రైతులు, చేనేత కార్మికులు, ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లా నారాయణపురం వచ్చిన షర్మిల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఐదేళ్ల కాలంలో ప్రజల కోసం తన సోదరుడు జగన్, తల్లి వైఎస్ విజయమ్మ చేసిన దీక్షలను ఈ సందర్భంగా షర్మిల ప్రజలకు వివరించారు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం ఇచ్చేందుకు జగన్నన సిద్ధంగా ఉన్నాడని అన్నారు. ఒక్కసారి జగనన్నకు అవకాశం ఇవ్వాలని షర్మిల ప్రజలను కోరారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై షర్మిల తన ప్రసంగంలో నిప్పులు చెరిగారు. తొమ్మిదేళ్ల పరిపాలనలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్కసారైనా రైతుల రుణమాఫీ చేశారా అంటూ ప్రజలను షర్మిల ప్రశ్నించారు. పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న కనీస ఆలోచన రాలేదని.... కానీ ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లే రోగుల వద్ద నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలనే దుర్మార్గపు ఆలోచన మాత్రం వచ్చిందని చంద్రబాబును షర్మిల దుయ్యబట్టారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం పంచాయతీని కనీసం మున్సిపాటిలీ కూడా చేయని ఆయన... ఈ రో జు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మలేషియా, సింగపూర్, జపాన్ చేస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు.
ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటేసే ముందు ఒక్కసారి తన తండ్రి వైఎస్ఆర్ను గుర్తు చేసుకోవాలని షర్మిల ప్రజలను కోరారు.