రైతుల పాలిట హంతకుడు
ఏలేరు స్కామ్‌లో అసలు దోషి
ఖల్ నాయక్
నమ్మకద్రోహి
ప్రజా కంటకుడు
అవినీతిపరుడు
అతిపెద్ద దివాలాకోరు
...ఇవన్నీ ఏమిటో తెలుసా?
చంద్రబాబుకు బీజేపీ పెట్టిన భుజకీర్తులు
పాపం చంద్రబాబు. ఎన్నికల గోదారిని ఏకాకిగా ఈదలేనని అర్థమై, మరో గతి లేక బీజేపీతో అంటకాగుతూ పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సినంత వినోదం పంచుతున్నారు. మతతత్వ పార్టీ అంటూ నిన్నామొన్నటిదాకా దుమ్మెత్తిపోసిన నోటితోనే ‘లోక కల్యాణార్థమే బీజేపీతో పొత్తు’ అంటున్నారు. ‘మసీదులు కూల్చాడు. మైనారిటీలను ఊచకోత కోయించాడు’ అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా నరేంద్ర మోడీని తిట్టిన బాబు, ఇప్పుడాయనపై ప్రశంసల వర్షమే కురిపిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగానే తగడని, తక్షణం తప్పుకోవాలని డిమాండ్ చేసిన నోటితోనే, ‘ప్రధాని పదవికి మోడీయే అత్యంత అర్హుడు’ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. కానీ బాబు ఇంతగా భజన చేస్తున్న ఆ బీజేపీయే... ముఖ్యమంత్రిగా ఆయన పనితీరును ‘అక్షరాలా’ చీల్చి చెండాడింది. బాబు దివాలాకోరు రాజకీయాలను ఎండగడుతూ ఏకంగా ‘ప్రజాకోర్టులో చార్జిషీటు’ దాఖలు చేసింది. అన్నదాత నోట్లో బాబు మట్టికొట్టిన వైనాన్ని, ప్రజలనూ వారి సంక్షేమాన్నీ గాలికొదిలి తొమ్మిదేళ్ల పాలనా కాలం పొడవునా అవినీతిలో మునిగితేలిన క్రమాన్ని దునుమాడుతూ పార్టీపరంగా అధికారికంగా పుస్తకాలకు పుస్తకాలే ప్రచురించింది. ఆ పుస్తకాల్లో బీజేపీ బయటపెట్టిన పలు పచ్చి నిజాల్లో మచ్చుకు కొన్ని...
‘‘అన్నదాత హంతకులెవరు?’’ అనే శీర్షికతో 1998లో బీజేపీ విడుదల చేసిన పుస్తకం తాలూకు ముఖచిత్రమిది. బాబు రూపంలో తన వెన్నులో దిగిన బాకు దెబ్బకు అన్నదాత నెత్తురోడుతూ నేలకొరిగి ఆక్రందన చేస్తుంటే, ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నట్టుగా చూపడం ద్వారా టీడీపీ పాలనను బీజేపీ దునుమాడింది. బాబు పాలనలో, ముఖ్యంగా 1998 జనవరి నెలలో రాష్ట్రంలో నెలకొన్న హృదయ విదారక పరిస్థితులకు ఈ పుస్తకం అద్దం పట్టింది. బాబు విధానాల వల్ల వందలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ వైనాన్ని వివరించడంతో పాటు ఆ బలవన్మరణాల తాలూకు వార్తల క్లిప్పింగులను పుస్తకంలో బీజేపీ గుదిగుచ్చింది