కేసు వాపస్ తీసుకోను
కొత్తగా ఆలోచించడం అన్నది సినిమానే జీవితంగా అనుభవిస్తూ దాన్ని కాచి వడబోసిన కమలహాసన్‌కే చెల్లు. ఆది నుంచి ప్రయోగాలకు ముందుండే ఈ ప్రయోజనాత్మక చిత్రాల నాయకుడు తాజాగా కొందరు డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నది కోలీవుడ్ టాక్. కమల్ నటించిన విశ్వరూపం-2, ఉత్తమ విలన్, పాపనాశం చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఆయన ద్విపాత్రాభినయంతో పలు గెటప్‌లతో కనిపించి అబ్బురపరచనున్న ఉత్తమ విలన్ ఏప్రిల్ 10న విడుదలకు ముస్తాబవుతోంది. పూజాకుమార్, ఆండ్రియా, పార్వతిమీనన్, ఊర్వశి, పార్వతి నాయర్‌అంటూ ఐదుగురు నాయికలు నటించిన ఈ చిత్ర విడుదల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు కమల్ ముందు ఒక డిమాండ్ ఉంచారు.
దీని గురించి చెప్పేముందు కాస్త వెనక్కు వెళ్లాలి. విశ్వరూపం చిత్రం విడుదల విషయంలో కమలహాసన్ ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారని భావించారు. అదే డీటీహెచ్ విధానం. థియేటర్లతోపాటు అదే రోజున చిత్రాన్ని ఛానళ్లలోను ప్రసారం చేయాలన్నదే ఆ ప్రయోగం. దీనికి కొన్ని ప్రముఖ ఛానళ్లు ముందుకొచ్చాయి. వాటితో కమల్ ఒప్పందం కూడా చేసుకున్నారు. అంతా సరిగా సాగుతోందనుకున్న సమయంలో కమల్ ప్రయోగాన్ని వ్యతిరేకిస్తూ ఆయన నిర్ణయానికి గండి కొట్టారు. డీటీహెచ్‌లో ప్రసారం చేస్తే విశ్వరూపం చిత్రాన్ని తాము థియేటర్లలో ప్రదర్శించబోమని తెగేసి చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యాజమాన్యానికి వంత పాడారు. దీంతో కమల్ ప్రయోగం ఫలవంతం కాలేదు.
దీంతో చాలా ఆవేదన చెందిన ప్రయోగాల పిపాసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో కొందరు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. దీంతో కమల్ ఎటాక్‌ను ఊహించని వారు హతాశులయ్యారు. ఉత్తమ విలన్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఆ డిస్ట్రిబ్యూటర్లలో కొందరు ఉత్తమ విలన్ చిత్రాన్ని కొనుగోలు చేశారు. వారిప్పుడు తమపై సీసీఐలో చేసిన ఫిర్యాదును వాపస్ తీసుకుంటేనే ఉత్తమ విలన్ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. అయితే వారికి బెదిరేది లేదు. ఫిర్యాదును వెనక్కు తీసుకునేది లేదని కమల్ ఖరాఖండిగా చెప్పినట్టు కోలీవుడ్ టాక్.