అన్నదాతల హంతకుడు బాబు
హైటెక్ పాలనతో రైతుల ఉసురు పోసుకుంటున్న ఘనుడంటూ చంద్రబాబుపై బీజేపీ దుమ్మెత్తిపోసింది. ‘అన్నదాత హంతకుడెవరు?’ పుస్తకంలో, ‘బాబు పాలన తాలూకు 100 తప్పుల చార్జిషీట్’లో ఏమందంటే...‘‘బాబు హైటెక్ ప్రభుత్వంలో అన్నదాతకు ఆత్మహత్యలే శరణ్యం. నీళ్లుండి కూడా, కేవలం కరెంటు లేని కారణంగా నిలువునా ఎండిన పైరును చూడలేక మెదక్ జిల్లా దేవనకూచినపల్లి వాసి కుర్మ దుర్గయ్య 1997 మార్చి 13న ఉరేసుకున్నాడు. దీనిపై అసెంబ్లీ అట్టుడికింది. కానీ బాబు మాత్రం పట్టించుకోలేదు. అప్పుల బాధకే మరణించాడు పొమ్మంటూ బుకాయించారు!’’
బాబు సభలోనే...
‘‘మార్కాపురంలో సాక్షాత్తూ సీఎం చంద్రబాబు సభలోనే ఓ పత్తి రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్‌లోనే ఓ పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా వీపనగండ్లలో అప్పుల బాధతో ఆదర్శ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా కేబీ పురం వాసి గోవిందరాజులు అప్పు దొరక్క ఆత్మహత్య చేసుకున్నాడు’’
హైటెక్ బాబు దృష్టిలో ఇవన్నీ లోటెక్!
‘‘ఏలూరు సమీపంలో పి.వెంకటరామారావు అనే రైతు బొమ్మిడి సహకార పరపతి సంఘం నుంచి తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోవడంతో అధికారులు ఇల్లు జప్తు చేశారు. వస్తువులు బయట పడేసి అవమానించారు. భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మర్నాడే ఏలూరులో కర్షక సదస్సు పెట్టిన బాబు... కనీసం సంతాపం కూడా తెలపలేదు! హైటెక్ సీఎం కదా! ఇలాంటి లోటెక్ విషయాలు పట్టించుకోడు’’
టీడీపీ కార్యకర్త అయినా...
‘‘నెల్లూరు జిల్లా మరపల్లికి చెందిన ముని రామయ్య తుఫాను బాధితుడు. బ్యాంకు నోటీసులతో బెంబేలెత్తి, బాబుకు చెప్పుకుందామని హైదరాబాద్ టీడీపీ కార్యాలయం చుట్టూ తిరిగాడు. కానీ... స్వయంగా టీడీపీ కార్యకర్త అయి కూడా కనీసం లోనికైనా వెళ్లలేకపోయాడు. శత ప్రయత్నాలు చేసినా, చివరికి పోలీసులతో గెంటివేతకు గురయ్యాడు. ఆ నిసృ్పహతో టీడీపీ కార్యాలయం ముందే పురుగుల మందు తాగేశాడు’’
ఒకరా, ఇద్దరా...!
‘‘పత్తి పంట ఎండి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం పగులాపూర్‌కు చెందిన పిల్ల కొమరయ్య, మంథని మండలం ధర్మారం వాసి కటుకూరి భీమయ్య, సైదాపూర్ మండలం ఆకునూరు వాసి మద్దూరు హన్మిరెడ్డి, కమాన్‌పూర్ మండలం జూలపల్లికి చెందిన పత్తి రైతు, సింగిల్ విండో డెరైక్టర్ కోల బాపు, వరంగల్‌జిల్లా రేగొండ మండలం గేరికొత్తపల్లి రైతు రాజేశ్వరరావు, గీసుకొండ మండలం నందనాయక తండా వాసి బదావత్ మంగ్యా, పరకాల మండలం వెంకటాపురానికి చెందిన జుంగు రవి, ఆత్మకూర్ మండలం పెద్దాపూర్ వాసి కొమ్ముల మల్లయ్య, సంగెం మండలం చింతపల్లికి చెందిన చాపర్తి వీరాస్వామి, గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెద్దగొర్లపాడు వాసి మారిశెట్టి కోదండరామయ్య, మేడికొండూరు మండలం పాలడుగు వాసి గుంటుపల్లి సుబ్బారావు, అనంతపురం జిల్లా బెళుగుప్ప వాసి విశ్వనాథం, కర్నూలు జిల్లా మద్దికెర మండలం పందెర్లపల్లికి చెందిన తిరుమలరెడ్డి... ఇలా ఎందరెందరో రైతులు బలవన్మరణాల పాలయ్యారు’’