‘మల్టీ’ఫుల్‌ | - | Sakshi
Sakshi News home page

‘మల్టీ’ఫుల్‌

Published Sat, Jun 15 2024 8:26 AM | Last Updated on Sat, Jun 15 2024 12:51 PM

‘మల్ట

‘మల్టీ’ఫుల్‌

–సినీ వీక్షణం.. కొత్త పుంతలు
–అత్యాధునిక సాంకేతికత..
–సీట్‌ వద్దకే ఫుడ్‌.. మొబైల్‌ ఛార్జింగ్‌
–అతిపెద్ద తెరలు.. అదిరే సౌండ్‌

నగరంలోని మాల్స్‌లో బిగ్‌ స్క్రీన్స్‌.. బిగ్‌ జోష్‌
టికెట్స్‌ ఉన్నాయా? ఇప్పుడెళ్తే దొరుకుతాయా? తీరా థియేటర్‌ దగ్గరకు వెళ్లాక టెకెట్లు లేకపోతే..సమయం, ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చు అంతా వృథా.. ఇలాంటి సందేహాలు... ఇది ఒకప్పటి పాత జనరేషన్‌. ప్రస్తుత జనరేషన్‌ ఉన్నచోట నుంచే అంతా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకోవడంతో మొదలుపెట్టి అన్నీ తామున్న చోటకే రావాలనేది ఆధునికుల బాట. అంతేకాదు థియేటర్‌ తెర సైజ్‌ దగ్గర నుంచి ఆడియో సౌండ్‌ క్వాలిటీ దాకా ప్రతిదీ అద్భుతంగా ఉండాలని వారు ఆశిస్తున్నారు. ఓటీటీల యుగంలో హోమ్‌ థియేటర్ల నుంచి ఆడియన్స్‌ని సినిమా థియేటర్లకు రప్పించడానికి మల్టీఫ్లెక్స్‌లు వారి ఆకాంక్షల్ని తీర్చడానికి కాదేదీ మార్పునకు అనర్హం అన్నట్టుగా రోజుకో కొత్త ఫెసిలిటీనీ పరిచయం చేస్తున్నాయి. దేశంలోని ప్రధాన మల్టీఫ్లెక్స్‌ సంస్థలన్నీ ఇప్పటికే పెద్ద సంఖ్యలో సిటీకి రాగా మేము సైతం అంటూ స్థానిక సంస్థలు కూడా పోటీకి తెరలేపాయి. ఈ నేపఽథ్యంలో మహా నగరంలో 2 దశాబ్ధాల మల్టీఫ్లెక్స్‌ జర్నీపై ప్రత్యేక కథనం..

జొమాటోతో భాగస్వామ్యం...
👉 త్వరలో జొమాటోతో భాగస్వామ్యం ద్వారా థియేటర్లలో ఉండే ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకునే సౌలభ్యాన్నీ కొన్ని మల్టీప్లెక్స్‌లు కల్పించనున్నట్లు సమాచారం.

👉 మరింత లగ్జరీ సీటింగ్‌, లేజర్‌ ప్రొజెక్షన్‌, 4డిఎక్స్‌ ఫార్మేట్స్‌ వంటివి జోడించనున్నారు.

👉 4డిఎక్స్‌, మైక్రో ఎక్స్‌ఈ...లతో పాటు ఐసీఈ థియేటర్‌ కాన్సెప్ట్‌ను పరిచయం చేయనున్నట్టు ఓ ప్రముఖ మల్టీప్లెక్స్‌ గ్రూప్‌కు చెందిన దేవాంగ్‌ సంపత్‌ అంటున్నారు.

👉 పాకశాస్త్రంలో చేయి తిరిగిన చెఫ్స్‌తో పీవీఆర్‌–ఐనాక్స్‌ చేతులు కలిపాయి.

భాగ్యనగరంలో మల్టీప్లెక్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది... ఎప్పటికప్పుడు నగరవాసులను ఆకర్షించేందుకు కొత్త మార్పులు చేస్తున్నారు. వినోదం, షాపింగ్‌, గేమింగ్‌, ఫుడ్‌కోర్ట్స్‌ వంటి అనేక హంగులను ఒక చోటే కల్పిస్తున్నారు..ఓటీటీల రాకతో వెలవెలబోతున్న వెండితెరలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారు. అనేక పోటీలను తట్టుకుని అత్యాధునిక హంగులతో వీక్షకులకు అపురూప అనుభూతిని కల్పిస్తున్నారు.

తొలి మల్టీప్లెక్స్‌...

దేశంలో తొలి మల్టీప్లెక్స్‌ను 1997లో పీవీఆర్‌ సినిమాస్‌ ఆధ్వర్యంలో సౌత్‌ ఢిల్లీలో నెలకొల్పారు. కాగా దేశంలో మూడో అతిపెద్ద ఐమ్యాక్స్‌ థియేటర్‌ను నగరంలో ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్‌ పేరిట 2003లో నెలకొల్పారు. ఎయిర్‌పోర్ట్స్‌లో తొలి మల్టీప్లెక్స్‌ను చైన్నెలో గతేడాది పీవీఆర్‌ ఏర్పాటు చేయగా, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లోనూ అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం.

113 నగరాల్లో..
దేశపు అతిపెద్ద మల్టీప్లెక్స్‌ గ్రూప్స్‌ అయిన పీవీఆర్‌, ఐనాక్స్‌ 2022లో చేతులు కలిపి పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌గా మారాయి. వీరికి దేశవ్యాప్తంగా 113 నగరాల్లో 1,715 స్క్రీన్స్‌ ఉన్నాయి. ఇందులో దక్షిణాదిలో 550, కేవలం తెలంగాణలో 106 ఉన్నాయి. నగరంలో 11 చోట్ల 62 స్క్రీన్స్‌ ఉన్నాయి. దేశపు తొలి అంతర్జాతీయ, ప్రపంచపు అతిపెద్ద మూవీ థియేటర్‌ సర్క్యూట్‌గా పేరొందిన సినీపోలీస్‌కి అత్తాపూర్‌లోని మంత్ర మాల్‌లో ఆరు స్క్రీన్ల మల్టీఫ్లెక్స్‌, మంజీరా ట్రినిటీ మాల్‌లో ఐదు, సిసిపిఎల్‌ మాల్లో ఐదు చొప్పున స్క్రీన్స్‌ ఉన్నాయి.

నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో...
ఓటీటీ తరహాలో మల్టీప్లెక్స్‌కూ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్రవేశపెడుతున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం రూ.699 చెల్లించి 10 సినిమాలు చూసే స్కీమ్‌ను పీవీఆర్‌ ప్రవేశపెట్టింది.

‘భారీ’ మార్పులు...
దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు జతచేస్తూ..నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నాయి. ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్‌లో తొలి స్క్రీన్‌ 29 మీటర్ల వెడల్పు, 21.93 మీటర్ల ఎత్తు కాగా...స్క్రీన్‌ 6లో గత డిసెంబర్‌లో 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో అతిపెద్ద స్క్రీన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఎండిఎ స్క్రీన్‌ దేశంలోనే పెద్దదిగా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మల్టీప్లెక్స్‌ మార్పుల్లో ఇదో ‘భారీ’ ఉదాహరణ.

సరికొత్త టెక్నాలజీ...
స్క్రీన్ల దగ్గర నుంచి ప్రొజెక్టర్ల వరకూ చివరికి సీటింగ్‌లోనూ సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. సీట్ల మధ్య స్పేస్‌ పెంచి.. రిక్లెయినర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 4కే–60 ఎల్‌ స్క్రీన్‌, 3డీ ప్రొజెక్టర్‌, డాల్బీ క్యూఎస్‌సీ ఆడియో, 53 స్పీకర్ల డాల్బీ సీపీ 950 వంటి ఎన్నో సౌకర్యాలు వీక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. ఇక 7.1 సరౌండ్‌ సౌండ్‌ పేరిట కొత్త సాంకేతికతను త్వరలోనే పరిచయం చేయనుంది. ప్రతీ చిన్న శబ్దాన్ని ప్రేక్షకుల వీనులకు విందు చేసేలా ఈ ఆడియో పనిచేస్తుంది. మరికొన్ని రోజుల్లో ఈ అప్‌గ్రేడేషన్‌ పూర్తవనుంది. గచ్చిబౌలిలోని ఆట్రియమ్‌ మాల్‌లో ఏర్పాటు చేసిన పీవీఆర్‌ స్క్రీన్స్‌లో 4కె ప్రొజెక్టర్స్‌, డాల్బీ అట్మోస్‌ సౌండ్‌ ప్రత్యేకత.

బటన్‌ నొక్కితే చాలు..
అపర్ణా మల్టీప్లెక్స్‌లో సరికొత్తగా ఎంట్రీని ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 1208 సీటింగ్‌ కాగా ఇందులో 135 గోల్డ్‌ క్లాస్‌ సీట్స్‌ ఏర్పాటు చేశారు. వేరే మల్టీప్లెక్స్‌లో లేని విధంగా సీట్‌కే ఛార్జింగ్‌ పోర్ట్‌ ఏర్పాటు చేశారు. ఇక బటన్‌ నొక్కితే సొంత కిచెన్లో వండిన ఫుడ్‌ సర్వ్‌ చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అడ్వాన్స్‌డ్‌లేజర్‌ ప్రొజెక్టర్‌ బార్కో సిరీస్‌ 4ను జత చేశారు. లెగ్‌ స్పేస్‌ కూడా మిగిలిన మల్టీప్లెక్స్‌లతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండేలా సెట్‌ చేశారు.

కాఫీ షాప్స్‌...
తొలి అంతర్జాతీయ, ప్రపంచపు అతిపెద్ద మూవీ థియేటర్‌ సర్క్యూట్‌గా పేరొందిన సినీపోలీస్‌కి అత్తాపూర్‌ మంత్ర మాల్‌లో 6, మంజీరా ట్రినిటీ మాల్‌లో 5, సీసీపీఎల్‌ మాల్లో 5 చొప్పున స్క్రీన్స్‌ ఉన్నాయి. నగరంలో మొత్తం 16 స్క్రీన్స్‌ కలిగిన సినీపోలిస్‌ డిజిటల్‌ ప్రొజెక్షన్స్‌, డి3డీ టెక్నాలజీ అందిస్తోంది. కాఫీషాప్స్‌, కాఫీ ట్రీ వంటివి ఈ గ్రూప్స్‌ ప్రత్యేకత అని డైరెక్టర్‌ ఆశిష్‌ శుక్లా తెలిపారు. కాగా మల్టీప్లెక్స్‌ టిక్కెట్‌ ధరలు అత్యాధునిక టెక్నాలజీ, విలాసవంతమైన అనుభవాలను అందుబాటులోకి తేవడంలో అడ్డంకిగా మారాయని మిరాజ్‌ సినిమాస్‌ ప్రతినిధి అమిత్‌ శర్మ చెబుతున్నారు.

బ్రాండ్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా..
నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థ అపర్ణ తొలిసారిగా మల్టీప్లెక్స్‌లో అడుగుపెట్టింది. నల్లగండ్లలోని అపర్ణా మాల్‌లో ఏడు స్క్రీన్స్‌ అందుబాటులోకి తెచ్చాం. సంస్థ బ్రాండ్‌ ఇమేజ్‌ దృష్టిలో పెట్టుకుని థియేటర్స్‌లో అత్యాధునిక హంగులకు పెద్ద పీట వేశాం. అత్యుత్తమమై స్క్రీన్స్‌, ఆడియో సిస్టమ్స్‌.. వీటితో పాటు విశాలమైన సీటింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాం. రిక్లెయినర్‌ సీట్లలో మొబైల్‌ ఛార్జింగ్‌, సీట్‌ వద్దకే ఫుడ్‌ ఆర్డర్‌, డెలివరీ తీసుకొచ్చాం. దీని కోసం చేయి తిరిగిన చెఫ్స్‌తో ఓ అత్యాధునిక కిచెన్‌ ఏర్పాటు చేశాం. మరిన్ని మల్టీప్లెక్స్‌లను రాష్ట్రవ్యాప్తంగా సంస్థ ఏర్పాటు చేయనుంది. – మధుకర్‌, మేనేజర్‌, అపర్ణా సినిమాస్‌ మల్టీప్లెక్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement