సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ అధికారాలను హైడ్రాకు(హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి) బదలాయించింది.
ఆర్డినెన్స్ అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ కట్టడాలు డిజాస్టర్స్ అసెట్స్ ప్రొటెక్షన్‌లో హైడ్రాకు అధికారాలు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధి మొత్తంలో అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపించే అవకాశం హైడ్రాకు కల్పించింది ప్రభుత్వం.
గవర్నర్ ఆమోదం
ఇప్పటికే హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ‘హైడ్రా’ చట్టబద్ధతపై హైకోర్టు పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించి ఆర్డినెన్స్‌ను రూపొందించింది. ఇప్పటివరకు హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు ఉన్న పలు అధికారాలను ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌తో తన అధీనంలోకి తీసుకుంది. అయితే ‘హైడ్రా’ ఆర్డినెన్స్‌పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నివృత్తి చేశారని, దీనితో గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
కొత్తగా ‘సెక్షన్ 374–బీ’ని చేరుస్తూ ఆర్డినెన్స్
జీహెచ్‌ఎంసీ చట్టం-1955లో ఇప్పటి వరకు 374, 374-ఎ సెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ 374-బి చేర్చుతూ ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించింది. అందులోని అంశాలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సమకూరే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ ఇతర సంస్థకైనా అప్పగించవచ్చని ఆర్డినెన్స్ చెబుతోంది. ఆ ఆర్డినెన్స్‌కు అనుగుణంగానే..తాజాగా, ఆ అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. తద్వారా హైడ్రాకు అదనపు బలం సమకూరినట్లైంది.
👉చదవండి : హైడ్రాకు బిగ్ రిలీఫ్
Comments
Please login to add a commentAdd a comment