హైదరాబాద్ పరిధిలో అన్యాక్రాంతమైన అన్ని రకాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడా నికీ, కొత్తగా ఆక్రమణలకు గురికాకుండా చూడడానికీ ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా)ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్తగా ఆలోచన చేసి దీనిని ప్రత్యేక వ్యవస్థగా రూపుదిద్దారు. జీహెచ్‌ఎమ్‌సీ, హెచ్‌ఎమ్‌డీఏ పరిధిలోని వేలాది ఎకరాల ప్రభుత్వ, ఇనాం, వక్ఫు, దేవాదాయ భూములు, చెరువులు కబ్జాకు గురయ్యాయి.
గత బీఆర్‌ఎస్ పాలనలో చెరువులను మాయం చేసి, కొండలు గుట్టలను ధ్వంసం చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి అమ్మేశారు. జీవో 59 ముసుగులో భూములను రక్షించాల్సిన వారే భక్షించారు. అధికారులు వారికి వంత పాడారు. రోజురోజుకూ కబ్జాలు పెరిగిపోతుండడంతో ముఖ్యమంత్రి ఇతర దేశాల్లో ప్రభుత్వాస్తుల రక్షణకు చేపట్టిన విధి, విధానాలపై అధ్యయనం చేశారు. అక్కడ సత్ఫలితాలు ఇస్తున్న విధానాన్ని హైదరాబాద్ లోనూ అమలు చేయడానికి హైడ్రాను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేశారు. దీని విధి విధా నాలు ఖరారు చేస్తూ ఇటీవల జీవో 99ని జారీ చేశారు. దీనికి ఐజీ స్థాయి సీనియర్ పోలీసు అధికారి ఏవీ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియ మించారు.
హైడ్రాను ఏర్పాటు చేసిన వెంటనే ప్రభుత్వం దానికి సంబంధించి రూ. 200 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అక్రమ నిర్మాణాల అంతు తేల్చడానికి ప్రభుత్వం ఎంత అంకితభావంతో ఉందో ఈ బడ్జెట్ కేటాయింపే నిదర్శనం. జీహెచ్‌ఎమ్‌సీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. సుమారు 2,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలను కలిపి స్వయం ప్రతిపత్తితో ఉండేలా హైడ్రాను అందుబాటులోకి తెచ్చారు. జీహెచ్‌ఎమ్‌సీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి,
సంగారెడ్డి జిల్లాల్లోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) గా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఆ ప్రాంతం వరకు విపత్తు నిర్వహణ తదితర అధికారులతో హైడ్రాను ఏర్పాటు చేశారు. హైడ్రా పాలకమండలికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా, మున్సిపల్ మంత్రి, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి; హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల ఇన్చార్జి మంత్రులు; హైదరాబాద్ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు.
చెరువులు, పార్కుల పరిరక్షణ కోసం హైడ్రా త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నది. చెరువులు కుంటలు, నాళాలు, పార్కులు ప్రభుత్వ స్థలాల్లో జరిగిన అక్రమ కట్టడాలే కాకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఏళ్ల క్రితమే అనుమతులతో వెలసిన భవనాలను చట్ట ప్రకారం కూల్చివేసేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు రంగంలోకి దిగింది. అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపుతోంది. జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్, బంజారాహిల్స్‌లోని మిథిలా కాలనీ, గాజుల రామారం, భూమ్ రుఖా ఉద్ దవాల్ చెరువుల్లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఆక్రమణలపై హైడ్రాకు రోజుకు 40 నుంచి 50 ఫిర్యాదులు వస్తుండడం విశేషంగా చెప్పవచ్చు.
ప్రభుత్వ స్థలాల్లో ఇప్పటికే ఇచ్చిన లే ఔట్లకు సంబంధించిన అనుమతులు రద్దు చేసే ఆలోచనతో హైడ్రా ముందుకు వెళ్తోంది. చెరువుల ఆక్రమ ణలు జరగకుండా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సాంకేతికంగా కూడా చర్యలు తీసు కుంటున్నది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచ నున్నది. ప్లాట్లు, ఇండ్లుకొనే వ్యక్తులు ఈ స్థలం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందా రాదా అన్నది తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందిస్తున్నారు.
హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఈ పోలీస్ స్టేషన్ ద్వారానే ఎస్‌ఓటీ ఏర్పాటు చేసి కబ్జా దారులపై ఉక్కు పాదం మోపనున్నారు. హైడ్రాకు మొత్తం 3,500 మంది సిబ్బందిని త్వరలో నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. హైడ్రా కింద అసెట్ ప్రొటెక్షన్‌తో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు కూడా కొన సాగుతుంది. పట్టణ ప్రణాళిక– విపత్తుల నిర్వహణ విభాగాలు, ట్రాఫిక్ పోలీ సులతో సమన్వయం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో 72 టీమ్‌లు పనిచేస్తున్నాయి. త్వరలో కొన్ని జిల్లాల్లోనూ ఇటువంటి వ్యవస్థలను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం ఆలోచించడం ముదావహం.
– వెలిచాల రాజేందర్ రావు, వ్యాసకర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, 9849 061481
Comments
Please login to add a commentAdd a comment