మాకూ కథలు రాయండి
సీనియర్ హీరోలకు దర్శకుల కథలు తయారు చేయూలని పద్మభూషణ్ కమల్ హాసన్ కోరారు. దీనిపై ఆయన ప్రస్తావిస్తూ ఇప్పుడొస్తున్న దర్శకులు యువ హీరోలను దృష్టిలో పెట్టుకునే కథలు సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు. అలాంటి విధానం సరైనది కాదన్నారు. తన లాంటి సీనియర్ హీరోలకు కథలు సిద్ధం చేయూలని పేర్కొన్నారు. అప్పుడే వైవిధ్యభరిత చిత్రాల్లో వస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అర్థవంతమయిన చిత్రాలు, అవార్డు చిత్రాలు తెరకెక్కుతాయన్నారు. ఈ విషయంలో భాగంగా అమితాబ్ బచ్చన్ చాలా లక్కీ అన్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికే ఆయన కోసమనే కథలు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా ఆయన కోసమే చిత్రాలు ఆడుతున్నాయని పేర్కొన్నారు.
తానీ వయసులో చెట్లు, పుట్ల చుట్టు తిరుగుతూ డ్యూయెట్లు పాడటం బాగుండదన్నారు. వయసుకు తగ్గ పాత్రలే చేయూలని చెప్పారు. ప్రస్తుతం విశ్వరూపం-2, ఉత్తమ విలన్, దృశ్యం రీమేక్ లాంటి చిత్రాల్లో తన వయసుకు తగ్గ పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. కమల్ పెద్ద కూతురు శ్రుతిహాసన్ ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. తండ్రి బాటలోనే పయనిస్తూ తమిళం, తెలుగు, మలయాళం, హిందీ మొదలగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా, పేరు తెచ్చుకుంటున్నారు. ఇక రెండో కూతురు అక్షర కూడా హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. ఆమె తొలి చిత్రం గురించి కమల్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
అక్షర గురించి తన భావాలను వ్యక్తం చేస్తూ నటన గురించి తనకు ఎలాంటి సూచనలు, సలహాలు అవసరం లేదన్నారు. ఎందుకంటే అక్షర బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బాల్కీ లాంటి సేఫ్ హ్యాండ్‌లో ఉందని చెప్పారు. నిజం చెప్పాలంటే పాత తరం వారి అడ్వైజ్ ఆమెకు అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో తన కుమార్తెకు తెలుసని, తన సహాయం కోరి ఎప్పుడు రాదని కూడా పేర్కొన్నారు. అక్షరలోను ఆత్మవిశ్వాసం మెండుగా ఉందని చెప్పారు. అక్షర రంగ ప్రవేశం చేస్తున్న హిందీ చిత్రం షమితాబ్‌లో ధనుష్ హీరోగా, అమితాబ్ బచ్చన్ ముఖ్య భూమికను పోషిస్తున్నారు.