రజనీ ఇమేజ్‌కు భంగం
ప్రఖ్యాత నటుడు రజనీకాంత్ ఇమేజ్‌కు భంగం కలిగించారని, లింగా చిత్రాన్ని నష్టపరిచారని ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ డిస్ట్రిబ్యూటర్లపై ఆరోపణలు గుప్పించారు. వివరాల్లో కెళితే లింగా చిత్రం తీవ్ర నష్టాన్ని కలిగించిందని ఆ చిత్ర హీరో రజనీకాంత్ జోక్యం చేసుకుని పరిహారం ఇప్పించాలని ఆ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు కొందరు గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. దానికి పరాకాష్టగా శనివారం చెన్నైలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టి కలకలం సృష్టించారు. దీనికి స్పం దించిన ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ శనివారం సాయంత్రం చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను నిర్మించిన లింగా చిత్రం విడుదల హక్కులను ఇరాస ఎంటర్ టైన్‌మెంట్ సంస్థకు విక్రయించానని వారి నుంచి ఆ హక్కులను వేందర్‌మూవీస్ పొందిందని వివరించారు.
ఆ సంస్థ నిర్వాహకులు వారికి తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించుకున్నారన్నారు. అయినా లింగా చిత్రంతో నష్టాలకు గురైన వారికి న్యాయం చేయాలని భావించానని రజనీకాంత్ ఇదే విషయం చెప్పారని అన్నారు. చిత్రం విడుదలైన ఐదువారాల తరువాత నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు తనను గానీ, రజనీకాంత్‌ను గానీ కలిసి పరిస్థితి వివరిస్తే వారికి తప్పక న్యాయం చేసేవాళ్లం అన్నారు. అలా కాకుండా కర్ణాటక నుంచి వచ్చారు220 కోట్లు దండుకుపోయారు అంటూ తిరుచ్చి ఏరియా డిస్ట్రిబ్యూటర్ సింగారవేలన్, ఇతర డిస్ట్రిబ్యూటర్లను రెచ్చగొడుతున్నారన్నారు. తాను 220 కోట్లు దోచుకున్నట్లు నిరూపిస్తే వారి నష్టాన్ని ఇప్పుడే సెటిల్ చేస్తానని లేదంటే సింగారవేలన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.