![Bjp Mla Venkataramana Reddy Comments On Hydra](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/08/20/Venkataramana-Reddy2.jpg.webp?itok=PWQ9Nxh9)
సాక్షి, హైదరాబాద్: హైడ్రా ఆలోచన బాగున్నా ఆచరణలో మాత్రం సరైన తీరు లేదని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘సామాన్య ప్రజలకు శికం భూమా, బఫర్ జోన్‌లో ఉందా? అనేది తెలీదు. కష్టపడి సంపాదించిన సొమ్మంతా పెట్టి భూమి కొంటారు. అధికారులు చేసే పనుల వల్ల సామాన్య జనం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది’’ అని వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు.
‘‘చెరువులను కాపాడాలి. అక్రమ కట్టడాలను కుల్చాలి కానీ అనుమతులు ఇచ్చిన అధికారులను ఏం చేస్తారు?. అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను కూల్చితే మంచిదే.. కానీ హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అనుమతి పొందిన వాటిని ఎలా కూలుస్తారు? రాజకీయ నాయకులు, అధికారులు కలిసి సామాన్య ప్రజలది తప్పు అన్నట్లు చేస్తున్నారు. రంగనాథ్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ ఉండటం తెలంగాణకు మంచిదే కానీ ఇలా ఎంతకాలం చేస్తారు?. నోటీసు ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూలగొట్టడం మంచిది కాదు’’ అని వెంకటరమణారెడ్డి చెప్పారు.
‘‘గత ప్రభుత్వ తప్పిదాలకు ప్రజలను బలి పశువు చేస్తారా..?. రేవంత్ రాత్రికి రాత్రి తీసుకునే నిర్ణయంతో సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. చెరువుల్లో కట్టడాలకు అనుమతి ఇచ్చిన వారికి బేడీలు వేసి జైల్లో వేయాలి అప్పుడే మిగతావారికి భయం వస్తుంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం పక్కకి పోయాయి ఇప్పుడు హైడ్రా కొన్నాళ్లు హడావుడి’’ అంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment