'రజనీకాంత్ జోక్యం చేసుకోవాలి'
లింగా చిత్రం డిస్ట్రిబ్యూటర్లు బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. స్వయంగా రజనీకాంత్ వచ్చి జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు: లింగా చిత్రానికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈనెల 10న నగరంలో నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుమతి కోరుతూ చెన్నైకి చెందిన మెరీనా ఫిలింస్ సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన ఆర్.సింగార వడివేలన్ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించగా పోలీసులు దీన్ని స్వీకరించడానికి నిరాకరించారంటూ ఆయన చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ మంగళవారం విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం బుధవారం తగిన బదులివ్వాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున న్యాయవాది జయప్రకాష్ నారాయణన్ హాజరైన ఈ కేసులో తగిన నిర్ణయం తీసుకోవడానికి పోలీసు కమిషనర్‌కు మరింత కాల వ్యవధి కావాలంటూ కోరారు. అయితే ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు మాత్రం హీరో రజనీకాంత్ వచ్చి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.