Visvarupam -2
-
కేసు వాపస్ తీసుకోను
కొత్తగా ఆలోచించడం అన్నది సినిమానే జీవితంగా అనుభవిస్తూ దాన్ని కాచి వడబోసిన కమలహాసన్‌కే చెల్లు. ఆది నుంచి ప్రయోగాలకు ముందుండే ఈ ప్రయోజనాత్మక చిత్రాల నాయకుడు తాజాగా కొందరు డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నది కోలీవుడ్ టాక్. కమల్ నటించిన విశ్వరూపం-2, ఉత్తమ విలన్, పాపనాశం చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఆయన ద్విపాత్రాభినయంతో పలు గెటప్‌లతో కనిపించి అబ్బురపరచనున్న ఉత్తమ విలన్ ఏప్రిల్ 10న విడుదలకు ముస్తాబవుతోంది. పూజాకుమార్, ఆండ్రియా, పార్వతిమీనన్, ఊర్వశి, పార్వతి నాయర్అంటూ ఐదుగురు నాయికలు నటించిన ఈ చిత్ర విడుదల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు కమల్ ముందు ఒక డిమాండ్ ఉంచారు. దీని గురించి చెప్పేముందు కాస్త వెనక్కు వెళ్లాలి. విశ్వరూపం చిత్రం విడుదల విషయంలో కమలహాసన్ ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారని భావించారు. అదే డీటీహెచ్ విధానం. థియేటర్లతోపాటు అదే రోజున చిత్రాన్ని ఛానళ్లలోను ప్రసారం చేయాలన్నదే ఆ ప్రయోగం. దీనికి కొన్ని ప్రముఖ ఛానళ్లు ముందుకొచ్చాయి. వాటితో కమల్ ఒప్పందం కూడా చేసుకున్నారు. అంతా సరిగా సాగుతోందనుకున్న సమయంలో కమల్ ప్రయోగాన్ని వ్యతిరేకిస్తూ ఆయన నిర్ణయానికి గండి కొట్టారు. డీటీహెచ్‌లో ప్రసారం చేస్తే విశ్వరూపం చిత్రాన్ని తాము థియేటర్లలో ప్రదర్శించబోమని తెగేసి చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యాజమాన్యానికి వంత పాడారు. దీంతో కమల్ ప్రయోగం ఫలవంతం కాలేదు. దీంతో చాలా ఆవేదన చెందిన ప్రయోగాల పిపాసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో కొందరు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. దీంతో కమల్ ఎటాక్‌ను ఊహించని వారు హతాశులయ్యారు. ఉత్తమ విలన్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఆ డిస్ట్రిబ్యూటర్లలో కొందరు ఉత్తమ విలన్ చిత్రాన్ని కొనుగోలు చేశారు. వారిప్పుడు తమపై సీసీఐలో చేసిన ఫిర్యాదును వాపస్ తీసుకుంటేనే ఉత్తమ విలన్ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. అయితే వారికి బెదిరేది లేదు. ఫిర్యాదును వెనక్కు తీసుకునేది లేదని కమల్ ఖరాఖండిగా చెప్పినట్టు కోలీవుడ్ టాక్. -
ఒకటి థ్రిల్లర్..మరొకటి పొలిటికల్...
ప్రముఖ నటుడు, దర్శక - నిర్మాత కమలహాసన్ ఇప్పుడు మంచి జోరు మీదున్నారు. ‘ఉత్తమ విలన్’, ‘విశ్వరూపం-2’, మలయాళ హిట్ ‘దృశ్యం’కు తమిళ రీమేకైన ‘పాపనాశం’ చిత్రాలు మూడింటి షూటింగ్‌నూ ముగించిన ఈ అలుపెరుగని నటుడు ముందుగా ‘ఉత్తమ విలన్’గా పలకరించనున్నారు. ఒకపక్క ఏప్రిల్‌లో ఆ సినిమా విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటూనే, మరోపక్క కొత్త చిత్రానికి సన్నాహాలు ప్రారంభించారు - కమల్. స్వీయ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించడానికి లొకేషన్లను వెతుక్కుంటూ ఇటీవలే ఆయన మారిషస్‌కు కూడా వెళ్ళివచ్చారు. ‘‘పూర్తి యాక్షన్ థ్రిల్లర్ అది. ‘ఉత్తమ విలన్’ రిలీజవగానే, ఈ కొత్త ప్రాజెక్ట్ మొదలవు తుంది. ప్రస్తుతం ఈ థ్రిల్లర్‌కు ప్రీ-ప్రొడక్షన్ పని జరుగుతోంది’’ అని కమలహాసన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే, మరోపక్క ఓ పూర్తి నిడివి హిందీ సినిమా కోసం ఆయన సన్నాహాలు చేస్తున్నారట! అయితే, అది పూర్తిగా రాజకీయ కథాంశమని భోగట్టా. నిర్మాతలు వీరేందర్ అరోరా, అర్జున్ కె. కపూర్లతో కలసి ఆయన ఆ సినిమా నిర్మిస్తారని కోడంబాకమ్ కబురు. మరి వీటి మధ్య ఆమిర్‌ఖాన్ ‘పీకే’ తమిళ రీమేక్‌కు కమల్ ఎలా డేట్లు సర్దుతారన్నది ఆసక్తికరం. ఏమైనా, ‘ఉత్తమ విలన్’ తమిళ పాటలను ఇటీవల డిజిటల్ డౌన్లోడ్ రూపంలో ఆధునికంగా విడుదల చేసి, అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ ‘ఉలగ నాయకన్’ (లోకనాయకుడు) కొత్త స్క్రిప్టులనూ అంతే ఆమళ్ళీ మ్యాజిక్? దునిక శైలిలో తీర్చిదిద్దుతారని వేరే చెప్పాలా? -
లెఫ్ట్ బాటలో...
కమల్‌హాసన్ నటించిన ‘విశ్వరూపం-2’, ‘ఉత్తమ విలన్’, ‘పాపనాశమ్’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దాంతో కమల్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన సన్నాహాల్లో ఉన్నారు. గత ఏడేళ్లుగా ఆయన మనసులో ఓ చిత్రం ఉందట. ఆ చిత్రానికి ఆయన ‘వామ మార్గమ్’ అని టైటిల్ కూడా అనుకున్నారు. అంటే.. ఎడమ దారి అని అర్థం. దీని గురించి కమల్ చెబుతూ, ‘‘కమ్యూనిస్టులను లెఫ్టిస్ట్‌లు అంటారు. అలాగే, అఘోరాలు కూడా వామ మార్గాన్ని అనుసరి స్తుంటారు. కానీ, నా సినిమా వీటికి సంబంధించినది కాదు. వ్యాపారంలో ఉండాల్సిన విలువలు గురించి చెప్పే చిత్రం. ‘మరుదనాయగమ్’, ‘మర్మయోగి’, ‘విరుమాండి’ (తెలుగులో ‘పోతురాజు’), ‘విశ్వరూపం’ చిత్రకథలు నా మనసును ఎలా తొలిచేశాయో ఈ కథ కూడా నన్నలా తొలిచేస్తోంది’’ అన్నారు. -
మరుదనాయగం మళ్లీ మొదలుపెడతా!
గత కొన్నేళ్లుగా ఒకేసారి ఒక చిత్రం మాత్రమే చేస్తూ వచ్చిన కమల్‌హాసన్ ఇప్పుడు ఏకంగా విశ్వరూపం-2, పాపనాశం, ఉత్తమ విలన్.. ఈ మూడు చిత్రాలూ చేశారు. మరో ఆరు నెలల్లో ఒకదాని తర్వాత ఒకటి ఈ మూడు చిత్రాలూ విడుదలవుతాయి. ఈ నేపథ్యంలో తదుపరి ‘టిప్పు సుల్తాన్’ అనే చిత్రం చేయాలనుకుంటున్నారు. అలాగే, తన కలల చిత్రం ‘మరుదనాయగమ్’ని మళ్లీ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇటీవల ఓ సందర్భంలో కమల్ ఈ విషయం గురించి చెబుతూ - ‘‘‘మరుదనాయగమ్’వంటి చిత్రం చేయడానికి డబ్బులు మాత్రమే కాదు.. చాలా సమకూరాలి. ముఖ్యంగా పంపిణీరంగం నుంచి సహకారం కావాలి. ఈ చిత్రాన్ని తమిళ్, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నా. పంపిణీ సరిగ్గా జరిగితేనే సినిమాకి న్యాయం జరుగుతుంది. అందుకని పకడ్బందీగా ప్రణాళికలు వేసుకోవాలి. జస్ట్ అలా అమ్మేసి, ఇలా హ్యాపీగా ఇంటికెళ్లిపోయేంత తేలికైన చిత్రం కాదిది. యూఎస్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మంచి వేదిక కావాలి నాకు. ఫాక్స్, వయొకామ్ వంటి సంస్థలు ముందుకొస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పటికి 30 నిమిషాల చిత్రాన్ని తీశాను. ఇంకా రెండు గంటల సినిమా తీయాల్సి ఉంది. అన్నీ అనుకూలిస్తే.. మొదలుపెడతా’’ అన్నారు. -
మాకూ కథలు రాయండి
సీనియర్ హీరోలకు దర్శకుల కథలు తయారు చేయూలని పద్మభూషణ్ కమల్ హాసన్ కోరారు. దీనిపై ఆయన ప్రస్తావిస్తూ ఇప్పుడొస్తున్న దర్శకులు యువ హీరోలను దృష్టిలో పెట్టుకునే కథలు సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. అలాంటి విధానం సరైనది కాదన్నారు. తన లాంటి సీనియర్ హీరోలకు కథలు సిద్ధం చేయూలని పేర్కొన్నారు. అప్పుడే వైవిధ్యభరిత చిత్రాల్లో వస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అర్థవంతమయిన చిత్రాలు, అవార్డు చిత్రాలు తెరకెక్కుతాయన్నారు. ఈ విషయంలో భాగంగా అమితాబ్ బచ్చన్ చాలా లక్కీ అన్నారు. బాలీవుడ్లో ఇప్పటికే ఆయన కోసమనే కథలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా ఆయన కోసమే చిత్రాలు ఆడుతున్నాయని పేర్కొన్నారు. తానీ వయసులో చెట్లు, పుట్ల చుట్టు తిరుగుతూ డ్యూయెట్లు పాడటం బాగుండదన్నారు. వయసుకు తగ్గ పాత్రలే చేయూలని చెప్పారు. ప్రస్తుతం విశ్వరూపం-2, ఉత్తమ విలన్, దృశ్యం రీమేక్ లాంటి చిత్రాల్లో తన వయసుకు తగ్గ పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. కమల్ పెద్ద కూతురు శ్రుతిహాసన్ ప్రముఖ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. తండ్రి బాటలోనే పయనిస్తూ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ మొదలగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా, పేరు తెచ్చుకుంటున్నారు. ఇక రెండో కూతురు అక్షర కూడా హీరోయిన్గా తెరంగేట్రం చేశారు. ఆమె తొలి చిత్రం గురించి కమల్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అక్షర గురించి తన భావాలను వ్యక్తం చేస్తూ నటన గురించి తనకు ఎలాంటి సూచనలు, సలహాలు అవసరం లేదన్నారు. ఎందుకంటే అక్షర బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బాల్కీ లాంటి సేఫ్ హ్యాండ్లో ఉందని చెప్పారు. నిజం చెప్పాలంటే పాత తరం వారి అడ్వైజ్ ఆమెకు అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో తన కుమార్తెకు తెలుసని, తన సహాయం కోరి ఎప్పుడు రాదని కూడా పేర్కొన్నారు. అక్షరలోను ఆత్మవిశ్వాసం మెండుగా ఉందని చెప్పారు. అక్షర రంగ ప్రవేశం చేస్తున్న హిందీ చిత్రం షమితాబ్లో ధనుష్ హీరోగా, అమితాబ్ బచ్చన్ ముఖ్య భూమికను పోషిస్తున్నారు.