ఈ తిక్కకు లెక్కేది..?
పవనిజం- ఒక గొంతు మూడు నాల్కలు
ఎన్నికల్లో విద్వేష ప్రసంగాలు చేస్తే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఎన్నికల సంఘం కట్టడి చేస్తోంది. ‘అవును చర్యలుంటాయ’ని డీజీపీ హెచ్చరిస్తున్నారు. మరి రెండు నాల్కల ప్రసంగాలు చేస్తే?
బహుశా ఈ విషయంలో తగు చర్యలు తీసుకునే అధికారం/బాధ్యత ఓటర్లదేనని, వారే కట్టడి చేయాలనేది ఎన్నికల సంఘం అభిప్రాయమై ఉంటుంది! ప్రజలు విజ్ఞులు కనుక అదెలాగూ జరుగుతుంది. కానీ, ఈ లోపు నష్టనివారణ చర్యలైతే ఉండాలి కదా! సదరు రెండు నాల్కల నేతలు పరస్పర విరుద్ధంగా ప్రాంతానికో మాట మాట్లాడటం అన్నది ప్రాంతీయ విద్వేషాల్ని రగిలించడం, రెచ్చగొట్టడం.... అవదా? రజల్ని ఆలోచించే మనుషులుగా కాకుండా ఈవీఎంలలో గణాంకాలై తమ తలరాతలు మార్చే పచ్చి ఓటర్లుగా మాత్రమే భావించే నేతలు.... ఏ రోటికాడ ఆ పాట పాడి, అది మీడియాలో కొట్టొచ్చినట్టు కనిపించి... ఎక్కడ ఏం మాట్లాడారో!
ఎంత పరస్పర భిన్నంగా ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ప్రసంగించారో ఇరు ప్రాంతాల వారికీ తెలిస్తే!?! అదే జరుగుతోందిప్పుడు, నటుడు పవన్ ప్రసంగాలతో! పవనమంటేనే గాలి. ఇది సాధారణ గాలి కాకుండా, యువ హృదయాల్లో దూసుకుపోయే పెనుగాలి అవుతుందని, తమ జోలెలో ఓట్లు రాలుస్తుందని ఆశపడ్డ బడా నేతలిద్దరు ఆయన ప్రాపకం కోసం అర్రులు చాస్తున్న తీరు తెలుగునాట అడ్డుతెర లేని భాగోతం లాగే రక్తి కడుతోంది. కాకపోతే ఆ గాలి తుపాన్ పిచ్చిగాలిలా ఎటుపడితే అటు వీస్తోంది.
పిచ్చి పవనం ముందుకు, మున్ముందుకే వీస్తోంది తప్ప వెనక్కి తిరిగి చూసుకోవటం లేదు, మొన్నకు నిన్న మాట తీరు ఎంత భిన్నంగా ఉంది, నిన్నటి మీద స్వరం నేడెంత విభిన్నంగా ఉంది అని బేరీజు వేసుకుంటే, తన ప్రసంగాల్లోని డొల్ల తనమే కాదు కుళ్లు కూడా బోధపడేది. విధానాలపరంగా కాకుండా వ్యక్తులపరంగా తానెంత కుత్సితపు, కుతంత్రపు మాటలు చెబుతున్నాడో పాపం తనకే తెలిసొచ్చేది. కానీ, ఈ పిచ్చి పవనం వెనక్కి తిరిగి చూడదు. ముక్కు సూటిగా ముందుకే వెళుతుంది, ఏ గొడకో గుద్దుకొని ముక్కు పచ్చడయ్యే వరకో, ఆగ్రహించే వారెదురై సిగదరిగితే గుండు నిగారించే వరకో... అలా వీస్తూనే ఉంటుంది నేల మీద కాళ్లు ఆనని ఈ పవనం.
ఎవరో ఏర్పాటు చేసే మైక్(ం)ఉన్నన్ని రోజులు నోటికొచ్చింది మాట్లాడి, తగిన శాస్తి జరిగాక కనుమరుగయితే... మళ్లీ ఇంకో సినిమాల సందడో, ఎన్నికల పండుక్కో తప్ప తెరమీదికి రానే రాదీ పవనం. పోయిన ఎన్నికలప్పుడు అన్న నీడలో తేరగా దొరికిన మైకుల్లో ఊదరగొడుతూ... సామాజిక మార్పని, స్వచ్ఛంద సేవని, పంచలూడగొడతామని పలికిన బీరాలు గాలికిపోయాయి. ఫలితాలతో ప్రజలు ఏకంగా మాడు పగలగొడితే అప్పుడు ఫరారై సరిగ్గా అయిదేళ్లకు, ఈ ఎన్నికల వేళ మళ్లీ దూసుకొచ్చిందీ పవనం. ప్రత్యర్థులు చెప్పినట్టు సంక్రాంతి సమయంలో వచ్చే గంగిరెద్దుల వాళ్లలాంటి (నిజంగా ఆ వినోదపు వృత్తితో పొట్టపోసుకునే వారికి క్షమాపణలతో) ఈ పవనం అద్దె గొంతుతో అరివీర భయంకరంగా రంకెలు వేస్తోంది.
అదెలా....?
ఒక గొంతు మూడు నాల్కలు
మీరే చూడండి ఎంత తేడానో..
సీన్-1 విశాఖపట్నం
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి ఇంతవరకు ఇలాంటి రాజకీయ వికృత క్రీడ ఎన్నడూ చూడలేదు. రాష్ట్ర విభజనతో ప్రజ లను రోడ్లపైకి తీసుకువచ్చారు. అర్థంపర్థం లేకుండా అడ్డంగా తెలుగు రాష్ట్రాన్ని విభజించారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విభజించి ఎంగిలి మెతుకులు చల్లినట్టు ప్యాకేజీలు చల్లడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం చేయగలరా? కాంగ్రెస్ కో హటావో, దేశ్‌కో బచావో!
సీన్-2: నిజామాబాద్
జై తెలంగాణ. తెలంగాణ కోసం మొదట్నుంచి నా హృదయం తపిస్తావుంది. తెలంగాణ అంటే నాకెంతో ప్రేమ, నా గుండె లోతుల్లో తెలంగాణ ఉంది. నరనరాల్లో, నా రక్తంలో తెలంగాణ అంటే ఇష్టం. ఎప్పుడో విభజన జరిగి ఉండాల్సింది. రాష్ట్ర ఏర్పాటు జాప్యానికి కాంగ్రెసే కారణం. అందువల్లే వందలాది మంది ఆత్మబలిదానాలు చేసుకోవాల్సి వచ్చింది. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ వ్యతిరేక పార్టీల కూటమి అయిన మూడో ఫ్రంట్‌లో కేసీఆర్ ఎలా కలుస్తారు?
సీన్-3 : తిరుపతి
జగన్ వల్లే తెలంగాణ ఏర్పడింది. కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే తెలంగాణ ఆకాంక్ష క్రమంగా పెరుగుతూ వచ్చింది. నేటి దుస్థితికి వైఎస్ కుటుంబమే పూర్తిగా కారణం. కేసీఆర్ తెలుగువారిని ఛీకొట్టి చీదరిస్తే.. చేతులు కట్టుకొని చూస్తూ కూర్చుంటారా? తెలుగువారి ఆత్మగౌరవానికి అవమానం జరుగుతుంటే ప్రశ్నించలేరా? పౌరుషం, ఆత్మగౌరవం చచ్చిపోయిందా? తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడలేని వారు ముఖ్యమంత్రి ఎలా అవుతారు? అది జరిగే పనికాదు.
చూశారుగా నాలుక ఎన్ని మలుపులు తిరిగిందో!
పడని వారందరికీ ప్రశ్నలు వేస్తూ పరుగు పరుగున ముందుకు సాగే పవనానికి, తనకెదురయ్యే ప్రశ్నలకు జవాబులివ్వడం తెలుసా? ఇవ్వగలదా? మచ్చుకు అయిదే...
1. ఇంతకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పా, ఒప్పా? (30న పోలింగ్ ముగిసింది కనుక ముమ్మాటికీ తప్పా? లేక నరనరాన మీకు రక్తమార్పిడి జరిగిందా?)
2. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు దారులు పరచిన లేఖ ఇచ్చి సహకరించిందెవరు?
3. రాష్ట్ర విభజనకు రాజ్యాంగ సవరణ అవసరమైన వేళ, పార్లమెంటు బయట చీకటి ఒప్పందం చేసుకొని, రాజ్యసభ వేదికపై అధికార పక్షానికి అంటకాగి వంత పాడిన పార్టీ ఏది?
4. విభజన బిల్లుకు అనుకూలంగా సంతకం చేసిన మీ అన్నను ఎందుకు ప్రశ్నించలేదు?
5. అవసరం లేకపోయినా... ‘నాకు భయం లేదు’ ‘నాకు భయం లేదు’ అని పదేపదే వల్లెవేస్తున్నారు. ఆ...... ఘటన తర్వాత మీకింకా భయం వీడలేదా?