సారాసురులు | Adulterated liquor | Sakshi
Sakshi News home page

సారాసురులు

Published Tue, Apr 29 2014 1:01 AM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM

సారాసురులు - Sakshi

సారాసురులు

ఎన్టీఆర్ విధించిన మద్య నిషేధానికి తూట్లు  నిషేధమెందుకంటూ ‘ఈనాడు’ వార్తలు.. నిషేధముంటే వృద్ధి అసాధ్యమన్న బాబు ప్రజల కోసమంటూ మద్య నిషేధం ఎత్తివేత బెల్టు షాపులతో ఊరూరా మద్యం తప్పుడు రాతలతో కల్లుగీ  కార్మికుల పొట్ట కొట్టిన ‘ఈనాడు’ టీడీపీ నేతల చేతికి గౌడ సంఘాలు...అప్పటి నుంచే కల్తీ కల్లు స్వైరవిహారం తమ పాపాన్ని వైఎస్‌కు అంటగట్టేందుకు రామోజీ కుయుక్తులు
 
1995 సెప్టెంబర్ 1. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. అప్పటికి ఏడు నెలలుగా రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం కచ్చితంగా అమలవుతోంది. కానీ మద్యం ముడుపుల మత్తులో చంద్రబాబు, తన హోటళ్ల వ్యాపార అవసరాల కోసం ‘ఈనాడు’ రామోజీ... కలిసికట్టుగా మద్య నిషేధానికి తూట్లు పొడిచారు. సజావుగా సాగని నిషేధం అవసరమా అనే సన్నాయి నొక్కులతో సంపాదకీయాలు... కల్తీ కల్లుతో జనారోగ్యం కుదేలవుతోందంటూ పతాక శీర్షికల్లో బూటకపు వార్తలు... ఇలా నెలల తరబడి పథకం ప్రకారం ‘ఈనాడు’లో రోత రాతలు రాయడం ద్వారా రామోజీ రంగం సిద్ధం చేశారు. బాబు కూడా తనవంతుగా, ‘మద్యనిషేధంతో ఖజానా బక్కచిక్కిపోతోంద’ంటూ మొసలి కన్నీళ్లతో నాటకాన్ని రక్తి కట్టించారు. అందులో భాగంగా, ‘‘మద్యనిషేధం, సబ్సిడీ బియ్యం రెండూ అమల్లో ఉండే పక్షంలో అభివృద్ధి అసాధ్యం’’ అంటూ ఏకంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ప్రజా వ్యతిరేకి చంద్రబాబు! మొత్తానికి రాజగురువుతో కలిసి నెలల తరబడి నాటకం నడిపిన అనంతరం మద్య నిషేధాన్ని బాబు అటకెక్కించారు. అది కూడా అలా ఇలా కాదు. ఏకంగా మద్య మహా ప్రవాహానికే గేట్లెత్తేశారు. అందుకోసం బెల్టుషాపులు అనే నయా కాన్సెప్టుకు తెర తీశారు. ఒక్క లెసైన్సుపై ఎన్నో మద్యం షాపులు తెరిపించిన ‘మార్గదర్శి’గా చంద్రబాబు. ఆయన పుణ్యమా అని రాష్ట్రంలో ఊరూరూ, వాడవాడలా మద్యం దుకాణాలు వెలిశాయి. అలా అతి తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌ను కాస్తా మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేసిన ఘనుడు చంద్రబాబు. రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్పే వాస్తవమిది. కానీ సార్వత్రిక ఎన్నికల వేళ రాజ గురివింద, నారా బాబు షరామామూలుగా నానా రకాల నాటకాలకు తెర తీస్తున్నారు. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిన చందంగా, తామిద్దరికి మాత్రమే సంయుక్తంగా చెందే మద్య ప్రవాహం తాలూకు పాపాన్ని దివంగత నేత వైఎస్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఆశించిన ప్రయోజనాలు సాధించకపోగా, ఖజానాకు చేటు చేస్తున్న మద్య నిషేధం అవసరమా?’ అని నాడు బాబు తరఫున వకాల్తా పుచ్చుకుంటూ ప్రశ్నించిన తన పత్రికలోనే... ‘పేదింటి కాపురాలు కూల్చి ప్రభుత్వం ఖజానా నింపుకోవాలా?’ అంటూ వైఎస్ పాలనను ఉద్దేశించి నేడు నంగనాచి రాతలు రాస్తున్న నయ వంచకుడు రామోజీ. ఇది చాలదన్నట్టు కల్తీ కల్లు పాపాన్ని కూడా దివంగత నేతకు అంటగట్టేందుకు ప్రయత్నించడం  దారుణాలోకెల్లా దారుణం. నిజానికి వైఎస్ రాజశేఖరరెడ్డి నిషేధించింది... రాజధానిలో విచ్చలవిడిగా సరఫరా అవుతున్న కల్తీ కల్లును. తద్వారా ఎందరో అమాయకులు కల్తీ కల్లు బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా కాపాడిన నాయకుడాయన. తన హయాంలో కల్లు సొసైటీలపై అస్మదీయులకు పెత్తనం కట్టబెట్టి, విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయించి ప్రజల ఉసురు తీసిన పాపాత్ముడు నారా బాబు. ఈ వాస్తవాలకు మసి పూసి, తన తాబేదారు బాబు చేసిన పాపాలన్నింటినీ వైఎస్‌కు అంటగట్టేందుకు రామోజీ పడుతున్న పాట్లు జనానికి రోత పుట్టిస్తున్నాయి.

‘చంద్రబాబు. లిక్కర్ లాబీ. ఈనాడు రామోజీ

1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడం ద్వారా రాష్ట్ర గమనాన్ని మార్చిన శక్తులివి. వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు. ఆ కత్తిని కొనిచ్చింది లిక్కర్ లాబీ. దాన్ని బాబుకు అందజేసింది రామోజీ. రామోజీ చేసిన ధ్వంస రచనను బాబు తూచా తప్పకుండా అమలు చేశారు. అందుకవసరమైన సొమ్మును లిక్కర్ లాబీ సమకూర్చింది. అలా రాష్ట్రంలో మద్య నిషేధం కఠినంగా అమలవుతున్న వేళ అందుకు కారకుడైన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి బాబు గద్దెనెక్కారు. పథకం ప్రకారం... ఏడాదిన్నర కూడా గడవక ముందే లిక్కర్ లాబీయింగ్ ఒప్పందాన్ని అమలు చేశారు. ‘మద్య నిషేధం, సబ్సీడీ బియ్యం పథకాలుంటే ఇక రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడుకునే పనే ఉండదు. బడ్జెట్ డిమాండ్లపై చర్చ కూడా అనవసరమే’ అంటూ 1997 ఫిబ్రవరి 26న అసెంబ్లీలో చంద్రబాబు చేసిన వాఖ్యలను ‘ఈనాడు’ అందిపుచ్చుకుంది. పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసిపారేంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కల్తీ కల్లు పెరిగిపోతోందంటూ చెలరేగింది. అలా గౌడ సంఘాల నోట్లో మట్టికొట్టింది. మద్యం మాఫియా అక్రమ లిక్కర్‌తో రాష్ట్రంపైకి ఎత్తి వస్తోందంటూ భయపెట్టింది. నిషేధాన్ని ఎత్తేయకపోతే రాష్ట్రంలో ఏదో ఘోరం జరుగబోతోందంటూ ఆరు నెలల పాటు హైడ్రామా నడిపింది. నిషేధాన్ని వ్యతిరేకించిన విపక్ష ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా సస్పెండ్ చేసి మరీ మద్య నిషేధానికి బాబు విజయవంతంగా మంగళం పాడారు.

ఆ తరవాత వినాశనమే...

ఎన్టీఆర్ అమలు చేసిన సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తేశాక రాష్ట్రాన్ని లిక్కర్ లాబీకి అక్షరాలా దోచిపెట్టారు బాబు. 1998లో ఒక వివాదాస్పద జీవో (ఎల్‌ఆర్‌ఎల్ నెంబర్ 25967/ఈఎక్స్111-1/98 నంబర్) తెచ్చారు. మద్యం కంపెనీల యాజమాన్యాలకు పొరుగునున్న తమిళనాడు కంటే 16 శాతం ధర అదనంగా చెల్లించాలన్నది ఆ ఉత్తర్వుల సారాంశం. ఆ కారణంగా 1998-2000 మధ్య రెండేళ్లలోనే ఖజానాకు రూ.600 కోట్లు గండి పడ్డట్టు విజిలెన్స్ నిగ్గుదేల్చి బాబు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ మొత్తం డబ్బును మూడు లిక్కర్ కంపెనీలకు దోచి పెట్టినట్లు కూడా విజిలెన్స్ పసిగట్టింది. ‘‘పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర ఫుల్ బాటిల్ మీద ఏకంగా రూ.500 దాకా తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) నిర్వాకం మూలంగా ప్రభుత్వం ఏటా అదనంగా రూ.356 కోట్లను ప్రైవేటు డిస్టిలరీకి చెల్లించింది. అలాగాక మద్యాన్ని తమిళనాడులో అక్కడి ధరలకు కొనుగోలు చేసి, రాష్ట్రంలో ఉన్న ధరలకు అమ్మితే రూ.300 కోట్ల అదనపు ఆదాయం వచ్చేది’’ అని తెలపింది. ఈ మద్యం కుంభకోణంపై విపక్షాలన్నీ నిలదీసినా, న్యాయ విచారణకు డిమాండ్ చేసినా బాబు ఖాతరు చేయలేదు. అంతేకాదు... విచిత్రంగా చంద్రబాబు అధికారం కోల్పోయే ముందు, అంటే 2003లో ఈ కుంభకోణానికి సంబంధించిన ఫైలును బాబు సర్కారు అధికారికంగానే తగలబెట్టించింది. 1998లో జరిగిన ఆ మద్యం కుంభకోణంపై వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2005లో విచారణ చేపట్టగా ఈ విషయం వెలుగు చూసింది. కుంభకోణానికి సబంధించిన ఫైలు వివరాలు అందించాలన్న వైఎస్ ఆదేశాల మేరకు అధికారులు 60 రోజుల పాటు వెదికి, చివరకు అసలు విషయం తెలుసుకొని నోరెళ్లబెట్టారు. మద్యం క్రయవిక్రయాలకు సంబంధించి కనీసం కనీసం నోట్ ఫైల్ కూడా లేకుండా చంద్రబాబు అధికారికంగానే వాటిని తగలబెట్టించినట్టు రికార్డు రూము అధికారులు లిఖతపూర్వకంగా రాసివ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు.

 1998 నుంచి 2003 వరకు మద్యం టెండర్లు, ధరల నిర్ణయాలను ముఖ్యమంత్రి అయిన బాబే స్వయంగా చూసుకున్నారు. మద్యం మార్కెట్‌లో ఎక్కువ శాతం అమ్మకాలున్న రాష్ట్రానికి చెందిన ఓ మూడు కంపెనీలు మాత్రమే టెండర్లలో పాల్గొనటానికి వీలుగా, టెండర్లలో రాష్ట్ర కంపెనీలే పాల్గొనాలనే నిబంధన పెట్టారు. వైఎస్ వచ్చాక దాన్ని ఎత్తేశారు. పారదర్శకంగా ఎవరైనా టెండర్లలో పాల్గొన వచ్చనే నిబంధన అమల్లోకి తెచ్చారు.


‘బెల్టు’ పెట్టి.... కల్లును ముంచి...

1998కి ముందు రాష్ట్రంలో మద్యం దుకాణాలు పరిమితంగానే ఉండేవి. మండలానికి ఒకటి, లేదా రెండు మండలాలకు 3 చొప్పున దాదాపు 3,000 మద్యం దుకాణాలుండేవి. అవి తమకు దూరంగా ఉండటం వల్ల కూడా కావచ్చు... గ్రామీణులు మద్యంపై పెద్దగా ఆసక్తి చూపేవాళ్లు కాదు. దాంతో దాని అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండేవి. దాంతో లిక్కర్ లాబీ రంగంలోకి దిగింది. గ్రామాల్లో సర్వే చేసింది. మద్యం తమ పొలిమేరల దాకా రావడం లేదు కాబట్టే అమ్మకాలు పెరగడం లేదనే అంచనాకు వచ్చింది. ఊరూరా చిన్న చిన్న మద్యం దుకాణాలు పెట్టి వీలైనంతగా అమ్ముకోవాలని ప్లాన్ వేసింది. కానీ గ్రామీణుల కల్లు అలవాటు అందుకు అడ్డంకిగా మారింది. అప్పట్లో ప్రతి గ్రామంలో 2,000 నుంచి 5,000 వరకు తాటి చెట్లుండేవి. ఎన్టీఆర్ కూడా గౌడ సంఘాలను ప్రోత్సహించారు. గీత కార్మికులకు ఐదు ఎకరాల స్థలమిచ్చి తాటి, ఈత వనాల పెంపకాన్ని పోత్సహించారు. ‘గీసేవాడిదే చెట్టు’ నినాదాన్ని అమలు చేశారు. కాబట్టి జనానికి మద్యం అలవాటు చేయలంటే ముందుగా కల్లును చావుదెబ్బ తీయాలి. అందుకు లిక్కర్ లాబీ, రామోజీ, చంద్రబాబులతో కూడిన దుష్ట త్రయం పక్కాగా ఎత్తు వేసింది. కుక్కను చంపాలంటే ముందుగా అది పిచ్చిదంటూ ప్రచారం చేయాలన్న సూత్రాన్ని అమలు చేశారు. కల్లుపై ‘కల్తీ’ అంటూ ముద్ర వేశారు. ఎక్సైజ్ అధికారులను గౌడ సంఘాలపైకి బాబు ఉసిగొల్పి కల్తీ కల్లు కేసులు పెట్టించడం... మర్నాడే ‘ఈనాడు’ దాన్ని పతాక శీర్షికన ప్రచురించడం... ఇదీ వరస. ఇంకేముంది? నెల తిరక్కముందే కల్లుపై విష ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో మద్యం లాబీ గ్రామాలపై పడింది. ఊరూరా చిన్న చిన్న దుకాణాలు పెట్టి మద్యం అమ్మించింది. వీటినే చంద్రబాబు ముద్దుగా బెల్టు దుకాణాలని పిలిచారు. వాటి పుణ్యాన మద్యం విక్రయాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎంతగా అంటే... 1999-2000 ఎక్సైజ్ సంవత్సరంలో రూ1,500 కోట్లున్న మద్యం విక్రయాలు బెల్టు దుకాణాల రాకతో ఒక్కసారిగా రూ.3,000 కోట్లకు చేరాయి! కేవలం మూడేళ్ల కాలంలో దాదాపు 70 శాతం మంది గ్రామీణులు మద్యం మహమ్మారికి బానిసలుగా మారారు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement