ఇప్పుడు మీ అన్న పంచెలూడదీసి కొడతావా? | adi seshagiri rao fire to pavan kalyan | Sakshi
Sakshi News home page

ఇప్పుడు మీ అన్న పంచెలూడదీసి కొడతావా?

Published Sat, May 3 2014 1:13 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

ఇప్పుడు మీ అన్న  పంచెలూడదీసి కొడతావా? - Sakshi

ఇప్పుడు మీ అన్న పంచెలూడదీసి కొడతావా?

 పవన్‌కు ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ ఆదిశేషగిరిరావు సూటిప్రశ్న

1. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల పంచలూడదీసి కొట్టాలన్న మాటలు మరిచావా?
2.    పవన్ ఓ పర్వెర్టెడ్ ఫెలో.. బాలకృష్ణ మెంటల్ కేస్.. చిరంజీవి అవకాశవాది..
3.    వీరి వల్ల సినీకళాకారుల పరువు గంగలో కలిసిపోయింది

 కాంగ్రెస్ నేతలను పంచెలూడదీసి కొట్టాలని గత ఎన్నికల్లో  ప్రజలకు పిలుపునిచ్చిన జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌కల్యాణ్... ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో ప్రచారసారథిగా ఉన్న తన అన్నయ్య చిరంజీవికి అదే బుద్ధి చెబుతాడా అని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సూటిగా ప్రశ్నించారు. ‘పవన్ నువ్వు ముందు నీ అన్న పంచెలూడదీసి కొట్టు... ఆ తర్వాత జనంలోకి వచ్చి మాట్లాడు...’ అని సూచించారు. ఆదిశేషగిరిరావు గురువారం ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

 సినీనటుల పరువు గంగలో కలిపారు

 గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీనటులకు ప్రత్యేక గౌరవం ఉండేది. వారు ఎన్నికల్లో ఓడినా, గెలిచినా హుందాతనంగా ఉండేవారు. కానీ అసమర్థుడు, అవకాశవాది చిరంజీవి రాజకీయ ప్రవేశంతో మొదలైన పతనం.. ఇప్పుడు పర్వెర్టెడ్ ఫెలో పవన్‌కల్యాణ్,  మెంటల్ కేస్ నందమూరి బాలకృష్ణ పిచ్చి ప్రేలాపనలతో రాజకీయాల్లో సినీనటుల పరువు గంగలో కలసిపోయింది. ఎన్నికలొస్తే చాలు తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ప్రచారం చేస్తుంటుంది.. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులతో పాటు పవన్ కల్యాణ్ లాంటి వారితో ప్యాకేజీలు మాట్లాడుకుని ప్రచారం చేస్తోంది. పవన్, బాలకృష్ణ కనీస విలువలు కూడా లేకుండా ఇష్టమొచ్చినట్టు వాగుతూ సినీ కళాకారుల పరువు తీస్తున్నారు. రాజకీయాల్లో చిరంజీవి, పవన్ ఐరన్‌లెగ్గులు. వాళ్లు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలు నాశనం కావడం ఖాయం. చిరంజీవి చేరికతో చూస్తుండగానే కాంగ్రెస్ పని అయిపోయింది. రేపు పవన్ ఎఫెక్ట్‌తో టీడీపీ, బీజేపీలకు అదే గతి పడుతుంది. చిరంజీవి సోనియా కాళ్ల వద్ద, పవన్ మోడీకి సాగిలపడి... ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారో అని కూడా లేకుండా నటుల స్థాయిని దిగజార్చారు.

 సొంతూరులో గెలిచే దమ్ము లేదా బాలకృష్ణ?

 30 ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉంటూ ఇన్నాళ్లకు ఎన్నికల బరిలో దిగిన బాలకృష్ణకు సొంతజిల్లా కృష్ణాలో పోటీచేసే దమ్ములేదా? మీ నాన్న పుట్టినూరు.. సొంత నియోజకవర్గం గుడివాడ ఉంచుకుని హిందూపురంలో పోటీచేయడం ఏంటి? సొంతూరులోనే గెలిచే సీన్ లేని నీకు రాజకీయాలు, వైఎస్ జగన్‌పై అర్థం లేని విమర్శలు అవసరమా? సినీ డైలాగుల మాదిరిగా ప్రసంగాలు చేస్తున్న  బాలకృష్ణ ఆవేశం.. మీ నాన్న ఎన్టీఆర్‌పై చెప్పులేయించినప్పుడు ఏమైంది? తండ్రి స్థాపించిన పార్టీని ముందుండి నడింపించాల్సిన నీవు బావ చేతికి పగ్గాలిచ్చి ఒక్క ఎమ్మెల్యే సీటును గెలిచేందుకు ఇంటిల్లిపాదిని అక్కడ తిప్పుతూ నానా కష్టాలు పడుతున్నావ్.. అటువంటి నీకు వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత ఉందా?

 మోడీ గుజరాత్ సీఎంగా ఆంధ్రాను దోచేశాడు..

 నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే మన గోదావరి జిల్లాల్లో ఉన్న సహజవాయువును అక్కడికి పైప్‌లైన్ల ద్వారా తరలించడం మొదలైంది. ఈ రిలయన్స్ ప్రాజెక్టు వెనుక మోడీ ఉన్నాడనేది అందరికీ తెలిసిన సత్యమే. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలోనే ఈ ప్రాజెక్టు ఒప్పందాలు జరిగాయి. గ్యాస్‌పై మన ప్రాంతానికి హక్కు లేకుండా చేసిన కుట్రలపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రంతో కూడా పోరాటం చేశారు. మళ్లీ బాబు, మోడీ కలిసి ఈసారి ఆంధ్రాను మొత్తం దోచేసేందుకు ఆరాటపడిపోతున్నారు. వీరిద్దరి విషయంలో సీమాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
 
బాబుకు సిగ్గెట్టాలేదో...

 తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా చేసి రాష్ట్రాన్ని యాభై ఏళ్లు వెనక్కి నెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాడు. ఒకప్పుడు తిట్టిన నోటితోనే ఇప్పుడు మోడీని కీర్తిస్తున్నాడు. చివరికి పవన్‌కల్యాణ్ ఇంటికి కూడా వెళ్లాడు. అసలు బాబుకు సిగ్గెట్టాలేదో? బాబు హయాంలో సీమాంధ్రలో ఒక్కటంటే ఒక్క ప్రాంతమైనా అభివృద్ధి చెందిందా? ఒక్క ప్రాజెక్టు వచ్చిందా? అసలు ఏం చూసి బాబును జనం నమ్మాలి? సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చెబుతున్న బాబు ఎన్నికలయ్యాక ప్రజలిచ్చే షాక్‌లు చూసి సింగపూర్ వెళ్లేందుకు తట్టాబుట్టా సర్దేసుకోవాలి.

 జగన్ వెంటే సీమాంధ్ర ప్రజ..

 ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే సీమాంధ్ర ప్రజలు ఉన్నారు. ఒక్క జగన్ కోసం చంద్రబాబు, మోడీ, పవన్‌కల్యాణ్ వంటి దుష్టశక్తులు ఏకమైనా జనశక్తి ముందు నిలవలేరు. వాళ్లకు దారుణ పరాభవం తప్పదు. ప్రజలు కూడా ఒక్కడి కోసం ఇంతమంది దిగజారి రాజకీయాలు చేస్తుండటాన్ని ఏవగించుకుంటున్నారు. అందుకే జగన్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను హైదరాబాద్‌లో కూర్చుని ఈ మాట చెప్పడం లేదు. శ్రీకాకుళం వంటి మారుమూల జిల్లాల్లో కూడా తిరిగి  ప్రజల నాడి తెలుసుకునే ఇంత ధీమాగా చెప్పగలుగుతున్నా. మా అన్న సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యాన్స్ మొత్తం జగన్ వెంటే ఉన్నారు.

 కేంద్రంలో రాబోయేది థర్ట్‌ఫ్రంట్

 కేంద్రంలో అందరూ అనుకున్నట్టు మోడీనో, కాంగ్రెస్సో రాదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మకశక్తిగా ఉండే థర్ట్‌ఫ్రంట్ అధికారంలోకి వస్తుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement