జల్సా మాల్స్‌! | hyderabad Metro Malls Business Spaces | Sakshi
Sakshi News home page

జల్సా మాల్స్‌!

Published Fri, Oct 5 2018 10:48 AM | Last Updated on Mon, Oct 22 2018 1:43 PM

hyderabad Metro Malls Business Spaces - Sakshi

పంజగుట్టలోని మెట్రోమాల్‌

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో మెట్రోస్టేషన్లకు అనుసంధానంగా నిర్మించిన మాల్స్‌కు జనాదరణ పెరుగుతోంది. ప్రస్తుతానికి పంజగుట్ట, హైటెక్‌సిటీ మెట్రోమాల్స్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. డిసెంబరు నుంచి ఎర్రమంజిల్, మూసారాంబాగ్‌ మెట్రోమాల్స్‌ సైతం ప్రారంభించనున్నారు. వీటిని సమీప మెట్రో స్టేషన్లలోని స్కైవేల(ఆకాశ మార్గాలు) ద్వారా అనుసంధానించనున్నారు. దీంతో ప్రతి మెట్రో స్టేషన్‌ నుంచి నిత్యం రాకపోకలు సాగించే వేలాదిమంది ప్రయాణికులు ఈ మాల్స్‌లోకి సులభంగా ప్రవేశించి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసే వీలుంది. అంతేకాదు.. మాల్స్‌లో ఏర్పాటు చేసిన కిడ్స్‌ గేమ్స్‌ జోన్, పెద్దల కోసం స్నూకర్‌ వంటి గేమ్స్‌ జోన్లు ఆటవిడుపుగా మారాయి. ఇక నూతనంగా పీవీఆర్‌ సినీప్లెక్స్‌ల ఏర్పాటుతో వినోదాన్ని సైతం ఇక్కడ పొందే అవకాశం లభించింది.  

వివిధ ప్రాంతాల్లో మెట్రో మాల్స్‌ ఇలా..
ప్రస్తుతానికి పంజగుట్టలో 4.80 లక్షల చదరపు అడుగులు, ఎర్రమంజిల్‌లో 3.25 లక్షలు, మూసారాంబాగ్‌లో 2.40 లక్షలు, హైటెక్‌సిటీలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్‌ నిర్మించారు. సమీప భవిష్యత్‌లో రాయదుర్గం మెట్రో టర్మినల్‌ స్టేషన్‌ వద్ద 13 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్‌ మాల్‌ను మించిన విస్తీర్ణంతో  బడా మాల్‌ను నిర్మించేందుకు ఎల్‌అండ్‌టీ సిద్ధమైంది. ఇక కూకట్‌పల్లి, ఉప్పల్, మియాపూర్‌ మెట్రో స్టేషన్ల వద్ద కూడా 4–5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్‌ ఏర్పాటుకు నిర్మాణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది.  మొత్తంగా ప్రభుత్వం ఎల్‌అండ్‌టీకి వివిధ ప్రాంతాల్లో కేటాయించిన 269 ఎకరాల స్థలాల్లో ఈ మాల్స్‌ ఏర్పాటు కానున్నాయి. వచ్చే 15 ఏళ్లలో రూ.2,243 కోట్లతో నగర వ్యాప్తంగా మేట్రో మార్గంలో 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్స్, ఇతర వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేయాలని సదరు సంస్థ నిర్ణయించింది. కాగా మెట్రో ప్రాజెక్టులో ప్రయాణికుల చార్జీల ద్వారా వచ్చే ఆదాయం కేవలం 45 శాతం మాత్రమే. మిగతా 50 శాతం రెవెన్యూ రియల్టీ ప్రాజెక్టులే ఆధారమంటే అతిశయోక్తి కాదు. ఇక మరో ఐదు శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా సమకూర్చుకోవాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది. నిర్మాణ ఒప్పందం కుదిరిన 2011 తొలినాళ్లలో 18 చోట్ల మాల్స్‌ నిర్మించాలనుకున్నప్పటికీ ప్రస్తుతానికి నాలుగు చోట్లనే మాల్స్‌ నిర్మాణం పూర్తయింది. 

మాల్స్‌లో ఏముంటాయంటే..
పంజగుట్ట మాల్‌ను నాలుగు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. దీని నిర్మాణ విస్తీర్ణం 4.8 లక్షల చదరపు అడుగులు. ఇందులో ఆరు సినీప్లెక్స్‌లు ఏర్పాటు చేశారు. హైటెక్‌సిటీ మాల్‌ను రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 2 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలం అందుబాటులోకి వచ్చింది. దీనికి అద్దె ప్రతి చదరపు అడుగుకు స్టోర్‌ లేదా ఆఫీసు విస్తీర్ణం, రకాన్ని బట్టి ప్రతినెలా రూ.75 నుంచి రూ.150 చొప్పున ఎల్‌అండ్‌టీ సంస్థ వసూలు చేస్తోంది. ఈ మాల్స్‌లో దేశ, విదేశాలకు చెందిన పలు కంపెనీల స్టోర్స్, సినీ మల్టీప్లెక్స్‌లు ఉంటాయి. ఆఫీసు, వాణిజ్య స్థలాలు, ఫుడ్‌కోర్టులు, చాట్‌బండార్స్, బేకరీలు, కన్‌ఫెక్షనరీలు సైతం ఉంటాయి. ట్రామాకేర్‌ సెంటర్లు, డయాగ్నోస్టిక్స్‌ సెంటర్లు, బ్యాంకులు, ఏటీఎంలు ఏర్పాటు చేస్తారు. వినోదాలు, పిల్లల ఆట పాటలు, గేమ్స్, స్కేటింగ్‌ వంటి సైతం ఉంటాయి. అంతేగాక సిమ్యులేటర్‌ డ్రైవింగ్‌ సెంటర్లు సైతం ఏర్పాటు చేస్తారు. వీటితోపాటు అన్ని రకాల నిత్యావసరాలు దొరికే ఏటు జడ్‌ స్టోర్స్, కాఫెటీరియాలు, ఐస్‌క్రీమ్‌ పార్లర్లు, బ్రాండెడ్‌ దుస్తులు, పుస్తకాలు, పాదరక్షల దుకాణాలు, కాస్మొటిక్స్, ఫ్యాషన్‌ మెటీరియల్‌ సైతం అందుబాటులో ఉంటాయి. 

ఖాళీగా మెట్రో రిటైల్‌ స్పేస్‌..  
ప్రస్తుతం మూడు మెట్రో రూట్లలో మొత్తం 72 కి.మీ మార్గంలో 64 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఎల్బీనగర్‌–మియాపూర్‌ మార్గంలో 27 మెట్రో స్టేషన్లు, నాగోల్‌–అమీర్‌పేట్‌ రూట్లో 16 స్టేషన్లు వినియోగంలోకి వచ్చాయి.  ఆయా స్టేషన్లలో మధ్యభాగం (కాన్‌కోర్స్‌ లెవల్‌)లో సరాసరిన ఒక్కో స్టేషన్‌కు 9,500–15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య స్థలం(రిటైల్‌ స్పేస్‌) అందుబాటులో ఉంది. అయితే ఇప్పటివరకు అమీర్‌పేట్, మియాపూర్‌ మినహా చాలా చోట్ల స్టేషన్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఆయా స్టేషన్లలో రిటైల్‌ స్పేస్‌ను బహుళ జాతి సంస్థలు దక్కించుకున్నప్పటికీ ప్రస్తుతానికి స్టేషన్లు అంతగా రద్దీ లేకపోవడంతో స్టోర్లను ఏర్పాటు చేయలేదు. దశలవారీగా అన్ని స్టేషన్లలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement