
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వాహనదారులకు పార్కింగ్ కాంప్లెక్స్‌లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మోండా మార్కెట్ ఓల్డ్ జైలు, పంజగుట్ట శ్మశానవాటిక, ఖిల్వత్ దగ్గరి పెన్షన్ ఆఫీస్, ఖైరతాబాద్ పార్కింగ్ యార్డు తదితర ప్రాంతాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు రానున్నాయి. ప్రసిద్ధి చెందిన హరిహర కళాభవన్, చిక్కడపల్లి, చిలకలగూడ మున్సిపల్ మార్కెట్ తదితర ప్రాంతాల్లోనూ ఆధునిక పార్కింగ్ కాంప్లెక్సులను నిర్మించనున్నారు. నూతన పార్కింగ్ పాలసీ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకుగాను నగరంలో పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మించేందుకు తగిన స్థలాల్ని ఎంపిక చేయాల్సిందిగా వివిధ ప్రభుత్వ విభాగాలకు సూచించింది. జీహెచ్‌ఎంసీతోపాటు హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎంఆర్‌ఎల్, హెచ్‌ఎండీఏ తదితర ప్రభుత్వ విభాగాలు తమ పరిధిలో పార్కింగ్ ఏర్పాట్లకు అనువుగా ఉన్న ప్రాంతాల జాబితాను రూపొందించాయి.
జీహెచ్‌ఎంసీ పదహారు ప్రాంతాలను అనువైనవిగా గుర్తించింది. మోండా మార్కెట్, పాతజైలు ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఎకరం స్థలంలో, చట్నీస్ ఎదురుగా పంజగుట్ట శ్మశానవాటికకు చెందిన దాదాపు ఎకరం స్థలంలో, పురానాపూల్ దగ్గరి చుడీబజార్‌లో ఒకటిన్నర ఎకరాల స్థలంలో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లను అధికారులు నిర్మించనున్నారు. చాదర్‌ఘాట్ దగ్గర దాదాపు 900 చదరపుగజాలస్థలంలో, చార్మినార్ పాదచారుల పథకంలో భాగంగా ఉన్న చార్మినార్ బస్టాండ్, చందానగర్, లాలాపేట, దూద్‌బావి, రాణిగంజ్ దగ్గర పర్యాటక శాఖ స్థలం ఎదుట, ఖిల్వత్‌దగ్గరి పాత పెన్షన్ కార్యాలయం ప్రాంతాల్లో దాదాపు 2 వేల చదరపు గజాల నుంచి 5 వేల చదరపు గజాల వరకు విస్తీర్ణమున్న స్థలాల్లో పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మించనున్నారు. ఇంకా దారుల్‌షిఫాలో కులీకుతుబ్‌షా ఆవరణలోని ఎకరం స్థలంలో, బంజారాహిల్స్ జగన్నాథ ఆలయం దగ్గర 2 వేల చదరపు గజాల స్థలంలో, ఖైరతాబాద్‌లో జీహెచ్‌ఎంసీకి చెందిన వాహన పార్కింగ్ యార్డు, దాని పక్కన ఉన్న స్థలంతో కలిపి దాదాపు 3 వేల చదరపుగజాల్లో, బంజారాహిల్స్ సినీమాక్స్ వెనుక 2 వేల చదరపు గజాల స్థలం పార్కింగ్ కాంప్లెక్స్‌లకు అనువుగా ఉంటాయని గుర్తించారు. వీటితోపాటు ఇతర ప్రభుత్వ విభాగాల స్థలాల్లో మొత్తం 42 పార్కింగ్ కాంప్లెక్స్‌లతోపాటు అవకాశం ఉన్న ఇతర ప్రాంతాల్లో ఇతర సదుపాయాల కాంప్లెక్స్‌లు కూడా నిర్మించే యోచనలో ఉన్నారు.
హరిహర కళాభవన్ స్థానే..
హరిహర కళాభవన్‌లో ప్రస్తుతం సభలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆడిటోరి యంతోపాటు, వివిధ మడిగెల్లో దుకాణాలు, ఒక భవనంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. వీటన్నింటినీ కూల్చివేసి మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ మోడరన్ కాంప్లెక్స్ నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. దాదాపు 70% స్థలాన్ని పార్కింగ్ కాంప్లెక్స్‌కు వినియోగించనున్నారు. సికింద్రాబాద్‌లోని రైల్వేస్టేషన్, హాస్పిటళ్లు, పలు వాణిజ్య కేంద్రాలను, అక్కడకు వచ్చే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని అక్కడ భారీ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి హరిహరకళాభవన్ అనువైన ప్రదేశంగా భావించారు. 15 అంతస్తుల్లో కొత్త కాంప్లెక్స్‌ను నిర్మించే యోచనలో ఉన్నారు.
ఆదాయం ఆయా విభాగాలకే...
పార్కింగ్ కాంప్లెక్స్‌లకు సంబంధించి హెచ్‌ఎంఆర్‌ఎల్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఆయా ప్రభుత్వశాఖల స్థలాల్లో నిర్మించే పార్కింగ్ కాంప్లెక్స్‌ల వల్ల వచ్చే ఆదాయం ఆయా శాఖలకే చెందుతుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. పీపీపీ పద్ధతిలో పార్కింగ్ కాంప్లెక్స్‌లను నిర్మించనున్నారు. ఈ పార్కింగ్ ప్రాంతాల్లో స్మార్ట్ పార్కింగ్ íసిస్టమ్‌ను అమలు చేయనున్నారు. వీటికి సంబంధించి ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపకల్పన తదితర చర్యలు చేపడతారు. పార్కింగ్ కాంప్లెక్సుల ఏర్పాటుకు వీటిల్లో కొన్నింటికి ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ, కొన్నింటికి ఆయా విభాగాల నుంచి అనుమతులు పొందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment