రజనీకాంత్ పరిష్కరించాలి
లింగా చిత్రం నష్టపరిహారం వ్యవహారంలో రజనీ కాంత్ కల్పించుకుని పరిష్కరించాలని ఆ చిత్ర కొనుగోలుదారులు విజ్ఞప్తి చేశారు. లింగా చిత్రం ఆశించిన వసూళ్లు సాధించలేదని దీంతో చాలా నష్టపోయినట్లు ఆ చిత్రాన్ని కొనుగోలు చేసిన పలువురు బయ్యర్లు ఈ నెల 10న నిరాహార దీక్షకు సిద్ధమవుతూ అనుమతి కోసం కోర్టును కూడా ఆశ్రయించారు. గురువారం తిరుచ్చి, తంజావూరు ఏరియా డిస్ట్రిబ్యూటర్ సింగారవడివేలన్, ఉత్తర ఆర్కాడు దక్షిణ ఆర్కాడు ఏరియా డిస్ట్రిబ్యూటర్ సాయ్, తిరునెల్వేలి కన్యాకుమారి జిల్లాల డిస్ట్రిబ్యూటర్ రూపన్ తదితరులు సమావేశంలో మాట్లాడుతూ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన లింగా చిత్రం ఆశించిన వసూళ్లు సాధించలేదన్నారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. లింగాచిత్ర హీరో రజనీకాంత్ ఈ వ్యవహారంలో కల్పించుకుని డిస్ట్రిబ్యూటర్లు నష్టాన్ని భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
లింగా చిత్రాన్ని 100 కోట్ల ఖర్చుతో నిర్మించి 90 కోట్లకు విక్రయిస్తే తాము నష్టపరిహారం కోరేవారం కాదన్నారు. అలాంటి రూ.45 కోట్ల ఖర్చుతో లింగా చిత్రాన్ని రూపొందించి 220 కోట్లకు వ్యాపారం చేశారని ఆరోపించారు. లింగా చిత్రాన్ని సెంగల్‌పట్టు ఏరియాకు రూ.14 కోట్లు, కోవై ఏరియాకు రూ.13 కోట్లకు, మదురై ఏరియా రూ.8 కోట్లకు తిరుచ్చి, తంజావూరు ఏరియాలోకి రూ.8 కోట్లకు, దక్షిణ, ఉత్తర ఆర్కాడు ఏరియాలకు రూ.8 కోట్లకు తిరునెల్వేలి, కన్యాకుమారిలో 4.20 కోట్లకు విక్రయించారని వివరించారు. మొత్తం 55 కోట్లకు కొనుగోలు చేయగా 35 కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపారు. రజనీ కాంత్ సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల10న నిరాహార దీక్షకు సిద్ధం అవుతామని హెచ్చరించారు.