గ్రేటర్ నగరంలో వాహనాల పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ప్రస్తుతం సరైన వసతి లేక వాహనదారులు పడరానిపాట్లు పడుతున్నారు. మెట్రోరైలు అందుబాటులోకి వచ్చినప్పటికీ పలు స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయం లేదు. వీటిని పరిగణనలోకి తీసుకున్న జీహెచ్‌ఎంసీ వీలైనన్ని ప్రాంతాల్లో, వీలైనన్ని పద్ధతుల్లో పార్కింగ్ కల్పించాలని భావిస్తోంది.
అందులో భాగంగా తక్కువ స్థలంలోనే ఎక్కువ కార్లు పార్కింగ్ చేయడానికి అనువైన ‘స్టాక్ పార్కింగ్’ విధానంపై దృష్టి సారించింది. జీహెచ్‌ఎంసీకి చెందిన ఖాళీ స్థలాలతోపాటు నగరంలో వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ఖాళీ స్థలాల్లోనూ పార్కింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని భావిస్తోంది. ముఖ్యంగా మెట్రో స్టేషన్లకుసమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
సాక్షి, సిటీబ్యూరో: తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా కొత్త కాంప్లెక్సులు నిర్మించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ఈమేరకు స్టాక్ పార్కింగ్ విధానాన్ని ఎంచుకుంది. ఈ విధానంలో రెండు కార్లు పట్టే స్థలంలోనే 12 కార్లను పార్కింగ్ చేయవచ్చు. ఒక కారుపై మరో కారు ఉండేలా నిలువుగా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తారు. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఉన్న ఈ విధానం ద్వారా తక్కువ స్థలంలోనే ఎక్కువ కార్లు నిలిపి ఉంచొచ్చు. నగరంలో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తొలుత జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోని స్థలాలను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. బీఓటీ (బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో స్టాక్ పార్కింగ్ కాంప్లెక్సులు ఏర్పాటు చేసే ఆలోచన ఉందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ప్రయోగాత్మకంగా తొలుత జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పార్కింగ్ ఫీజును మాత్రం జీహెచ్‌ఎంసీయే నిర్ణయిస్తుందన్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే.. తగిన స్థలమున్న ప్రైవేట్ వ్యక్తులు సైతం ఇలాంటి పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవచ్చునన్నారు. తద్వారా మెట్రో స్టేషన్లతోపాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యలు తగ్గుతాయన్నారు.
జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వ స్థలాల్లో..
జీహెచ్‌ఎంసీకి వివిధ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో, నగరంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఖాళీ స్థలాల్లోనూ పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ఇందుకుగాను ప్రైమ్, నాన్ ప్రైమ్, మిడిల్ ప్రైమ్ ప్రాంతాలుగా వర్గీకరించి మూడు ప్రాంతాలతో కలిపి ఒక ప్యాకేజీగా టెండర్లు ఆహ్వానించాలని యోచిస్తున్నారు. పాతబస్తీలోని ఖిల్వత్ వద్ద మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ కోసం ఏళ్లతరబడి టెండర్లు పిలుస్తున్నప్పటికీ, గిట్టుబాటు కాదని ఎవరూ ముందుకు రావ డం లేరు. ఇలాంటి పరిస్థితి నివారించేందుకు రద్దీ ఎక్కువగా ఉండి, బాగా డిమాండ్ ఉండే ప్రాంతాలను ప్రైమ్ ఏరియాలుగా, డిమాండ్ లేని వాటిని నాన్‌ప్రైమ్ ఏరియాగా, తక్కువ డిమాండ్ ఉండేవాటిని మిడిల్ ప్రైమ్ ఏరియాగా వర్గీకరించి ఒకే ప్యాకేజీలో మూడు ప్రాంతాలూ ఉండేలా టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. తద్వారా పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణాలకు ముందుకొస్తారని భావిస్తున్నారు. ఇందుకుగాను ఇప్పటికే కొన్ని ప్రాంతాలను గుర్తించినట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు. చిక్కడపల్లి మార్కెట్‌లో దాదాపు రెండెకరాల స్థలం ఉంది. అక్కడ మార్కెట్‌తోపాటు పార్కిం గ్ కాంప్లెక్స్‌కూ వీలుందన్నారు. మెట్రోస్టేషన్‌కూ దగ్గరగా ఉంటుందని దాన్ని ఎంపిక చేశారు.
చుడీబజార్‌లో జీహెచ్‌ఎంసీ బీటీ మిక్సింగ్ ప్లాంట్ వద్ద దాదాపు 2000 గజాల స్థలం ఉంది. అక్కడ నాలుగైదు అంతస్తుల్లో నిర్మించే కాంప్లెక్స్‌లో ఒక అంతస్తులో చార్మినార్ పరిసరాల్లోని వీధి వ్యాపారులకు దుకాణాలు కేటాయించే ఆలోచన కూడా ఉంది. చార్మినార్ పాదచారుల పథకం, అమృత్‌సర్ స్వర్ణదేవాలయం తరహా లో చార్మినార్ దగ్గరి వీధి వ్యాపారులను తరలించాల్సి ఉన్నందున ఇక్కడ వారికి సదుపాయం కల్పించవచ్చునని భావిస్తున్నారు. ఖైరతాబాద్ జీహెచ్‌ఎంసీ వాహనాల పార్కింగ్ యార్డు వద్దే మెట్రో స్టేషన్ ఉంది. బస్టాప్ కూడా ఉంది. అక్కడి స్థలంలో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించడం ద్వారా ఎన్నో విధాలుగా ఉపయుక్తంగా ఉం టుందని అంచనా వేశారు. ఖిల్వత్ దగ్గర, శాలిబండ వద్ద కూడా పార్కింగ్‌కాంప్లెక్స్‌ల నిర్మా ణం ఆలోచనలున్నాయి. వీటితోపాటు జీహెచ్‌ఎంసీకి చెందిన దాదాపు పది స్థలాల్లో, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన 15 ఖాళీస్థలాలు పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణానికి అనువుగా ఉన్నాయని గుర్తించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ద్వారా ఆయా శాఖలనుంచి పార్కింగ్ కోసం స్థలాలు పొందాలని భావిస్తున్నారు. కోఠి మహిళా కళాశాల, కొత్తపేట పండ్ల మార్కెట్, రంగారెడ్డి జిల్లా కోర్టులు తదితర ప్రదేశాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన çస్థలాలున్నట్లు గుర్తించారు. అక్కడ పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి అవకాశముంటుందని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment