బాబు..తేనెపూసిన కత్తి | chandra babu is most dangirous | Sakshi
Sakshi News home page

బాబు..తేనెపూసిన కత్తి

Published Sat, May 3 2014 1:03 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

బాబు..తేనెపూసిన కత్తి - Sakshi

బాబు..తేనెపూసిన కత్తి

తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నగా చెబుతున్నాను
 

 
 
 దుర్మార్గుడు.. మేకవన్నె పులి  గాడ్సేనే మించిన వాడు  అభినవ ఔరంగజేబు.. మిడత..!  మూర్తీభవించిన పదవీ కాంక్ష  ప్రజాస్వామ్య హంతకుడు.. కుట్రకు కొలువు గూడుపుఠాణీకి గురువు.. మోసానికి మూలస్తంభం గుండెల్లో చిచ్చు పెట్టిన వాడు.. గొడ్డు కన్నా హీనం చీమల పుట్టలో పాములా చేరిన వాడు
 
 తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా వినండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. మీరు చెప్పేదే న్యాయం. చేసేదే ధర్మం. నాటి నుంచి నేటి వరకూ జరిగిన చరిత్రను మీ ముందు, అంటే ప్రజా న్యాయస్థానం ముందుంచుతున్నాను. మంచేదో చెడేదో; నిజమేదో అబద్ధమేదో; ఆశయమేదో ఆశేదో మీకు తెలియాలనే ఈ ప్రయత్నం. నీతికీ అవినీతికీ మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో న్యాయనిర్ణేతలు మీరే. ఎవరు విజేతలో తేల్చాల్సింది కూడా మీరే.
 
 ఇవన్నీ గిట్టని వారి మాటలు కావు. ఎన్నికల వేళ ఎవరి పేరు చెప్పుకుంటూ చంద్రబాబు ఊరూరా ఓట్లడుక్కుంటున్నారో, ఆ అన్నగారే స్వయానా అన్నమాటలు! దివంగత నందమూరి తారక రామారావు నోటి నుంచి వెలువడ్డ శిలాక్షరాలు. బాబు ‘విశ్వరూపాన్ని’ కళ్లారా చూసి ఆయనే స్వయంగా అనుగ్రహించిన బిరుద రాజాలు. అల్లుడని నమ్మిన వాని చేతిలోనే అడ్డంగా నయవంచనకు, వెన్నుపోటుకు గురైన ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిన శాపనార్థాలు. ఎన్టీఆర్ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడలేదు! పిల్లనిచ్చిన మామనే ఇంతగా క్షోభ పెట్టి, ఆయనతో ఇన్ని రకాలుగా తన కీర్తిగానం చేయించుకున్న పుణ్య చరితుడు నారా బాబు. వెన్నుపోటుకు గురై అధికారం కోల్పోయిన అనంతరం బాబును దునుమాడుతూ ఎన్టీఆర్ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను ఆయన మాటల్లోనే చదవండి...
 
 బాబు ఒక చిన్న మిడత
 
224 సీట్లతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రాభవాన్ని ప్రతిఘటించడం చేతకాని వ్యతిరేక శక్తులు కొంతమంది, (1995లో) లోలోన గూడుపుఠాణీ ఆరంభించారు. దీనికిగురువు, ఈ కుట్రకు కొలువు, మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్రబిందువు చంద్రబాబు నాయుడు! నా అల్లుడనబడుతున్నవాడే నా గుండెల్లో చిచ్చుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్‌లో ఉంటూ, మంత్రులపై కూడా పోటీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికి, చివరకు తెలుగుదేశం మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఓ చిన్న మిడత. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, అతను పార్టీలో చేరతానని వస్తే, చేర్చుకోవద్దని కొందరు హితవు చెప్పారు. అయినప్పటికీ పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాను. తర్వాత పార్టీలో ముఖ్యమైన పదవులన్నీ ఇచ్చాను. అయితే అతడు ప్రజాసేవ కోసం కాక పదవి కోసమే పార్టీలో చేరాడన్న దుర్మార్గాన్ని నేను కనిపెట్టలేకపోయాను. అతడు కడుతున్న ముఠాల గురించి, చేరదీస్తున్న గ్రూపుల గురించి పట్టిం చుకోలేదు. అతడిలో పదవీ కాంక్ష ఇంతగా గూడుకట్టుకుంటుందని, అతడి వల్ల ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం తప్పుకోవాల్సి వస్తుందని, అతని వల్ల ప్రజాభీష్టమే వ్యర్థమై పోతుందని, ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురౌతుందని, అధికారం కోసం ఆ పెద్దమనిషి ఇంతటి అల్పమైన నీచమైన దారుణమైన వెన్నుపోటుకు కూడా సిద్ధపడతాడని నేనూహించలేకపోయాను. నా మీద ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకేదో అన్యాయం జరిగిందట. ఏమిటా అన్యాయం? ఎవరికా అన్యాయం? పార్టీపట్ల శ్రద్ధాభక్తులతో, అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసం చూరగొన్న ఏ నా కార్యకర్తలకూ ఏ నా తెలుగు తమ్ముళ్లకూ అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశవాదులకు మాత్రమే జరిగింది! చంద్రబాబు... ఆ పెద్దమనిషి.... ఆ మేకవన్నె పులి... ఆ తేనెపూసిన కత్తి తయారుచేసిన కుట్రదారులకే జరిగింది!! అతడి పక్కన చేరి, కుహనా కార్యకర్తలుగా చెలామణై, దళారీలుగా ఉన్నవారికే జరిగింది!!!
 
పేరు చెప్పేందుకూ అనర్హుడే

 
ఇవాళ నేను మాట్లాడుతున్న వ్యక్తి ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చాడు. నా విధానాలకు పూర్తిగా అంకితమవుతానని మాటిచ్చాడు. కానీ అతని మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. నేనిన్ని పదవులిచ్చాను. కానీ ఆయన మాత్రం తనకంటూ ఓ గుంపును తయారు చేసుకున్నాడు. అది నేను గమనించలేదు. ఎవరూ ఊహించని విధంగా (1994 ఎన్నికల్లో) మాకు 214 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో చూసుకుంటే 224 సీట్లు! కాబట్టి వాళ్లేం చేయలేకపోయారు. అదే ఏ 130, 140 సీట్లో వచ్చుంటే వాళ్లేమైనా చేసి ఉండేవాళ్లు. మాకిది కావాలి, అది కావాలంటూ కోరేవారు. ఎందుకంటే అంతకు ముందే రంగం ఏర్పాటై ఉంది. అందరికీ డబ్బిచ్చాడు ఈయన. ఆయన పేరు చెప్పడం కూడా నాకిష్టం లేదు. పేరు చెప్పేందుకు కూడా ఆయన అర్హుడు కాదు. అందరికీ 5 లక్షలు, 10 లక్షలు డబ్బులిచ్చి ‘ఇదిగో ఎన్నికల కోసం మీ అందరికీ డబ్బిస్తున్నాను. మీరంతా నా మనుషులుగా ఉండాలి’ అంటూ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే 224 సీట్లు టీడీపీకి వచ్చాయో ఆయన ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీఆర్‌నే నాయకుడిగా ఎన్నుకోవాల్సి వచ్చింది. కానీ ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ మాత్రం ఆయన మనసులో చావలేదు. ఆ ఆశతోనే తన గ్రూపును తయారు చేశాడు. ఇట్స్ ఏ ప్లాన్‌డ్ ట్రెచెరీ!
 
 మరో ఔరంగజేబు
 
చరిత్రను చూస్తే... తండ్రిని జైల్లో పెట్టిన సమ్రాట్లున్నారు. రాజ్యాధికారం కోసం అన్నల్ని చంపిన సోదరుడున్నాడు... ఔరంగజేబు. అలాంటి దురదృష్టకరమైన విధానం మళ్లీ ఇన్ని వందల ఏళ్ల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అలాంటి చిన్నబుచ్చేతనాన్ని మన జాతి అనుభవించడం అనేది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్లుగా ఉంటూ ఈనాడు జాతికే ద్రోహం చేసి మాయని మచ్చను తెచ్చారు. ప్రజాస్వామ్యానికిది చిన్నతనం. (1995 ఆగస్టు 23 నాటి వెన్నుపోటుకు కొద్ది రోజుల ముందు) నేను శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లినప్పుడు అక్కడ కూడా ఈ మహానుభావుడే, ఎవరైతే ఈనాడు జాతికే చిన్నతనం తెచ్చారో... అవమానకరంగా వ్యవహరించారో... తెలుగుజాతిని కించపరిచారో... ఆ మహానుభావుడే, ‘రామారావు గారు లేకపోతే మా పార్టీ (తెలుగుదేశం) లేదు. ఆయన  వల్లే పార్టీ నడుస్తోంది. మేమాయన వెనకాల ఉంటున్నాం. ఈ ఖ్యాతి, గౌరవం అంతా ఆయనదే. రామారావే మా నాయకుడు’ అన్నాడు. అలా చెప్పినవాడే 23వ తేదీ సాయంత్రానికల్లా ఎందుకు మారారంటారు?
 
 గాడ్సేను మించినవాడు
 
 ఈ వెన్నుపోటు జరిగింది నాకొక్కడికి మాత్రమే కాదు. ప్రజలకు, మీకు, మీరు వేసిన ఓటుకు. మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి, మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆదర్శాలకు ఇది వెన్నుపోటు! ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్రబాబు... ఎన్టీఆర్‌లాగే ఆయన విధానాలే కొనసాగిస్తామని చెబుతుంటే ఎలా ఉందో తెలుసా? చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకీ పేల్చి గాంధీ మహాత్ముడ్ని పొట్టనబెట్టుకున్న గాడ్సేనే మించిపోయాడనిపిస్తోంది. ఇది సిగ్గుచేటు. క్షమించరాని నేరం. వీళ్లంతా ఇలా ఎందుకు చేశారు? ఎందుకు వెన్నుపోటు పొడిచారు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్ చేసిన తప్పు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్ చేసిన నేరం?
 
 బాబును చరిత్ర క్షమించదు
 
 అయామ్ ద లయన్. నేనే సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు. ఏ అవమానాన్నీ సహించదు. కాబట్టి నాకెలా అవమానం జరిగింది, నా వాళు,్ల నా అన్నవాళ్లు నన్నే విధంగా మోసం చేశారో ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పడం నా ధర్మం. నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగినా ప్రజలకు తెలియజెప్పడం నా బాధ్యత. దేవుడు సహా ఎవరూ క్షమించలేని ఘాతుకానికి బాబు ఒడిగట్టాడు. దీన్ని జాతి, చరిత్ర ఎప్పటికీ  క్షమించదు.

 మీకు ఏ విధమైన రాజకీయం కావాలి? ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి? అది నిర్ణయించుకోవాల్సింది మీరే. అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తుందో, ఏ పార్టీ అయితే మనం తెచ్చుకున్న స్వాతంత్య్రానికి ఓ చక్కని రూపం దిద్దగలుగుతుందో, అలాంటి పార్టీకే మీరు నిర్భయంగా ఓటేయండి. ఓటు మీ జన్మహక్కు. దాన్ని నిరుపయోగం చేయకండి. పిరికితనంతో దాన్ని మరో రకంగా ఉపయోగించకండి.... ఇది ‘అన్న’ మాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement