ఓ మాల్‌లో పాప్‌కార్న్ కాంబో కొనుగోలు చేస్తున్న దృశ్యం, రూ.495గా పేర్కొన్న ధర
సాక్షి,హైదరాబాద్: మల్టీప్లెక్స్ థియేటర్లు, మెగామాల్స్‌ల్లో నిర్దేశించిన ధరలకే అన్ని రకాల వస్తువులు, ఆహార పదార్థాలు విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయం తొలిరోజు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. నగరంలోని మల్టీప్లెక్స్‌లు, ఇతర మాల్స్‌ల్లో ఇష్టారీతిన సాగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఎంఆర్‌పీ ధరలకే అమ్మాలంటూ తూనికలు, కొలతల శాఖ ఆదేశించిన నేపథ్యంలో ‘సాక్షి’బృందాలు బుధవారం నగరంలో వివిధ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని రికార్డు చేశాయి. ప్యాక్ చేసిన కొన్ని వస్తువులపై ఎంఆర్‌పీ అమలు చేసిన నిర్వాహకులు అనేక ఆహార పదార్థాలపై మాత్రం ఇష్టారీతిన స్టిక్కర్లు వేసి అమ్మకాలకు పెట్టారు.
బుధవారం, గురువారం నాటి ధరలకు పెద్దగా తేడా లేదని ఆయా మాల్స్‌ల్లో సందర్శకులు పెదవి విరిచారు. ఐఎస్‌ఐ బ్రాండ్ లీటర్ మంచినీళ్ల ధర బహిరంగ మార్కెట్‌లో రూ.19. కానీ, నెక్లెస్‌రోడ్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో మాత్రం రూ. 25. 400 ఎంఎల్ కోకాకోల ధర రూ.70. ఎగ్‌పఫ్ రూ.50, సమోసా 40. పాప్‌కార్న్ రూ.160లకు విక్రయించారు. కూకట్‌పల్లిలోని మంజీరా మాల్, సినీపోలిస్, ఫోరం మాల్, పీవీఆర్ సినిమాల్లో తినుబండారాల ధరలు పాత పద్ధతిలోనే కొనసాగాయి. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను ఎమ్మార్పీకి విక్రయిస్తూ విడిగా ఆర్డర్ చేసే ఆహార పదార్థాలు, పాప్‌కార్న్ లాంటివి వందల్లో విక్రయించారు.
పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ కంబైన్డ్ అప్‌సైజ్ కపుల్ కాంబోను జీఎస్‌టీ ధరలతో కలిపి రూ.495 వసూలు చేశారు. ధరల సూచికలో పేర్కొన్న వాటి కంటే ఎక్కువగానే వసూలు చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. ఫోరం మాల్‌లో తాగునీరు, కూల్‌డ్రింక్స్ మాత్రమే ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తూ మిగతావి తమ సొంత నిర్ణీత ధరలకు అమ్మారు. ఆహార పదార్థాల పరిమాణం తదితర వివరాలను ప్రత్యేకంగా పేర్కొన్న దాఖలాలులేవు.
ఈ విషయమై స్థానికంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మాత్రం అధికారులు ప్రత్యేకంగా ప్యాకేజ్డ్ ఫుడ్ ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని నిబంధనల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ప్యాకింగ్ లేని ఆహార పదార్థాల విషయంలో నిబంధనలు తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరించడం విశేషం.
నిబంధనలు ఏం చెబుతున్నాయి
తినుబండారాలు, మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింకులు నిర్ణీత ధరలకే విక్రయించాలి .విడిగా అమ్మే తినుబండారాలు అందించే కంటైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతోపాటు ఎంఆర్‌పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్ ఉండాలి. సెప్టెంబర్ 1 నుంచి స్టిక్కర్ స్థానంలో ఎంఆర్‌పీ, పరిమాణం, బరువు కచ్చితంగా ముద్రించి ఉండాలి. ఇవన్నీ ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించేలా బోర్డుపై ప్రదర్శించాలి. ధర మారితే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలి.
ఒకే బ్రాండ్ తినుబండారాలు కాకుండా వివిధ బ్రాండ్స్ అందుబాటులో ఉంచాలి. ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎంఆర్‌పీ, కస్టమర్ కేర్ వివరాలు ఉంచాలి. అలాగే ఎమ్మార్పీ ధర ఉన్న ఫుడ్స్ మాత్రమే విక్రయించాలి. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042 500333, వాట్సాప్ నంబర్ 7330774444ను విధిగా సినిమా హాళ్లలో ప్రదర్శించాలి.
ధరల్లో మార్పు లేదు
మల్టీప్లెక్స్‌లో వివిధ వస్తువుల ధరల్లో మాత్రం మార్పు కనిపించలేదు. తిను బండారాలకు ఇష్టానుసారం ధర నిర్ణయించారు. గతంలో స్టిక్కర్ ఉండకపోయేది. ఇప్పుడు కొత్తగా స్టిక్కర్ అంటించి దర్జాగా దోపిడీ చేస్తున్నారు. – మణికుమార్, చింతల్
అడ్డగోలు ధరలతో స్టిక్కర్లు
మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లలో విక్రయించే వస్తువులపై అడ్డగోలు ధరల స్టిక్కర్లు అంటించారు. బయట ధరలతో పోలిస్తే రెండు, మూడింతలు అధికమే. శీతల పానీయాల ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. –రవితేజ, కూకట్‌పల్లి
ధరలపై నియంత్రణ లేదు
మల్టీప్లెక్స్‌లో ధరలపై నియంత్రణ లేదు. ఎమ్మార్పీ అమలును పక్కదారి పట్టించేవిధంగా ప్రైస్ స్టిక్కర్లు అంటించారు. నాణ్యత పేరుతో ధరల దోపిడీకి పాల్పడుతున్నారు. ధరలపై నియంత్రణ అవసరం. తినుబండారాలపై నిర్ణీత ధర నిర్ణయించాలి. –ఉమర్, విజయనగర్ కాలనీ
ఇష్టారాజ్యంగా తినుబండారాల ధరలు...
వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింక్స్‌పై ఎమ్మార్పీ ముద్రించి ఉంటుంది కనుక గుర్తించగలుగుతున్నాం. తినుబండారాలపై ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ధరలపై అవగాహన ఉండకపోవడంతో అడిగినంత ఇస్తున్నాం. ప్రభుత్వం తినుబండారాల పరిమాణం, ధరలను కూడా నిర్ధారించడం ద్వారా అక్రమ విక్రయాలను అడ్డుకోవాలి. – సంజీవ, మూసాపేట
అధిక ధరలు కట్టడి చేస్తాం
మల్టీప్లెక్, సినిమా థియేటర్లలో వివిధ వస్తువుల అధిక ధరలను కట్టడి చేస్తాం. ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు నిబంధనల ఉల్లంఘనే. బయట మార్కెట్ ధరలతో సమానంగా మల్టీప్లెక్, సినిమా థియేటర్లలో అమలు చేయాలి. ఎమ్మార్పీ అమలుపై రేపటి నుంచి తనిఖీలు నిర్వహిస్తాం. భారీ జరిమానాలకు వెనుకాడబోం. –జగన్మోహన్, అసిస్టెంట్ కంట్రోలర్,తూనికలు, కొలతల శాఖ
Comments
Please login to add a commentAdd a comment