది. 43 గ్రామాల్లోని 2.56 లక్షల మందికి తాగునీరు అందేది.
- వెలిగొండ ప్రాజెక్టుపై వైఎస్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కృష్ణా మిగులు జలాల ఆధారంగా నల్లమల కొండల్లో దీని నిర్మాణానికి పూనుకున్నారు. తీగలేరు కాలువ కింద 62 వేల ఎకరాలు, గొట్టిపడియ కాలువ కింద 9,500 ఎకరాలు, ఈస్టర్న్ కెనాల్ కింద 3,70,800 ఎకరాలు సాగులోనికి తీసుకురావాలన్నది లక్ష్యం.
- గుండ్లబ్రహ్మేశ్వరం రిజర్వాయర్ కింద ఉన్న 3,500 ఎకరాలు, రాళ్లవాగు రిజర్వాయర్ కింద ఉన్న 1,500 ఎకరాలతో పాటు ప్రకాశం , నెల్లూరు, కడప జిల్లాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు అందించే విధంగా ప్రణాళిక రూపొందించారు.
వైఎస్ తర్వాత..
- మూడు దశల్లో జరగాల్సిన గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులను ైవైఎస్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అడ్డుకున్నాయి. రూ.592.18 కోట్లు అంచనాలుంటే, ఇప్పటికి 247.37 కోట్లే ఖర్చు చేశారు.
- 60.31 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంటే, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయలేదు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ. 69.42కోట్లు మాత్రమే వ్యయం చేశారు.
- 2013-14లో ఈ ప్యాకేజీ కింద రూ.29 కోట్లు కేటాయించినా.. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు.
- మొత్తం 7 ప్యాకేజీలుగా వెలిగొండ పనులు పూర్తిచేయాలని నిర్ణయించినా ఒక్కటీ ముందుకు సాగడం లేదు
- ఒకటో టన్నెల్ కింద ఇంకా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
- సుంకేసుల డ్యాం పరిధిలో తీగలేరు ఫీడరు కెనాల్ ఇప్పటికీ పూర్తికాలేదు. గుర్తించిన భూమిలో ఇంకా 9,483 ఎకరాలను సేకరించాల్సి ఉంది.
వైఎస్ ఉంటే ఆగేవా?
జిల్లాలో వెనుకబడిన ప్రాంతాన్ని కరువు కోరల నుంచి కాపాడేందుకు వెలిగొండ పనులను ప్రారంభించారు వైఎస్. ఆయన ఉన్నంత వరకు పనులు త్వరగా జరిగాయి. తరువాత వచ్చిన సీఎంలు ఎవరూ పట్టించుకోలేదు.
- గంజి శంకరరెడ్డి, రైతు
మా త్యాగానికి విలువ లేదా?
వెలిగొండ కోసం మా భూములనే త్యాగం చేశాం. వైఎస్‌పై నమ్మకంతో భవిష్యత్తుపై ఆశలు పెంచుకున్నాం. ఈ ప్రాంతం పచ్చగా అవుతుందనుకున్నాం. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో కూడా అర్థం కావడం లేదు.
- తుమ్మా వెంకటరెడ్డి