
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారికే భవిష్యత్‌లో హోటళ్లు, మాల్స్‌లోకి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుందని ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన కోఠిలోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని, ఇరువురూ కోలుకున్నారని, వారి కాంటాక్ట్‌లను కూడా టెస్ట్ చేస్తే నెగటివ్ వచ్చిందన్నారు. డెల్టా రకం ప్రమాదకరమని, ఇంటాబయటా ప్రజలు మాస్కు తప్పకుండా ధరించాలని సూచించారు. థర్డ్‌వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్, సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. పిల్లల కోసం జిల్లా ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశామని, వందకు పైగా బెడ్లు ఉన్న అన్నీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆగస్ట్ నెలాఖరు నాటికి ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు పెట్టుకోవాలని ఆదేశించారు. డెల్టా రకం భారత్ సహా 135 దేశాల్లో తీవ్రత చూపుతోందన్నారు.
దేశంలోని 50% కేసులు కేరళ నుంచే వచ్చాయని, డెల్టా వైరస్ శరీరంపై ఎక్కువ కాలం తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యాన్ని శాస్త్రవేత్తలు గుర్తించినట్లు వివరించారు. సేకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదని.. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ వంటి చోట్ల కేసులు అధికంగానే ఉన్నాయని చెప్పారు. కూసుమంచి గ్రామంలో ఒకేసారి భారీగా కేసులు నమోదైన ఘటనలు చూశామని, పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్‌లో ఉండకుండా బయట తిరుగుతున్నారన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, జీహెచ్‌ఎంసీ, ఖమ్మం వంటి చోట్ల అత్యధికంగా కేసులు చూస్తున్నామని, దాదాపు 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగానే ఉన్నాయన్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు నిరంతరం కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో 2.2 కోట్ల మంది టీకాలకు అర్హులని, వీరిలో 1.12 కోట్ల మందికి ఇప్పటి వరకు సింగల్ డోస్ ఇచ్చామని, 33.79 లక్షల మందికి రెండు డోస్‌లు పూర్తి చేశామన్నారు. ఈ నెలలో ఇప్పటివరకు 30.04 లక్షల డోసులు పంపిణీ చేశామని, కేటాయించిన దానికన్నా 9.5 లక్షల డోసులు అదనంగా రాష్ట్రానికి వచ్చాయన్నారు. కోవిషీల్డ్ 22.32 లక్షల మందికి రెండో డోస్ ఇవ్వాల్సి ఉంటే అందులో 12 లక్షల మందికి అందించినట్లు చెప్పారు. కోవాక్సిన్ 3 లక్షల మందికి పైగా రెండో డోస్ ఇవ్వాల్సి ఉందన్నారు. రానున్న రెండు వారాల్లో రెండో డోసుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment