కె.జి.రాఘవేంద్రరెడ్డి: ‘రైతులకు ఉచిత విద్యుత్’.. ఏ పాలకుడూ ఊహించని, సాధ్యమని నమ్మని పథకం. తొమ్మిదేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు.. ఉచిత విద్యుత్ ఇస్తే తీగలు బట్టలారేసుకోవడానికే పని కొస్తాయని ఎద్దేవా చేశారు. ప్రపంచబ్యాంకు నిబంధనలను కూడా కాదని రైతులకు వరంలా ఉచిత విద్యుత్‌ను అమలు చేసి చూపారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన అనంతరం మళ్లీ పాలకులు చంద్రబాబు పాలనను గుర్తుకుతెస్తున్నారు.
చంద్రబాబు పాలనలో..
- ప్రభుత్వం చేసే ప్రతి పనికీ ప్రజల నుంచి చార్జీలు వసూలు చేయాలన్నది బాబు విధానం, సిద్ధాంతం. ఇందులో భాగం గానే వ్యవసాయానికీ విద్యుత్ చార్జీలను వసూలు చేశారు.
- విద్యుత్ చార్జీలు చెల్లించని రైతులపై కేసులు పెట్టారు. జైళ్లకు పంపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేశారు.
- రైతులపై 78 వేల కేసులు నమోదు చేశారు.
- ఏటా విద్యుత్ చార్జీలు పెంచారు. అటు గృహ వినియోగానికి, ఇటు వ్యవసాయానికీ చార్జీలు పెంచిన ఘనత చంద్రబాబుదే.
- చార్జీలు చెల్లించడం లేదని వ్యవసాయ కనెక్షన్లను తొలగించారు. పొలం మీద పడి మోటార్లు ఎత్తుకెళ్లారు. ఫ్యూజులు పీకేశారు. పంటలు ఎండిపోతున్నా కనికరించలేదు.
- ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించదని, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలకు బట్టలు ఆరేసుకోవాల్సిందేనని హేళన చేశారు.
- {పైవేటు ప్లాంట్లను ప్రోత్సహించారు. గ్యాసు లేదని తెలిసీ మరీ గ్యాసు ప్లాంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. విద్యుత్ ఇవ్వకపోయినా, స్థిర చార్జీలు చెల్లిస్తామని ఒప్పందంలో హామీ ఇచ్చారు.
రోశయ్య, కిరణ్ హయాంలో..
- ఏటా విద్యుత్ చార్జీలను పెంచారు. సర్దుబాటు చార్జీల పేరుతో పరోక్షంగా బాదారు. రెగ్యులర్, సర్దుబాటు చార్జీలను కలిపి ఏకంగా రూ. 24,218 కోట్ల మేరకు ప్రజలపై భారం వేశారు.
- ఇది చాలదన్నట్టు 2014-15లో ఏకంగా రూ. 9,370 కోట్ల మేరకు విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రతిపాదనలు సమర్పించారు.
- రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ను పూర్తిగా మరచిపోయారు. వ్యవసా యానికి ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కొత్త కొత్త ఆంక్షలను ముందుకు తెచ్చారు.
- వ్యవసాయ కనెక్షన్లకు సర్వీసు చార్జీని నెలకు 20 నుంచి 30 రూపాయలకు పెంచారు.
- వైఎస్ హయాంలో వసూలు చేయని సర్వీసు చార్జీలను బకాయిల పేరుతో వసూలు చేసేందుకు తెర లేపారు. వాటిని చెల్లించని రైతుల వ్యవసాయ స్టార్టర్లు, మోటార్లు ఎత్తుకెళుతున్నారు.
- వైఎస్ మరణం తరువాత ఒక్క కొత్త విద్యుదుత్పాదన ప్లాంటు నిర్మాణ పనులు కూడా ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు.
- సకల జనుల సమ్మె సాకుతో 2011 అక్టోబరులో మొదలైన విద్యుత్ కోతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీలు
- రైతులకు కచ్చితంగా 7 గంటల ఉచిత విద్యుత్ సరఫరా
- ఆ తరువాత ఉచిత విద్యుత్ సరఫరా సమయాన్ని 7 గంటల నుంచి 9 గంటలకు పెంపు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం
‘గత ఐదేళ్లలో విద్యుత్ చార్జీలను పెంచలేదు.. మరో ఐదేళ్లు పెంచేది లేదు’
- 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్పష్టీకరణ
- ‘అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ఉచిత విద్యుత్’ ఫైలుపైనే. విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తూ ఆయన రెండో సంతకం చేశారు.
- ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ లభించింది. రైతులు బకాయిపడ్డ రూ.1250 కోట్ల కరెంటు బకాయిలు మాఫీ అయ్యాయి. సుమారు 2 లక్షల మంది రైతులపై నాటి చంద్రబాబు ప్రభుత్వం బనాయించిన కేసులు రద్దు అయ్యాయి.
- ఏటా లక్షన్నర వ్యవసాయ కనెక్షన్లను జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
- 2004 నుంచి ఒక్క ఏడాదీ విద్యుత్ చార్జీలు పెంచలేదు. కనీస సర్వీస్ చార్జి అయిన రూ.20లను కూడా వసూలు చేయలేదు.
- వచ్చే ఐదేళ్లు కూడా విద్యుత్ చార్జీలు పెంచేది లేదని 2009 ఎన్నికల ముందు స్వయంగా వైఎస్ హామీనిచ్చారు. రైతులకిచ్చే ఉచిత విద్యుత్‌ను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచుతామన్నారు.
- 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో ఉత్పత్తి ప్రారంభమైన వెంటనే వ్యవసాయానికి 9 గంటల కరెంటు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చారు.
- 2014-15 ఆర్థిక సంవత్సరానికి మరో 9,370 కోట్ల మేరకు పెంచేందుకు ప్రతిపాదనలను సమర్పించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రానున్నాయి.
బిల్లులు భారమైతున్నయ్
ఏడాదికి రెండుమూడుసార్లు కరెంటు బిల్లులు పెంచుతుండ్రు. అయిగూడ అడ్డగోలుగ అస్తున్నయ్. పల్లెల్లో పగటిపూట మొత్తం కరెంటు లేకపోవడం వల్ల తాగడానికి గుక్కెడు నీరు కూడా దొరుకతలేదు. వైఎస్ ఉన్నప్పుడు ఇట్ట లేకుండె. గిప్పుడేమో వేసవి రాకముందు నుంచి నాలుగు నెలలపాటు కరెంటు కోతలు విధిస్తున్నరు. కరెంటు లేక పంటలు దెబ్బతిని నష్టపోతున్నం. మేం ఎవుసాయం ఎట్టచేయాలె.. ఎట్ట బతకాలె.. ఏమీ అర్థమైతలేదు.
-సాడం కుమార్, ఘన్‌పూర్(ఎం), నిజామాబాద్
ఉచితమే గాదు,కరెంటు ఫుల్‌గా వొచ్చేది
దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సారు ఉన్నపుడు ఉచిత కరెంటు ఇవ్వడంతో పాటు రోజుకు ఏడు గంటలు వచ్చేది. ఉన్న రెండె కరాలు నిమ్మలంగా పండించిన. ఇపుడేమో రోజుకు మూడు గంటలే ఇస్తున్నరు. ఎవర్ని అడిగినా చెప్పరు. ఎకరమే వరి నాటేసినం,అది కూడ పారుత లేదు. నాటేసిన పొలంల కొంత ఇప్పటికే ఎండుముఖం పట్టింది. రోజుకు మూడు గంటలే వొస్తుంది.అది ఎపుడు వోస్తదో తెలువది.
- నీరుడి సత్తయ్య, మూసాపేట, మెదక్ జిల్లా.
ఉచిత విద్యుత్ 12గంటల పాటు ఇయ్యాలె
కరెంటుపై ఆధారపడే పంటలు పండించుకునేటోళ్లం. సర్కారేమో కరెంటు ఏడు గంటలు ఇస్తామని చెప్పి మూడు గంటలు కూడా ఇస్తలేదు. మా గోస పట్టించుకునేటోళ్లే కరువైండ్రు. గా రాజశేఖరరెడ్డి సారు ఉన్నప్పుడు కరెంటు బాగొస్తుండె.తెలంగాణ రాష్ట్రంలోనైనా 12గంటల ఉచిత విద్యుత్ అందిస్తే రైతులు బాగుపడతరు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి ఏడాదంతా పంటలు నీళ్లందించేలా చేస్తే గదే పదివేలు.
-కృష్ణయ్య, టంకర, మహబూబ్‌నగర్
‘ఉచిత విద్యుత్’కు చీకట్లు
Published Fri, Apr 4 2014 1:18 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement