multiplex theaters
-
మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. అయితే ఆ ఒక్క రోజే!
మూవీ లవర్స్‌కు ఓ గుడ్ న్యూస్. తాజాగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినీ ప్రియులకు అదిరిపోయే వార్త చెప్పింది. ఈనెల 20న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సినిమా టిక్కెట్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోని మల్టీప్లెక్స్‌లో ఎక్కడైనా సరే రూ.99 రూపాయలకే సినిమా చూడవచ్చని ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4వేలకు పైగా స్క్రీన్స్‌పై ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఐమ్యాక్స్, 4డీఎక్స్, రిక్లైనర్స్ వంటి ప్రీమియర్ కేటగిరీలకు ఇది వర్తించదని పేర్కొంది.ఇంకేందుకు ఆలస్యం.. మీకు నచ్చిన సినిమాను కేవలం రూ.99కే మల్టీప్లెక్స్ థియేటర్లలో చూసేయండి. అయితే ఈ ఆఫర్ కేవలం పీవీఆర్ ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, మూవీటైమ్, డిలైట్ మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్ ఆ రోజు అన్ని సినిమాలతో పాటు అన్ని షోలకు వర్తిస్తుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. కాగా.. ఈ రోజుల్లో థియేటర్లలో ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూడాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ బంపరాఫర్ పట్ల సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
సినీ ప్రియులకు బంపరాఫర్.. కేవలం రూ.99 కే టికెట్!
సినీ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఈనెల 13న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. ఆ ఒక్క రోజు దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌ల్లో కేవలం రూ.99 కే టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా తమ ఫ్యామిలీతో కలిసి ఇష్టమైన సినిమాను ఆస్వాదించవచ్చని వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన నగరాలు, థియేటర్లలో మాత్రమే వర్తిస్తుందని ప్రకటించింది. ఈ మేరకు ఎంఏఐ(MAI) ట్వీట్ చేసింది. అక్టోబర్ 13న శుక్రవారం కావడంతో చాలా సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు 4 వేల కంటే ఎక్కువ స్క్రీన్లలో ఈ అవకాశం కల్పించారు. ఇప్పటికే రిలీజైన సినిమాలతో పాటు శుక్రవారం రిలీజయ్యే చిత్రాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. తక్కువ ధరకే సినిమా చూసే ఒక్కరోజు మాత్రమే. ఈ ఆఫర్ ప్రముఖ థియేటర్లు అయిన పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, ఎం2కే, డిలైట్‌లో రూ.99 కే అందుబాటులో ఉంటాయని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్న వారికే వర్తిస్తుందని పేర్కొంది. కాగా.. 2022లో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మొదటిసారిగా జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. అంతకుముందు సెప్టెంబర్ 16వ తేదీని వేడుకల రోజుగా ప్రతిపాదించగా.. ఆ తర్వాత అది సెప్టెంబర్ 23కి మారింది. గతేడాది జాతీయ సినిమా దినోత్సవం రోజున 6.5 మిలియన్ల మంది ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమా చూశారని వెల్లడించింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆ ఏడాదిలో అత్యధికంగా ప్రేక్షకులు హాజరైన రోజుగా నిలిచిందని ప్రెసిడెంట్ కమల్ జియాన్చందానీ తెలిపారు. National Cinema Day is back on October 13th. Join us at over 4000+ screens across India for an incredible cinematic experience, with movie tickets priced at just Rs. 99. It's the perfect day to enjoy your favorite films with friends and family. #NationalCinemaDay2023 #13October pic.twitter.com/Pe02t9F8rg — Multiplex Association Of India (@MAofIndia) September 21, 2023 -
స్టార్ కమెడియన్‌కు చేదు అనుభవం.. ఏకంగా నాలుగుసార్లు!
అతడో కమెడియన్. జనాల్ని నవ్విస్తుంటాడు. స్టాండప్ షోలతో కితకితలు పెట్టిస్తుంటాడు. నెట్‌ఫ్లిక్స్‌లోనూ 'వేక్ న్ బేక్ బై రోహన్' అనే ప్రోగ్రాంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి ఇతడిని ఏడిపించారు. సరదాగా సినిమా చూద్దామని థియేటర్‌కి వెళ్తే చేదు అనుభవాలు మిగిల్చారు. ఆ విషయాల్ని స్వయంగా ఇతడే బయటపెట్టాడు. ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. మల్టీప్లెక్స్‌ల్లో దోపిడి గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. సినిమా టికెట్ రేట్ కంటే స్నాక్స్, డ్రింక్స్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కమెడియన్ రోహన్ జోషి కూడా అలాంటి అనుభవమే ఎదుర్కొన్నాడు. ముంబయిలోని ఓ మల్టీప్లెక్స్‌కి రీసెంట్గా వెళ్లాడు. చిన్న పెప్సీకి రూ.400 ఛార్జ్ చేశారని, టేస్ట్ కూడా ఏం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?) రోహన్ జోషి ఇన్ స్టా పోస్ట్ ప్రకారం.. ఇతడు గతంలో ఓసారి 'షాంగ్ చీ' సినిమా త్రీడీలో చూద్దామని ఓ మల్టీప్లెక్స్‌కి వెళ్లాడు. అయితే మూవీని 2Dలో ప్లే చేశారు. ఇదేంటని స్టాఫ్‌ని అడిగితే ఇంటర్వెల్ తర్వాత పక్కా త్రీడీలో ప్లే చేస్తామని అన్నారట. మరోసారి 'టాప్‌గన్ మేవరిక్' చూద్దామని ఫ్రెండ్స్‌తో వెళ్తే సరిగా డైలాగ్స్ వినిపించలేదని, అడిగితే ముందు నుంచి ప్లే చేశారని చెప్పాడు. అయినా పెద్దగా మార్పులేం జరగలేదని అన్నాడు. 'గార్డియన్ ఆఫ్ ది గ్యాలక్సీ 3' చూడటం కోసం రోహన్, కొన్నిరోజుల ముందు ఓ మల్టీప్లెక్స్‌కి వెళ్లాడు. ఇంటర్వెల్ బ్రేక్ 15 నిమిషాల తర్వాత థియేటర్లోకి వెళ్లాడు. సినిమా చూసి వచ్చేశాడు. మరోసారి అదే మూవీ చూసిన తర్వాత ఈ కమెడియన్‌కి అర్థమైన విషయం ఏంటంటే.. గతసారి ఇంటర్వెల్ బ్రేక్‌లోనూ మూవీ రన్ చేశారు. దీంతో పావు గంట పార్ట్‌ని అందరూ మిస్ అయిపోయారట. ఇవన్నీ బయటపెట్టిన ఇతడు.. మల్టీప్లెక్స్‌ల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Rohan Joshi (@mojorojo) (ఇదీ చదవండి: Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ) -
పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: దేశంలోని టాప్–2 మల్టీప్లెక్స్ దిగ్గజాల విలీనానికి తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ సంయుక్త సంస్థగా ఆవిర్భవించేందుకు మరో అడుగు ముందుకు పడింది. ప్రతిపాదిత విలీనానికి ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఈ నెల 12న అనుమతించినట్లు పీవీఆర్ వెల్లడించింది. 2022 అక్టోబర్‌లో ప్రత్యర్థి సంస్థ ఐనాక్స్ లీజర్తో విలీనానికి పీవీఆర్ వాటాదారులు ఆమోదముద్ర వేశారు. అంతకుముందు జూన్‌లో స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఇందుకు ఓకే చెప్పాయి. తొలుత గతేడాది మార్చిలో రెండు కంపెనీలూ విలీనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్సీఎల్టీ అనుమతి నేపథ్యంలో పీవీఆర్ షేరు 0.5 శాతం నీరసించి రూ. 1,745 వద్ద, ఐనాక్స్ లీజర్ 0.7 శాతం నష్టంతో రూ. 515 వద్ద ముగిశాయి. -
స్వతంత్ర భారతి: 1997/2022 మల్టీప్లెక్స్ మయసభలు
1997 నాటికి దేశ జనాభా వంద కోట్లు. ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న వెండితెరలు కేవలం 12,500. పది లక్షల జనాభాకు సగటున 13 థియేటర్లు కూడా లేని ఆ కాలంలో మెల్లిగా మల్టీప్లెక్స్‌లు అవతరించడం మొదలైంది. ఒక్కోటి కనీసం 35 కోట్ల రూపాయల అంచనా వ్యయమయ్యే మల్టీపెక్ల్లు ఆ ఏడాది కొన్ని పదుల సంఖ్యలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రేక్షకుల కోసం ఎలివేటర్లను సిద్ధం చేశాయి. దీంతో సినిమాను వీక్షించే తీరే మారిపోయింది. భారీ బడ్జెట్ చిత్రాలను భారీ మల్టీపెక్స్ సినిమా హాళ్లలో మాత్రమే చూడాలనే తరం బయల్దేరింది. మల్టీప్లెక్స్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ ప్రేక్షకులను దృష్టి ఉంచుకుని నిర్మాతలు సినిమాలు తీయడం అనే కొత్త ధోరణి కూడా అప్పుడే మొదలైంది. 1990ల ద్వితీయార్థంలో మల్టీప్లెక్స్‌లకు మాల్స్ చేదోడుగా ఉంటే, కరోనా అనంతరం మాల్స్ ఇప్పుడు మల్టీప్లెక్స్‌లకు చేదోడు అవుతున్నాయి. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు మదర్ థెరెసా వారసురాలిగా సిస్టర్ నిర్మలను ఎంచుకున్న మిషనరీస్ ఆఫ్ ఛారిటీ. ప్రధాని హెచ్.డి. దేవెగౌడ నాయకత్వం బలహీనంగా ఉందన్న కారణంతో ‘యునైటెడ్ ఫ్రంట్’కు మద్దతు ఉపసంహరించుకున్న కాంగ్రెస్ పార్టీ. కొత్త ప్రధానిగా ఐ.కె.గుజ్రాల్. రాష్ట్రపతిగా కె.ఆర్. నారాయణన్. ప్రత్యర్థి టి.ఎన్.శేషన్ ఓటమి. మదర్ థెరెసా మరణం. (చదవండి: బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా?) -
ఆన్లైన్ టికెట్లపై రోజంతా వాదనలు
సాక్షి, అమరావతి: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టులో వాదనలు మంగళవారం వాడీవేడిగా సాగాయి. బుక్ మైషో, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దాదాపుగా రోజంతా వాదనలు సాగాయి. మల్టీప్లెక్స్ థియేటర్ల సంఘం వాదనల నిమిత్తం తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. మధ్యంతర ఉత్తర్వుల జారీకి బుక్ మైషో తరఫున సీనియర్ న్యాయవాది పలుమార్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అందరి వాదనలు విన్న తరువాతే నిర్ణయాన్ని వెలువరిస్తామని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. కొంతకాలం ప్రభుత్వం తెస్తున్న వ్యవస్థను కొనసాగనిద్దామని, అప్పుడు బుక్ మైషో వ్యక్తం చేస్తున్న భయాందోళనలు నిజమో కాదో తేలిపోతుందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. సినిమా టికెట్లను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆన్లైన్లో విక్రయించుకునేందుకు వీలుగా ప్రభుత్వం తెచ్చిన సవరణ చట్ట నిబంధనలతో పాటు ఉత్తర్వులను సవాలు చేస్తూ బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (బుక్ మైషో) యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. బాహుబలికి 50 శాతం ఆక్యుపెన్సీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. బుక్ మైషో లాంటి సంస్థలు రకరకాల చార్జీల పేరుతో చేస్తున్న దోపిడీని అడ్డుకునేందుకే ప్రభుత్వం రంగంలోకి దిగిందన్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థను ఏపీఎఫ్డీసీ ద్వారా అనుసంధానం చేస్తున్నామన్నారు. ఆన్లైన్ టికెట్లను 50 శాతం సీటింగ్ కెపాసిటీకి పరిమితం చేసి మిగిలిన టికెట్లను థియేటర్లో నేరుగా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా వంద శాతం టికెట్లను ఆన్లైన్లో బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నాయన్నారు. రూ.100 బేస్ రేటు కలిగిన టికెట్‌ను బుక్ మై షో రూ.145కు విక్రయిస్తోందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దేశంలోనే అత్యధిక గ్రాస్ సాధించిన బాహుబలి–2 సినిమాకు కేవలం 50 శాతం ఆక్యుపెన్సీనే బుక్ మైషో లాంటి సంస్థలు చూపాయని నివేదించారు. ఆన్లైన్ టికెట్ విక్రయాలపై తామేమీ నిషేధం విధించలేదని, నియంత్రణ మాత్రమే చేస్తున్నామన్నారు. కొత్త పోర్టల్ వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రభుత్వానికి 2 శాతం లోపు సర్వీస్ చార్జి చెల్లిస్తే సరిపోతుందన్నారు. ప్రభుత్వం పోటీదారుగా వ్యవహరించదని ధర్మాసనానికి స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానాన్ని ముందుకు సాగనివ్వాలని, కొంతకాలం పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అంతా ప్రభుత్వ పోర్టల్‌లోనే కొంటారు.. బుక్ మైషో తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న ఆన్లైన్ టికెట్ వ్యవస్థ ద్వారా గుత్తాధిపత్యం ఏర్పడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని ఇలాంటి వ్యవస్థ వల్ల వ్యాపారం చేయడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వానికి 2 శాతం సర్వీసు చార్జీ చెల్లించాలంటే వినియోగదారుడి నుంచి అధిక మొత్తాలు వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. జూలై 2 నుంచి కొత్త విధానం అమలు చేయకుండా యథాతథస్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని ఎక్కడ ఉందని, ఏ చట్టం నిషేధిస్తుందో చూపాలని ధర్మాసనం ప్రశ్నించింది. ఒత్తిడి చేయకుండా ఆదేశాలివ్వండి జూలై 2 నుంచి కొత్త విధానం అమలుకు ఏపీఎఫ్‌డీసీతో ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి నివేదించారు. లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని చెబుతోందన్నారు. ఒప్పందాల కోసం ఒత్తిడి చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ సమయంలో ఏజీ శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ 80 శాతం థియేటర్లకు బీ లైసెన్సులు లేవని తెలిపారు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది. -
ఏపీఎఫ్డీసీ ద్వారా టికెట్లు విక్రయించుకోండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్లను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) ద్వారా ఆన్లైన్లో విక్రయించుకునే ప్రక్రియ కొనసాగించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కొంతకాలం తరువాత ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో చూసి తగిన విధంగా స్పందిస్తామని తెలిపింది. ఇదే సమయంలో తమ సొంత పోర్టల్ ద్వారా టికెట్లను విక్రయించుకునేందుకు అనుమతించాలన్న మల్టీప్లెక్స్ థియేటర్ల అభ్యర్థనకు హైకోర్టు నో చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీఎఫ్డీసీ ద్వారా టికెట్ల విక్రయం నిమిత్తం ప్రభుత్వం గత డిసెంబర్ 17న జారీచేసిన జీవో 142ను సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సుమిత్ నీమా వాదనలు వినిపిస్తూ.. ఏపీఎఫ్డీసీ ద్వారా మాత్రమే టికెట్లను విక్రయించాలని ప్రభుత్వం చెబుతోందన్నారు. తాము తమ సొంత పోర్టల్ ద్వారా టికెట్లు విక్రయిస్తున్నామని, సమాంతరంగా రెండు వ్యవస్థలు ఉండటం వల్ల ఇబ్బందేమీ ఉండదని చెప్పారు. దీనిపై ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వివరణ కోరింది. ఏపీఎఫ్డీసీ ద్వారా వాళ్లూ టికెట్లు అమ్ముకోవచ్చు ఏజీ వాదనలు వినిపిస్తూ.. ఏపీఎఫ్డీసీ ద్వారా టికెట్లను విక్రయించేందుకు బుక్‌మై షో, పేటీఎం వంటి సంస్థలు అంగీకరించాయని, అయితే మల్టీప్లెక్స్ థియేటర్లు మాత్రం ముందుకు రావడంలేదని చెప్పారు. టికెట్ విక్రయ కార్యకలాపాలను ఏపీఎఫ్‌డీసీలో విలీనంచేస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఆన్లైన్ టికెట్ విక్రయాల జీవో ఇచ్చామన్నారు. ఏపీఎఫ్డీసీ ద్వారా టికెట్ల విక్రయాన్ని కొనసాగించనివ్వాలని, దీనివల్ల పిటిషనర్ హక్కులకు భంగం వాటిల్లుతుంటే అప్పుడు జోక్యం చేసుకోవచ్చునని చెప్పారు. టికెట్ల విక్రయాల నుంచి తామెవరినీ తప్పించడం లేదని, ఏపీఎఫ్డీసీ ద్వారా విక్రయించాలని చెబుతున్నామని తెలిపారు. ఒక్కో టికెట్ విక్రయించినందుకు ప్రభుత్వానికి రూ.1.97 సర్వీసు చార్జీ కింద వస్తుందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఇబ్బంది ఏముందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ న్యాయవాదిని ప్రశ్నించింది. తమకు తమ సొంత వ్యవస్థలు, విధానం ఉన్నాయని సుమిత్ నీమా చెప్పారు. తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ల విధానాన్ని ఆషామాషీగా తీసుకురాలేదని, చట్టం ద్వారా ఆ విధానాన్ని తీసుకొచ్చిందని పేర్కొంది. అందువల్ల ఏపీఎఫ్డీసీ ద్వారా ఆన్లైన్ టికెట్ల విక్రయాన్ని కొనసాగనివ్వాలంటూ ఉత్తర్వులిచ్చింది. తమ సొంత విధానంలో కూడా టికెట్ల విక్రయానికి అనుమతినివ్వాలన్న మల్టీప్లెక్స్ అసోసియేషన్ అభ్యర్థనను తోసిపుచ్చింది. తదుపరి విచారణను జూలై 12కి వాయిదా వేసింది. -
మల్టీప్లెక్సు థియేటర్లను సేవ్ చేసిన స్పైడర్‌మ్యాన్
ఫ్రెండ్లీ నైబర్‌హుడ్.. స్పైడర్‌మ్యాన్‌కు ఉన్న ట్యాగ్ లైన్ ఇదే. తన, పర బేధం లేకుండా ఆపదలో ఎవరైనా ఉన్నారని గ్రహిస్తే.. ఆలస్యం చేయకుండా వాలిపోయి రక్షిస్తుంటాడు. అలాంటి సూపర్ హీరో(ముగ్గురు) ఇప్పుడు ఇండియన్ మల్టీప్లెక్స్ బాక్సాఫీస్‌ను కాపాడేశాడు. కరోనా టైం నుంచి పాతాళానికి పడిపోతున్న టికెట్ సేల్‌ను తన సాలెగూడుతో అమాంతం ఆకాశానికి చేర్చేశాడు. భవిష్యత్తు మల్టీప్లెక్స్ బిజినెస్‌కు భరోసా ఇస్తూ.. భవిష్యత్తులో మరికొన్ని సినిమాలు రిలీజ్ అయ్యే ధైర్యం 2021 ఇయర్ ఎండ్‌లో అందించి బాక్సాఫీస్‌కు జోష్ నింపాడు. ఓ హాలీవుడ్ మూవీ, మరో టాలీవుడ్ మూవీ మల్టీప్లెక్సు థియేటర్లకు ఊపు తెచ్చాయి. కరోనా సంక్షోభం తర్వాత మిణుకుమిణుకుమంటున్న మల్టీప్లెక్సు వ్యాపారానికి ‘సినిమా’ ఉందనే నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చాయి. రిలీజ్‌కి ముందే వంద శాతం టిక్కెట్ల బుకింగ్ సాధించి భవిష్యత్తుకు భరోసా ఇచ్చాయి. విశేషం ఏంటంటే.. బుకింగ్ దెబ్బకి సైట్లు సైతం క్రాష్ అయ్యే పరిస్థితి ఎదురైందంటే ఆ క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్సుల భవితవ్యంపై సందేహాలు కమ్ముకుంటున్న వేళ వాటిని ఒక్క దెబ్బతో పటాపంచాలు చేశాయి ఈ రెండు సినిమాలు. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌ల భవిష్యత్తుకు ఊపిరి పోసిన సినిమాలుగా స్పైడర్‌మ్యాన్, పుష్పలను పేర్కొనవచ్చు. హాలీవుడ్ మూవీ ఐనప్పటికీ స్థానికంగా స్పైడన్ మ్యాన్ మూవీకి మల్టీప్లెక్స్‌లలో మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజైన పుష్ప అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలో రిలీజ్‌కి ఒక రోజు ముందే వంద శాతం టిక్కెట్లు అమ్ముడై సంచలనం సృష్టించింది. అంతకు ముందు అఖండ సినిమా ఇటు సింగిల్ స్క్రీన్ల స్థాయిలో మల్టీప్లెక్స్‌లలో కూడా హవా కనబరిచింది. ఆదాయం ఇక్కడి నుంచే సాధారణంగా మల్టీప్లెక్స్‌లకు ఆదాయం మూడు రకాలుగా అందుతుంది. టిక్కెట్ల అమ్మకం (యావరేజ్ టిక్కెట్ ప్రైజ్, ఏటీపీ), సినిమా చూసేందుకు థియేటర్‌కి వచ్చిన వారు పెట్టే తలసరి ఖర్చు (స్పెండ్ పర్ హెడ్, ఎస్‌పీహెచ్), యాడ్ రెవిన్యూ. కరోనా కారణంగా పెట్టిన ఆంక్షలతో గత ఏడాదిన్నరగా థియేటర్లకు ఈ మూడు రకాలుగా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. కొన్ని సందర్భాల్లో సున్నాకు చేరుకుంది. సూర్యవంశీ ఇచ్చిన ధైర్యం కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత సెప్టెంబరులో థియేటర్లు ప్రారంభమయ్యాయి. అయితే జనాలు మల్టీప్లెక్స్‌లకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ఆ నెలలో సినిమాలు విడుదలైనప్పుడు తక్కువ ఆక్యుపెన్షీ నమోదు అయ్యింది. అక్టోబరులో కొద్దిగా మెరుగుపడి అది 18 శాతానికి చేరుకుంది. నవంబరులో సూర్యవంశీ సినిమా రాకతో 27 శాతంగా నమోదు అయ్యింది. ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో దానిపై ఆధారపడిన స్పెండ్ పర్ హెడ్ ఆదాయం కూడా పడిపోయింది. పైగా ముంబై లాంటి రాష్ట్రాల్లో థియేటర్లలో ఫుడ్ అండ్ బేవరేజెస్‌కి అనుమతి ఇవ్వలేదు. దీంతో సెకండ్ వేవ్ తర్వాత మల్టీప్లెక్స్‌ల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎంతో ఖర్చుతో నిర్మించిన మల్టీప్లెక్సులు కథ కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్ల మాదిరిగానే అవుతుందా అనే కామెంట్లు వినిపించాయి. 83, ట్రిపుల్ ఆర్... స్పైడర్‌మ్యాన్, పుష్ప సినిమాలు ఇచ్చిన ఊపుతో గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యాయి మిగిలిన సినిమాలు. పుష్ప సినిమా నుంచి గట్టి పోటీ ఎదురైనా నాన్ ఇండియన్ మూవీ స్పైడర్ మ్యాన్ నిలదొక్కుకుంది. వారంతానికి వంద కోట్ల రూపాయల క్లబ్లో ఈ సినిమా చేరింది. మరోవైపు టాక్ తో సంబంధం లేకుండా రిలీజ్‌డే నుంచి సండే వరకు మల్టీప్లెక్సుల్లో టిక్కెట్లన్నీ బుక్ అవడం పుష్పకి అడ్వాంటేజ్‌గా మారింది. దీంతో ఒక్కసారిగా మల్టీప్లెక్సుల గల్లాపెట్టే గలగలమంటోంది. ఇందులో ముందుగా వస్తోన్న సినిమా క్రికెట్ బేస్డ్ మూవీ 83. ఈ సినిమా తర్వాత వరుసగా మ్యాట్రిక్స్ రీసర్సెక్షన్, జెర్సీ, కింగ్స్‌మ్యాన్ సినిమాలు డిసెంబరులో ఉండగా జనవరిలో ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్తో పాటు అక్షయ్ కుమార్ పృధ్విరాజ్ సినిమాలు ఉన్నాయి. ఒమిక్రాన్ లేకుంటే ఒమిక్రాన్ ముప్పు. థర్డ్ వేవ్ భయాలను జయిస్తే 2022లో మల్టీప్లెక్సులు పూర్తిగా కోవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటాయని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) అంచనా వేస్తోంది. అందుకే రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల కాలం ఎంతో కీలకమని ఎంఐఏ అంటోంది. యాడ్ రెవెన్యూ కూడా పీవీఆర్, ఐనాక్స్ వంటి దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సు చైన్లు కలిగిన సంస్థలకు యాడ్ రెవెన్యూ దాదాపు 10 శాతంగా ఉండేంది. సినిమాలు రిలీజ్ కాకపోవడం, మల్టీప్లెక్సులు మూత పడటంతో దాదాపు ఏడాదిన్నరగా ఈ ఆదాయానికి దాదాపు కోత పడింది. డిసెంబరులో వచ్చిన సినిమాలు బాక్సాఫీసుకు ఊపు ఇవ్వడంతో. ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉన్న సినిమాలకు ప్రచారం సైతం ఊపందుకోనుంది. ఫలితంగా యాడ్ రెవెన్యూ సైతం సాధారణ స్థితికి చేరుకుంటుందనే నమ్మకం ఉందని ఎంఏఐ అధ్యక్షుడు కమల్ జైన్చందానీ జాతీయ మీడియాతో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓటీటీ టైం పెంచుతాం కరోనా రావడానికి ముందు సినిమా రిలీజ్ అయిన తర్వాత 8 వారాల అనంతరం ఓటీటీకి ఇవ్వాలనే ఒప్పందం ఉండేది. కానీ కరోనా వచ్చి థియేటర్లు క్లోజ్ అయిన తర్వాత చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో వచ్చాయి. థియేటర్లో రిలీజరైనా నాలుగు వారాలే రన్ టైం ముగిసిన తర్వాత ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చేది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడుతున్నందున త్వరలోనే ఓటీటీ టైంని నాలుగు నుంచి ఎనిమిది వారాలకు పెంచాలని డిమాండ్ చేయాలని ఎంఏఐ నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితులను మరికొంత కాలం అంచనా వేసి ఏప్రిల్ 1 నుంచి ఎనిమిది వారాల గడువు మళ్లీ వస్తుందంటున్నారు. -సాక్షి, వెబ్ స్పెషల్ -
పీవీఆర్‌కు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర నష్టం రూ. 289 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 74.5 కోట్ల నష్టమే నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 662 కోట్ల నుంచి రూ. 263 కోట్లకు క్షీణించింది. కాగా.. కోవిడ్–19 కట్టడికి లాక్డౌన్ల అమలు, సామాజిక దూరం, కంటెంట్ తగ్గడం వంటి పలు ప్రతికూల అంశాలు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపినట్లు పీవీఆర్ పేర్కొంది. వెరసి ఫలితాలను అంతక్రితం ఏడాది పనితీరుతో పోల్చి చూడతగదని తెలియజేసింది. మల్టీప్లెక్స్ పరిశ్రమకు గత ఆర్థిక సంవత్సరం అత్యంత గడ్డుకాలమని వ్యాఖ్యానించింది. అయితే ఫిక్స్డ్ వ్యయాల తగ్గింపు, తగినంత లిక్విడిటీ వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలియజేసింది. క్యూ4లో హాలీవుడ్, బాలీవుడ్ నుంచి ప్రాధాన్యతగల సినిమాలు విడుదలకాలేదని ప్రస్తావించింది. దక్షిణాదిలో కీలక సినిమాల కారణంగా రికవరీ కనిపించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 1,319 వద్ద ముగిసింది. -
అల్లు అర్జున్ కొత్త బిజినెస్: మహేష్‌కు పోటీగా!
సినిమాలతోపాటు ఇతర బిజినెస్‌లపై దృష్టిపెట్టారు మన టాలీవుడ్ హీరోలు.. కొత్త రంగాల్లో పెట్టిబడి పెడుతూ చేతికి అందినంత సంపాదించుకునేదుకు సిద్దపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాడు. స్టార్ హీరోగా దూసుకుపోతున్న బన్నీ ఇప్పుడు థియేటర్ల రంగంలోకి ఎంటర్ అయ్యాడు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఏఏ(AAA) సినిమాస్ మొదలు పెడుతున్నాడు. ఇప్పటికే ఈ వ్యాపారంలో మహేశ్‌బాబు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఎంబీ(AMB) సినిమాస్ పేరుతో మహేష్ బిజినెస్ చేస్తున్నాడు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్‌తో మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఏవీడీ(AVD) సినిమాస్ పేరుతో తన సొంత పట్టణం మహబూబ్‌నగర్‌లో మొదలు పెడుతున్నాడు. ప్రస్తుతం బన్నీ కూడా థియేటర్ల బిజినెస్‌లోకి రావడంతో వీరిద్దరి మధ్య మంచి పోటీ నెలకొనబోతోందని టాక్ వినిపిస్తోంది. సినిమా ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మల్టిప్లెక్స్ నిర్మాణంలో ఉంది. అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థలంలోనే ఈ మల్టిప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగ్గట్టుగానే ఏఏఏ సినిమాస్ నిర్మాణం జరుగుతోంది. అమీర్‌పేట్ పరిసరాల్లోనే అత్యంత విలాసవంతమైన భవంతిగా నిర్మిస్తున్నారని తెలుస్తోంది. దీని కోసం భారీగానే డబ్బులు వెచ్చిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాతి వరకు ఈ థియేటర్ రెడీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ ఫోటోతో ఏఏఏ లోగో కూడా విడుదల చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ రేంజ్ మించిపోయేలా ఏఏఏ సినిమాస్ ఉంటుదా అనేది తెలియాలంటే నిర్మాణ పూర్తి అయ్యే వరకు వేచి ఉండాల్సిందే. చదవండి: పుష్పరాజ్‌ను ఢీకొట్టే ధీటైన విలన్ దొరికాడు -
15 నుంచి తెరుచుకోనున్న థియేటర్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ తాజాగా అన్‌లాక్–5 మార్గదర్శకాలను జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా బుధవారం అన్‌లాక్–5 మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా పాఠశాలలు, విద్యా, శిక్షణ సంస్థలు తెరిచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. 50 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు అనుమతిచ్చింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను యథాతథంగా కొనసాగించింది. అక్టోబర్ 15 నుంచి అనుమతించేవి.. ► 50 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవచ్చు. దీనికోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక నియమావళి జారీ చేస్తుంది. ► వాణిజ్య శాఖ జారీ చేసే ప్రత్యేక నియమావళి ఆధారంగా వాణిజ్య సంస్థలు (బిజినెస్ టు బిజినెస్) ఎగ్జిబిషన్లు తెరుచుకోవచ్చు. ► క్రీడాకారుల శిక్షణ కోసం ఉపయోగించే స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి. దీనిపై క్రీడల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రామాణిక నియమావళి జారీ చేస్తుంది. ► ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా ఎంటర్టైన్మెంట్ పార్కులు, ఈ తరహా సంస్థలు తెరుచుకోవచ్చు. విద్యా సంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు.. ► అక్టోబర్ 15 తర్వాత పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ సంస్థలను దశల వారీగా ప్రారంభించుకునే వెసులుబాటును కేంద్రం రాష్ట్రాలకు విడిచిపెట్టింది. అయితే ఆయా సంస్థలు కేంద్రం విధించిన షరతులను పాటించాలి. ► ఆన్లైన్ విద్య, దూరవిద్య కొనసాగాలి. హాజరు నిబంధనలు అమలు చేయరాదు. ► విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఆన్లైన్ తరగతులకు హాజరు కావడానికి ఇష్టపడితే అందుకు వారిని అనుమతించాలి. ► తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో మాత్రమే పాఠశాలలు, శిక్షణ సంస్థలకు విద్యార్థులు హాజరుకావచ్చు. ► పాఠశాలలు, శిక్షణ సంస్థలను తెరిచేందుకు కేంద్ర విద్యా శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించి నియమావళి తయారు చేసుకోవాలి. ► రాష్ట్రాల ప్రామాణిక నియమావళిని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలి. ► కరోనా పరిస్థితిని అంచనా వేసి కేంద్ర హోం శాఖతో సంప్రదించి కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలు ప్రారంభించవచ్చు. ► సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రీమ్‌లోని పీహెచ్డీ, పీజీ విద్యార్థులకు అక్టోబర్ 15 నుంచి ఉన్నత విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతిస్తారు. ఈ విషయంలో కేంద్ర నిధులతో పనిచేసే ఉన్నత విద్యా సంస్థల అధిపతి ఈ అవసరాన్ని గుర్తిస్తారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ వర్సిటీలు తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం. 50 శాతం భర్తీకి అనుమతి.. ► సామాజిక, విద్య, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మత, రాజకీయ వేడుకలు, ఇతర సమ్మేళనాలకు సంబంధించి ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం 100 మంది వరకు అనుమతించారు. అక్టోబర్ 15 తర్వాత కంటైన్మెంట్ జోన్ల వెలుపల 100 మందికి మించి ఇలాంటి సమావేశాల నిర్వహించే అనుమతిని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. ఇందుకు ఈ నియమాలు పాటించాలి. ► హాల్ సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం భర్తీకి అనుమతిస్తారు. గరిష్టంగా 200 మందికి మించకూడదు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, థర్మల్ స్కానింగ్, హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ వాడకం తప్పనిసరి. అంతర్జాతీయ ఆంక్షలు యథాతథం.. ► హోం శాఖ అనుమతించిన ప్రయాణాలు మినహా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయి. ► కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. ► కంటైన్మెంట్ జోన్ల వెలుపల రాష్ట్రాలు కేంద్రంతో సంప్రదించకుండా లాక్డౌన్ విధించరాదు. -
సినిమాను కాపాడండి
‘‘సినిమాను కాపాడండి’’ అంటున్నారు థియేటర్స్ యాజమాన్యాలు. ‘సేవ్ సినిమా’ (సినిమాను కాపాడండి), సపోర్ట్ మూవీ థియేటర్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీటర్లో ట్రెండ్ ఆరంభించారు. ఈ విషయం గురించి ‘మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ పలు ట్వీట్స్‌లో ఇలా పేర్కొంది. ‘‘మన దేశ సంప్రదాయాల్లో సినిమా థియేటర్స్‌లో సినిమాకు వెళ్లడం ఓ పద్ధతి. మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సినిమా థియేటర్స్ చాలా కీలకం. ఎన్నో వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. చాలా దేశాల్లో సినిమా థియేటర్స్ తెరవడానికి ఆయా ప్రభుత్వాలు అనుమతించాయి. భారత ప్రభుత్వం కూడా మా విన్నపాన్ని మన్నించాలని, సినిమా హాళ్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సినిమా చూడటానికి ప్రేక్షకులు వచ్చేలా చేసే బాధ్యత మాది. పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉంటాం. విమానయానాలు, మెట్రో ట్రైన్స్, రెస్టారెంట్స్ ఓపెన్ చేసేందుకు అనుమతించినట్లుగానే సినిమా హాళ్లకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం’’ అని పేర్కొంది. ఈ విషయంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మరికొంతమంది సినీ ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. -
బొమ్మపడి 100 రోజులు
చిన్నోడికైనా, పెద్దోడికైనా సినిమా అంటే ఓ ఆనందం.. సినిమాకెళ్లడమంటే మహదానందం.. చూస్తున్నంత సేపు ఆత్మానందం.. బయటకు వస్తుంటే పరమానందం... ఇది కరోనా రాకముందు మాట. యాంత్రిక జీవన ఎడారిలో వినోదాల ఒయాసిస్సు దక్కేది ఒక్క సినిమా హాలులోనే. అలాంటి సినిమా టాకీసులు ఇవాళ కరోనా దెబ్బకు బిక్కుబిక్కుమంటున్నాయి. ఓ మూడు గంటలపాటు ఆనందడోలికల్లో ఓలలాడించే ఈ సినిమాహాళ్లలో తెరపైకి లేచి, టికెట్లు తెగి ఇవాల్టికి సరిగ్గా వందరోజులు. వాటినే నమ్ముకున్న యజమానులు, లీజుదారులు, పనిచేసే సిబ్బంది, పంపిణీదారులు అంతా బొమ్మపడక సతమతమవుతున్నారు. గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): థియేటర్ల వద్ద కొత్త సినిమాల విడుదల సందడి లేదు. అభిమాన సంఘాల హడావిడి అంతకంటే లేదు. విజయోత్సవ ర్యాలీలు లేవు. సినిమా హాళ్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం లేదు. కరోనా కారణంగా సినిమా హాళ్లు మూతపడి నేటికి వంద రోజులు. నిత్యం ప్రేక్షకులు, అభిమాన సంఘాలతో కళకళలాడే థియేటర్లు వంద రోజులుగా వెలవెలబోతున్నాయి. ఏ థియేటర్ గేటు దగ్గర చూసిన కరోనా లాక్డౌన్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. సినిమాల ప్రదర్శన నిలిచిపోవడంతో యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. థియేటర్లలో పనిచేసే సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమా పంపిణీదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సినిమా ప్రదర్శనలు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కృష్ణా జిల్లాలో 90 థియేటర్లు, విజయవాడ నగరంలో 45 సింగిల్ స్క్రీన్లు, మల్టిఫ్లెక్స్‌లు ఉన్నాయి. 60 రిజిస్టర్డ్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. వీటిలో 12 పూర్తిగా యాక్టివ్‌గా ఉన్నాయి. థియేటర్లు,పంపిణీ సంస్థలపై ఆధారపడి పత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి పైగా సిబ్బంది జీవనం సాగిస్తున్నారు. ఒక్కో థియేటర్లో టెక్నికల్ స్టాఫ్, లైట్‌మెన్, వాచ్మెన్లు, టికెట్ బుకింగ్ సిబ్బంది, రిప్రజెంటేటివ్స్ పనిచేస్తుంటారు. ఇక మల్టిఫ్లెక్స్‌లో సుమారు 25 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 20 నుంచి థియేటర్లు, మల్టీ ఫ్లెక్స్‌లు మూతపడ్డాయి. లాక్ డౌన్లో సడలింపులు ఇచ్చినప్పటికీ అవి థియేటర్లు మాత్రం మరికొంత కాలం ఆగాల్సిందే థియేటర్లలో సినిమా ప్రదర్శనలు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సిబ్బంది వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. యాజమాన్యానికి తీరని నష్టం మూడు నెలలుగా సినిమా ప్రదర్శనలు నిలిచిపోవడం యాజమాన్యం దిక్కుతోచని స్థితిలో పడిండి. దాదాపు జిల్లాలోని 90 శాతం థియేటర్లు లీజుదారుల చేతిలోనే ఉన్నాయి. సినిమాలు ప్రదర్శిస్తేనే లీజు చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటారు. ఒక్కో థియేటర్ క్లాస్‌ను బట్టి వారానికి రూ.1 లక్షల నుంచి 3.50 లక్షల వరకు లీజు వస్తుంది. ప్రస్తుతం ప్రదర్శనలు లేకపోవడంతో యజమానులకు లీజు రావడం లేదు. ఒక్కో యజమాని నెలకు రూ. 4 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చింది. దీనికి తోడు థియేటర్ల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ చార్జీల రూపంలో అదనపు భారం పడింది.. కొన్ని థియేటర్ల యాజమాన్యం 50 శాతం సిబ్బందిని తప్పించి వారికి నిత్యావసరాలు, వారానికి కొంత మొత్తం నగదు చెల్లిస్తున్నారు. పంపిణీదారుల పాట్లు సాధారణంగా ఏ సినిమాకైనా పంపిణీదారుడే కీలకం. సినిమా థియేటర్లకు మార్చి నుంచి జూన్ వరకు మంచి సీజన్. ఈసారి సీజన్ అంతా లాక్‌డౌన్‌లోనే గడిచిపోయింది. మార్చి 25 తర్వాత పెద్దా, చిన్నా అన్ని కలిపి 20కు పైగా సినిమాలు విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్డౌన్ పుణ్యమాని అవి నిలిచిపోయాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు పనిలేకుండా పోయింది. సినిమా హిట్ అయితే నాలుగు రూపాయలు మిగిలేవి, కానీ సినిమా ప్రదర్శనే లేకపోవడం, సిబ్బంది జీతాలు, కార్యాలయ అద్దెలు చెల్లించాల్సి రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వంద రోజులుగా మూతపడింది ఇరవై ఏళ్లుగా సినిమా పంపిణీ సంస్థ నడుపుతున్నా. ఎన్నో సినిమాలకు వంద రోజుల çఫంక్షన్స్ నిర్వహించాం. ఏనాడు థియేటర్లు మూత పడలేదు. ఈ సారి కరోనా మహమ్మారి కారణంగా హండ్రెడ్ డేస్ లాక్డౌన్ చూడాల్సి వచ్చింది. దీంతో పరిశ్రమపై ఆధారపడిన మా లాంటి వాళ్లు తీవ్రంగా నష్టపోతున్నాం –ఎన్.సర్వేశ్వరరావు, కామాక్షి డిస్ట్రిబ్యూటర్స్ కోలుకోలేని దెబ్బ లాక్డౌన్ కారణంగా థియేటర్ల లీజు యాజమాన్యం కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఒక్కో థియేటర్‌కు రెంట్, సిబ్బంది జీతాలు, ప్రాపర్టీ ట్యాక్స్ అన్నీ కలుపుకుని రూ. 5 నుంచి 10 లక్షల వరకు నష్టం వచ్చింది. జీతాలు చెల్లించే పరిస్థితి లేదు. సిబ్బందికి మొదటి నెల పూర్తి జీతం చెల్లించాం. తర్వాత నుంచి వారికి అవసరమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తు న్నాం. కొన్ని థియేటర్లు ఈ నెల నుంచి జీతాలు కూడా ఇవ్వడం లేదు. –ఎం బాబీ, మేనేజర్, శైలజా థియేటర్ -
30 ఏళ్ల తర్వాత అక్కడ తొలి మల్టీప్లెక్స్
శ్రీనగర్: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత.. కశ్మీర్ ప్రజలు బిగ్ స్క్రీన్‌పై బాలీవుడ్ చిత్రాలను చూడనున్నారు. ప్రస్తుతం శ్రీనగర్‌లో మొట్టమొదటి మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. మూడు అంతస్తుల ఈ థియేటర్ 2021 మార్చిలో ప్రారంభం కానుంది. 1990 కాలంలో ఉగ్రవాద గ్రూపులు జారీ చేసిన ఆదేశాల కారణంగా కశ్మీర్‌లోని చాలా థియేటర్లు మూతబడ్డాయి. అయితే ప్రస్తుతం కశ్మీర్లో ఉగ్రవాద గ్రూపులు బలహీనపడటంతో.. సాధరణ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణానికి, సినిమాలను ప్రదర్శించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్మాణం పూర్తయిన తర్వాత లైసెన్స్ మంజూరు చేయబడుతుంది. ఈ మల్టీప్లెక్స్‌లో మూడు థియేటర్లు ఉండనున్నాయి. 1990 కాలంలో శ్రీనగర్‌లో బాగా ప్రసిద్ధి చెందిన బ్రాడ్వే సినిమా హాలుకు ఎదురుగా ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. (నర హంతకుడిగా.. లెక్కల మాస్టారు) ఈ మల్టీప్లెక్స్‌ను ధార్ కుటుంబానికి చెందిన ఎమ్ / ఎస్ తక్సల్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీనగర్‌లోని బాదామి బాగ్ కంటోన్మెంట్ ప్రాంతంలో నిర్మిస్తుంది. ఈ సందర్భంగా థియేటర్ యజమాని విజయ్ ధార్ మాట్లాడుతూ.. ‘గత 30 ఏళ్లుగా ఇక్కడి యువతకు ఎలాంటి వినోదం లభించలేదు. ఇతర ప్రాంత ప్రజలకు లభిస్తున్న సౌకర్యం ఇక్కడి ప్రజలకు కూడా అందాలి అనే ఉద్దేశంతో ఈ థియేటర్ నిర్మాణం చేపట్టాం’ అని తెలిపారు. కశ్మీర్ సినీ రంగ ప్రముఖులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కశ్మీరి చిత్రనిర్మాత ముష్తాక్ అలీ మాట్లాడుతూ.. ‘మల్టీప్లెక్స్ నిర్మాణాన్ని నేను స్వాగతిస్తున్నాను. కశ్మీర్‌కు ఈ తరహా సౌకర్యాలు కావాలి. ఈ థియేటర్ బాలీవుడ్‌ను తిరిగి కశ్మీర్‌కు తీసుకురాగలదు. ఎందుకంటే చాలావరకు బాలీవుడ్ చిత్రాలు కశ్మీర్‌లోనే చిత్రీకరించబడ్డాయి. బాలీవుడ్‌కు కశ్మీర్‌తో దశాబ్దాల అనుబంధం ఉంది. ఈ మల్టీప్లెక్స్ ఎప్పుడు తెరుచుకుంటుందా అని నేను ఆత్రుతుగా ఎదురు చూస్తున్నాను. ఈ థియేటర్లో సినిమా చూసే మొదటి వ్యక్తి నేనే’ అన్నారు. 1990లకు ముందు, శ్రీనగర్‌లో ఫిర్దాస్, షిరాజ్, ఖయం, నాజ్, నీలం, షా, బ్రాడ్వే, రీగల్, పల్లాడియం వంటి 10 సినిమా హాళ్లు ఉండేవి. వీటిలో ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలను ప్రదర్శించేవారు. అయితే 90ల ప్రారంభంలో ఉగ్రవాదం ఊపందుకోవడం.. సినిమా హాళ్లను మూసివేయాలని ఉగ్రవాదులు థియేటర్ యజమానులను బెదిరించడంతో ఇవన్ని మూతబడ్డాయి. (ఈ ఫోటోకి ఏం అవార్డు ఇస్తారు?) -
బొమ్మ ఆడక.. పూట గడవక..
కొత్తగూడెం టౌన్/భద్రాచలంఅర్బన్: వినోదంతో పాటు మానసికోల్లాసాన్ని పంచే సినిమా థియేటర్లు కరోనా లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి. దీంతో సినిమా హాళ్లలో పనిచేసే కార్మికులకు ఇక్కట్లు తప్పడం లేదు. వేతనాలు రాక, చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో 5, పాల్వంచలో 3, ఇల్లెందులో 3, అశ్వారావుపేటలో 4, మణుగూరులో 2, సారపాకలో 1, భద్రాచలంలో 2, చర్లలో 2 చొప్పున, జిల్లాలో మొత్తం 22 థియేటర్లు ఉన్నాయి. గత మార్చి 23న లాక్డౌన్ ప్రకటించడంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో వాటిల్లో పని చేసే వర్కర్లు ఇక్కట్లు పడుతున్నారు. ఒక్కో థియేటర్లో 20 నుంచి 25 మంది వరకు పని చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 500 మంది వరకు సినిమా హాళ్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. థియేటర్లు పని చేయక పోవడంతో ఆయా కుటుంబాలు రెండు నెలలుగా అవçస్థ పడుతున్నాయి. దాతలు సైతం థియేటర్లలో పని చేసే వర్కర్లను గుర్తించకపోవడంతో దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. యాజమాన్యాలకూ నష్టమే.. ప్రతిఏటా వేసవిలో థియేటర్లకు ప్రేక్షకులు అధికంగా వస్తుంటారు. దీంతో యజమానులు లాభాలను ఆర్జిస్తుంటారు. కానీ కరోనా కారణంగా ఈ వేసవిలో మార్చి నెల నుంచి థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పట్లో థియేటర్లను నడిపించడానికి అనుమతులు లభించడం కష్టంగానే మారింది. దీంతో యాజమాన్యాలు కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ఇబ్బందులు పడుతున్నాం 20 ఏళ్లుగా సినిమా హాల్లో పని చేస్తున్నాను. నాకు తెలిసి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. థియేటర్ రిపేరు చేసినప్పుడు పది రోజుల్లో పూర్తి చేసే వాళ్లం. కరోనా లాక్‌డౌన్‌తో థియేటర్ మూత పడింది. చాలా ఇబ్బందులు పడుతున్నాం.– వెంకటేశ్వర్లు,ఏఎమ్మార్ సినిమాస్ ఆపరేటర్,భద్రాచలం పట్టించుకునే వాళ్లే లేరు సినిమా థియేటర్లలో పని చేసే వారిని పట్టించుకునే వాళ్లే లేరు. థియేటర్లు నడిస్తేనే మాకు జీవనోపాధి. లాక్‌డౌన్‌తో కుటుంబాలను పోషించడం కష్టంగా మారింది. ప్రభుత్వం చొరవ చూపి నగదు సాయాన్ని అందించాలి.–ప్రసాద్, శాంతి థియేటర్ మేనేజర్, పాల్వంచ యాజమాన్యాలు ఆర్థికంగా ఆదుకోవాలి సినిమాహాల్ వర్కర్లను ప్రభుత్వం, యాజమాన్యాలు ఆదుకోవాలి. రెండు నెలలుగా నిత్యావసర వస్తువులకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్మికుల కుటుంబాలకు అండగా నిలవాలి.–సీహెచ్. రాంనారాయణ, తెలంగాణ సినిమా హాల్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాళీగా ఉంటున్నాయి.. సినిమాహాల్స్ ప్రేక్షకులు లేక ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. కార్మికుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమం రూపొందించి వారిని ప్రభుత్వం, యాజమాన్యాలు ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి.–సునీల్,పూర్ణ థియేటర్ అసిస్టెంట్ మేనేజర్ ♦ సినిమాహాళ్లలో పని చేస్తున్న గేట్ కీపర్‌కు రూ.8500 నుంచి రూ.10 వేల వరకు, ఆపరేటర్లకు రూ.9,500లు, బుకింగ్ కార్మికులకు రూ. 8 వేలు ఇస్తారు. ♦ కార్మికుల వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించినా సొంతంగా సినిమాహాళ్లు నిర్వహిస్తున్న వారు కొందరు వేతనాలను ఇచ్చేందుకు ఇబ్బందులు పెడతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ♦ కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న థియేటర్ల యాజమాన్యాలు వేతనాలు చెల్లిస్తున్నాయని చెబుతున్నారు. -
స్క్రీన్ ఉంది.. సీన్ లేదు
ఒకప్పుడు ‘నేడే చూడండి... మీ అభిమాన హీరో సినిమా’ అంటూ రిక్షాల్లో తిరుగుతూ మైకుల్లో చెప్పేవారు. రిక్షా వెనకాల పిల్లలు పరిగెత్తుతూ సందడి సందడి చేసేవారు. ఇప్పుడు టీవీ, రేడియా, సోషల్ మీడియా ఇలా సినిమా ప్రమోషన్‌కి చాలా ఉన్నాయి. థియేటర్ ముందు అయితే భారీ కటౌట్లు, గజమాలలు, పాలాభిషేకాలతో ఫ్యాన్స్ సందడి సందడి చేస్తుంటారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో థియేటర్ల ముందు సందడి లేదు. వెండితెర వెలవెలబోతోంది. ‘స్క్రీన్ ఉంది.. సీన్ లేదు’. ‘‘సినిమా చరిత్రలో ఇలా పదీ పదిహేను రోజులు ‘థియేటర్లు బంద్’ కావడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్ అని’’ నైజాం ప్రముఖ పంపిణీదారుడు చారి పేర్కొన్నారు. దాదాపు పది రోజులు థియేటర్లు మూసివేయడం ద్వారా ‘సింగిల్ థియేటర్’కి ఏర్పడే నష్టం ఐదారు లక్షలు ఉంటుందని, మల్టీప్లెక్స్‌కి ఇంకా ఎక్కువ ఉంటుందని ఓ పంపిణీదారుడు తెలిపారు. అయితే సినిమా ఆడినప్పుడు సింగిల్ థియేటర్‌తో పోల్చితే మల్టీప్లెక్స్‌కి రాబడి ఎక్కువ ఉంటుందని మరో పంపిణీదారుడు అన్నారు. థియేటర్ల నిర్వహణ గురించి కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన సమాచారంలోకి వెళదాం... ► ఈ మధ్య ‘సింగిల్ థియేటర్’కి అన్నీ నష్టాలే. ఎందుకంటే సినిమా రిలీజులు పెద్దగా లేవు. చిన్న సినిమాలు మంచి టాక్ తెచ్చుకుని ఓ మూడు నాలుగు వారాలు ఆడితే అప్పుడు లాభాలు చూడొచ్చు. ఇక పెద్ద హీరోల సినిమాలను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తారు. దాంతో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ మంచి వసూళ్లతో థియేటర్ నడుస్తుంది. థర్డ్ వీక్ నుంచి వసూళ్లు పడిపోతుంటాయి. ► మల్టీప్లెక్స్‌లో అయితే ఉన్న మూడు నాలుగు స్క్రీన్స్‌లోనూ పెద్ద సినిమాని ప్రదర్శిస్తారు. వాళ్లకు పర్సంటేజ్ సిస్టమ్ ఉంటుంది. మొదటి వారం వచ్చే వసూళ్లలో డిస్ట్రిబ్యూటర్ 55 శాతం, ఎగ్జిబిటర్ 45 శాతం తీసుకుం టారు. రెండో వారానికి రివర్శ్. 55 ఎగ్జిబిటర్ (సినిమా ప్రదర్శించేవాళ్లు), 45 శాతం డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు. అలా చివర్లో డిస్ట్రిబ్యూర్ 30, ఎగ్జిబిటర్ 70 శాతం తీసుకుంటారు. ► సింగిల్ థియేటర్ అయితే సినిమాని పర్సంటేజ్ పద్ధతిలో కాకుండా రెంటల్ సిస్టమ్‌కి ఇస్తారు. ఏరియాని బట్టి వారానికి నాలుగు లక్షలు రెంట్ ఉంటుంది. ఒకవేళ వసూళ్లు నామమాత్రంగా ఉంటే అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు రెంటల్ విధానంలో కాకుండా పర్సంటేజ్ విధానంలో ఎగ్జిబిటర్ నుంచి డబ్బు తీసుకుంటారు. అది ఎప్పుడూ అంటే ఒక షోకి 50 వేలు వసూలు అయితే.. వారానికి సుమారు 10 లక్షలు కలెక్ట్ అవుతాయి. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ 2 లక్షలు రెంట్ ఇచ్చేసి, మిగతా 8 లక్షలు తీసుకుంటారు. అదే వారం మొత్తం 2 లక్షలే వస్తే... ఎగ్జిబిటర్‌కి మొత్తం 2 లక్షలు రెంట్ ఇవ్వకుండా వచ్చిన వసూళ్లలో సగం తీసుకుంటారట పంపిణీదారుడు. అదే మల్టీప్లెక్స్ అయితే పర్సంటేజ్ సిస్టమే. ► అసలు ఒక థియేటర్ నెల మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? అంటే.. బాగా నీట్‌గా మెయింటైన్ చేసే సింగిల్ థియేటర్‌కి ఐదున్నర నుంచి ఆరు లక్షలవుతుందట. ప్రొజెక్టర్ ఖర్చు, ప్రొజెక్టర్ బల్బ్, టాయ్‌లెట్, ఫ్లోర్ క్లీనింగ్, సీట్స్, కరెంట్ బిల్... ఇలాంటివన్నీ ఈ ఆరు లక్షల్లో ఉంటాయి. ప్రొజెక్టర్ నెల రెంట్ 30 వేలు అయితే, బల్బ్ దర 90 వేల నుంచి లక్ష వరకూ ఉంటుంది. రెండు మూడు నెలలకోసారి కొత్త బల్బ్ మార్చాల్సి ఉంటుంది. ఇది సింగిల్ థియేటర్ ఖర్చు. మల్టీప్లెక్స్‌కి వేరే విధంగా ఉంటుంది. అయితే సింగిల్ థియేటర్లో మూడు టికెట్ కౌంటర్లు ఉంటే.. మల్టీప్లెక్స్‌లోనూ దాదాపు అన్నే ఉంటాయని ఓ ఎగ్జిబిటర్ అన్నారు. కాకపోతే మల్టీప్లెక్స్‌లో స్టాఫ్ తక్కువ.. స్క్రీన్లు ఎక్కువ ఉంటాయి. అలాగే సింగిల్ థియేటర్లో సినిమా బాగా ఆడకపోతే క్యాంటీన్ రెవెన్యూ కూడా తగ్గుతుంది. కానీ మల్టీప్లెక్స్‌లో వేరే వేరే సినిమాలు స్క్రీనింగ్ చేసుకోవచ్చు కాబట్టి క్యాంటీన్ రన్ బాగానే ఉంటుంది. బాగున్న సినిమాని రెండు మూడు స్క్రీన్స్‌లో ప్రదర్శించే వీలు మల్టీప్లెక్స్‌కి ఉంటుంది. అయితే మల్టీప్లెక్స్వాళ్లకు ఉండే కష్టాలు వాళ్లకూ ఉంటాయి కానీ సింగిల్ థియేటర్స్‌కే నష్టం ఎక్కువ అని లెక్కలు చెబుతున్నారు కొందరు ఎగ్జిబిటర్లు. ► మరి ఈ పరిస్థితిలో థియేటర్ని ఎందుకు కంటిన్యూ చేయడం అంటే.. ఎప్పుడో థియేటర్స్ కట్టి ఉన్నాయి. వాటిని ఏం చేయాలన్నా కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఉమ్మడి ప్రాపర్టీ అయితే పెట్టుబడి ఎవరు పెట్టాలి? అనే విషయంలో వివాదం వచ్చే అవకాశం ఉంది. ఇక పిల్లలు విదేశాల్లో సెటిల్ అయితే ఇక్కడున్న ప్రాపర్టీ మీద పెద్దగా దృష్టి పెట్టరు. అందుకని ఎలాగూ ఉన్నాయి కదా అని థియేటర్స్‌ని నడుపుతున్న ఎగ్జిబిటర్లే ఎక్కువ శాతం ఉన్నారని చారి పేర్కొన్నారు. ► ఇంతకీ పది రోజులు థియేటర్లు మూసేస్తే వచ్చే నష్టం ఎంతా అంటే ‘మినిమమ్ ఐదారు లక్షలు’ అంటున్నారు. ఏరియాని బట్టి ఈ లెక్కలో హెచ్చు తగ్గులుంటాయి. పైగా మార్కెట్లో దొరికే వస్తువులు ఇవాళ కాకపోతే రేపు అమ్ముడవుతాయి. కానీ ఆ రోజు సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోతే ఆ మర్నాడు వస్తారన్న గ్యారంటీ లేదు. ఓ వారం తర్వాత ఆ సినిమా థియేటర్లో ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. గత శుక్రవారం అర్జున, ప్రేమ పిపాసి’, 302, యురేక, మేద వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఆ మర్నాటి నుంచే థియేటర్ల మూతను ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోయే అవకాశం ఉంది. అయితే బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే... కరోనా కారణంగా ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రావడంలేదు. అందుకని ఇప్పుడు థియేటర్లు మూసినా పెద్దగా నష్టం వాటిల్లదనే చెబుతున్నారు. దానికి ఓ ఉదాహరణ చెప్పాలంటే... ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో 3600 టికెట్లు బుక్ అయితే.. 600 మంది ప్రేక్షకులు అసలు థియేటర్‌కి రాలేదట. బుక్ చేసుకుని మరీ రాలేదంటే కరోనా ఎంత భయపెడుతోందో ఊహించుకోవచ్చు. షూటింగ్ బంద్ కరో కరోనా వైరస్ ప్రభావం అన్ని రాష్ట్రాల చిత్ర పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాల చిత్రీకరణలను నిలిపివేస్తున్నట్లు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నటీనటుల సంఘం, నిర్మాతల మండలి సంయుక్తంగా ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణదాస్ నారంగ్ మాట్లాడుతూ – ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో షూటింగ్స్‌ను నిలిపి వేయాలని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’’ అన్నారు. ‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా చిత్రీకరణలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొందరు నిర్మాతలకు ఇబ్బందిగా ఉన్నా సరే మా ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. కరోనా కారణంగా తెలంగాణలో ఎక్కడా షూటింగ్స్ జరగవు’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్. ‘‘కరోనా వైరస్ చాలా భయంకరమైనది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్, మాల్స్ బంద్ ప్రకటించడం జరిగింది. అదే విధంగా షూటింగ్ నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది’’ అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ. ‘‘తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా తీసుకున్న నిర్ణయం ఇది. థియేటర్స్ బంద్‌తోపాటు షూటింగ్స్ కూడా నిలిపివేయాలనేది అందరూ మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చిత్రీకరణలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. అభ్యంతరం లేని ఆంధ్రా ప్రాంతాల్లో షూటింగ్స్ జరుగుతున్నాయి’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కల్యాణ్. ‘‘షూటింగ్స్‌లో వందలమంది పాల్గొంటుంటారు. వారి ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాజిక బాధ్యతతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అందరం దీన్ని సమర్థిస్తున్నాం’’ అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ జీవితా రాజశేఖర్. ‘‘ప్రభుత్వం మళ్లీ షూటింగ్స్ జరుపుకోవచ్చని తెలియజేసినప్పుడు చిత్రీకరణలు పునరావృతం అవుతాయి. ఈ నిర్ణయాన్ని నిర్మాతలందరూ స్వాగతించాలి’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్. ఈ సమావేశంలో నిర్మాతలు శ్యామ్ ప్రసాద్, ఠాగూర్ మధు, నట్టికుమార్, రామసత్యానారాయణ, సురేందర్‌రెడ్డి, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు సినిమాలు, టీవీ సీరియల్స్, వెబ్‌సిరీస్‌ల షూటింగ్స్ కూడా ఈ నెల 19 నుంచి 31 వరకు జరగకూడదని ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎమ్పీఆర్ఏ) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తిరిగి షూటింగ్స్‌ను ఎప్పుడు ప్రారంభించాలనే విషయాలను అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 30న ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఐఎమ్పీఆర్ఏ పేర్కొంది. సి. కల్యాణ్, ప్రసన్నకుమార్, జీవిత, వెంకటేష్, నారాయణదాస్, బెనర్జీ, దామోదర ప్రసాద్, మధు -
సాహో అ'ధర'హో!
సాక్షి, హైదరాబాద్: మొన్న మహర్షి నేడు సాహో.. టికెట్ల ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. ఈ నెల 30న విడుదల కానున్న సాహో సినిమా టికెట్ల ధరలను రాష్ట్రంలో కొన్ని థియేటర్ యాజమాన్యాలు అమాంతంగా పెంచేశాయి. దీంతో సామాన్య ప్రేక్షకులకు వినోదభారం తప్పడం లేదు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాకు సగానికిపైగా థియేటర్లు రేట్లు పెంచడం వినోద ప్రియులను కలవరపెడుతోంది. ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేసే ‘బుక్ మై షో’వెబ్సైట్లో ఈ మేరకు పెంచిన ధరలు దర్శనమిస్తున్నాయి. దాదాపు వారం రోజులుగా ఈ పెంచిన ధరలతోనే బుకింగ్‌లు జరుగుతున్నాయి. ఈ సినిమా శుక్రవారం విడుదలవనుంది. తరువాత శని, ఆదివారాలు సెలవు దినాలు రావడం, సోమవారం వినాయక చవితి కావడంతో సినిమా బుకింగ్‌లు అమాంతం పెరిగాయి. రూ.10 నుంచి రూ.150 అధికంగా.. సాధారణంగా నాన్ ఏసీ థియేటర్లలో బాల్కనీ టికెట్ ధర రూ.80, ఏసీ థియేటర్లలో రూ.125గా ఉంటుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక చాలా థియేటర్లు ఇవే ధరల్ని కొనసాగిస్తున్నాయి. కానీ కొన్ని మాత్రం అస్సలు పాటించడం లేదు. మొదటివారం వీలైనంత వసూలు చేసుకోవాలన్న ఆలోచనతో టికెట్ ధరలు పెంచేస్తున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌ల్లో ఈ వ్యత్యాసం అధికంగా ఉంటోంది. వాస్తవానికి జీఎస్టీతో కలిపి మల్టీప్లెక్స్‌లో టికెట్ల ధర రూ.138 వద్ద మొదలై గరిష్టంగా రూ.150 వరకు ఉంది. కానీ, సాహో సినిమాకు ఈ వ్యత్యాసం మరీ పెరిగిపోయింది. కొన్ని రూ.175, ఇంకొన్ని రూ.230కి చేరింది. ఇక ఓ ప్రముఖ థియేటర్లో అయితే సోఫా టికెట్ ధర రూ.300, బాల్కనీ ధర రూ.200గా ఉంది. అయినా దీనిపై అధికారులు దృష్టి సారించకపోవడం గమ నార్హం. ప్రస్తుతం అన్ని సినిమాలకు ఇవే థియేటర్లు వసూలు చేస్తోన్న మొత్తంలో సాహో సినిమాకు వసూలు చేస్తో న్న మొత్తంలో కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.150కి వరకు వ్యత్యాసం ఉండటం గమనార్హం. సామాన్యులకు అందుబాటులో ఉండే సెకండ్ క్లాస్ టికెట్ ధరలను సైతం భారీగా పెంచారు. చాలా థియేటర్లలో సెకండ్ క్లాస్ కనిపించకుండా పోతోంది. ఏపీ హైకోర్టుకు వివాదం.. సాహో సినిమాకు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారని ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. సాహో సినిమా టికెట్ల రేటు పెంపునకు అనుమతించలేదు. తమకు అన్ని సినిమాలు ఒక్కటేనని, ఒక్కో సినిమాను ఒక్కోలా చూడలేమని తేల్చి చెప్పింది. కాగా, మహర్షి సినిమా విడుదల సమయంలోనూ కొన్ని థియేటర్ యాజమాన్యాలు తమకు తామే టికెట్ల రేటు పెంచాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కానీ, రెండు మూడు రోజుల అనంతరం థియేటర్ యాజమాన్యాలు టికెట్ల రేట్లు తగ్గించడంతో వివాదం సద్దుమణిగింది. -
మల్టీప్లెక్స్ థియేటర్ సీజ్
తిరువొత్తియూరు: పన్ను చెల్లించకుండా, పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడం వలన సేలంలో బుధవారం ఉదయం మల్టీ ప్లెక్సీ థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. సేలం కొత్త బస్టాండ్ సమీపంలో ఎ.ఆర్.ఆర్.ఎస్ మల్టీప్లెక్స్ ఉంది. ఈ కాంప్లెక్స్‌లో ఐదు థియేటర్లు నడుస్తున్నాయి. ఈ థియేటర్ల నిర్వాహకులు కార్పొరేషన్‌కు రూ.30 లక్షలు పన్ను బకాయిపడ్డారు. దీనిపై కార్పొరేషన్ అధికారులు పలు దఫాలుగా నోటీసులు జారీ చేశారు. అయినా కూడా పన్ను చెల్లించక పోవడంతో బుధవారం ఉదయం కార్పొరేషన్ సహాయ కమిషనర్ రాజా, సూరమంగళం మండల సహాయ కమిషనర్ సుందరరాజన్‌ల నేతృత్వంలో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి థియేటర్లకు సీలు పెట్టారు. -
సినిమా చూపిస్త మావా!
రోజువారీ సాధక బాధకాల నుంచి సగటు జీవికి ఊరటనిచ్చే ‘సినిమా’ ప్రస్తుతం ప్రియంగా మారింది. ప్రేక్షకులకు కార్పొరేట్ మల్టీఫ్లెక్స్ థియేటర్లోకి వెళ్లక ముందే యాజమాన్యాలు సినిమా చూపిస్తున్నాయి. పెద్ద హీరో సినిమాకు టికెట్లతోపాటు కాంబో ప్యాక్, ఆర్డినరీ ప్యాక్ కొనుగోలు తప్పనిసరి చేస్తున్నాయి. అప్పటికే చేతిచమురు వదిలించుకున్నప్పటికీ ఇంటర్వెల్లో అసలు సినిమా మొదలవుతోంది. కేవలం స్నాక్స్‌కే రూ.800 నుంచి రూ.1000 వెచ్చించాల్సి వస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు మామూళ్లతో సరిపెట్టుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, నెల్లూరు : పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే మాత్రం అభిమానుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. మల్టీఫ్లెక్స్ థియేటర్లలోనే అభిమాన హీరోల సినిమాల రిలీజ్ అవుతుండడంతో అక్కడికే వెళ్లి సినిమా చూడాల్సివస్తోంది. కేవలం పాప్ కార్న్, కూల్‌డ్రింక్ బాటిల్ చేతిలో పెట్టి రూ.600 వంతున వసూలు చేస్తున్నారు. థియేటర్లలో టికెట్ రూ.150 వంతున వసూలు చేస్తుండగా కాంబో పేరుతో స్నాక్స్ అంటూ మరో రూ.450 అదనంగా పెంచి టికెట్లు ఇస్తున్నారు. ఎవరు చెప్పినా.. నెల్లూరు నగరంలో 3 మల్టీఫ్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. అందులో ఒక్క మల్లీఫ్లెక్స్లో సగటున 6 స్కీన్లు ఉన్నాయి. ప్రతిచోటా స్నాక్స్ పేరుతో అడ్డుగోలు దోపిడీ చేస్తున్నారు. థియేటర్ వెలుపల కొనుగోలు చేసిన ఏ తినుబండారమూ లోనికి అనుమతించడం లేదు. థియేటర్ క్యాంటీన్లోనే కొనుగోలు చేయాలి. ఆఫ్ లీటర్ వాటర్ బాటిల్ రూ.50, చిన్న పాప్‌కార్న్‌కు రూ.170, కోల్డ్ కాఫీ రూ.150, పిజ్జా, కోక్ రూ.200, స్వీట్స్ కేక్స్ రూ.80.. ఇలా 28 రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటీ రూ.100 నుంచి రూ.300 పైనే నిర్ణయించి విక్రయాలు చేస్తున్నారు. ప్రతి స్నాక్స్‌పై జీఎస్టీ బాదుడు అదనంగా వసూలు చేస్తున్నారు. పార్కింగ్ పేరుతో దోపిడీ మల్టీఫ్లెక్స్‌లలో పార్కింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారు. పార్కింగ్ వసతి ఉన్న చోట్ల సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రుసుము వసూలు చేయకూడదు. అయినా నిర్వాహకులు యథేచ్ఛగా వాహనదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మాల్స్‌లో ద్విచక్రవాహనానికి రూ.20, కారు అయితే రూ.40 వంతున నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తూ పక్కా దోపిడీకి పాల్పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. న్యాయస్థానం తీర్పుతోనైనా.. మల్టీఫ్లెక్స్ థియేటర్ల దోపిడీపై గతంలో వినియోగదారుల న్యాయస్థానం మొట్టికాయ వేసింది. వినోదం కోసం వెళ్లి వినియోగదారుడు జేబుకు చిల్లు పెట్టుకోవాల్సిరావడంపై న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మల్టీఫ్లెక్స్ థియేటర్లో దోపిడీపై ఫోరానికి వెళ్లిన బాధితుడికి నష్టపరిహారం చెల్లించేలా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చి ఏడాది కావస్తున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. ఇకనైనా తూనికలు, కొలతల శాఖ అధికారులు న్యాయస్థానం తీర్పును అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ ఒత్తిళ్లు.. నెలవారీ మామూళ్లు మల్టీఫ్లెక్స్ థియేటర్లలో దోపిడీపై తెలంగాణ రాష్ట్రంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు కన్నెర్ర చేశారు. అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ప్రతి థియేటర్ వద్ద స్నాక్స్ ఎమ్మార్పీ ధరల పట్టిక తెలుగులో రాసిన బోర్డు పెట్టాలని, నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం మల్టీఫ్లెక్స్ థియేటర్లలోకి అధికారులు వెళ్లే సాహసం చేయడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు, నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు దోపిడీకి గురవుతున్న వినియోగదారుడికి న్యాయం చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
అంతా మా ఇష్టం!
సాక్షి, అమరావతి బ్యూరో : పాప్‌కార్న్ కంటే బిర్యానీ ధర తక్కువ.. సినిమా టికెట్ కంటే తిను బండారాల రేట్లు ఎక్కువ.. ఓ మధ్య తరగతి కుటుంబం ఒక్కసారి అడుగు పెడితే దాదాపు రూ.వెయ్యి సమర్పించుకోవాల్సిన దుస్థితి.. నగరంలోని కొన్ని మల్టీఫ్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో జరుగుతున్న అడ్డగోలు దోపిడీ ఇది. ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు గతేడాది దాడుల పేరుతో హడావుడి చేశారు.. తర్వాత ఆ విషయం వదిలేశారు. నిబంధనలు గాలికి... ప్రేక్షకులకు ప్రత్యామ్నాయం లేదు.. బయటి నుంచి నీళ్ల సీసాలను అనుమతించరు. ప్రవేశ ద్వారం వద్దే పక్కాగా తనిఖీలు చేస్తున్నారు. పోనీ.. లోపలైనా తాగునీటిని అందుబాటులో ఉంచుతున్నారా అంటే చాలా చోట్ల ఆ పరిస్థితి లేదు. దాహం వేస్తే కచ్చితంగా నీళ్ల సీసా కొనుక్కోవాల్సిందే. అదీ వాళ్లు ఎంత ధర చెబితే అంతకే. ఏఏ తినుబండారాలను విక్రయిస్తున్నారు..? ఎమ్మార్పీ (గరిష్ఠ చిల్లర ధర)ఎంత?. ఉల్లంఘనలపై ఎవరికి ఫిర్యాదు చేయాలి తదితర వివరాలతో కూడిన బోర్డులను నిబంధనల ప్రకారం కచ్చితంగా ఏర్పాటు చేయాలి. అధిక శాతం మల్టీఫ్లెక్స్‌లు, థియేటర్లలో ఇవి కనిపించవు. ఎవరికి ఫిర్యాదు చేయాలో అవగాహన లేక ప్రేక్షకులు మిన్నకుండిపోతున్నారు. హడావుడి చేసి వదిలేశారు... గతేడాది తూనికలు, కొలతల శాఖాధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన మల్టీఫ్లెక్స్‌లు, థియేటర్లపై కేసులు నమోదు చేయడంతోపాటు భారీగా జరిమానా విధించారు. తీరు మార్చుకోవాలని నిర్వాహకులను హెచ్చరించారు. విడిగా తినుబండారాలను విక్రయించరాదని.. ప్రతిదానిపై ఎమ్మార్పీ, బరువు తదితర వివరాలతో కూడిన స్టిక్కర్‌ను అతికించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. తీరా చూస్తేనేమో అంత హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత ఒక్కసారి అటువైపు చూడలేదు. అదిరే ధరలు... అది గాంధీనగర్‌లోని ఓ థియేటర్.. ఆలూ సమోసా 20 రూపాయలు.. 750 ఎంఎల్ నీళ్ల సీసా రూ.30.. శీతల పానీయాలు(చిన్నవి) ఒకటి రూ.30. బెజవాడలోని మరో థియేటర్లోనూ ఇదే తీరు. ఇక్కడ చిన్న కప్ టీ తాగాలంటే రూ.20 సమర్పించుకోవాల్సిందే. మల్టీప్లెక్స్‌ల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బెంజిసర్కిల్లోని ఓ మల్టీప్లెక్స్‌లో దోపిడీ అంతా కాదు. జంబో, స్మాల్, లార్జ్ అంటూ రకరకాల ఆఫర్ల పేర్లు చెప్పి ప్రేక్షకుల జేబులు గుల్ల చేస్తున్నారు. బయట రూ.20కి దొరికే నీళ్ల సీసా ఇక్కడ రూ.50. పాప్‌కార్న్ రూ.250. శీతల పానీయాలు (ఒక్కో గ్లాస్) రూ.80. ఆలూ సమోసా, పఫ్‌లు రూ.60.. సమీపంలోనే ఉన్న మరో మల్టీప్లెక్స్‌లోనూ ఇంచుమించు ఇవే ధరలు వసూలు చేస్తున్నారు. -
మల్టీప్లెక్స్... బాక్సాఫీస్ హిట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో మల్టీప్లెక్స్ కల్చర్ విస్తరిస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల స్థానంలో ఇవి ఎంట్రీ ఇస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున మల్టీప్లెక్సుల ఏర్పాటులో పోటీ పడుతున్నాయి. ఒ క్కో కంపెనీ ఏటా 100కుపైగా స్క్రీన్లను నెలకొల్పుతున్నాయంటే ఎంటర్టైన్మెంట్ రంగంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీలు ఒక్కో తెరకు (థియేటర్) రూ.2.5 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నాయి. డాల్బీ అట్మోస్, ఓరా వంటి ఆధునిక సౌండ్ టెక్నాలజీ, లేజర్ ప్రొజెక్టర్లతో వ్యూయర్ ఎక్స్‌పీరియెన్స్‌కు పెద్దపీట వేస్తున్నాయి. ఇదీ పరిశ్రమ.. దేశవ్యాప్తంగా 9,000 తెరలు ఉన్నాయి. ఇందులో మల్టీప్లెక్సుల్లో 3,000 స్క్రీన్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు 6,000 దాకా నెలకొన్నాయి. పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్, కార్నివాల్, మిరాజ్ ఈ రంగంలో పెద్ద బ్రాండ్లుగా అప్రతిహతంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. ఆసియాన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ వంటి ప్రాంతీయ బ్రాండ్లు 20 దాకా ఈ రంగంలో ఉన్నాయి. మల్టీప్లెక్సుల స్క్రీన్లు ఏటా 12 శాతం వృద్ధి చెందుతున్నాయి. దేశంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య తగ్గుతోంది. అదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇవి గట్టి పట్టు సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2,500 దాకా స్క్రీన్లుంటే, వీటిలో సింగిల్ స్రీన్లే అత్యధికం. సింగిల్ స్థానంలో మల్టీ.. భారత్‌లో 6,000 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. వీటి సంఖ్య క్రమంగా పడిపోతోంది. గతేడాది ఈ థియేటర్ల సంఖ్య 5 శాతం తగ్గాయి. వీటి స్థానంలో మల్టీప్లెక్సులు వస్తున్నాయి. ప్రధాన ప్రాంతాల్లో ఇవి నెలకొని ఉండడం కలిసివచ్చే అంశం. పైగా పెద్ద బ్రాండ్లు సొంతంగా పెట్టుబడి పెట్టి మల్టీప్లెక్సులను నిర్మిస్తుండడంతో స్థల/థియేటర్ యజమానులకు ఎటువంటి భారం ఉండడం లేదు. పైపెచ్చు గతంలో కంటే ఏటా అదనంగా నిర్దిష్ట ఆదాయం వస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సీట్ల సామర్థ్యం 500 నుంచి 600 దాకా ఉంది. అదే మల్టీప్లెక్సు అయితే ఒక్కో స్క్రీన్ 250 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటున్నాయి. ఏటా 12 శాతం వృద్ధి.. టికెట్ల విక్రయం, ప్రకటనలు, ఫుడ్ విక్రయాల ద్వారా పరిశ్రమ ఏటా రూ.17,500 కోట్లు ఆర్జిస్తోంది. వృద్ధి రేటు 10–12 శాతం ఉంటోంది. ఈ ఆదాయంలో 60 శాతం వాటా మల్టీప్లెక్సులు కైవసం చేసుకుంటున్నాయి. మొత్తం ఆదాయంలో తెలుగు సినిమాల ద్వారా 20 శాతం, తమిళం 15, మలయాళం 5, కన్నడ 5 శాతం నమోదు అవుతోంది. పెద్ద బ్రాండ్ల మార్జిన్లు 22 శాతం వరకు ఉంటోందని సమాచారం. పరిశ్రమలో 50,000 మంది పైచిలుకు పనిచేస్తున్నారు. సగటున 2,000 సినిమాలు.. భారత్‌లో ఏటా 2,000 సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. ఇందులో 1,600 దేశీయంగా నిర్మించినవి కాగా మిగిలినవి విదేశాలకు చెందినవి. సినిమాల నిర్మాణం పరంగా ప్రపంచంలో భారత్ తొలి స్థానంలో ఉంటుంది. మొత్తం సినిమాల్లో 700 దాకా హిందీ సినిమాలు, 300–350 తెలుగు సినిమాలు ఉంటాయి. టికెట్ ధర ఎంతైనా సరే.. అల్ట్రా ప్రీమియం స్క్రీన్స్‌లో టికెట్ ధర ఊహించనంత ఉంటోంది. ఢిల్లీలో అయితే ఏకంగా రూ.3,000 వరకు ఉందని మిరాజ్ ఎంటర్టైన్మెంట్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ భువనేష్ మెందిరట్ట సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. సినిమా అనుభూతి కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావాల్సిందేనని చెప్పారు. ఇందుకు ఖర్చుకు వెనుకాడడం లేదన్నారు. ‘ఒక ఏడాదిలో థియేటర్ల ఆక్యుపెన్సీ (సీట్లు నిండడం) దేశ సగటు 30 శాతం ఉంది. దక్షిణాదిన ఇది అత్యధికగా 50 శాతం నమోదు చేస్తోంది. మల్టీప్లెక్స్ కల్చర్ ప్రధానంగా దక్షిణాదినే కేంద్రీకృతమైంది’ అని వివరించారు. 5 -
సినిమా టి‘కేటుగాళ్ల’పై నజర్
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను ఆసరాగా చేసుకుని సినిమా టికెట్ల పేరుతో ప్రేక్షకుల నుంచి ఎక్కువ ధరలను వసూలు చేస్తున్న థియేటర్ యాజమాన్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. వాస్తవానికి రూ.100 కన్నా ఎక్కువ ఉన్న సినిమా టికెట్లపై మొదట్లో 28 శాతం జీఎస్టీ విధించారు. కానీ, గత కౌన్సిల్ సమావేశంలో ఈ మొత్తాన్ని 18 శాతానికి తగ్గించి ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చారు. అయితే, కొన్ని థియేటర్ల యాజమాన్యాలు టికెట్లపై 28 శాతం జీఎస్టీ అని ముద్రించి ప్రేక్షకుల నుంచి వసూలు చేసిన తర్వాత ప్రభుత్వానికి మాత్రం 18 శాతమే చెల్లిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు హైదరాబాద్‌లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొన్ని థియేటర్లు తగ్గించిన జీఎస్టీని వసూలు చేస్తుండగా, మరికొన్ని పాత జీఎస్టీ ప్రకారమే వసూలు చేస్తున్నాయని తేలింది. దీంతో ఎక్కువ మొత్తంలో జీఎస్టీని వసూలు చేస్తున్న థియేటర్ యాజమాన్యాలపై సాక్ష్యాలతో కేసు నమోదు చేసిన అధికారులు విచారించే ప్రక్రియను యాంటీ ప్రాఫిటరింగ్ విభాగానికి బదిలీ చేశారు. ఈ మేరకు ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్‌పై విచారణ జరిపేందుకు గాను హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆదేశాలిచ్చారు. దీంతో పాటు నగరంలోని పలు థియేటర్లను తనిఖీలు చేసి సినిమా టికెట్ల రూపంలో ఎక్కువ మొత్తాలను వసూలు చేస్తున్న థియేటర్ల యాజమాన్యాలపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పుడు 12 శాతమే.. సినిమా టికెట్లపై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గిందని, తాజా బడ్జెట్లో ఆ వ్యత్యాసాన్ని కూడా తీసేసి ధరతో సంబంధం లేకుండా ప్రతి సినిమా టికెట్‌పై కేవలం 12 శాతమే జీఎస్టీ ఉంటుందని ప్రకటించారు. దీంతో ఇక నుంచి సినిమా టికెట్లపై 12 శాతం జీఎస్టీ మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని జీఎస్టీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రతిపాదిత జీఎస్టీ కన్నా ఎక్కువ వసూలు చేసే థియేటర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని, దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తామని జీఎస్టీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇందుకోసం యాంటీ ప్రాఫిటరింగ్ విభాగాన్ని రంగంలోకి దించుతామని, ఉల్లంఘనలకుపాల్పడి ప్రజల సొమ్మును దోచుకుని ప్రభుత్వానికి పన్ను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. -
హైదరాబాద్‌లో ‘ఆలంబాగ్’!
ఆధునిక బస్స్టేషన్ల నిర్మాణానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.హైదరాబాద్ నగర అందాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా వీటిని నిర్మించడంతో పాటు, అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తారు. ఏసీ సదుపాయం , ఫుడ్‌ప్లాజాలు, షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు, బ్యాంకులు, తదితర అన్ని వాణిజ్య కార్యకలాపాలకు, వినోదాలకు కేంద్రంగా సిటీబస్స్టేషన్ల ఏర్పాటుకు గ్రేటర్ ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. నగర వాసులను, పర్యాటకులు సైతం వీటిని సందర్శించేవిధంగా నిర్మించనున్నారు.యూపీ రాజధాని లక్నోలోని ఆలంబాగ్‌లో కట్టించిన హైటెక్ బస్‌స్టేషన్ తరహాలో నగరంలోని గౌలిగూడ, జూబ్లీబస్‌స్టేషన్, తదితర ప్రాంతాల్లో నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఇందుకోసం ఆర్టీసీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తంతో పాటు మరి కొందరు సీనియర్ అధికారులతో కూడిన బృందం ఫిబ్రవరి ఒకటో తేదీన లక్నోకు వెళ్లనుంది. యూపీలోని పలు నగరాల్లో ఉత్తరప్రదేశ్ ఆర్టీసీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో కట్టించిన బస్స్టేషన్లను కూడా అధికారులు పరిశీలించనున్నారు. ఈ బస్స్టేషన్లలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల ద్వారా ఏటా రూ.100 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. – సాక్షి, హైదరాబాద్ ఆలంబాగ్ ప్రత్యేకతలు.. - మొత్తం 26,500 చదరపు గజాల విస్తీర్ణంలో అక్కడి అందాలను రెట్టింపుచేసే విధంగా నిర్మించారు. - రోజుకు 80 వేలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగేలా ఏర్పాట్లు . 50 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. - షాలీమార్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సుమారు రూ.200 కోట్లతో నిర్మించింది. ఇది ఒక అత్యాధునిక టౌన్షిప్పులా ఉంటుంది. - డిజైన్,బిల్డ్, ఫైనాన్స్,ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో దీన్ని కట్టించారు. 35 ఏళ్ల పాటు దీనిని లీజుకు ఇచ్చారు. - ఇలాంటివే లక్నో, ఆగ్రా, అలహాబాద్, మీరట్, ఘజియాబాద్, కాన్పూర్లలో 21 బస్స్టేషన్లను యూపీఎస్ ఆర్టీసీ నిర్మిస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణం.. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని బస్స్టేషన్లలో స్టాల్స్, ఇతర వ్యాపార కేంద్రాల నుంచి ఆర్టీసీకి ఏటా రూ.86 కోట్ల ఆదాయం లభిస్తోంది.ఈ ఏడాది రూ.103 కోట్లకు పెంచేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. మరోవైపు పెట్రోల్ బంకుల ద్వారా మరో రూ.25 కోట్లను ఆర్జించేందుకు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో 113 చోట్ల బంకుల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టారు. వీటిలో 9 బంకులు ఆచరణలోకి వచ్చాయి. మరో 5 చోట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇక ఆధునిక బస్స్టేషన్ల ఏర్పాటు ద్వారా రానున్న రెండేళ్లలో మొత్తంగా వాణిజ్య ఆదాయాన్ని రూ.300 కోట్లకు పెంచుకోవాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఇందులో తొలి విడతగా గౌలిగూడలోని 4.5 ఎకరాలు, జూబ్లీబస్‌స్టేషన్‌కు ఆనుకొని ఉన్న 3.5 ఎకరాల స్థలాల్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్లో అత్యా ధునిక బస్స్టేషన్లు నిర్మించనున్నారు. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్‌కు, మహాత్మాగాంధీ మెట్రో స్టేషన్‌కు ఆనుకొని ఉండే ఈ స్థలాల్లో బస్స్టేషన్లను ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ–మెట్రో కనెక్టివిటీ పెరగడంతో పాటు, రెండు చోట్లా మల్టీప్లెక్స్ థియేటర్లు, మాల్స్, ఫుడ్‌ప్లాజాలు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఈ బస్స్టేషన్లు భాగ్యనగర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్మించి 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల పాటు ప్రైవేట్ వ్యాపారులకు లీజుకు ఇస్తారు. అనంతరం చిలకలగూడ, మెట్టుగూడ,కాచిగూడ, ఆర్టీసీ పాత ఎండీ కార్యాలయ స్థలాల్లోనూ పీపీపీ తరహాలో వాణిజ్య భవన సముదాయాలను నిర్మించే ప్రణాళికలో అధికారులు ఉన్నారు. -
పీవీఆర్ రూ.750 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ థియేటర్ చెయిన్‌ను నిర్వహిస్తున్న పీవీఆర్ సంస్థ రూ.750 కోట్లు సమీకరించనుంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు (క్యూఐబీ) షేర్లు జారీ చేయటం ద్వారా ఈ నిధులు సమీకరించనున్నామని పీవీఆర్ తెలిపింది. ఈ మేరకు తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని, ఈ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరుతున్నామని వివరించింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 29 మధ్యలో వాటాదారులు ఈ ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని, ఓటింగ్ ఫలితాలను వచ్చే నెల 30న వెల్లడిస్తామని తెలియజేసింది. ఈ నిధులను పెట్టుబడుల అవసరాలకు, ఇతర కంపెనీల కొనుగోళ్లకు, రుణ భారం తగ్గించుకోవడానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఇతర సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తామని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టులో దక్షిణ భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎస్పీఐ సినిమాస్‌లో 71.69 శాతం వాటాను పీవీఆర్ రూ.633 కోట్లకు కొనుగోలు చేసింది. 2016లో రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నుంచి డీటీ సినిమాస్‌ను రూ.433 కోట్లకు చేజిక్కించుకుంది. రూ.750 కోట్ల నిధుల సమీకరణ నేపథ్యంలో బీఎస్ఈలో పీవీఆర్ షేర్ 0.5 శాతం లాభంతో రూ.1,585 వద్ద ముగిసింది. -
జేయల్‌ఈ ప్రత్యేకత అదే
సినిమా మారుతోంది. మూకీ సినిమా నుండి టాకీ సినిమా వచ్చాక ఒక్కో దశాబ్దంలో ఒక్కో విధంగా సినిమా మారుతూనే ఉంది. టూరింగ్ టాకీస్‌లో కదిలే బొమ్మని చూసి ప్రేక్షకులు ఆనందించారు. టూరింగ్ టాకీస్ నుంచి థియేటర్‌కి వచ్చింది సినిమా. సింగిల్ థియేటర్ నుంచి ఒకే కాంపౌండ్‌లో మల్టీ థియేటర్స్ వచ్చాయి. హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్ నిర్మాణం ఓ అద్భుతంలా చూశాం మనమందరం. ప్రసాద్ మల్టీప్లెక్స్ తర్వాత హైదరాబాద్‌లో బోల్డన్ని మల్టీప్లెక్స్‌లు వెలిశాయి. తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు, ఏషియన్ సినిమాస్ కలిసి ఏర్పాటు చేసిన ‘ఏఎమ్బి సినిమాస్’ నేడు ఆరంభం కానుంది. అలాగే జిల్లాల్లోని ముఖ్య నగరాలన్నింటిలో ఇప్పుడు రకరకాల మల్టీప్లెక్స్‌లు వస్తున్నాయి. ఇప్పుడు అదే కోవలోకి వస్తోంది గుంటూరులోని జేయల్‌ఈ సినిమాస్. గ్రౌండ్ లెవల్ పార్కింగ్తో పాటు సినిమా స్క్రీన్లన్నీ కూడా కిందనే ఉండటం జేయల్‌ఈ సినిమాస్ స్పెషల్.. విశాలమైన 4 ఎకరాల్లో దాదాపు 40000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు స్క్రీన్లతో పాటు, పిల్లల కోసం అతి పెద్ద గేమింగ్ జోన్‌ను ఏర్పాటు చేశారు జేయల్‌ఈ సినిమాస్ అధినేత రాము పొలిశెట్టి. ఈ రోజుతో రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపకల్పన అయిన ఈ థియేటర్లో అన్ని స్క్రీన్లు యస్‌యమ్‌పీటీఈ అండ్ టీహెచ్ఎక్స్ స్టాండర్డ్‌లో ఉంటాయి. ఇక్కడ అన్ని స్క్రీన్లలో 4కే ప్రొజెక్షన్‌తో పాటు, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఈ థియేటర్స్‌లో ఓన్లీ శాకాహారం మాత్రమే అందించడం ఓ విశేషం అని రాము తెలిపారు. జేయల్‌ఈ సినిమాస్ ఇచ్చిన తృప్తితో త్వరలోనే విశాఖపట్నం, విజయవాడలో బ్రాంచీలను విస్తరించనున్నామని కూడా అన్నారు.