ఒకప్పుడు ‘నేడే చూడండి... మీ అభిమాన హీరో సినిమా’ అంటూ రిక్షాల్లో తిరుగుతూ మైకుల్లో చెప్పేవారు. రిక్షా వెనకాల పిల్లలు పరిగెత్తుతూ సందడి సందడి చేసేవారు. ఇప్పుడు టీవీ, రేడియా, సోషల్ మీడియా ఇలా సినిమా ప్రమోషన్‌కి చాలా ఉన్నాయి. థియేటర్ ముందు అయితే భారీ కటౌట్లు, గజమాలలు, పాలాభిషేకాలతో ఫ్యాన్స్ సందడి సందడి చేస్తుంటారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో థియేటర్ల ముందు సందడి లేదు. వెండితెర వెలవెలబోతోంది. ‘స్క్రీన్ ఉంది.. సీన్ లేదు’. ‘‘సినిమా చరిత్రలో ఇలా పదీ పదిహేను రోజులు ‘థియేటర్లు బంద్’ కావడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్ అని’’ నైజాం ప్రముఖ పంపిణీదారుడు చారి పేర్కొన్నారు. దాదాపు పది రోజులు థియేటర్లు మూసివేయడం ద్వారా ‘సింగిల్ థియేటర్’కి ఏర్పడే నష్టం ఐదారు లక్షలు ఉంటుందని, మల్టీప్లెక్స్‌కి ఇంకా ఎక్కువ ఉంటుందని ఓ పంపిణీదారుడు తెలిపారు. అయితే సినిమా ఆడినప్పుడు సింగిల్ థియేటర్‌తో పోల్చితే మల్టీప్లెక్స్‌కి రాబడి ఎక్కువ ఉంటుందని మరో పంపిణీదారుడు అన్నారు. థియేటర్ల నిర్వహణ గురించి కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన సమాచారంలోకి వెళదాం...
► ఈ మధ్య ‘సింగిల్ థియేటర్’కి అన్నీ నష్టాలే. ఎందుకంటే సినిమా రిలీజులు పెద్దగా లేవు. చిన్న సినిమాలు మంచి టాక్ తెచ్చుకుని ఓ మూడు నాలుగు వారాలు ఆడితే అప్పుడు లాభాలు చూడొచ్చు. ఇక పెద్ద హీరోల సినిమాలను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తారు. దాంతో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ మంచి వసూళ్లతో థియేటర్ నడుస్తుంది. థర్డ్ వీక్ నుంచి వసూళ్లు పడిపోతుంటాయి.
► మల్టీప్లెక్స్‌లో అయితే ఉన్న మూడు నాలుగు స్క్రీన్స్‌లోనూ పెద్ద సినిమాని ప్రదర్శిస్తారు. వాళ్లకు పర్సంటేజ్ సిస్టమ్ ఉంటుంది. మొదటి వారం వచ్చే వసూళ్లలో డిస్ట్రిబ్యూటర్ 55 శాతం, ఎగ్జిబిటర్ 45 శాతం తీసుకుం టారు. రెండో వారానికి రివర్శ్. 55 ఎగ్జిబిటర్ (సినిమా ప్రదర్శించేవాళ్లు), 45 శాతం డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు. అలా చివర్లో డిస్ట్రిబ్యూర్ 30, ఎగ్జిబిటర్ 70 శాతం తీసుకుంటారు.
► సింగిల్ థియేటర్ అయితే సినిమాని పర్సంటేజ్ పద్ధతిలో కాకుండా రెంటల్ సిస్టమ్‌కి ఇస్తారు. ఏరియాని బట్టి వారానికి నాలుగు లక్షలు రెంట్ ఉంటుంది. ఒకవేళ వసూళ్లు నామమాత్రంగా ఉంటే అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు రెంటల్ విధానంలో కాకుండా పర్సంటేజ్ విధానంలో ఎగ్జిబిటర్ నుంచి డబ్బు తీసుకుంటారు. అది ఎప్పుడూ అంటే ఒక షోకి 50 వేలు వసూలు అయితే.. వారానికి సుమారు 10 లక్షలు కలెక్ట్ అవుతాయి. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ 2 లక్షలు రెంట్ ఇచ్చేసి, మిగతా 8 లక్షలు తీసుకుంటారు. అదే వారం మొత్తం 2 లక్షలే వస్తే... ఎగ్జిబిటర్‌కి మొత్తం 2 లక్షలు రెంట్ ఇవ్వకుండా వచ్చిన వసూళ్లలో సగం తీసుకుంటారట పంపిణీదారుడు. అదే మల్టీప్లెక్స్ అయితే పర్సంటేజ్ సిస్టమే.
► అసలు ఒక థియేటర్ నెల మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? అంటే.. బాగా నీట్‌గా మెయింటైన్ చేసే సింగిల్ థియేటర్‌కి ఐదున్నర నుంచి ఆరు లక్షలవుతుందట. ప్రొజెక్టర్ ఖర్చు, ప్రొజెక్టర్ బల్బ్, టాయ్‌లెట్, ఫ్లోర్ క్లీనింగ్, సీట్స్, కరెంట్ బిల్... ఇలాంటివన్నీ ఈ ఆరు లక్షల్లో ఉంటాయి. ప్రొజెక్టర్ నెల రెంట్ 30 వేలు అయితే, బల్బ్ దర 90 వేల నుంచి లక్ష వరకూ ఉంటుంది. రెండు మూడు నెలలకోసారి కొత్త బల్బ్ మార్చాల్సి ఉంటుంది. ఇది సింగిల్ థియేటర్ ఖర్చు. మల్టీప్లెక్స్‌కి వేరే విధంగా ఉంటుంది. అయితే సింగిల్ థియేటర్‌లో మూడు టికెట్ కౌంటర్లు ఉంటే.. మల్టీప్లెక్స్‌లోనూ దాదాపు అన్నే ఉంటాయని ఓ ఎగ్జిబిటర్ అన్నారు. కాకపోతే మల్టీప్లెక్స్‌లో స్టాఫ్ తక్కువ.. స్క్రీన్లు ఎక్కువ ఉంటాయి. అలాగే సింగిల్ థియేటర్‌లో సినిమా బాగా ఆడకపోతే క్యాంటీన్ రెవెన్యూ కూడా తగ్గుతుంది. కానీ మల్టీప్లెక్స్‌లో వేరే వేరే సినిమాలు స్క్రీనింగ్ చేసుకోవచ్చు కాబట్టి క్యాంటీన్ రన్ బాగానే ఉంటుంది. బాగున్న సినిమాని రెండు మూడు స్క్రీన్స్‌లో ప్రదర్శించే వీలు మల్టీప్లెక్స్‌కి ఉంటుంది. అయితే మల్టీప్లెక్స్‌వాళ్లకు ఉండే కష్టాలు వాళ్లకూ ఉంటాయి కానీ సింగిల్ థియేటర్స్‌కే నష్టం ఎక్కువ అని లెక్కలు చెబుతున్నారు కొందరు ఎగ్జిబిటర్లు.
► మరి ఈ పరిస్థితిలో థియేటర్‌ని ఎందుకు కంటిన్యూ చేయడం అంటే.. ఎప్పుడో థియేటర్స్ కట్టి ఉన్నాయి. వాటిని ఏం చేయాలన్నా కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఉమ్మడి ప్రాపర్టీ అయితే పెట్టుబడి ఎవరు పెట్టాలి? అనే విషయంలో వివాదం వచ్చే అవకాశం ఉంది. ఇక పిల్లలు విదేశాల్లో సెటిల్ అయితే ఇక్కడున్న ప్రాపర్టీ మీద పెద్దగా దృష్టి పెట్టరు. అందుకని ఎలాగూ ఉన్నాయి కదా అని థియేటర్స్‌ని నడుపుతున్న ఎగ్జిబిటర్లే ఎక్కువ శాతం ఉన్నారని చారి పేర్కొన్నారు.
► ఇంతకీ పది రోజులు థియేటర్లు మూసేస్తే వచ్చే నష్టం ఎంతా అంటే ‘మినిమమ్ ఐదారు లక్షలు’ అంటున్నారు. ఏరియాని బట్టి ఈ లెక్కలో హెచ్చు తగ్గులుంటాయి. పైగా మార్కెట్లో దొరికే వస్తువులు ఇవాళ కాకపోతే రేపు అమ్ముడవుతాయి. కానీ ఆ రోజు సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోతే ఆ మర్నాడు వస్తారన్న గ్యారంటీ లేదు. ఓ వారం తర్వాత ఆ సినిమా థియేటర్లో ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. గత శుక్రవారం అర్జున, ప్రేమ పిపాసి’, 302, యురేక, మేద వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఆ మర్నాటి నుంచే థియేటర్ల మూతను ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోయే అవకాశం ఉంది. అయితే బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే... కరోనా కారణంగా ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రావడంలేదు. అందుకని ఇప్పుడు థియేటర్లు మూసినా పెద్దగా నష్టం వాటిల్లదనే చెబుతున్నారు. దానికి ఓ ఉదాహరణ చెప్పాలంటే... ఓ మల్టీప్లెక్స్ థియేటర్‌లో 3600 టికెట్లు బుక్ అయితే.. 600 మంది ప్రేక్షకులు అసలు థియేటర్‌కి రాలేదట. బుక్ చేసుకుని మరీ రాలేదంటే కరోనా ఎంత భయపెడుతోందో ఊహించుకోవచ్చు.
షూటింగ్ బంద్ కరో
కరోనా వైరస్ ప్రభావం అన్ని రాష్ట్రాల చిత్ర పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాల చిత్రీకరణలను నిలిపివేస్తున్నట్లు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నటీనటుల సంఘం, నిర్మాతల మండలి సంయుక్తంగా ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణదాస్ నారంగ్ మాట్లాడుతూ – ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో షూటింగ్స్‌ను నిలిపి వేయాలని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’’ అన్నారు.
‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లు సంయుక్తంగా చిత్రీకరణలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొందరు నిర్మాతలకు ఇబ్బందిగా ఉన్నా సరే మా ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. కరోనా కారణంగా తెలంగాణలో ఎక్కడా షూటింగ్స్ జరగవు’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్.
‘‘కరోనా వైరస్ చాలా భయంకరమైనది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్, మాల్స్ బంద్ ప్రకటించడం జరిగింది. అదే విధంగా షూటింగ్ నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది’’ అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ.
‘‘తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా తీసుకున్న నిర్ణయం ఇది. థియేటర్స్ బంద్‌తోపాటు షూటింగ్స్ కూడా నిలిపివేయాలనేది అందరూ మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చిత్రీకరణలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. అభ్యంతరం లేని ఆంధ్రా ప్రాంతాల్లో షూటింగ్స్ జరుగుతున్నాయి’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కల్యాణ్.
‘‘షూటింగ్స్‌లో వందలమంది పాల్గొంటుంటారు. వారి ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాజిక బాధ్యతతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అందరం దీన్ని సమర్థిస్తున్నాం’’ అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ జీవితా రాజశేఖర్.
‘‘ప్రభుత్వం మళ్లీ షూటింగ్స్ జరుపుకోవచ్చని తెలియజేసినప్పుడు చిత్రీకరణలు పునరావృతం అవుతాయి. ఈ నిర్ణయాన్ని నిర్మాతలందరూ స్వాగతించాలి’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్. ఈ సమావేశంలో నిర్మాతలు శ్యామ్ ప్రసాద్, ఠాగూర్ మధు, నట్టికుమార్, రామసత్యానారాయణ, సురేందర్‌రెడ్డి, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు సినిమాలు, టీవీ సీరియల్స్, వెబ్‌సిరీస్‌ల షూటింగ్స్ కూడా ఈ నెల 19 నుంచి 31 వరకు జరగకూడదని ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎమ్‌పీఆర్‌ఏ) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తిరిగి షూటింగ్స్‌ను ఎప్పుడు ప్రారంభించాలనే విషయాలను అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 30న ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఐఎమ్‌పీఆర్‌ఏ పేర్కొంది.
సి. కల్యాణ్, ప్రసన్నకుమార్, జీవిత, వెంకటేష్, నారాయణదాస్, బెనర్జీ, దామోదర ప్రసాద్, మధు
స్క్రీన్ ఉంది.. సీన్ లేదు
Published Mon, Mar 16 2020 12:52 AM | Last Updated on Mon, Mar 16 2020 6:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment