distributors
-
కొలిక్కివస్తున్న పోలవరం డిస్ట్రిబ్యూటరీల వ్యయ ఆమోదం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు బ్రాంచ్ కాలువలు, పిల్ల కాలువల (డిస్ట్రిబ్యూటరీలు) తవ్వడానికి రూ.5,338.9 కోట్లు వ్యయం అవుతుందని జలవనరుల శాఖ అధికారవర్గాలు తేల్చాయి. జలాశయం పనులు పూర్తయ్యేలోగా కాలువలతోపాటు స్ట్రిబ్యూటరీలను కూడా పూర్తి చేసి సత్వరమే ఆయకట్టుకు నీళ్లందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీని ప్రకారం కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు స్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.2,248.89 కోట్లు, ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు స్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.3,090.01 కోట్లు ఖర్చవుతుందని లెక్క కట్టారు. ఆ మేరకు నిధులు కోరుతూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర జల్ శక్తి శాఖకు 8 నెలల క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిపై సీడబ్ల్యూసీ అధికారులు పలు మార్లు లేవనెత్తిన సందేహాలను రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు నివృత్తి చేశారు. దీంతో స్ట్రిబ్యూటరీల అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. ఆ ప్రక్రియను పూర్తి చేసి, స్ట్రిబ్యూటరీలకు భూసేకరణ చేసి, పనులకు టెండర్లు పిలవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోగా స్ట్రిబ్యూటరీలను పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే జలాశయం పనులు కొలిక్కి.. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయకుండానే అప్పటి చంద్రబాబు సర్కారు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ద్వారా చేసిన చారిత్రక తప్పిదం పోలవరం ప్రాజెక్టులో విధ్వంసానికి కారణమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబు సర్కారు చేసిన తప్పులను సరిదిద్దుతూ.. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున మళ్లించింది. కుడి కాలువలో మిగిలిన పనులతో పాటు ఎడమ కాలువలలో కీలకమైన నిర్మాణాలు, జలాశయంతో కాలువల అనుసంధానం పనులు పూర్తి చేసింది. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చితే శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి కేంద్రాన్ని కోరుతూ వచ్చింది. అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుని డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేలి్చ, ప్రాజెక్టును పూర్తి చేసే విధానాన్ని ఖరారు చేస్తామని అప్పట్లో కేంద్రం చెప్పింది. ఇటీవల పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం.. డయాఫ్రం వాల్ దెబ్బతిందని, సమాంతరంగా కొత్తది నిర్మించాలని చెప్పింది. ఇప్పటికే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తయిన నేపథ్యంలో వరదల్లోనూ డయాఫ్రం వాల్ పనులు చేపట్టి, ఈసీఆర్ఎఫ్ డ్యాంను పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.» పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు» కుడి కాలువ పొడవు 178.812 కిలోమీటర్లు.. » ఎడమ కాలువ పొడవు 212.32 కిలోమీటర్లు.. » పూర్తయిన కుడికాలువ పనులు » 100 శాతం ప్రాజెక్టు ద్వారా వినియోగించుకొనే జలాలు 322 టీఎంసీలు » ప్రవాహ సామర్థ్యం 17,560 క్యూసెక్కులు » పూర్తయిన ఎడమ కాలువ పనులు 73.07 శాతం -
సినిమా విడుదల పేరుతో మోసం చేశారు, కత్తితో బెదిరించారు: నిర్మాత ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఏఎన్నార్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా ప్రతిబింబాలు పేరుతో తాను నిర్మించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ రూ.13 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ సినీ నిర్మాత జె.రాధాకృష్ణమూర్తి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 9వ తేదీన ఈ విషయం చర్చించేందుకు తాను రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణలకు ఫోన్ చేయగా వారు అందుబాటులోకి రాలేదన్నారు. వారి డ్రైవర్ బాలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని తనను దుర్భాషలాడారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల విషయంలో, తన వద్ద తీసుకున్న డబ్బుల విషయంలో ప్రశ్నించినందుకు తనను బెదిరించారని, కత్తి తీసుకొని పొడిచేందుకు ప్రయత్నించారని వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కుర్చీలో నుంచి కిందపడేసి గాయపరిచారన్నారు. బలవంతంగా తన ఆఫీస్‌లోని పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు తీసుకొని వెళ్లారని వాటిని తిరిగి ఇవ్వలేదని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సినీ నిర్మాత జె.రాధాకృష్ణ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు డిస్ట్రిబ్యూటర్లు రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ, డ్రైవర్ బాలుపై ఐపీసీ సెక్షన్ 448, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాళ్లని తప్పా నేను ఎవరిని మోసం చేయలేదు : పూరి జగన్నాథ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. లైగర్ ఫ్లాప్ కావడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు డబ్బు వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్ చేయడమే కాకుండా, పూరిని బెదిరిస్తూ ధర్నాకు దిగేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో పూరి తమ ఫ్యామిలీకి ముప్పు ఉందని రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరిణామాలపై పూరి జగన్నాథ్ మీడియాకు లేఖను విడుదల చేశారు. 'నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే.. అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియన్స్‌ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా.వాళ్ళని ఎంటర్ టైన్ చేస్తా' అంటూ సుధీర్ఘ నోట్లో రాసుకొచ్చారు. పూరి లేఖ పూర్తి సారాంశం.. ”సక్సెస్.. ఫెయిల్యూర్.. ఈ రెండూ అపోజిట్ అనుకుంటాం. కానీ కాదు. ఈ రెండూ ఫ్లోలో ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి. గుండెల నిండా ఊపిరి పిలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి ? ఊపిరి వొదిలెయ్యటమే. పడతాం, లేస్తాం. ఏడుస్తాం, నవ్వుతాం. ఎన్నో రోజులు ఏడ్చినాక తర్వాత జరిగేది ఏంటి ? పగలబడి నవ్వటమే.. ఇక్కడ ఏదీ పర్మినెంట్ కాదు .. లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక ఎక్స్పీరియన్స్ లా చూడాలి తప్ప, ఫెయిల్యూర్ సక్సెస్ లా చూడకూడదు. నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, వడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, వూరి వేలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో లైఫ్ లో జరుగుతుంటాయి. అవన్నీ సీన్లే. అందుకే లైఫ్ ని సినిమా లా చూస్తే, షో అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్ కి తీసుకుంటే మెంటల్ వస్తాది. సక్సెస్ ఐతే డబ్బులొస్తాయి. ఫెయిల్ ఐతే బోలెడు జ్ఞానం వస్తాది. సో ఎప్పుడూ మనం మెంటల్లీ, ఫైనాన్షియల్లీ పెరుగుతూనే ఉంటాం తప్ప, ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదిలేదు. అందుకే దేన్నీ ఫెయిల్యూర్ గా చూడొద్దు. ఇక బ్యాడ్ జరిగితే మన చుట్టూ ఉన్న బ్యాడ్ పీపుల్ మాయమైపోతారు .. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది. మంచిదే కదా ? కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదోకటి చెయ్యాలి .. అది రిస్క్ అవ్వాలి. జీవితంలో రిస్క్ చెయ్యకపోతే అది లైఫే కాదు. ఏ రిస్క్ చెయ్యకపోతే అది ఇంకా రిస్క్. జీవితంలో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు, బొక్కలో వేస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు, అందరూ చప్పట్లు కొడతారు, అక్షింతలు వేస్తారు. సో ఇవన్నీ మీ జీవితంలో జరగకపోతే, జరిగేలా చూడండి. లేకపోతె మీరు హీరో కాదేమో అనుకొనే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరోలా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నేను నిజాయతి పరుడుని అని చెప్పుకొనవసరంలేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకులని ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. నిజానికి నేను ప్రేక్షకుల పట్ల బాధ్యత వహిస్తాను. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా . వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా. డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన, ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే .. మధ్యలో జరిగేది అంతా డ్రామా”.. – మీ పూరి జగన్నాధ్ -
పూరీ జగన్నాథ్ ఇంటికి పోలీసుల భద్రత.. కోర్టుకు వెళ్లనున్న డిస్ట్రిబ్యూటర్లు!
లైగర్ మూవీ ఫ్లాప్‌తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చిక్కుల్లో పడ్డారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందింది. దీంతో ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన పూరీ ఆర్థికంగా భారీగా నష్టపోయారు. మరోవైపు లైగర్ వల్ల తాము ఆర్థికంగా నష్టపోయామని, పెట్టన డబ్బులో కోంతభాగం వెనక్కి ఇవ్వాలంటూ పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పూరీని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పూరీ సమయంలో కోరడంతో వారు బెదిరింపులకు పాల్పడుతున్నారు. చదవండి: నిజమే పూరీ పెద్ద మోసగాడు.. పరువు తీసేద్దాం పదండి!: లేఖ వైరల్ దీంతో బుధవారం పూరీ పోలీసులను ఆశ్రయించారు. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్ల ద్వారా తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు వారినుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డిస్ట్రిబ్యూటర్లు తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందని, ముందస్తు భద్రత కల్పించాలని ఆయన ఫిర్యాదు కోరారు. ఈ మేరకు పోలీసులు పూరీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. గురువారం ఆయన ఇంటి వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. చదవండి: పెద్దింటి కోడలు కాబోతున్న యంగ్ హీరోయిన్ వర్ష! కాగా గత ఆగస్ట్ 25న భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ మూవీ ఘోర పరాజయం పొందింది. నైజాం డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ వరంగల్ శీను, శోభన్ బాబులు నష్టపోయిన డబ్బులు తిరిగి చెల్లించాలని పూరీపై ఒత్తిడి పెంచారు. సుమారు రూ.8 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, వాటిని తిరిగి ఇప్పించాలంటూ పూరీకి లేఖలు రాశారు. ఈ విషయమై పూరీ మాట్లాడిన ఓ ఆడియో ఫైల్ రెండు రోజుల క్రితం వైరల్ అయింది. ఈ నెల 27న వారంతా తన ఇంటి ముందు ధర్నా చేయబోతున్నారని, తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారంటూ పూరీ వాపోయారు. అయితే ఈ విషయమైన డిస్ట్రిబ్యూటర్లు కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆర్ఆర్ఆర్ మేనియా.. ఒక్క టికెట్ రూ. 3వేలా?
'రౌద్రం రణం రుధిరం'.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియా కనిపిస్తుంది. సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు మార్చి25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి తర్వాత రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్ కావడం, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. 2018 నవంబర్ 11న ప్రారంభమైన ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సుమారు నాలుగేళ్ల కష్టం అనంతరం ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమా గురించే కాకుండా ఆర్ఆర్ఆర్ టికెట్ రేటు కూడా మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో సుమారు అన్ని థియేటర్లలో టికెట్లను డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్ చేశారని సినీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మల్టీఫ్లెక్సుల్లోనూ టికెట్స్ బ్లాక్ చేయడంతో కొనుగోలు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. గత వారం రోజులుగా ట్రై చేస్తున్నా టికెట్స్ అందుబాటులో లేవని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్‌లో ఒక్కో టికెట్‌ను రూ. 3వేలకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. -
పేస్ట్, సబ్బు, ఫేస్పౌడర్లు బంద్.. మరో నాలుగు రాష్ట్రాలకు!
ఎఫ్ఎంసీజీ (Fast-moving consumer goods) ఉత్పత్తులపై మార్జిన్ విషయమై పంపిణీదారుల్లో అసంతృప్తి పెల్లుబికుతోంది. రిటైల్ ధరలకు, బీ2బీ కంపెనీలకు వేర్వేరు రేట్లపై నిరసన.. క్రమక్రమంగా దేశం మొత్తం విస్తరిస్తోంది. ఇదివరకే మహారాష్ట్ర పంపిణీదారులు కొన్ని కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది మరికొన్ని రాష్ట్రాలకు పాకింది. ఎఫ్ఎంసీజీ పంపిణీదారుల సెగ మరో నాలుగు రాష్ట్రాలకు పాకింది. గుజరాత్, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు జనవరి 4వ తేదీ నుంచి సప్లయ్ నిలిపివేయాలని ఆయా రాష్ట్రాల పంపిణీదారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆల్ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ఒక స్పష్టమైన ప్రకటన సైతం విడుదల చేసింది. హిందుస్థాన్ యునిలివర్ ఉత్పత్తులైన పౌడర్, సబ్బులు, హెయిర్ ఆయిల్, షాంపూ ప్రొడక్టులతో కోల్గేట్ సంబంధిత ఉత్పత్తులు ఈ లిస్టులో ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ కంపెనీలది ఒక ఆర్గనైజ్డ్‌ఛానెల్. జియోమార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఉడాన్, ఎలాస్టిక్ రన్, వాల్‌మార్ట్)లాంటివి ఈ పరిధిలోకి వస్తాయి. వాటికి ఎలాంటి పంపిణీ మార్జిన్ ఇస్తున్నారో.. తమకూ అదే మార్జిన్ ఇవ్వాలంటూ పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు. రిటైల్ మార్జిన్ 8-12 శాతం ఉండగా, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు.. బీ2బీ స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని పంపిణీదారులు ఆరోపిస్తుండగా.. అలాంటిదేం లేదని ఆయా కంపెనీలు చెప్తున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్రలో పంపిణీదారులు హిందుస్థాన్ యునిలివర్ ఉత్పత్తుల పంపిణీని నిలిపివేశారు. ఆపై జనవరి 1వ తేదీ నుంచి కోల్గేట్ కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తులను సైతం ఆపేశారు. దీంతో పేస్టుల కొరత ఏర్పడొచ్చన్న కథనాల మేరకు జనాలకు ఎగబడి కొంటున్నారు. మరోవైపు చర్చలు జరిపిన మరికంపెనీల నుంచి కూడా సరైన స్పందన లేకుండా పోయింది. సహయక నిరాకరణ చేపడతామని తాము ముందస్తు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. ఎఫ్ఎంసీజీ కంపెనీల నుంచి సరైన స్పందన లేదని పంపిణీదారుల అసోషియేషన్ గుర్రుగా ఉంది. ఈ తరుణంలో సోమవారం జరగబోయే చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవేళ ఈ చర్చలు గనుక విఫలమైతే.. మరికొన్ని కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేయాలన్న ఆలోచనలో All India Consumer Product Distributors Federation ఉంది. సంబంధిత వార్త: కోల్గేట్ పేస్ట్ కోసం క్యూ కడుతున్న జనం! కారణం ఏంటంటే.. -
కోల్గేట్ పేస్ట్ ఎగబడి కొంటున్నారు! ఎందుకంటే..
Colgate Products Shortage In Maharastra: కోల్గేట్ పేస్ట్, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అక్కడ జనాలు ఎగబడిపోతున్నారు. కిరాణ.. చిల్లర దుకాణాల్లో, మార్ట్‌లలోనూ కోల్గేట్ పేస్టులు హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. త్వరలో కోల్గేట్ పేస్టుల కోరత అక్కడ ఎదురు కానుంది. కాబట్టే, అంత డిమాండ్ నడుస్తోంది. అవును.. మహారాష్ట్ర వ్యాప్తంగా కోల్గేట్ ఉత్పత్తుల పంపిణీ నిలిపివేయాలని డిస్ట్రిబ్యూటర్స్(పంపిణీదారులు) నిర్ణయించారు. జనవరి 1వ తేదీ నుంచి పేస్ట్‌లు, ఇతర ఉత్పత్తులను దశల వారీగా పంపిణీ ఆపేయనున్నారు. ఇవాళ(జనవరి 1, 2022) నుంచి మ్యాక్స్ఫ్రెష్ పేస్ట్‌ల ఉత్పత్తిని ఆపేశారు. వారం తర్వాత వేదశక్తి పేస్ట్‌ను సైతం పంపిణీ నిలిపివేయాలని నిర్ణయించారు. జనవరి మధ్య నుంచి కోల్గేట్ టూత్ బ్రష్స్లు పంపిణీ ఆగిపోనుంది. ఇక పూర్తి ఉత్పత్తుల పంపిణీ బంద్‌ను ఫిబ్రవరి 1 నుంచి నిర్ణయించారు. కారణం.. ధరల అసమానత. Fast-moving consumer goods(ఎఫ్ఎంసీజీ) కంపెనీల ఉత్పత్తుల విషయంలో సంప్రదాయ వ్యాపారపు రేట్లకు.. ఆర్గనైజ్డ్‌ఛానెల్ అంటే జియోమార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఉడాన్, ఎలాస్టిక్ రన్ లాంటి కామర్స్ బీ2బీ కంపెనీలకు మరో రేట్లు ఉంటోంది. అయితే పూణేలో జరిగిన ఒక ఉత్పత్తి లాంచ్ ఈవెంట్లో కంపెనీ తన ఉత్పత్తులను అన్ని ఛానెల్‌లలో ఒకే ధరకు విక్రయించినట్లు తెలిపింది. కానీ, డిస్ట్రిబ్యూటర్లు ఇందులో నిజం లేదని అంటున్నారు. రిటైల్ మార్జిన్ 8-12 శాతం ఉండగా, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు.. బీ2బీ స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని చెప్తున్నారు. దీనికి నిరసనగానే పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు చిల్లర వ్యాపారులు వ్యవస్థీకృత(ఆర్గనైజ్డ్) ఛానెల్ నుంచి స్టాక్లను ఎత్తివేయడం పెంచుకుంటూ పోతున్నారు. కోల్గేట్ స్పందన.. కోల్గేట్ పాల్మోలైవ్ ఇండియా, పంపిణీదారుల చర్యలపై స్పందించింది. పంపిణీదారులతో ఎనిమిది దశాబ్దాలుగా బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని, పారదర్శకత ఉందని, డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌తో సంప్రదింపులు జరుపుతామని, సవాళ్లను అధిగమిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు Fast-moving consumer goods అయిన మరో కంపెనీ హిందుస్థాన్ లివర్ ప్రొడక్టుల విషయంలోనూ పంపిణీదారులు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అయితే మహాలో తమ ఉత్పత్తుల సరఫరా అంతరాయం లేకుండా ఉంటుందని HUL చెబుతోంది.మరోవైపు Edelweiss సెక్యూరిటీస్ తన నివేదికలో ఈ సమస్యలు (కంపెనీ మరియు పంపిణీదారులు) ముందుగానే జరిగాయని, HUL మరియు డిస్ట్రిబ్యూటర్లు త్వరలో ఒక ఒప్పందానికి వస్తారని అంచనా వేసింది. లేఖలు రాసినా.. ఆల్ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (నాలుగున్నర లక్షలమంది ఉన్నారు).. ఎఫ్ఎంసీజీ కంపెనీలతో సమావేశమై ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ఇదివరకే ప్రయత్నించింది. ఒకే రకమైన ధరలు, పాలసీలు ఉండాలన్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ఎఫ్ఎంసీజీల ముందు ఉంచింది(రెండు లేఖలు రాసింది). లేకుంటే జనవరి 1 నుంచి సహాయక నిరాకరణోద్యమం చేస్తామని ప్రకటించింది కూడా. ఈ క్రమంలో నెస్లే ఇండియా, ఐటీసీ, డాబర్, మారికోలు చర్చించినా.. ఓ కొలిక్కి రాలేదని సమాచారం. చదవండి: లేస్ చిప్స్ ‘ఆలు’పై పేటెంట్ రైట్స్ రద్దు.. భారత రైతులకు భారీ ఊరట -
ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త!?
ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్టిబ్యూటర్ ను ఎంపిక చేసుకోవచ్చని, అక్కడి నుంచే గ్యాస్ సిలిండర్ పొంద వచ్చని ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా... ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి వినియోగదారులు ఎదుర్కొంటున్న కష్టాల్ని ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించారు. దీనికి కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్ స్పందిస్తూ... ‘ ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్టిబ్యూటర్ ను ఎంపిక చేసుకోవచ్చని, వారి వద్ద నుంచే సిలిండర్ ను ఫిల్ చేయించుకోవచ్చు’ అని ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటి వరకు సిలిండర్ వినియోగదారులు ఒక్క డిస్టిబ్యూటర్ వద్ద మాత్రమే గ్యాస్ ఫిల్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచైనా గ్యాస్ సిలిండర్ తెచ్చుకునే వెసులుబాటును పైలట్ ప్రాజెక్టుగా చండీగడ్, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే, రాంచీలలో ఇప్పటికే అమలు చేస్తున్నారు. పార్లమెంటులో కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్ చేసిన ప్రకటనతో ఈ పథకం దేశమంతటా అమలు చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. మొత్తంగా కేంద్రం తాజా నిర్ణయం గ్యాస్ వినియోగదారులకు ఊరట కలిగించింది. -
అమెజాన్.. వెనక్కి తగ్గాలి
న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూపు, రిలయన్స్ మధ్య కుదిరిన ఒప్పందానికి అడ్డుపడకుండా, వెనక్కి తగ్గాలంటూ వర్తకుల మండలి.. ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్(ఏఐసీపీడీ), స్వచ్చంద సంస్థ ప్రహర్ అమెజాన్‌ను డిమాండ్ చేశాయి. కంపెనీల మధ్య ప్రస్తుత వివాదం అలాగే కొనసాగితే అది ఫ్యూచర్ గ్రూపు వెండర్లు, సరఫరాదారులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ‘‘దేశ వ్యాప్తంగా సుమారు 6,000 మంది చిన్న విక్రేతలు, సరఫరాదారులకు ఫ్యూచర్ గ్రూపు నుంచి రూ.6,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. 2020 మార్చి నుంచి ఈ బకాయిలు ఆగిపోయి ఉన్నాయి. 2020 ఆగస్ట్‌లో ఫ్యూచర్ గ్రూపు-రిలయన్స్ ఒప్పందం త్వరలోనే మా బకాయిలు వసూలవుతాయన్న ఆశలను చిగురింపజేసింది’’ అని ఏఐసీపీడీ, ప్రహర్ తమ లేఖలో పేర్కొన్నాయి. ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌కు అడ్డుపడకుండా వెనక్కి తగ్గాలని లేదా తమ సభ్యుల బకాయిలను చెల్లించాలని అమెజాన్‌ను వర్తకుల సంఘం కోరింది. చదవండి: అలా అయితే రూ.75కే లీటర్ పెట్రోల్! డెస్క్ టాప్లోనూ వాయిస్, వీడియో కాల్స్ -
బొమ్మొచ్చె వేళాయెరా
అక్టోబర్ 15 నుంచి 50 శాతం సీటింగ్‌తో సినిమాలు ప్రదర్శించుకోవచ్చు ఏడు నెలల నిరీక్షణ ఫలించింది. ఇన్ని రోజులూ తాళాలేసిన థియేటర్స్‌ని తెరవబోతున్నారు. కోవిడ్ వల్ల ఏర్పడ్డ బ్రేక్ ముగిసింది. ప్రొజెక్టర్ల దుమ్ము దులపబోతున్నారు. పాప్ కార్న్ ఎప్పటిలానే పొంగబోతోంది. నిశ్శబ్దంగా మారిన సినిమా హాళ్లలో సందడి మొదలవ్వనుంది. సినిమాను సినిమాలా చూసే అసలైన మజా మళ్లీ రానుంది. కొంత గ్యాప్ తర్వాత తెరపై బొమ్మొచ్చె వేళయింది. సినీ ప్రేమికుల పండగ మొదలవ్వనుంది. ఈ సందర్భంగా పలువురు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏమంటున్నారో చూద్దాం... కరోనా వైరస్.. లాక్డౌన్ వల్ల చాలా సినిమాలు చిత్రీకరణ ఆగిపోయాయి. కానీ లాక్‌డౌన్‌లోనే రామ్‌గోపాల్ వర్మ పలు సినిమాలను చిత్రీకరించారు. అందులో ‘కరోనా వైరస్’ ఒకటి. లాక్డౌన్ వల్ల ఇంట్లో చిక్కుకుపోయిన ఓ కుటుంబం కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్స్ తెరుచుకున్న తర్వాత విడుదల కాబోతున్న తొలి సినిమా ఇదే అని ట్వీట్ చేశారు రామ్‌గోపాల్ వర్మ. లాక్డౌన్ 5లో భాగంగా థియేటర్స్ రీఓపెన్ చేయటం ఆనందమే. కానీ, దీనికి సంబంధించి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి థియేటర్ యాజమాన్యాలు కరెంట్ బిల్లులు కట్టని కారణంగా అందరి పవర్ ఫ్యూజ్‌లు తీసుకుని వెళ్లారు సంబంధిత అధికారులు. అలాగే థియేటర్లు నడవాలంటే కంటెంట్ కావాలి. సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఎవ్వరి దగ్గరా కంటెంట్ లేదు. ఒకవేళ ఏదైనా సినిమా కంటెంట్ ఉన్నా డిస్ట్రిబ్యూటర్స్ సినిమాని డబ్బులు ఇచ్చి కొనరు. కేంద్రప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వాలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. గతంలో ఉన్న ఖర్చులకంటే ఇప్పుడు థియేటర్లకు శానిటైజేషన్ రూపంలో ఖర్చు ఎక్కువ అవుతుంది. దాన్ని ఎలా అరికట్టాలి? అసలు జనాలు వస్తారా, రారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ థియేటర్లు ఆరంభించాకే సమాధానం దొరుకుతుంది. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందుతుందో చూడాలి. – డి.సురేశ్‌కుమార్, సాయి సినీచిత్ర (వెస్ట్‌గోదావరి డిస్ట్రిబ్యూటర్) థియేటర్లు ఓపెన్ చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురు చూస్తున్నాం. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా గవర్నమెంట్ హాలిడే. తర్వాత శని, ఆదివారం కావటంతో సోమవారం గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకటిస్తుందనుకుంటున్నాం. మా థియేటర్‌ను పూర్తి స్థాయిలో రెడీ చేయటానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మా థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అన్ని షోలకు థియేటర్‌ను ఎలా శానిటైజ్ చేయాలనే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. – అరుణ్, శ్రీరాములు థియేటర్, హైదరాబాద్ బుధవారం సెంట్రల్ గవర్నమెంట్ వారు థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పగానే గురువారం మా స్టాఫ్ అందరినీ పనుల్లోకి రమ్మని చెప్పాం. థియేటర్లో సీటు సీటుకి మధ్య గ్యాప్‌కోసం థర్మాకోల్ షీట్‌ను అమరుస్తున్నాం. ప్రతి షోకి శానిటైజేషన్ చేయటానికి మా స్టాఫ్‌కి తర్ఫీదు ఇస్తున్నాం. ప్రస్తుతం సినిమాలను కొనే పరిస్థితుల్లో లేం. మా డిస్ట్రిబ్యూటర్స్ ఏ సినిమా ఇచ్చి ఆడించమంటే ఆ సినిమా ఆడిస్తాం. – కుమార్, దేవి 70 ఎం.ఎం థియేటర్ మేనేజర్, హైదరాబాద్ ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి షోకు శానిటేజైషన్ చేయటం వల్ల నెలకు దాదాపు 40 వేల రూపాయల నుండి 50 వేల రూపాయల వరకు ఖర్చు అదనంగా పెరుగుతుంది. అలాగే థియేటర్‌కి వచ్చి టికెట్ తీసుకునే ప్రేక్షకుల నుంచి డబ్బును తీసుకోవడానికి కూడా సెపరేట్‌గా శానిటైజ్ చేయటానికి కొత్త మిషన్లను తీసుకోవాలనుకుంటున్నాం. – శ్రీనివాసరెడ్డి -
ఓటీటీకే ఓటు
థియేటర్స్ మూసేసి నెల రోజులు దాటిపోయింది. దీంతో రిలీజ్‌కి రెడీ అయిన చిత్రాలను ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు కొందరు నిర్మాతలు. ఇందులో భాగంగా సూర్య నిర్మాణంలో జ్యోతిక నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలనుకున్నారు. ముందు ఈ నిర్ణయాన్ని తమిళ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అంగీకరించలేదు. భవిష్యత్తులో సూర్య నిర్మాణంలో వచ్చే చిత్రాలను ప్రదర్శించబోమని ప్రకటించారు. అయితే ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రాన్ని డిజిటల్ ద్వారా రిలీజ్ చేయడం సరైన నిర్ణయమే అని నిర్మాతల సంఘం అభిప్రాయపడింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘సినిమాను ఎలా రిలీజ్ చేసుకోవాలన్నది నిర్మాత ఇష్టం. చిన్న సినిమాలను మరియు మీడియమ్ బడ్జెట్ సినిమాలను ఆన్ లైన్లో రిలీజ్ చేయడం నిర్మాతలకు కలసి వచ్చే విషయమే. అలాగే లాక్ డౌన్ తీసేసిన తర్వాత రిలీజ్‌కి భారీ క్యూ ఉండి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి రాదు’’ అని నిర్మాతల సంఘం పేర్కొంది. -
స్క్రీన్ ఉంది.. సీన్ లేదు
ఒకప్పుడు ‘నేడే చూడండి... మీ అభిమాన హీరో సినిమా’ అంటూ రిక్షాల్లో తిరుగుతూ మైకుల్లో చెప్పేవారు. రిక్షా వెనకాల పిల్లలు పరిగెత్తుతూ సందడి సందడి చేసేవారు. ఇప్పుడు టీవీ, రేడియా, సోషల్ మీడియా ఇలా సినిమా ప్రమోషన్‌కి చాలా ఉన్నాయి. థియేటర్ ముందు అయితే భారీ కటౌట్లు, గజమాలలు, పాలాభిషేకాలతో ఫ్యాన్స్ సందడి సందడి చేస్తుంటారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో థియేటర్ల ముందు సందడి లేదు. వెండితెర వెలవెలబోతోంది. ‘స్క్రీన్ ఉంది.. సీన్ లేదు’. ‘‘సినిమా చరిత్రలో ఇలా పదీ పదిహేను రోజులు ‘థియేటర్లు బంద్’ కావడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్ అని’’ నైజాం ప్రముఖ పంపిణీదారుడు చారి పేర్కొన్నారు. దాదాపు పది రోజులు థియేటర్లు మూసివేయడం ద్వారా ‘సింగిల్ థియేటర్’కి ఏర్పడే నష్టం ఐదారు లక్షలు ఉంటుందని, మల్టీప్లెక్స్‌కి ఇంకా ఎక్కువ ఉంటుందని ఓ పంపిణీదారుడు తెలిపారు. అయితే సినిమా ఆడినప్పుడు సింగిల్ థియేటర్‌తో పోల్చితే మల్టీప్లెక్స్‌కి రాబడి ఎక్కువ ఉంటుందని మరో పంపిణీదారుడు అన్నారు. థియేటర్ల నిర్వహణ గురించి కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన సమాచారంలోకి వెళదాం... ► ఈ మధ్య ‘సింగిల్ థియేటర్’కి అన్నీ నష్టాలే. ఎందుకంటే సినిమా రిలీజులు పెద్దగా లేవు. చిన్న సినిమాలు మంచి టాక్ తెచ్చుకుని ఓ మూడు నాలుగు వారాలు ఆడితే అప్పుడు లాభాలు చూడొచ్చు. ఇక పెద్ద హీరోల సినిమాలను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తారు. దాంతో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ మంచి వసూళ్లతో థియేటర్ నడుస్తుంది. థర్డ్ వీక్ నుంచి వసూళ్లు పడిపోతుంటాయి. ► మల్టీప్లెక్స్‌లో అయితే ఉన్న మూడు నాలుగు స్క్రీన్స్‌లోనూ పెద్ద సినిమాని ప్రదర్శిస్తారు. వాళ్లకు పర్సంటేజ్ సిస్టమ్ ఉంటుంది. మొదటి వారం వచ్చే వసూళ్లలో డిస్ట్రిబ్యూటర్ 55 శాతం, ఎగ్జిబిటర్ 45 శాతం తీసుకుం టారు. రెండో వారానికి రివర్శ్. 55 ఎగ్జిబిటర్ (సినిమా ప్రదర్శించేవాళ్లు), 45 శాతం డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు. అలా చివర్లో డిస్ట్రిబ్యూర్ 30, ఎగ్జిబిటర్ 70 శాతం తీసుకుంటారు. ► సింగిల్ థియేటర్ అయితే సినిమాని పర్సంటేజ్ పద్ధతిలో కాకుండా రెంటల్ సిస్టమ్‌కి ఇస్తారు. ఏరియాని బట్టి వారానికి నాలుగు లక్షలు రెంట్ ఉంటుంది. ఒకవేళ వసూళ్లు నామమాత్రంగా ఉంటే అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు రెంటల్ విధానంలో కాకుండా పర్సంటేజ్ విధానంలో ఎగ్జిబిటర్ నుంచి డబ్బు తీసుకుంటారు. అది ఎప్పుడూ అంటే ఒక షోకి 50 వేలు వసూలు అయితే.. వారానికి సుమారు 10 లక్షలు కలెక్ట్ అవుతాయి. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ 2 లక్షలు రెంట్ ఇచ్చేసి, మిగతా 8 లక్షలు తీసుకుంటారు. అదే వారం మొత్తం 2 లక్షలే వస్తే... ఎగ్జిబిటర్‌కి మొత్తం 2 లక్షలు రెంట్ ఇవ్వకుండా వచ్చిన వసూళ్లలో సగం తీసుకుంటారట పంపిణీదారుడు. అదే మల్టీప్లెక్స్ అయితే పర్సంటేజ్ సిస్టమే. ► అసలు ఒక థియేటర్ నెల మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? అంటే.. బాగా నీట్‌గా మెయింటైన్ చేసే సింగిల్ థియేటర్‌కి ఐదున్నర నుంచి ఆరు లక్షలవుతుందట. ప్రొజెక్టర్ ఖర్చు, ప్రొజెక్టర్ బల్బ్, టాయ్‌లెట్, ఫ్లోర్ క్లీనింగ్, సీట్స్, కరెంట్ బిల్... ఇలాంటివన్నీ ఈ ఆరు లక్షల్లో ఉంటాయి. ప్రొజెక్టర్ నెల రెంట్ 30 వేలు అయితే, బల్బ్ దర 90 వేల నుంచి లక్ష వరకూ ఉంటుంది. రెండు మూడు నెలలకోసారి కొత్త బల్బ్ మార్చాల్సి ఉంటుంది. ఇది సింగిల్ థియేటర్ ఖర్చు. మల్టీప్లెక్స్‌కి వేరే విధంగా ఉంటుంది. అయితే సింగిల్ థియేటర్లో మూడు టికెట్ కౌంటర్లు ఉంటే.. మల్టీప్లెక్స్‌లోనూ దాదాపు అన్నే ఉంటాయని ఓ ఎగ్జిబిటర్ అన్నారు. కాకపోతే మల్టీప్లెక్స్‌లో స్టాఫ్ తక్కువ.. స్క్రీన్లు ఎక్కువ ఉంటాయి. అలాగే సింగిల్ థియేటర్లో సినిమా బాగా ఆడకపోతే క్యాంటీన్ రెవెన్యూ కూడా తగ్గుతుంది. కానీ మల్టీప్లెక్స్‌లో వేరే వేరే సినిమాలు స్క్రీనింగ్ చేసుకోవచ్చు కాబట్టి క్యాంటీన్ రన్ బాగానే ఉంటుంది. బాగున్న సినిమాని రెండు మూడు స్క్రీన్స్‌లో ప్రదర్శించే వీలు మల్టీప్లెక్స్‌కి ఉంటుంది. అయితే మల్టీప్లెక్స్వాళ్లకు ఉండే కష్టాలు వాళ్లకూ ఉంటాయి కానీ సింగిల్ థియేటర్స్‌కే నష్టం ఎక్కువ అని లెక్కలు చెబుతున్నారు కొందరు ఎగ్జిబిటర్లు. ► మరి ఈ పరిస్థితిలో థియేటర్ని ఎందుకు కంటిన్యూ చేయడం అంటే.. ఎప్పుడో థియేటర్స్ కట్టి ఉన్నాయి. వాటిని ఏం చేయాలన్నా కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఉమ్మడి ప్రాపర్టీ అయితే పెట్టుబడి ఎవరు పెట్టాలి? అనే విషయంలో వివాదం వచ్చే అవకాశం ఉంది. ఇక పిల్లలు విదేశాల్లో సెటిల్ అయితే ఇక్కడున్న ప్రాపర్టీ మీద పెద్దగా దృష్టి పెట్టరు. అందుకని ఎలాగూ ఉన్నాయి కదా అని థియేటర్స్‌ని నడుపుతున్న ఎగ్జిబిటర్లే ఎక్కువ శాతం ఉన్నారని చారి పేర్కొన్నారు. ► ఇంతకీ పది రోజులు థియేటర్లు మూసేస్తే వచ్చే నష్టం ఎంతా అంటే ‘మినిమమ్ ఐదారు లక్షలు’ అంటున్నారు. ఏరియాని బట్టి ఈ లెక్కలో హెచ్చు తగ్గులుంటాయి. పైగా మార్కెట్లో దొరికే వస్తువులు ఇవాళ కాకపోతే రేపు అమ్ముడవుతాయి. కానీ ఆ రోజు సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోతే ఆ మర్నాడు వస్తారన్న గ్యారంటీ లేదు. ఓ వారం తర్వాత ఆ సినిమా థియేటర్లో ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. గత శుక్రవారం అర్జున, ప్రేమ పిపాసి’, 302, యురేక, మేద వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఆ మర్నాటి నుంచే థియేటర్ల మూతను ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోయే అవకాశం ఉంది. అయితే బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే... కరోనా కారణంగా ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రావడంలేదు. అందుకని ఇప్పుడు థియేటర్లు మూసినా పెద్దగా నష్టం వాటిల్లదనే చెబుతున్నారు. దానికి ఓ ఉదాహరణ చెప్పాలంటే... ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో 3600 టికెట్లు బుక్ అయితే.. 600 మంది ప్రేక్షకులు అసలు థియేటర్‌కి రాలేదట. బుక్ చేసుకుని మరీ రాలేదంటే కరోనా ఎంత భయపెడుతోందో ఊహించుకోవచ్చు. షూటింగ్ బంద్ కరో కరోనా వైరస్ ప్రభావం అన్ని రాష్ట్రాల చిత్ర పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాల చిత్రీకరణలను నిలిపివేస్తున్నట్లు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నటీనటుల సంఘం, నిర్మాతల మండలి సంయుక్తంగా ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణదాస్ నారంగ్ మాట్లాడుతూ – ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో షూటింగ్స్‌ను నిలిపి వేయాలని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’’ అన్నారు. ‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా చిత్రీకరణలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొందరు నిర్మాతలకు ఇబ్బందిగా ఉన్నా సరే మా ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. కరోనా కారణంగా తెలంగాణలో ఎక్కడా షూటింగ్స్ జరగవు’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్. ‘‘కరోనా వైరస్ చాలా భయంకరమైనది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్, మాల్స్ బంద్ ప్రకటించడం జరిగింది. అదే విధంగా షూటింగ్ నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది’’ అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ. ‘‘తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా తీసుకున్న నిర్ణయం ఇది. థియేటర్స్ బంద్‌తోపాటు షూటింగ్స్ కూడా నిలిపివేయాలనేది అందరూ మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చిత్రీకరణలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. అభ్యంతరం లేని ఆంధ్రా ప్రాంతాల్లో షూటింగ్స్ జరుగుతున్నాయి’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కల్యాణ్. ‘‘షూటింగ్స్‌లో వందలమంది పాల్గొంటుంటారు. వారి ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాజిక బాధ్యతతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అందరం దీన్ని సమర్థిస్తున్నాం’’ అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ జీవితా రాజశేఖర్. ‘‘ప్రభుత్వం మళ్లీ షూటింగ్స్ జరుపుకోవచ్చని తెలియజేసినప్పుడు చిత్రీకరణలు పునరావృతం అవుతాయి. ఈ నిర్ణయాన్ని నిర్మాతలందరూ స్వాగతించాలి’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్. ఈ సమావేశంలో నిర్మాతలు శ్యామ్ ప్రసాద్, ఠాగూర్ మధు, నట్టికుమార్, రామసత్యానారాయణ, సురేందర్‌రెడ్డి, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు సినిమాలు, టీవీ సీరియల్స్, వెబ్‌సిరీస్‌ల షూటింగ్స్ కూడా ఈ నెల 19 నుంచి 31 వరకు జరగకూడదని ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎమ్పీఆర్ఏ) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తిరిగి షూటింగ్స్‌ను ఎప్పుడు ప్రారంభించాలనే విషయాలను అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 30న ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఐఎమ్పీఆర్ఏ పేర్కొంది. సి. కల్యాణ్, ప్రసన్నకుమార్, జీవిత, వెంకటేష్, నారాయణదాస్, బెనర్జీ, దామోదర ప్రసాద్, మధు -
కూర్చోనివ్వని సినిమా
మనుషులతో వాస్తవం నిత్యం దోబూచులాడుతూ ఉంటుంది. కళ్లకు కట్టిన గంతలు తెరిస్తే ఏం చూడాల్సి వస్తుందోనని భయం. చేదు నిజంలో కంటె, తియ్యని అబద్ధంలో జీవించడమే మనిషికి ఆనందం. అయితే ఒక చేదు నిజాన్ని విని గుండె ఆగినంత పనైంది ఆ తల్లికి! అయినప్పటికీ కుమారుడిని అర్థం చేసుకుంది. భర్తతో పోరాడింది. కొడుకుకు, భర్తకు మధ్య నలిగిపోయింది. ఈ థీమ్‌తో ఒక సంచలనాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు క్వీర్ సినిమాలు (హోమో సెక్సువల్) తీయడంతో సిద్ధహస్తుడైన శ్రీధర్ రంగాయన్. ఆ చిత్రం పేరు ‘ఈవెనింగ్ షాడోస్’. జనవరి 10న మెట్రో నగరాల్లోని పరిమిత థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అబ్బాయి ఊరి నుంచి రాగానే వివాహం చేయాలని సంకల్పించారు తల్లిదండ్రులు. పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. అబ్బాయికి విషయం చెప్పారు. అయితే ఆ అబ్బాయి.. ‘‘అమ్మా! ఎందుకో నాకు అమ్మాయిల మీద మనసు పోవట్లేదు’ అన్నాడు. తల్లి షాకయ్యింది. ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. ‘ఈవెనింగ్ షాడోస్’ చిత్రంలోని సీన్ ఇది. ముంబైకి చెందిన ఒక యువకుడు కర్ణాటకలోని తన స్వగ్రామానికి చేరుకుంటాడు. ఇంట్లో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. అమ్మాయిని చూడటానికి తనకు మనస్కరించడం లేదని, తాను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని, తాను ‘గే’ అని తల్లికి చెప్పుకుంటాడు. ఆవిడకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ యువకుడి పేరు కార్తిక్ (దేవాంశ్ దోషి). మోనా అంబేగాన్కర్ కార్తిక్ తల్లిగా నటించారు. అనంత్ మహదేవన్, అర్పిత్ చౌదరీ, యామినీ సింగ్, అభయ్ కులకర్ణి, వీణా నాయర్, దిశా ఠాకూర్ ఇందులో నటించారు. 2018, జనవరి 11న ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియాలో ప్రదర్శించి, అవార్డులు అందుకున్నారు. చాలామంది గేలను కలిసి, వారి జీవితాల గురించి స్వయంగా తెలుసుకున్న అనుభవంతో ఈ చిత్రం తీశారు రంగయాన్. బెంగళూరు ఫిలిమ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు, చాలామంది ప్రేక్షకులు ఎంతో ఇబ్బందిపడడం గమనించారు రంగాయన్. ముఖ్యంగా మగవారు ఇబ్బంది పడటం ఆయనకు కనిపించింది. కొందరు హాలులో నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రేక్షకుల స్పందనను నేరుగా చూడటం వలన చిత్రం గురించి ప్రేక్షకుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు రంగాయన్. ఈ కథను రంగాయన్ 2009లో రాయడం ప్రారంభించారు. సినిమా తీయడానికి తగినంత డబ్బు దొరకడంలో ఆలస్యం జరగడంతో, ఏడు సంవత్సరాల తరవాత ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం ప్రారంభించారు. బాలారిష్టాలు దాటుకుని 2016లో చిత్ర నిర్మాణం ఊపందుకుంది. తియ్యడం వరకు బాగానే ఉంది కానీ, విడుదల చేయడం ఇబ్బందికరంగా మారింది. ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రాలేదు. అందువల్ల ఈ చిత్రాన్ని ఇప్పుడు చాలా ప్రత్యేకంగా విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు. 200 థియేటర్లలో శుక్రవారం నాడు విడుదల చేసే పద్ధతి నుంచి బయటకు రావాలనుకుంటున్నారు. అన్ని థియేటర్లలో విడుదల చేస్తే ఎవ్వరూ వెళ్లి చూడరు. తక్కువ స్క్రీన్లు ఉన్నచోట విడుదల చేసి, ఈ సినిమాకి ఎటువంటి ఆదరణ వస్తుందో చూడాలనుకుంటున్నారు రంగాయన్. – జయంతి -
అరుళ్‌పతికే పట్టం
తమిళ సినిమా: డిస్ట్రిబ్యూటర్లు మళ్లీ అరుళ్‌పతికే పట్టం కట్టారు. తమిళనిర్మాతల మండలి ఎన్నికలు, ఆర్కే.నగర్ ఉప ఎన్నికల తరువాత అంత సంచలనాన్ని కలిగించిన ఎన్నికలు డిస్ట్రిబ్యూటర్ల సంఘానివే. ఆదివారం స్థానిక చింతాద్రిపేటలోని మీరాసాహెబ్ వీధిలోని ఆ సంఘం కార్యలయంలో జరిగిన ఓటింగ్ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రస్తుతం అధ్యక్ష పదవిలో ఉన్న టీఏ.అరుళ్‌పతి జట్టు మళ్లీ పోటీ చేయగా వారికి వ్యతిరేకంగా నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజా జట్టు, నిర్మాత దేవరాజ్‌లు అధ్యక్షపదవికి పోటీ చేశారు. కాగా ఈ ఎన్నికల్లో ఉపకార్యదర్శి పదవి మినహా అన్ని పదవులను అరుళ్‌పతి జట్టే కైవసం చేసుకుంది. ఫలితాలివే.. మొత్తం సంఘంలో 527 సభ్యులుండగా 469 ఓట్లు పోలయ్యాయి. కాగా అధ్యక్షపదవికి పోటీ చేసిన అరుళ్‌పతి 248 ఓట్లతో గెలుపొందారు. ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన కేఈ.జ్ఞానవేల్‌రాజాకు 194 ఓట్లు, దేవరాజ్ 17 ఓట్లతో ఓటమి పాలయ్యారు. కాగా జ్ఞానవేల్‌రాజా జట్టులో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన శ్రీరామ్ 202 ఓట్లతో గెలుపుపొందారు. ఆయనపై పోటీ చేసిన రాజ్‌గోపాలన్ 173, ఎన్.చంద్రన్56 ఓట్లకే పరిమితం అయ్యారు. కార్యదర్శి పదవికి పోటీ చేసిన మెట్రో జయ 169 ఓట్లతో గెలుపోందారు. ఆయనతో పోటీ పడిన నేశమణి 142 ఓట్లు, కలైపులి జీ.శేఖర్ 140 ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన శ్రీనివాసన్ 216 ఓట్లతో ఆయనతో పోటీ పడ్డ కే.రాజన్ 199 ఓట్లు, ఆర్.సంపత్ 30 ఓట్లతో ఓటమిని చవిచూశారు. కోశాధికారి పదవికి పోటీ చేసిన బాబురావ్ 201ఓట్లతో గెలుపోందగా, ఆయన్ను ఢీకొన్న సిద్ధిక్ 142 ఓట్లతో, జీ.మోహన్రావ్ 54 ఓట్లతోనే సరిపట్టుకుని ఓటమిపాలయ్యారు. మరోసారి సంఘం అధ్యక్ష పదవిని చేపట్టిన అరుళ్మణిని నిర్మాత కలైపులి ఎస్.థాను, ఎస్వీ.శేఖర్ తదితర సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. -
నాది బాధ్యత అన్నారు
తమిళసినిమా: ఏదైనా నేనే బాధ్యత వహిస్తానని నటు డు శింబు అన్నారని ఇప్పుడు నష్టాన్ని ఆయనే భరించాలని నిర్మాత మైఖెల్‌రాయప్పన్ డిమాండ్ చేస్తున్నారు. ఈయన శింబు హీరోగా అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రాన్ని నిర్మించారు. శ్రియ, తమన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకుడు. గత జూన్‌లో విడుదలైన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్‌కు నష్టాల్ని కలిగించింది. ఈ నష్టానికి కారణం నటుడు శింబునేనని, నిర్మాత మైఖెల్‌రాయప్పన్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. నటుడు శింబు అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర పూర్తి స్క్రిప్ట్ చదివిన తరువాత చిత్రంలో నటించడానికి అంగీకరించారని తెలిపారు. చిత్ర షూటింగ్ సగం పూర్తయిన తరువాత చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించండి ఏం జరిగినా తాను బాధ్యత వహిస్తానని, రెండ వ భాగానికి పారితోషికం కూడా తీసుకోనని శింబు చెప్పారన్నారు. అంతకు ముందే దర్శకుడు చెప్పినట్లు ఆయన కథలో నటించలేదని ఆరోపించారు. తాను శిం బు అడిగిన పారితోషికం చెల్లించానని చెప్పారు. అయి తే చిత్రం విడుదలై తనకు రూ.20 కోట్లు నష్టం వచ్చిం దన్నారు. డిస్ట్రిబ్యూటర్లు నష్టపరిహారం చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. వారి నష్టానికి శింబు బాధ్యత వహించాలని తాను నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశానన్నారు. మండలి నిర్వాహకులు విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామని చెప్పి నెల రోజులు అయ్యిందని ఇప్పటి వరకూ పరిష్కారం జరగలేదని, శింబునే నష్టాన్ని భరించాలని నిర్మాత మైఖెల్ రాయప్పన్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై నటుడు శింబుకు రెడ్‌కార్డ్ విధించే అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. -
పరువునష్టం దావా వేస్తాం!
‘సాక్షి’ పత్రిక ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించి, మంగళవారం ప్రచురించిన పూరీ జగన్నాథ్ వాదన (‘లోఫర్ కాదు’)కు స్పందిస్తూ, ‘ఆ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు’ లేఖ రూపంలో ఆయనకు ఒక వివరణనిచ్చారు. అది... ‘‘పూరీ జగన్ గారూ! మీ ఆఫీసులో మిమ్మల్ని మేము కలిసింది ఒకే ఒక్కసారి. అదీ - ‘లోఫర్’ సినిమా రిలీజ్‌కు ముందు! కానీ, మీరు మాత్రం మా నష్టాల్ని భర్తీ చేసుకోవడానికి, మీతో 5 సినిమాలకు ఒప్పందం కుదుర్చుకోవాలని భావించినట్లు ఆరోపించారు. సార్! సినిమా రిలీజ్‌కు ముందే అది ఫ్లాప్ అవుతుందనీ, నష్టాలు వస్తాయనీ మాకు ఎలా తెలుసు? మీరు మా మీద కేసులు పెట్టారు. ఈ ఏప్రిల్ 14న మేము మీ దగ్గరకు వచ్చామంటూ పోలీసులు చేస్తున్న వాదనకు ఒక్క సాక్ష్యమైనా చూపించాల్సిందిగా కోరుతున్నాం. మీ ఇల్లంతా పూర్తిగా సి.సి. టీవీ కెమేరాలుంటాయి. గేటు దగ్గర గన్‌మ్యాన్ ఉంటాడు. మీ ఇంటికి రావడం అంత సులభం కాదు. గడచిన 4 నెలల్లో ఈ వ్యవహారంపై మేము మీకు పంపిన ఒక్క ఎస్సెమ్మెస్ కానీ, చేసిన ఫోన్ కాల్ కానీ, వాట్సప్ కానీ చూపించండి. డబ్బంతా చెల్లించాం! ఇక, మేము కేవలం రూ. 3.5 కోట్లే చెల్లించామనడం శుద్ధ అబద్ధం. మేము డబ్బంతా చెల్లించాం (‘లోఫర్’ చిత్ర నిర్మాత సి. కల్యాణ్‌కు చెందిన ‘శ్రీశుభశ్వేతా ఫిల్మ్స్’కు రూ.7.02 కోట్ల మేర మొత్తాన్ని అభిషేక్‌కు చెందిన ‘శ్రీఅభిషేక్ పిక్చర్’ సంస్థ బ్యాంకు ద్వారా చెల్లించినట్లు ఒక లెడ్జర్ పత్రం కూడా వాట్సప్‌లో సాక్ష్యంగా పెట్టారు). పైగా మేమెప్పుడూ వసూళ్ళ వివరాల్ని తిమ్మిని బమ్మిని చేయలేదు. నిజానికి, మేము రిలీజ్ చేసే సినిమాలకు ప్రతి రాత్రీ ట్విట్టర్లో వసూళ్ళ వివరాలను పెట్టే సంస్థ మాది ఒక్కటే! సినిమాల పంపిణీకి మాకు వచ్చే కమిషన్ కేవలం 20 శాతమే. మీ కొత్త సినిమా రిలీజ్‌లను మేము ఆపుచేస్తామని భావించి, మమ్మల్ని బెదిరించడం కోసం మీరు మా మీద తప్పుడు కేసు పెట్టారనే విషయం ప్రపంచానికి తెలియాలి. ఈ వ్యవహారంలో మేము పోలీస్ కమిషనర్నీ, డి.జి.పినీ, రాష్ట్ర హోమ్ మంత్రినీ, అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రినీ మా పిటిషన్‌తో కలుస్తాం. మా మీద మీరు పెట్టిన తప్పుడు కేసులకు ప్రతిగా మేము పరువునష్టం దావా వేయనున్నాం. - కాలి సుధీర్, అభిషేక్, ముత్యాల రామ్‌దాస్ (డిస్ట్రిబ్యూటర్లు)’’ -
వెనక్కివ్వాలా? వద్దా?
‘లోఫర్’ చిత్రానికి సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్‌కూ, డిస్ట్రిబ్యూటర్స్ ముత్యాల రామ్‌దాస్, అభిషేక్, కాలి సుధీర్లకూ మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు సినీ రంగాల్లో హాట్ టాపిక్. ఆ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లూ తనపై దాడి చేశారని పూరీ కేసు పెడితే, అవన్నీ వట్టి తప్పుడు కేసులంటూ వారు సోమవారం మీడియా ముందుకు వచ్చి వాపోయిన సంగతి మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వ్యవహారంపై మంగళవారం ‘సాక్షి’ ప్రచురించిన ప్రత్యేక కథనం ‘కట్ చేస్తే... కాంట్రవర్సీ!’కి విశేష స్పందన వచ్చింది. అలాగే, ఈ వివాదంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. వారి అభిప్రాయాలు... వారి మాటల్లోనే... కాంబినేషన్స్‌నే నమ్మితే ముప్పే! ‘‘ఇవాళ సినిమాల్లో నూటికి 20 సినిమాలే, అవీ క్రేజున్నవే - బయ్యర్లు కొంటున్నారు. మిగిలిన 80 శాతం సినిమాల్ని నిర్మాతలే రిలీజ్ చేసుకొని, రిస్క్ భరిస్తున్నారు. ఆ రకంగా నిర్మాతలే ఎక్కువ నష్టపోతున్నారు. మరోపక్క డిస్ట్రిబ్యూటర్లు ఇష్టపడి, పోటీపడి మరీ ‘అవుట్ రైట్’ కన్నా ఎక్కువ సొమ్ముకి ‘నాన్ రికవరబుల్ అడ్వాన్స్’ పద్ధతిలో సినిమా కొంటున్నారు. అలా కొన్నాక, తీరా నష్టమొస్తే అది ఎవరి తప్పు? కొనుక్కున్న వాళ్ళదే కదా! దాన్ని నిర్మాతో, టెక్నీషియనో భర్తీ చేయాలనడం తప్పు. లెక్కప్రకారమైతే ఎవరూ భర్తీ చేయనక్కరలేదు. రజనీకాంత్ లాంటి వాళ్ళకు చిత్ర నిర్మాణంలోనూ వాటా ఉంటుంది కాబట్టి, వారు ‘బాబా’(2002) లాంటి చిత్రాలకు కొంత మొత్తం వెనక్కి ఇస్తే ఇచ్చారు. ఐనా, నిర్మాతకూ, డిస్ట్రిబ్యూటర్కీ మధ్య జరిగిన వ్యాపార ఒప్పందంలో దర్శకుడికీ, హీరోకీ సంబంధం ఏంటి? క్రేజీ కాంబినేషన్స్ నమ్మి, సినిమాను చూడకుండానే కొనుక్కుంటే ఇదే ముప్పు. తీరా చేతులు కాలాక, అప్పుడు కొత్త చిత్రాలకు సహాయ నిరాకరణ లాంటి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగితే మరీ తప్పు. ఐనా, ఇవన్నీ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశాలు. రోడ్డు మీదకెక్కడం బాధాకరం.’’ - తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నిర్మాత - దర్శకుడు పోటీపడి కొనడమెందుకు? నష్టపోవడమెందుకు? ‘‘డిస్ట్రిబ్యూటర్స్‌కు 20 శాతం కన్నా మించి నష్టం వస్తే, కోటి రూపాయల పారితోషికం తీసుకొనే నటీనటులు, టెక్నీషియన్లు తమ పారితోషికంలో కొంత వెనక్కి ఇవ్వాలని ఏణ్ణర్ధం క్రితమే ఒక ప్రతిపాదన వచ్చింది. కానీ అది సాధ్యం కాదనీ, డిస్ట్రిబ్యూటర్లు తాము ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలతోనే ఆ డబ్బుల వ్యవహారం చూసుకోవాలనీ మా దర్శకుల సంఘం తరఫున లేఖ ఇచ్చే శాం. అయినా, డిస్ట్రిబ్యూటర్లు రికవరబుల్ ఎడ్వాన్స్ పద్ధతిలో కూడా సినీ వ్యాపారం చేసుకొనే అవకాశం ఉండగా, నాన్ రికవరబుల్ ఎడ్వాన్స్ (ఎన్.ఆర్.ఎ) పద్ధతిలో రేట్లు పెంచి, పోటీపడి సినిమాలు కొనడమెందుకు? నష్టపోవడమెందుకు? ఆ తరువాత నష్టం కొంతైనా భర్తీ చేసేలా డబ్బులు వెనక్కి ఇవ్వమంటూ, ‘బెగ్గింగ్ చేస్తున్నా’మని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడమెం దుకు? మునుపటి చిత్రాల రిజల్ట్‌ను బట్టే సాగే సినిమా వ్యాపారంలో ‘ఇడియట్’ అవుతుందనుకొని ‘లోఫర్’ కొన్నామని వ్యాపారస్థులైన డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం అమాయకత్వమే. రేట్లు పెంచి టికెట్లు అమ్మడం, కెపాసిటీకి మించి హాళ్ళలోకి జనాన్ని పంపి, ఆ కలెక్షన్లను బట్టి హీరోలు, దర్శకుల పారితోషికాలు కోట్లలోకి పెరగడానికి బాధ్యత పరోక్షంగా డిస్ట్రిబ్యూటర్లదే. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు వ్యతిరేకిస్తున్న ఆన్లైన్ టికెట్ విధానాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు తెస్తే, పారదర్శకత వస్తుంది. నిర్మాతకు సరిగ్గా డబ్బు, ప్రభుత్వ ఖజానాకు వినోద పన్ను మొత్తం అందుతాయి. దానికి శ్రీకారం చుట్టాల్సింది డిస్ట్రిబ్యూటర్లే!’’ - వీరశంకర్, ప్రముఖ దర్శకుడు - ‘తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం’ అధ్యక్షుడు ఇప్పుడిక ఒళ్ళు దగ్గర పెట్టుకొంటారు! ‘‘ఒకప్పుడు ఎన్టీయార్, కృష్ణ, చిరంజీవి గారి లాంటి హీరోలకు పర్మనెంట్‌గా, స్టాండర్డ్ నిర్మాతలుండేవారు. డిస్ట్రి బ్యూటర్లూ ఉండేవారు. అందరూ ఒకరి కష్టనష్టాలను మరొకరు పంచుకొనేవారు. ఇవాళ తెలుగులో ఏ హీరోకూ పర్మనెంట్ నిర్మాతలూ, డిస్ట్రిబ్యూటర్లూ లేరు. హీరోలు, దర్శకులు మార్కెట్‌కు మించి ఎక్కువ డబ్బులు అడుగుతు న్నారు, తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తం వ్యవస్థే నాశనమైంది. నిర్మాతలకూ, హీరోలకూ డబ్బులు రావడానికి కారణమైన డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల వాళ్ళు కూడా లేకుండా పోతే, ఇక సినిమాలు రిలీజ్ చేసేదెవరు? ఆడేదెవరు? కాబట్టి, వాళ్ళను కాపాడుకోవాలి. సినిమాలో నష్టమొస్తే, దర్శక, హీరోలు డబ్బులు వెనక్కివ్వాలి. డెరైక్టర్ డబ్బులు వెనక్కివ్వడం ‘ధైర్యం’ (2005) సినిమాతో నాతోనే మొదలైంది. సినిమా ఆడక పోతే, డబ్బు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందంటే అప్పుడు దర్శకులు, హీరోలు ఒళ్ళు దగ్గరపెట్టుకొని, సరైన కథలతో సిన్మా తీస్తారు. కాబట్టి, డబ్బులు వెనక్కి ఇమ్మని డిస్ట్రిబ్యూటర్లు అడగడం శుభపరిణామం. నాకు నచ్చింది.’’ - తేజ, ప్రముఖ దర్శకుడు - నిర్మాత - పంపిణీదారు - ప్రదర్శకుడు -
'పూరి డిస్ట్రిబ్యూటర్ల డైరెక్టర్ అన్నారే..'
హైదరాబాద్: 'లోఫర్ సినిమా విడుదలకు ముందే అభిషేక్, సుధీర్ లు నన్ను కలిశారు. వాళ్ల బ్యానర్ లో నేను ఐదు సినిమాల చేసేలా ఒప్పందం చేసుకుందామన్నారు. ప్రత్యేకంగా తనకో సినిమా చేసిపెట్టాలని ముత్యాల రామ్ దాస్ అడిగారు. ఆ తర్వాతగానీ వాళ్ల ఉద్దేశం ఏంటో నాకు తెలిసిరాలేదు. నాతో సినిమా ఒప్పందాల పేరుతో వాళ్లకున్న అప్పుల్ని నాపై రుద్దే ప్రయత్నం చేశారు. వాళ్ల నష్టాలకు నన్ను బాధ్యుణ్ని చేయాలని చూశారు. లోఫర్ సినిమా ప్రమోషన్ కు ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ఆ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతూ పూరి డిస్ట్రిబ్యూటర్ల డైరెక్టర్ అని, మమ్మల్ని చూసుకుంటారని ఏదేదో మాట్లాడారు. కేవలం పూరి జగన్నాథ్ వల్లే లోఫర్ నైజాం హక్కులను రూ.7.5 కోట్లకు కొన్నామని సుధీర్ చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ సినిమా నైజాం హక్కులు రూ.3.4 కోట్లకే అమ్మినట్లు నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు. దీన్ని బట్టే ఆ ముగ్గురూ ఎంత డ్రామా ఆడారో అర్థం అవుతుంది. బ్లాక్ మెయిల్ చేసి తప్పుడు లెక్కలు చూపారని తెలుస్తోంది' అంటూ డిస్ట్రిబ్యూటర్లతో నెలకొన్న వివాదంపై సుదీర్ఘవివరణ ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. నిర్మాత సి. కల్యాణ్ అంటే తనకెంతో గౌరవమని, అతని కోసం ఎన్ని సినిమాలైనా చేస్తానుగానీ, అలాంటి తప్పుడు మనుషుల కోసం చేయనని సదరు డిస్ట్రిబ్యూటర్లను ఉద్దేశించి పూరి వ్యాఖ్యానించారు. 'నేను కూడా చాలా సినిమాలు నిర్మించాను. విజయవంతమైన ఎన్నో సినిమాలకు సంబంధించి బయ్యర్లు ఇవ్వాల్సినంత ఇవ్వలేదు. ప్లాప్ అయిన సినిమాలకు మాత్రం నేను అన్ని క్లియర్ చేశా' అని నిర్మాణరంగంలో తానెంత నిజాయితీతో వ్యవహరిస్తున్నది చెప్పుకొచ్చారు పూరి. లోఫర్ సినిమాకు తాను దర్శకుడిని మాత్రమేనని, నష్టాలకు తనను బాధ్యుడ్ని చేయటం సరికాదని ఆయన వాపోయారు. లోఫర్ కోసం నా రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నానని, వరుణ్ తేజ్ మంచి భవిష్యత్ ఉన్న హీరోఅని అన్నారు. అంతకుముందు.. దర్శకుడు పూరి జగన్నాథ్ పై తాము దాడి చేయలేదని తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. తమపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూరి జగన్నాథ్ పై తాము ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని అన్నారు. 'లోఫర్' సినిమా ఫ్లాప్ కావడంతో తమ డబ్బులు తిరిగివ్వాలని నిర్మాత చిల్లర కల్యాణ్ ను అడిగామని తెలిపారు. పూరి జగన్నాథ్ ఇంటికి వెళ్లలేదు, ఆయనతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడిచేశారంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పూరి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవమారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
నాపై దాడి చేశారు: పూరి జగన్నాథ్
‘లోఫర్’ డిస్ట్రిబ్యూటర్లపై దర్శకుడు పూరి ఫిర్యాదు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు సినీ డిస్ట్రిబ్యూటర్లపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి వివరాలను మీడియాకు వెల్లడించారు. సి.కల్యాణ్ నిర్మాతగా పూరి జగన్నాథ్ దర్శకుడిగా ఇటీవల లోఫర్ సినిమా నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి నైజాం, సీడెడ్, ఆంధ్రా హక్కులను అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ డిస్ట్రిబ్యూటర్లుగా కొనుగోలు చేశారు. ఈ సినిమా తీవ్ర నష్టాలు కలిగించడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఈ ముగ్గురు కలసి కొద్ది రోజుల నుంచి పూరిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీ రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నం. 34లోని పూరి కార్యాలయానికి అభిషేక్, సుధీర్, రాందాస్ వచ్చి డబ్బులు ఇస్తావా ఇవ్వవా అంటూ బెదిరించడంతో పాటు ఆయనపై దాడికి పాల్పడ్డారు. శనివారం పూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 506, 452, 323, 452, 386, రెడ్‌విత్ 511 కింద కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెంకట్‌రెడ్డి తెలిపారు. -
లింగ... డిసైడ్ చేశాడట..
చెన్నై: లింగ సినిమా వివాదానికి ఫుల్స్టాప్ పెట్టడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగారు. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ....ఎక్కు తొలిమెట్టు... కొండను ఢీకొట్టు...అంటూ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు కొంతసొమ్ము చెల్లించడానికి 'దళపతి' ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఎంత డబ్బు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను ధృవీకరించారు. సమస్య పరిష్కారమైందనీ, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన విరమించారని ఆయన ప్రకటించారు. కాగా లింగ సినిమా పంపిణీ దారులకు , నిర్మాత రాక్ లైన్ వెంకటేష్‌కు మధ్య గత రెండు నెలలుగా వివాదం నడుస్తోంది. తాము నష్టపోయిన సుమారు 35 కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకు దిగి ఉద్యమించారు. గత నెలలో రజనీ ఇంటిముందు భిక్షాటన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ సరనస అనుష్క, సోనాక్షి హీరోయిన్లుగా, డిసెంబర్ 12, 2014లో భారీ అంచనాలతో రిలీజైన మూవీ లింగ. రజనీకాంత్ సినీ జీవితంలో డిజాస్టర్‌గా నిలిచి భారీ నష్టాలను మూటగట్టుకుంది. -
కేసు వాపస్ తీసుకోను
కొత్తగా ఆలోచించడం అన్నది సినిమానే జీవితంగా అనుభవిస్తూ దాన్ని కాచి వడబోసిన కమలహాసన్‌కే చెల్లు. ఆది నుంచి ప్రయోగాలకు ముందుండే ఈ ప్రయోజనాత్మక చిత్రాల నాయకుడు తాజాగా కొందరు డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నది కోలీవుడ్ టాక్. కమల్ నటించిన విశ్వరూపం-2, ఉత్తమ విలన్, పాపనాశం చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఆయన ద్విపాత్రాభినయంతో పలు గెటప్‌లతో కనిపించి అబ్బురపరచనున్న ఉత్తమ విలన్ ఏప్రిల్ 10న విడుదలకు ముస్తాబవుతోంది. పూజాకుమార్, ఆండ్రియా, పార్వతిమీనన్, ఊర్వశి, పార్వతి నాయర్అంటూ ఐదుగురు నాయికలు నటించిన ఈ చిత్ర విడుదల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు కమల్ ముందు ఒక డిమాండ్ ఉంచారు. దీని గురించి చెప్పేముందు కాస్త వెనక్కు వెళ్లాలి. విశ్వరూపం చిత్రం విడుదల విషయంలో కమలహాసన్ ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారని భావించారు. అదే డీటీహెచ్ విధానం. థియేటర్లతోపాటు అదే రోజున చిత్రాన్ని ఛానళ్లలోను ప్రసారం చేయాలన్నదే ఆ ప్రయోగం. దీనికి కొన్ని ప్రముఖ ఛానళ్లు ముందుకొచ్చాయి. వాటితో కమల్ ఒప్పందం కూడా చేసుకున్నారు. అంతా సరిగా సాగుతోందనుకున్న సమయంలో కమల్ ప్రయోగాన్ని వ్యతిరేకిస్తూ ఆయన నిర్ణయానికి గండి కొట్టారు. డీటీహెచ్‌లో ప్రసారం చేస్తే విశ్వరూపం చిత్రాన్ని తాము థియేటర్లలో ప్రదర్శించబోమని తెగేసి చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యాజమాన్యానికి వంత పాడారు. దీంతో కమల్ ప్రయోగం ఫలవంతం కాలేదు. దీంతో చాలా ఆవేదన చెందిన ప్రయోగాల పిపాసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో కొందరు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. దీంతో కమల్ ఎటాక్‌ను ఊహించని వారు హతాశులయ్యారు. ఉత్తమ విలన్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఆ డిస్ట్రిబ్యూటర్లలో కొందరు ఉత్తమ విలన్ చిత్రాన్ని కొనుగోలు చేశారు. వారిప్పుడు తమపై సీసీఐలో చేసిన ఫిర్యాదును వాపస్ తీసుకుంటేనే ఉత్తమ విలన్ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. అయితే వారికి బెదిరేది లేదు. ఫిర్యాదును వెనక్కు తీసుకునేది లేదని కమల్ ఖరాఖండిగా చెప్పినట్టు కోలీవుడ్ టాక్. -
ఉత్తరాదికీ... డిస్ట్రిబ్యూటర్ల తాకిడి?
ఒకరికి తెద్దునా... ఇద్దరికి తెద్దునా... అందరికీ తెద్దునా... అంటే ఇదే కావచ్చు! దక్షిణాది మొత్తంలో రికార్డు స్థాయి వసూళ్ళు సాధించే హీరో రజనీకాంత్‌కే ఇలా జరిగిందంటే, ఇక మామూలు హీరోల మాటేమిటని ఉత్తరాది హీరోలు ఇప్పుడు బెంబేలెత్తుతున్నారట! ఆ మధ్య విడుదలైన ‘లింగ’ చిత్రం పరాజయం పాలై, భారీ నష్టాలు మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వల్ల తమకు భారీ నష్టం వచ్చిందనీ, తమకు డబ్బులు వెనక్కి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తూ తమిళ సినీ పంపిణీదారులు రజనీకాంత్ ఇంటి ముందే సామూహిక భిక్షాటన చేస్తామంటూ హెచ్చరించారు. తమిళనాట మొదలైన ఈ ‘ట్రెండ్’ ఎక్కడ ఉత్తరాదికి పాకుతుందోనని హిందీ హీరోలు సతమతమవుతున్నారని హిందీ సినీ వర్గాల కథనం. దక్షిణాదిలో కన్నా హిందీ సినీ రంగంలో ఫ్లాపుల రేటు, నష్టాలు ప్రస్తుతం భారీగా ఉన్నాయి. పెపైచ్చు, చాలామంది హిందీ హీరోలు ఇప్పుడు సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. రేపు పొద్దున రజనీకాంత్ చిత్రాల లాగానే తమ చిత్రాలకూ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి గొంతు మీద కూర్చుంటే ఏం చేయాల్రా అని ఉత్తరాది తారలు తలపట్టుకు కూర్చున్నారు. మొత్తానికి, హిట్ల విషయంలోనే కాదు... ఈ విషయంలోనూ రజనీకాంత్ దెబ్బ హిందీ వాళ్ళకు తప్పదులా ఉంది. -
రజనీ ఇమేజ్‌కు భంగం
ప్రఖ్యాత నటుడు రజనీకాంత్ ఇమేజ్‌కు భంగం కలిగించారని, లింగా చిత్రాన్ని నష్టపరిచారని ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ డిస్ట్రిబ్యూటర్లపై ఆరోపణలు గుప్పించారు. వివరాల్లో కెళితే లింగా చిత్రం తీవ్ర నష్టాన్ని కలిగించిందని ఆ చిత్ర హీరో రజనీకాంత్ జోక్యం చేసుకుని పరిహారం ఇప్పించాలని ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు కొందరు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. దానికి పరాకాష్టగా శనివారం చెన్నైలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టి కలకలం సృష్టించారు. దీనికి స్పం దించిన ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ శనివారం సాయంత్రం చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను నిర్మించిన లింగా చిత్రం విడుదల హక్కులను ఇరాస ఎంటర్ టైన్మెంట్ సంస్థకు విక్రయించానని వారి నుంచి ఆ హక్కులను వేందర్‌మూవీస్ పొందిందని వివరించారు. ఆ సంస్థ నిర్వాహకులు వారికి తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించుకున్నారన్నారు. అయినా లింగా చిత్రంతో నష్టాలకు గురైన వారికి న్యాయం చేయాలని భావించానని రజనీకాంత్ ఇదే విషయం చెప్పారని అన్నారు. చిత్రం విడుదలైన ఐదువారాల తరువాత నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు తనను గానీ, రజనీకాంత్‌ను గానీ కలిసి పరిస్థితి వివరిస్తే వారికి తప్పక న్యాయం చేసేవాళ్లం అన్నారు. అలా కాకుండా కర్ణాటక నుంచి వచ్చారు220 కోట్లు దండుకుపోయారు అంటూ తిరుచ్చి ఏరియా డిస్ట్రిబ్యూటర్ సింగారవేలన్, ఇతర డిస్ట్రిబ్యూటర్లను రెచ్చగొడుతున్నారన్నారు. తాను 220 కోట్లు దోచుకున్నట్లు నిరూపిస్తే వారి నష్టాన్ని ఇప్పుడే సెటిల్ చేస్తానని లేదంటే సింగారవేలన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
రజనీకాంత్ పరిష్కరించాలి
లింగా చిత్రం నష్టపరిహారం వ్యవహారంలో రజనీ కాంత్ కల్పించుకుని పరిష్కరించాలని ఆ చిత్ర కొనుగోలుదారులు విజ్ఞప్తి చేశారు. లింగా చిత్రం ఆశించిన వసూళ్లు సాధించలేదని దీంతో చాలా నష్టపోయినట్లు ఆ చిత్రాన్ని కొనుగోలు చేసిన పలువురు బయ్యర్లు ఈ నెల 10న నిరాహార దీక్షకు సిద్ధమవుతూ అనుమతి కోసం కోర్టును కూడా ఆశ్రయించారు. గురువారం తిరుచ్చి, తంజావూరు ఏరియా డిస్ట్రిబ్యూటర్ సింగారవడివేలన్, ఉత్తర ఆర్కాడు దక్షిణ ఆర్కాడు ఏరియా డిస్ట్రిబ్యూటర్ సాయ్, తిరునెల్వేలి కన్యాకుమారి జిల్లాల డిస్ట్రిబ్యూటర్ రూపన్ తదితరులు సమావేశంలో మాట్లాడుతూ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన లింగా చిత్రం ఆశించిన వసూళ్లు సాధించలేదన్నారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. లింగాచిత్ర హీరో రజనీకాంత్ ఈ వ్యవహారంలో కల్పించుకుని డిస్ట్రిబ్యూటర్లు నష్టాన్ని భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. లింగా చిత్రాన్ని 100 కోట్ల ఖర్చుతో నిర్మించి 90 కోట్లకు విక్రయిస్తే తాము నష్టపరిహారం కోరేవారం కాదన్నారు. అలాంటి రూ.45 కోట్ల ఖర్చుతో లింగా చిత్రాన్ని రూపొందించి 220 కోట్లకు వ్యాపారం చేశారని ఆరోపించారు. లింగా చిత్రాన్ని సెంగల్పట్టు ఏరియాకు రూ.14 కోట్లు, కోవై ఏరియాకు రూ.13 కోట్లకు, మదురై ఏరియా రూ.8 కోట్లకు తిరుచ్చి, తంజావూరు ఏరియాలోకి రూ.8 కోట్లకు, దక్షిణ, ఉత్తర ఆర్కాడు ఏరియాలకు రూ.8 కోట్లకు తిరునెల్వేలి, కన్యాకుమారిలో 4.20 కోట్లకు విక్రయించారని వివరించారు. మొత్తం 55 కోట్లకు కొనుగోలు చేయగా 35 కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపారు. రజనీ కాంత్ సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల10న నిరాహార దీక్షకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. -
గోలీ.. నకిలీ!
సిద్దిపేట/సిద్దిపేట మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: జలుబైనా.. జబ్బు చేసినా.. డాక్టర్లు యాంటీబయాటిక్ మాత్రలు రాయడం పరిపాటి. అందుకే యాంటీబయా‘ట్రిక్స్’ ప్లేచేశారు సిద్దిపేటలో మెడికల్ దందాలో ఉన్న కొందరు వ్యక్తులు. సాధారణంగా బ్రాండెడ్, వంద శాతం నాణ్యతా ప్రమాణాలున్న వాటికి వచ్చే లాభాలకన్నా 50 శాతం అధికంగా ఆర్జించే వెసులుబాటు ఉండటంతో నాసిరకం (సబ్ స్టాండర్డ్) గోలీలకు డిస్ట్రిబ్యూటర్ల అవతారమెత్తారు. కొంత కాలం నుంచి ఈ అక్రమ దందాతో రూ.లక్షలు గడిస్తున్నారు. సిద్దిపేటలోని భారత్‌నగర్-శివాజీనగర్ ఏరియాల్లోనే ఎక్కువగా దవాఖానాలు, రిటైల్ మందుల దుకాణాలు, మెడికల్ ఏజెన్సీలున్నాయి. స్థానిక ఓ మెడికల్ ఏజెన్సీ కేంద్రంగా సబ్స్టాండర్ట్ యాంటీబయాటిక్ మాత్రల దిగుమతులు, ఎగుమతులు జరుగుతున్నట్టు సమాచారం. మామూలుగానైతే హైదరాబాద్ నుంచి స్టాకు రావాలి. కానీ...ఏకంగా ఇక్కడ్నించే భాగ్యనగరానికి ఎగుమతి చేస్తుండటం గమనార్హం. ఇదే క్రమంలో అందిన సమాచారం మేరకు ఔషధ నియంత్రణ అధికారులు రంగంలోకి దిగారు. సదరు ఏజెన్సీలో తనిఖీ చేసి నాణ్యతా ప్రమాణాలు లేవని, మరేదో మోసం దాగి ఉందని ప్రాథమికంగా భావించారు. అందుకే ఆ యాంటీబయాటిక్పై ఆయా చోట్ల శోధిస్తున్నారు. అనేక అనుమానాలు ఈ వ్యవహారంలో సంబంధిత అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ యాంటీబయాటిక్ మందులు, బిల్లులు చూడగానే సందేహించిన వాళ్లు ఆ ఏజెన్సీని తక్షణం తమ ఆధీనంలోకి ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాగూ తమ బండారం బయటపడుతుందని అంచనాకొచ్చిన ఏజెన్సీ బాధ్యులు స్టాకును రహస్య స్థావరాలను తరలించారని ప్రచారం జరుగుతోంది. యాంటీబయాటిక్ మాత్రల గోల్‘మాల్’ జాతకాన్ని తేల్చేందుకు సంబంధిత అధికారుల బృందం లోతుగానే శోధిస్తోంది. నిజానికి ఈ టీంలోని ఓ అధికారి తిరుమల తిరుపతిలో దైవదర్శనానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే ఈ పని పడడంతో తిరుపతి పర్యటన రద్దు చేసుకొని మరీ..ఆయన ఆ యాంటీబయాటిక్ డ్రగ్స్ మూలాలున్న ఉత్తరాఖండ్‌కు వెళ్లారని తెలిసింది. మందుల నాణ్యతను నిర్ధారించడంతోపాటు వాటి వేర్లు, ఇతర వివరాలను రాబడుతున్నారు. అయితే మొత్తంగా ఈ వ్యవహారంపై ఏడీని వివరణ కోరేందుకు ‘న్యూస్‌లైన్’ బుధ, గురువారాల్లో ఫోన్లో పలుమార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. డీఐ ప్రభాకర్‌గౌడ్‌ను ఫోన్లో సంప్రదిస్తే...‘ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం...వివరాలు వెల్లడించే అధికారం నాకు లేదు..ఏడీనే అడగండి..’ అంటూ బదులిచ్చారు. ఇదిలా ఉండగా మెడికల్ ఏజెన్సీల పరంగా మెదక్ జిల్లాకు రాష్ట్రంలోనే మంచి గుర్తింపుందని తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని వారి సంఘం ప్రతినిధి ఒకరు ‘న్యూస్‌లైన్’తో అన్నారు. అలాంటి కొందరు వ్యక్తుల నిర్వాకం వల్లే మచ్చ వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.