Best Villain
-
ఏమప్పా బాలగోవిందు...నేను పొన్నుసామిని!
ఉత్తమ విలన్ జీవా విలనీలో మూసవాసనలు ఉండవు. భయానకం, విరుపు, వెటకారం, హాస్యం కలగలిసి ఒక్కో పాత్రలో ఒక్కరకంగా ఆ విలనీ పండుతుంది. భయానకం: ‘నాకు పెద్దగా కోరికలేమీ లేవు. మూడే మూడు కోరికలు. 1. నాలుగు కోట్లు. 2. డబుల్ ఏసీ రూమ్. 3. అందమైన ఆడపిల్ల. చివరికి ఏమైంది? నాలుగు కోట్లు మటాష్. డబుల్ ఏసీ రూమ్ కాదు కదా...సింగిల్ ఏసీ రూమ్ కూడా లేక... చివరికి ఇలా అడవుల పాలయ్యాం’‘మృగం’ సినిమాలో ప్రతినాయకుడిగా ఈ డైలాగు చెబుతున్నప్పుడు జీవాలో కనిపించే కసి లోతేమిటో తెలిసిపోతుంది.అమ్మో జీవా! ‘ఆ భద్రగాడికి వేలకు వేలు ఇచ్చింది నీ మీద చేయి వేయడానికి... తీయడానికి కాదు’ అని ఆడపిల్లను వేధిస్తూ ‘కార్తికేయ’ సినిమాలో శంకరన్నగా జుగుప్సను రాజేయగలడు. వామ్మో జీవా!! ‘ఏమప్పా బాలగోవిందు! నేను మీ నాన్న ఫ్రెండ్‌ని అప్పా. ఇంటికెళ్లాలి... అడ్రస్ చెప్పు’ అని హీరోని అడిగి... అతని జవాబు విని కంగుతిన్న తంబిదురై అనుచరుడు పొన్నుసామిగా ‘దేశముదురు’ సినిమాలో కితకితలు పెట్టించగలడు.. ఏడిపిస్తూనే నవ్వించగలడు. నవ్విస్తూనే ఏడిపించగలడు. కొన్నిసార్లు ఆయన పెదవులు కాదు ఎర్రటి కళ్లు డైలాగులు చెబుతాయి. ∙∙ నాటకాలు, లఘుచిత్రాలు, డాక్యుమెంటరీ లలో నటించి నటనలో రాటుదేలిన జీవా అసలు పేరు కొచ్చర్ల దయారత్నం. ఈ పేరేదో పొడుగ్గా ఉందని దయారత్నం పేరుని ‘జీవా’గా మార్చారు ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్. ఆయన ‘తొలి కోడి కూసింది’ చిత్రంతో వెండి తెరకు పరిచమయ్యారు జీవా. ఈ సినిమాలోని పాత్ర కోసం వేలాది మంది యువకులు పోటీ పడితే తన కళ్లతో ఆ పాత్రను దక్కించుకున్నారు జీవా. కళ్లతో దక్కించుకోవడం ఏమిటి? అనే కదా డౌటు. విషయం ఏమిటంటే ‘తొలి కోడి కూసింది’ సినిమాకు వేలాది ఫొటోలు వచ్చాయి. గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ఈ ఫొటోల్లో నుంచి ఒక ఫొటోలోని రెండు కళ్లు బాలచందర్ని ఆకర్షించాయి. అలా దయారత్నం కాస్త జీవా అయ్యాడు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కెరీర్ తొలిరోజుల్లో ఆయనవేసే పాత్రల్లో విపరీతమైన కోపం, కసి కనిపించేవి. ఇప్పుడు వాటి స్థానంలో కామెడీ అంతర్లీనమై పోయింది. ‘జగ్గా హైదరబాదీ’గా ‘సత్య’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న జీవా... తెలుగు విలన్లలో చెప్పుకోదగ్గ విలన్. మెచ్చుకో దగ్గ విలన్. ఉత్తమవిలన్. -
సైలెంట్ విలన్!
‘ఆయన ఎవరనుకుంటున్నారు?‘‘సాక్షాత్తు ఎంపీగారి కుమారుడు, యూత్ లీడర్... ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారా?’’‘‘తప్పు చేసిన వాడిని జైల్లో వేయక మెడలో దండలు వేసి ఊరేగిస్తారా?’’చట్టంతో వారికి పనిలేదు. రూల్స్‌తో వారికి పనిలేదు. వారికి తెలిసిందల్లా వాటిని తమ దారిలోకి తెచ్చుకోవడం. అవి దారిలోకి వస్తే రాష్ట్రాన్ని సైతం అమెరికాకు అమ్ముకునే తెలివితేటలు ఉన్నాయి ఈ తండ్రీకొడుకులకు. అందుకే ఆ యూత్లీడర్ ఏమంటున్నాడో చూడండి.‘‘నన్ను లోపలెయ్యడానికి వాడెవ్వడు.మా నాన్నతో ఢిల్లీతో మాట్లాడించి వాడ్ని ట్రాన్సఫర్ చేయిస్తానంతే’’ ‘రక్షణ’ సినిమాలో యూత్లీడర్ కావచ్చు. ‘నువ్వు నేను’ సినిమాలో మాటలు లేకుండా హీరోహీరోయిన్లను వెంటాడే రౌడీ కావచ్చు.... ఏ పాత్ర చేసినా బెనర్జీకి బారెడు డైలాగులు ఉండవు. దీనికి జవాబు అడిగితే ఆయన దగ్గర స్పష్టమైన సమాధానం లేకపోవచ్చుగానీ... భయపెట్టించడానికి బారెడు డైలాగులు మాత్రమే అక్కర్లేదని బెనర్జీ నటన పరిచయం ఉన్నవాళ్లకు అర్థమవుతుంది.చిన్న డైలాగుల్లో సైతం లోతైన నటనను ప్రదర్శించడంలో తనదైన మార్క్ సృష్టించుకున్నారు బెనర్జీ. సినిమాల్లోకి వెళ్లాలని, నటుడు కావాలని బెనర్జీ పెద్దగా ఎప్పుడూ అనుకోలేదు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే... ఒక నీటి ప్రవాహంలా ఎటంటే అటు వెళ్లారు. మద్రాస్‌లో హోటల్ మేనేజ్మెంట్ చదివి మధ్యలోనే వదిలేశారు. ఒక కంపెనీ బ్రాంచ్ మేనేజర్‌గా విజయనగరంలో ఆరు సంవత్సరాలు పనిచేశారు. అక్కడ మంచి స్నేహితులను సంపాదించుకున్నారు. వారి సలహా వల్లో ఏమోగానీ ఆ తరువాత సినిమా ఫీల్డ్‌కు వెళ్లారు. యు.విశ్వేశ్వర్రావు దగ్గర ఒక సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేశారు. అసిస్టెంట్‌గా విధులు నిర్వహించడంతో పాటు ఆ సినిమాలో నటించారు కూడా. అలా తొలి సినిమాతోనే అసిస్టెంట్ డైరెక్టర్‌తో పాటు నటుడు అయ్యారు.‘థర్టీఇయర్స్ ఇండస్ట్రీ’ అనిపించుకున్నారు.‘అది చేస్తా’, ‘ఇది చేస్తా’, ‘ఇరగదీస్తా’ ఇలాంటి ఆడంబరపు మాటలేవీ బెనర్జీ నోటి నుంచి వినిపించవు. అలవి కాని స్వప్నాలు కూడా ఆయనలో కనిపించవు. ఆయన మాటల్లో లోతు కనిపిస్తుంది. అడపాదడపా ఇలాంటి కవితలు కూడా వినిపిస్తాయి. ‘ప్రపంచం ఒక మధుశాల జీవితం అనేది ఒక మత్తు ఒకడికి చనిపోవాలనే మత్తు. ఒకడికి బతకాలనే మత్తు. ఒకడికి సంపాదించాలనే మత్తు. ఒకడికి ప్రేమ మత్తు. నేను కొద్దిగానే తాగా. నా మత్తు పొద్దుటి కల్లా దిగిపోతుంది. ఆ మత్తు మాత్రం జీవితం వెళ్లిపోయేవరకు ఉంటుంది’. ఆయనలోని తాత్వికత మాట ఎలా ఉన్నా.... తక్కువ మాటలతో ఎక్కువ భయపెట్టే విలన్ల వరుసలో బెనర్జీ తప్పనిసరిగా ఉంటారు. -
ఈ బంటిగాడికి తిక్క రేగితే...
‘నేను జీవితంలో ఒక్క మంచిపనీ చేయలేదు.ఈ పని చేయనివ్వు’ అంటున్నాడు బొండు తన ఆత్మీయుడితో.ఇంతకీ మంచిపని అంటే? ఒకరి కోసం ప్రాణం ఇవ్వడం కాదు.ఒకరి పగ కోసం ప్రాణం తీయడం... రక్తచరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకోవడం! నాయక్ అంటే కంత్రి. వాడి తమ్ముడు బంటి పరమ కంత్రి. ఈ కంత్రి అంటే ఆ కంత్రికి ఎనలేని ఇష్టం. ‘బంటీ బేటా’ అని ప్రేమగా పిలుచుకుంటాడు. నాయక్‌కు బంటి తమ్ముడు మాత్రమే కాదు అతడికి కుడిభుజం కూడా.‘ఏమ్రా బంటీ ఇంత లేటు జేసినవ్’ అని ‘దూకుడు’ సినిమాలో మహేష్‌బాబుతో అనిపించుకున్న ఈ బంటి అసలు పేరు అజాజ్‌ఖాన్. ‘రక్తచరిత్ర’ ‘దూకుడు’ ‘నాయక్’ ‘బాద్షా’ ‘హార్ట్ ఎటాక్’ ‘వేట’ ‘రోగ్’ సినిమాలతో ‘యువ విలన్’గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఖాన్ మొదట ముంబైలో మోడలింగ్ చేశాడు. కండలు తిరిగిన దేహంతో కనబడే ఖాన్ ‘కరమ్ అప్నా అప్నా’ ‘క్యా హోగా నిమ్మో కా’ ‘రహే తేరా ఆశీర్వాద్’ ‘కహానీ హమారీ మహాభారత్ కీ’...మొదలైన టీవీషోలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘అల్లాకే బందే’ ‘రక్తచరిత్ర’ సినిమాలతో వెండితెరకు పరిచయమయ్యాడు. రియాల్టీ టీవీషో ‘బిగ్‌బాస్–7’తో మరింత పాపులర్ అయ్యాడు. సెయింట్ జేవియర్ స్కూల్లో చదువుకునే రోజుల్లో చదువు మీద కంటే సాంస్కృతిక కార్యక్రమాల మీదే ఎక్కువ ఆసక్తి కనబరిచేవాడు ఖాన్. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాకపోవడం లోపం అనుకోవడం లేదు ఖాన్. ఆయన దృష్టిలో లోపం అంటే కల కనకపోవడం. కల కని కష్టపడకపోవడం. కష్టపడినా.. త్వరగానే నిరాశ చెందడం. టైమ్ కోసం ఎదురుచూడక పోవడం. టైమ్ వచ్చినప్పుడు ఫిట్‌గా లేకపోవడం. అందుకే ఆరోగ్యంపై అమితశ్రద్ధ కనబరుస్తాడు ఖాన్.‘‘గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. దానికి అంకితభావం కూడా తోడుకావాలి’’ అంటాడు ఖాన్. ‘సినిమా ఫీల్డ్‌లో మనకో గాడ్‌ఫాదర్ ఉండాలి అనుకుంటారు. ఉన్నాడనుకుందాం. ఆయన పాత్ర మనల్ని పరిచయం చేయడం వరకే. ప్రతిభతో నిరూపించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది’’ అని చెప్పే ఖాన్ ఇద్దరు దర్శకుల గురించి చెబుతాడు.‘‘మనం ఏ నేపథ్యం నుంచి వచ్చామనే దానితో రామ్‌గోపాల్‌వర్మ, మహేష్‌భట్ లాంటి దర్శకులకు పనిలేదు. మనలో ఏమాత్రం ప్రతిభ ఉన్నా భుజం తడతారు’’ అనే అజాజ్ఖాన్కు టీవీలో నటించడం కంటే సినిమాల్లో నటించడమంటేనే ఎక్కువ ఇష్టం.‘‘టీవీలో కృత్రిమత్వం ఉంటుంది. సినిమాల్లో వాస్తవం ఉంటుంది’’ అంటాడు ఖాన్.వాస్తవపాత్రలతో ‘యువవిలన్’గా ఆయన మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
ఐయామ్ కనకాంబ్రం... బ్రదర్ ఆఫ్ ఏకాంబ్రం
ఏకాంబ్రం తమ్ముడి పేరు కనకాంబ్రం.పేరులో బంగారం ఉండొచ్చుగానీ ఆయన మనసు మాత్రం విషమయం. ఎప్పుడూ ఎవరి మీదో ఒకరి మీద నిప్పులు కక్కుతూనే ఉంటాడు.‘సాలా మర్గయా’ అని అరుస్తూనే ఉంటాడు.తనకు తానే నిప్పుతో వాతలు పెట్టుకుంటూ ‘రా...యు...డూ’ అని పెద్దగా అరుస్తున్న అతడి పేరు భూపతి. అతనికేమైనా పిచ్చా? కాదు కసి! ఎవరి మీద? ఇదిగో ఆయన మాటల్లోనే వినండి.‘ఆ రాయుడు వంశం మీద నా పగ చల్లారకుండా రగులుతూ ఉండడానికి ఈ వాతలు పెట్టుకుంటున్నాను’. చెవిని కిందికిలాగుతూ విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చే కనకాంబ్రంగా ‘గ్యాంగ్‌లీడర్’ సినిమాలో, అవమానభారంతో రగిలిపోయే అగ్నిపర్వతంలా కనిపించే భూపతి పాత్రలో ‘పెదరాయుడు’లో కనిపించిన ఆనంద్‌రాజ్ తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత విలన్. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘యాక్షన్ జాక్సన్’తో బాలీవుడ్‌కు కూడా పరిచయమైన ఆనంద్‌రాజ్ పాండిచ్చేరిలో పుట్టి పెరిగాడు. తండ్రి వ్యాపారవేత్త. మంచి ఫిజిక్ ఉండడంతో కుమారుడు పోలీస్ ఆఫీసర్ కావాలనుకునేవాడు తండ్రి. కానీ ఆనంద్కేమో సినిమాలు ఇష్టం. ఒక ఫైన్‌మార్నింగ్... ‘‘నాకు నటన మీద ఆసక్తి ఉంది’’ అని ఆనంద్‌రాజ్ చెప్పడంతో తల్లిదండ్రులేమీ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. అలా మద్రాస్‌లోని ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. ఇక్కడ శివరాజ్ కుమార్ (కన్నడ హీరో) ఆనంద్‌కు సహ విద్యార్థి.కమలహాసన్‌తో సహా రకరకాల క్రాఫ్ట్‌లకు సంబంధించిన ప్రముఖులు గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వస్తుండేవాళ్లు. అలా వచ్చిన వారిలో కొందరు, విద్యార్థులను పరిశీలిస్తూ ‘నువ్వు భవిష్యత్‌లో హీరో అవుతావు’, ‘విలన్ అవుతావు’ అని జోస్యం చెప్పేవాళ్లు. అయితే ఆనంద్ విషయంలో మాత్రం ఎవరూ ఏమీ చెప్పలేదు. దీంతో డీలాపడిపోయేవాడు ఆనంద్. యాక్టింగ్ కోర్సు పూర్తికాగానే అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తాయిని భావించాడు. అయితే అలాంటిదేమీ జరగలేదు.సత్యరాజ్ విలన్ పాత్రల నుంచి హీరో పాత్రలు చేస్తున్న కాలం అది. అంటే విలన్ సీటు ఖాళీగానే ఉంది. ఈ టైమ్‌లోనే ‘ఒరువర్ వాళుమ్ ఆలయం’, ‘ఉరిమై గీతం’ సినిమాలతో చిత్రరంగంలోకి ప్రవేశించాడు ఆనంద్‌రాజ్. ఈ రెండు సినిమాలు బ్లాక్బస్టర్లు అయినప్పటికీ పి.వాసు సినిమా ‘ఎన్ తంగై పడిచ్చవ’ సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ‘‘హీరో పాత్రలో ఎంత దమ్ముందో... నువ్వు చేస్తున్న విలన్ పాత్రల్లో కూడా అంతే దమ్ముంది’’ అంటూ తన ఆరాధ్య నటుడైన శివాజీ గణేషన్ తనకు ఇచ్చిన కాంప్లిమెంట్ను ఎప్పుడూ గుర్తు చేసుకునే ఆనంద్‌రాజ్... ముద్దుల మామయ్య, లంకేశ్వరుడు, ఒంటరి పోరాటం, బావాబావమరిది, శుభాకాంక్షలు, పెదరాయుడు, గ్యాంగ్‌లీడర్... మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. -
‘ఏమ్రా లొల్లిబెడుతున్నవ్?’
రౌతాల గురించి మీకేమైనా తెలుసా? అయితే వినండి...ఆరడుగులకు పైగా హైట్ ఉండే రౌతాల... అరాచకాలకు తిరుగులేని అడ్డా. తాను చెప్పిందే నిజం. తన నోటి నుంచి వచ్చిందే శాసనం. తాను నేరాలు, ఘోరాలు చేస్తున్నాడని పోలీసులకు తెలిసినా సరే...‘కేసు ఏమని రాసుకోమంటారు?’ అని భయంతో కూడిన వినయంతో అడుగుతారే తప్ప... ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు.‘గెట్ల రాస్తావు?రాస్కోరాస్కో’ అని పోలీసులకు ఆర్డర్ వేసే రౌతాలకు ఎవరూ ఎదురు మాట్లాడడానికి లేదు. ‘నువ్వు చేస్తున్నది అరాచకం’ అని చెప్పడానికి లేదు.చెబితే?‘ఏయ్... ఏమ్రా లొల్లిబెడుతున్నవ్?’ అని గద్దించగలడు. లొల్లిని ఆపడానికి రక్తం చూడగలడు ఈ రౌతాల! ∙∙ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా మంచి పేరు ఉన్న కోళ్ల అశోక్ కుమార్ డిక్షనరీలో ఏ మూలలోనూ ‘నటన’ అనే పదం లేదు. బియ్యపు గింజ మీద తినేవారి పేరు రాసి ఉన్నట్లుగానే... ప్రతి పాత్ర మీద నటుడి పేరు రాసి ఉంటుందేమో! లేకపోతే నటన మీద ఆసక్తి లేని, నాటకాల్లోనైనా చిన్న పాత్ర వేయని అశోక్ కుమార్ 70 సినిమాల్లో నటించడం ఏమిటి? ఇంతకీ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ ‘విలన్ అశోక్ కుమార్’ ఎలా అయ్యారు? తాను నిర్మిస్తున్న ‘చెవిలో పువ్వు’ సినిమాలో నటించమని దర్శకుడు కోడి రామకృష్ణని అడిగారు అశోక్. ‘‘అలాగే నటిస్తానుగానీ... నువ్వు నా సినిమాలో నటించాలి’’ బదులుగా అన్నారు రామకృష్ణ.‘‘నేను నటించడం ఏమిటండీ... నాకు బొత్తిగా నటన రాదు. పైగా బోలెడు సిగ్గు’’ అన్నారు అశోక్.‘‘అదంతా నేను చూసుకుంటానుగానీ... నువ్వు నా సినిమాలో నటించు’’ అంటూ అశోక్ కుమార్‌ను తొలిసారిగా ‘భారత్‌బంద్’లో నటింపజేశారు.అలా అశోక్ కుమార్ కాస్తా రౌతాల అయిపోయాడు. విలన్‌గా బోలెడు గుర్తింపు వచ్చింది. ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలో అశోక్ చేసిన దొర కొడుకు పాత్ర ఆయనకు మరింత గుర్తింపు తెచ్చింది. నిజానికి ఈ పాత్రను చరణ్‌రాజ్ చేయాల్సింది. ఎందుకనో అది అశోక్‌ను వరించింది.‘అశోక్ కుమార్‌కు టైలర్‌మేడ్ పాత్ర’ అన్నారు అందరు.‘‘నటన అంటే భయంగా ఫీలవ్వను. ఆ క్యారెక్టర్ ఊహించుకొని అందులోకి వెళ్లిపోతాను’’ అనే అశోక్ కుమార్ బాడీ లాంగ్వేజ్‌తో విలనిజాన్ని పండించడంలో దిట్ట అనిపించుకున్నారు. అందుకే అంటారు... ఆయన జుట్టు కూడా నటిస్తుందని! -
ఎత్తండ్రా పాడా... కొట్టండ్రా డప్పు!
‘ఏ స్పాట్ పెట్టినా / ఏ గేమ్ ఆడినా భగవతిదేరా పైచేయి/ ఎత్తండ్రా పాడా కొట్టండ్రా డప్పు’ భగవతి స్పాట్ పెడితే చచ్చినట్టే. పాడె ఎత్తాల్సిందే. డప్పు కొట్టాల్సిందే! ‘రణం’ సినిమాలో ‘భగవతి’ బాగా పాపులర్ అయ్యాడు. ‘ఎవరీ భగవతి?’ అనే ఆసక్తిని పెంచాడు. దిట్టంగా కనిపించే మలయాళ నటుడు బీజూ మీనన్ ‘భగవతి’ పాత్రకు ప్రాణం పోశాడు. ‘రణం’ సినిమాలో ఆవేశం, కోపం, ప్రత్యక్షహింసకు నిలువెత్తు కటౌట్లా కనిపించిన బీజూ మీనన్ ‘ఖతర్నాక్’ సినిమాలో మాత్రం చాప కింద విషంలాంటి లాయర్ పాత్రలో...‘పోలీసులకు తెలివిగా స్పిన్ బౌలింగ్ చేసే కిలాడి కావాలి.వాడి ఒంట్లో 420 క్రిమినల్ గ్రూప్ బ్లడ్ ఉండాలి’లాంటి డైలాగులతో మెప్పించాడు. ∙∙ మలయాళం టీవి సీరియల్స్‌తో తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించాడు బీజూ మీనన్. ‘పుత్రన్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో విలన్, సెకండ్ హీరోగా నటించాడు. హీరోగా నటించిన చిత్రాలలో ఎక్కువ భాగం పరాజయం పొందాయి. సురేష్ గోపితో కలిసి ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించాడు.డబ్బుల కోసం ఎడాపెడా నటించే నటుడు కాదు బీజూ. 2007–2010 మధ్యలో ఒకేరకమైన పోలీసు పాత్రల్లో నటించాల్సివచ్చింది. చివరికి ఒక దశలో విరక్తి వచ్చినంత పనైంది.‘‘ఇక నేను పోలీసు పాత్రల్లో నటించను’’ అని బహిరంగంగా ప్రకటించాడు కూడా.ఎవరూ పోలీసు పాత్రలు ఆఫర్ చేయకుండా పనిగట్టుకొని తలవెంట్రుకలు, గెడ్డం పెంచాడు!ఒక పాత్రను నిండుగా పండించడానికి తన జీవితంలో నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాడు.ఉదాహరణకు పోలీసు పాత్రలో కోపాన్ని ప్రదర్శించే సన్నివేశాల్లో... తన తండ్రి హావభావాలను గుర్తుతెచ్చుకునేవాడు. వాళ్ల నాన్న పోలీసు. కోపంగా ఉన్నప్పుడు... ఆయన ఇంట్లో ప్రదర్శించిన కోపం బీజూ మైండ్‌లో ఫిక్సయిపోయింది. ఇక ‘రోల్ లెంత్’ అనేదానిపై బీజూకు ఎలాంటి భ్రమలు లేవు.‘‘పాత్ర నిడివి పెద్దగా ఉంటేనే పేరొస్తుంది అనే మాటను నేను నమ్మను. ఎంత పెద్ద పాత్రలో నటించావు, ఎంత చిన్నపాత్రలో నటించావు అనేదాని కంటే... ఇచ్చిన పాత్రకు ఎంత న్యాయం చేశావు అనేది ముఖ్యం’’ అంటాడు బీజూ.టెక్నాలజీ మారినట్లే... నటుడు అనేవాడు కూడా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ ఉండాలి అనే బీజూ మూసా పాత్రలు కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యం కనిపించే పాత్రల్లో నటించడానికి ఇష్టపడతాడు. ‘‘నటన అనేదానికి అవకాశం ఉందంటే అది హీరోనా, విలనా, సెకండ్ హీరోనా. చిన్నపాత్ర... అనేది చూడను’’ అంటున్న బీజూ మీనన్ ఏ పాత్రలో అయినా ఇమిడిపోయే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. -
కరకు చూపుల... కాదల్ దండపాణి
రాజేంద్రకు మూడు విషయాలు అంటే మాచెడ్డ ఇష్టం. 1.జాతి 2.అంతస్తు 3. గౌరవం...ఈ మూడింటికి ఏ మాత్రం తేడా వచ్చినా, భయపెట్టించేట్టు కనిపించే రాజేంద్ర మరింత భయానకంగా కనిపించగలడు. ఎంత దుర్మార్గానికైనా తెగించగలడు. జాతి, అంతస్తు, గౌరవం... వీటికి ఎవరైనా దూరంగా జరిగి పెళ్లి చేసుకుంటే... వరుడిని మర్యాదగా కిడ్నాప్ చేసుకొచ్చి.. ‘‘ఆ పిల్ల తండ్రికి నువ్వు నచ్చలా. నీకు ఆ పిల్లకు ఏ సంబంధం లేదని రాసివ్వు’’ అని చాలా అమర్యాదగా బెదిరించగలడు. బయటి వాళ్ల సంగతి సరే... సొంత కూతురే ప్రేమించి పెళ్లి చేసుకుంటే?అమ్మో! ఇంకేమైనా ఉందా!! ‘‘తెంచేయ్. ఆ తాళిని నీ మెడలో నుంచి తెంచేయ్. తాళిని నీ మెడలో నుంచి తీస్తావా? చేయి విరిచేయనా?’’ అంటూ కన్న కూతురు ముందు రంకెలు వేయగలడు. ఇక ‘లంక రాజు’ తక్కువోడా ఏమిటి?ఏడుస్తున్న కూతురిని చూస్తూ తన చుట్టూ ఉన్న గూండాలతో ఏమంటున్నాడో చూడండి...‘‘అక్క ఏడుస్తుంది. ఈ విషయం జనాలకు తెలిస్తే ఏమవుతుందిరా?’’‘‘పరువు పోతుందన్నా’’ అంటారు గూండాలు. అప్పుడు ‘లంక రాజు’ ఎంత క్రూరంగా మాట్లాడతాడంటే... ‘‘నేను, నా పరువు ప్రతిష్ఠ బెజవాడలో ఉండాలంటే దీన్నైనా చంపాలి. వాడినైనా చంపాలి’’ ‘ప్రేమిస్తే’ సినిమాలో రాజేంద్ర కావచ్చు, ‘కృష్ణ’ సినిమాలో ‘లంక రాజు’ కావచ్చు... డైలాగుల కంటే పర్సనాలిటీ, హావభావాలతోనే తెగ భయపెట్టించాడు కాదల్ దండపాణి.సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందు దిండిగల్ (తమిళనాడు) నగరంలో దండపాణి రకరకాల వ్యాపారాలు చేసేవాడు. తన వ్యాపారమేదో తాను చేసుకుంటున్న దండపాణి డైరెక్టర్ బాలాజీ శక్తివేల్ దృష్టిలో పడ్డాడు. శక్తివేల్ స్నేహితుల్లో ఒకరు దండపాణి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో చూపించాడు. ఇది సినిమాల్లో అవకాశం కోసం దిగిన ఫొటో కాదు. ఏదో పని కోసం దిగింది. ఫొటో చూసీ చూడగానే ‘నా సినిమాలో ఇతనే హీరోయిన్ తండ్రి’ అనే నిర్ణయానికి వచ్చాడు శక్తివేల్. ‘‘నువ్వు పెద్దగా నటించనక్కర్లేదు. నీ సహజశైలిలో డైలాగులు చెప్పు చాలు’’ అని చెప్పాడు శక్తివేల్. అలా ‘కాదల్’ (తెలుగులో ప్రేమిస్తే) సినిమాలో హీరోయిన్ తండ్రి వేషం ఇచ్చాడు. ఈ పాత్ర దండపాణిని ‘కాదల్ దండపాణి’ని చేసింది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించేలా చేసింది. వృత్తిరీత్యా దండపాణి వ్యాపారి. ప్రవృత్తిరీత్యా నటుడు. అయితే తాను ప్రేమించిన నటనే అతడిని నాలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సుపరిచితుడిని చేసింది.‘ప్రేమిస్తే’ ‘రాజుభాయ్’ ‘ముని’ ‘కృష్ణ’ ‘ఆంజనేయులు’ ‘రేసుగుర్రం’...సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కాదల్ దండపాణి 2014లో ఈలోకాన్ని వీడి వెళ్లారు. కరకు చూపులతో, కఠినమైన గొంతుతో తనదైన విలనిజాన్ని వెండితెరపై ప్రదర్శించాడు కాదల్ దండపాణి. -
కాళీ నుంచి సన్యాసినాయుడి వరకు!
ఉత్తమ విలన్ ‘నాకెందుకండీ రాజకీయం. ఏదో రౌడీయిజం మీద బతుకుతున్నాను’ అంటాడు కాళీ. అంతమాత్రానా భజనపరులు ఊరుకుంటారా ఏమిటి?‘తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు... రౌడీ ముదిరి రాజకీయ నాయకుడు అవుతాడు’ అని ఉపదేశించి రంగంలోకి దించుతారు. ఇక అప్పుడు కాళీని ఆపతరమా! రాజకీయం అండతో చెలరేగిపోయే రౌడీ ‘కాళీ’గా ‘ప్రతిఘటన’ సినిమాలో అదరగొట్టేశారు చరణ్‌రాజ్. ఇప్పటికీ చరణ్‌రాజ్‌ను ‘కాళీ’గానే గుర్తుపెట్టుకుంటారు. పచ్చి రౌడీయిజం చలాయించే కాళీ పాత్ర నుంచి ‘పైసా’లో ఎలాగైనా సరే సీఎం కావాలనుకునే సన్యాసినాయుడు పాత్ర వరకు...ఆ పాత్రలలోని సారాన్ని, జీవాన్ని కళ్లకు కట్టిన చరణ్‌రాజ్ కన్నడంలో చేసిన తొలి సినిమా హిట్ అయింది. ఆ తరువాత పది సినిమాల్లో హీరోగా చేశారు. ఆ సమయంలోనే ‘ప్రతిఘటన’ సినిమాలో ‘కాళీ’ పాత్ర వెదుక్కుంటూ వచ్చింది. ‘విలన్ వేషాలేంటి?’ అని వెనక్కి లాగారు కొందరు. మరోవైపు... ‘టీ.కృష్ణ గొప్ప దర్శకుడు. నీకు నటుడిగా మంచి పేరు వస్తుంది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు’ అన్నారు మరికొందరు. సరే అంటూ ‘ప్రతిఘటన’ సినిమాలో నటించారు. ‘కాళీ’గా అతని పేరు మారుమోగిపోయింది. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించి ‘ఉత్తమ విలన్’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు చరణ్‌రాజ్. హైస్కూల్ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాడు చరణ్‌రాజ్.‘నువ్వు హీరో అవుతావు’ అని మునగ చెట్టెక్కించేవారు స్నేహితులు. గురురాజ్ భట్ అనే స్నేహితుడు మాత్రం ‘నీకు అంత సీన్ లేదు’ అనేవాడు. ఇక అప్పటి నుంచి పౌరుషం పుట్టుకొచ్చింది. ఎలాగైనా సరే సినిమాల్లో నటించాలనే పట్టుదల పెరిగింది. ‘నాన్నా... నేను సినిమాల్లోకి వెళ్లాలను కుంటున్నాను’ అని అన్నప్పుడల్లా చెంప చెళ్లుమనేది. ఇలా అయితే కుదరదని ఒక ఫైన్ మార్నింగ్ ఇంట్లో నుంచి డబ్బులు కొట్టేసి సొంతూరు బెల్గాం నుంచి బెంగళూరుకు పారిపోయి వచ్చాడు. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు. నక్కతోకను చరణ్‌రాజ్ తొక్కాడో లేదోగానీ ఒకరోజు దర్శకుడు యస్.డి.సిద్దలింగయ్య ‘కొత్తవాళ్లతో సినిమా తీస్తున్నాను. హీరోగా నటిస్తావా?’ అని అడిగాడు. ఇక చరణ్‌రాజ్ సంతోషానికి హద్దు లేదు. ఆ సినిమా హిట్ కావడంతో పదిమంది దృష్టిలో పడ్డాడు.‘హీరోగానే చేస్తాను’ అనే పరిమితి పెట్టుకోకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు బ్రహ్మానంద. మధ్యలో ఈ బ్రహ్మానంద ఏమిటి అనుకుంటున్నారా? ఇది ఆయన అసలు పేరు! -
స్టైలిష్ విలన్...
మన మార్కు సంప్రదాయ విలన్లు మనకు దూరమై ఇప్పుడు సరికొత్త విలన్లు వస్తున్నారని కొన్ని సినిమాలలో విలన్ క్యారెక్టర్లను చూస్తే సులభంగా అర్థమైపోతుంది. ‘ఖైదీ నంబర్:150 కూడా ఇలాంటి చిత్రమే.పేదవాళ్లను నైసుగా మోసం చేసే నక్క తెలివితేటలు ఉన్న ఎం.ఎన్.సి. యజమాని అగర్వాల్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు తొలి పరిచయం అయ్యాడు తరుణ్ అరోరా. స్టైలిష్‌గా కనిపిస్తూనే క్రూరత్వాన్ని ప్రదర్శించే పాత్రలో నటించి ‘ఉత్తమ విలన్ నిపించుకున్నాడు.రంజీవి సెకండ్ ఇన్నింగ్స్ సినిమా ‘ఖైదీ నం: 150లో చిన్న పాత్ర దొరికినా గొప్పే అనుకునే పరిస్థితుల్లో ‘ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎవరిని వరిస్తుంది? అనే ఆసక్తి నెలకొని ఉండేది. అలాంటి ఆసక్తికర సమయాల్లో తరుణ్ అరోరా పేరు వినిపించింది. ‘ఖైదీనం:150లో విలన్ క్యారెక్టర్ అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటికి న్యాయం చేస్తూ ‘ఉత్తమ విలన్ అనిపించుకున్నాడు తరుణ్ అరోరా. పంజాబీ అయిన అరోరా పెరిగింది మాత్రం అస్సాంలో.బెంగళూరులో ‘హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న రోజుల్లో మోడలింగ్ చేశాడు తరుణ్ అరోరా. ‘ప్యార్ మే కభీ కభీ సినిమాతో యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టాడు. ‘జబ్ వుయ్ మెట్ తరువాత అవకాశాలు వెల్లువెత్తాయిగానీ అన్నీ ఒకే మూసలో ఉన్నాయి. దీంతో బెంగళూరుకు వెనక్కి వచ్చాడు. అక్కడ ఆయనకో రెస్టారెంట్ ఉంది. ఆ సమయంలోనే ‘కనితన్ అనే తమిళ సినిమాలో విలన్ పాత్ర వెదుక్కుంటూ వచ్చింది. ‘మా హీరో చాక్లెట్ బాయ్ కదా అన్నారు కో ఆర్డినేటర్లు.అయితే అక్కడ కావల్సింది మాంచి శరీరదారుఢ్యంతో ఉన్న సై్టలిష్ విలన్. దీనికి తరుణ్ అరోరా పక్కాగా సరిపోయాడు. ఫేక్ సర్టిఫికెట్ల ధందా నిర్వహించే తురా సర్కార్‌గా తొలిసారిగా కనితన్లో విలన్‌గా కనిపించాడు. ఈ పాత్ర కోసం 7 కిలోలు బరువు కూడా పెరిగాడు.తురా సర్కార్ తక్కువగా మాట్లాడతాడు. అందుకే డైలాగులు కూడా చిన్నవిగానే ఉండేవి. వాటిని అసిస్టెంట్ çసహకారంతో నేర్చుకునేవాడు. ‘జబ్ వుయ్ మెట్ సినిమాలో నటిస్తున్నప్పుడు టేకుల మీద టేకులు తీసుకునేవాడు తరుణ్. అయినప్పటికీ ఆ సినిమా డైరెక్టర్ ఇంతియాజ్ అలీ విసుక్కోకుండా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు నటన గురించి చెప్పేవాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా తరుణ్ అరోరాకు ఫిల్మ్ మేకింగ్‌లో భిన్నమైన కోణాలను పాఠాలుగా నేర్పించింది.‘ఖైదీనంబర్:150, కాటమరాయుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తరుణ్ అరోరా అందాల నటి అంజలా జవేరీ భర్త. -
నేనొక్కసారి స్కెచ్ వేస్తే...
చెల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకునే అన్నయ్య... ఆ చెల్లి కోసం ఎంత దుర్మార్గానికైనా తెగించే అన్నయ్యగా ‘చంటి’ సినిమాలో కనిపించినా, ప్రత్యర్థి కోసం ఆకలాకలిగా ఎదురుచూసే ప్రతినాయకుడిగా ‘దమ్ము’లో కనిపించినా, బిజ్జలదేవునిగా శకుని తరహా విలనిజంతో ‘బాహుబలి’లో భయపెట్టినా... తనదైన విలనిజాన్ని చాటుకుంటున్నారు నాజర్. ‘‘నేను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నాను’’ అనగానే... ‘‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా సినిమాలేమిటి?’’ అనే తల్లిదండ్రులనే చూస్తుంటాం. నాజర్ విషయంలో మాత్రం సీన్ రివర్స్.కడుపులో చల్ల కదలకుండా, డబ్బులకు ఇబ్బంది పడకుండా ఉండే ఉద్యోగం చేయాలనేది నాజర్ కల. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేయడం ద్వారా తన కలను నెరవేర్చుకున్నాడు నాజర్. అయితే నాజర్ ఉద్యోగం చేయడం తండ్రికి నచ్చలేదు. కొడుకును నటుడిగా చూడాలనేది ఆయన కల. అయితే నాజర్‌కు మాత్రం ఎప్పుడూ నటన మీద ఆసక్తి లేదు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు పండగల సందర్భాల్లో నాటకాల్లో నటించడం తప్ప... నటన గురించి నాజర్‌కు పెద్దగా తెలియదు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తనకు ఒక స్థిరమైన ఉద్యోగం అవసరం అనుకున్నారు నాజర్. అందుకే ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగంలో చేరినప్పుడు చాలా సంతోష పడ్డారు. కానీ నాన్న ఆలోచన వేరుగా ఉంది. ‘‘నీ గురించి ఎన్నో కలలు కంటే ఇలా చేస్తావా!’’ అన్నారు ఆయన బాధ పడిపోతూ. ఇక చేసేదేమి లేక ఉద్యోగానికి రాజీనామా చేశారు నాజర్. ‘‘సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తాను’’ అన్నారు తండ్రితో. ‘‘అలా ఎలా కుదురుతుంది. శిక్షణ తీసుకోకుండా సినిమాల్లో ఎలా నటిస్తావు? నువ్వు నటనలో తప్పకుండా శిక్షణ తీసుకోవాల్సిందే’’ అని కాస్త గట్టిగానే చెప్పారు తండ్రి. అప్పుడుగానీ అర్థం కాలేదు. తన తండ్రి తన విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నాడో. ఎలాగైనా సరే, తండ్రి కలను నిజం చేయాలనుకున్నారు. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. కె.బాలచందర్ ‘కళ్యాణ అగతిగల్’ సినిమాలో తొలి అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడం కాస్త నిరాశకు గురైనా అంతలోనే తేరుకున్నారు. ‘కళ్యాణ అగతిగల్’ సినిమా ఫెయిల్యూర్ నాజర్ కెరీర్‌కు అడ్డంకేమీ కాలేదు. ఈ సినిమా తరువాత విలనీ ఛాయలు ఉన్న పాత్రలు చేసి శబ్భాష్ అనిపించుకున్నారు. మణిరత్నం సినిమా ‘నాయకన్’తో నాజర్‌కు మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ‘విలన్ లేనిది హీరో లేడు’ అని చెప్పే నాజర్ ఎన్నో సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేసి ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు. -
దండాలు జగ్గన్నదొరా!
‘ఆ బ్రహ్మ కాదు కదా అతడి అమ్మ దేవుడి వల్ల కూడా కాని పనిరా. ఏంచేయాలన్నా... దొర దొరతనం చేయాలా దొర మగతనం చేయాలా’ ‘దొరతనం’ గురించి జగ్గన్న దొరకు చాలా క్లారిటీ ఉంది. అంతే కాదు...తనకు ఎలాంటి వాడు నచ్చుతాడో అనేదాని గురించి కూడా పరమ క్లారిటీ ఉంది. ఒకరి చెంప చెళ్లుమనిపిస్తాడు. సదరు ఆ చెంపదెబ్బతిన్నవాడు ‘అమ్మో’ అని బాధగా ముఖం పెట్టవద్దు. చాలా సంతోషంగా కనిపించాలి. ‘నేను చెంపదెబ్బ కొడితే...మల్లెపువ్వు రుద్దుకున్నట్లు కమ్మగా ఉంది దొర అనేవాడు నాకు కావాలి.నేను చెప్పిన చోట వేలి ముద్రలు వేసే కుక్క కావాలి కాని...నా కాలి జాడ వెదికే తోడేళ్లు కాదు’ అంటాడు జగ్గన్న దొర. ‘ఎర్రమందారం’ సినిమాలో కన్నడ నటుడు దేవరాజ్‌ను చూస్తే...అచ్చం దొరను చూసినట్లే ఉంటుంది. ‘గ్రామీణ విలన్’గా నూటికి నూరుపాళ్లు సరిపోయే దేవరాజ్ ‘20వ శతాబ్దం’ ‘బంగారు బుల్లోడు’ ‘సమరసింహారెడ్డి’ ‘యజ్ఞం’...మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.హెచ్ఎంటీలో తొమ్మిది సంవత్సరాలు పనిచేసిన దేవరాజ్ ‘త్రిశూల’ అనే కన్నడ సినిమాతో చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఏ ఆర్టిస్ట్‌కైనా మొదటి సినిమా హిట్ అయితే కెరీర్ ఊపందుకుంటుంది. హిట్ కావడం మాటేమిటోగానీ దేవరాజ్ నటించిన మూడు సినిమాలు విడుదల కూడా కాలేదు. ఆ సమయంలోనే ‘ఇంద్రజిత్’ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ వేషం వచ్చింది. ఆ సినిమా యావరేజ్ హిట్ అయింది. ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ చేయడం ప్రారంభించారు. కొన్ని పాత్రలకు అవార్డులు కూడా వచ్చాయి. ‘వీరప్పన్’ అనే సినిమాలో చేసిన నెగెటివ్ రోల్‌కు స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది. ‘ఆవేశ’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసిన తరువాత హీరోగా అవకాశాలు వెల్లువెత్తాయి. అలా అని హీరోగా మాత్రమే చేస్తానని భీష్మించుకొని కూర్చోలేదు.విలన్ అయినా, హీరో అయినా పాత్రలో సత్తా ఉంటే చేసుకుంటూ వెళ్లేవాడు. దీనికి కారణం...హీరోగా మాత్రమే చేస్తే...ఒక సినిమా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హీరో భవిష్యత్ అనేది సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆర్టిస్ట్‌గా ఎదగాలనుకునే వ్యక్తికి ఇది అడ్డు అనుకున్నారు దేవరాజ్. అందుకే కేవలం హీరో పాత్రలు మాత్రమే కాకుండా విలన్‌గా కూడా చేశారు. సినిమాల్లోకి రాక ముందు దేవరాజ్ స్టేజీ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధుడు.‘నాటకాలు’ అనే బలమైన పునాది ఆయనకు ఉండడం వల్ల ‘పోలీస్ ఆఫీసర్’ రోల్ నుంచి ‘డాన్’ వరకు...రఫ్ అండ్ టఫ్ లుక్స్ నుంచి శాడిస్ట్ వరకు...ఏ పాత్ర అయినా అవలీలగా పోషించే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు దేవరాజ్. -
దేవన్...ఒక కూల్ విలన్!
విలన్లు మూడు విధములు... 1. బాడీతో భయపెట్టించే విలన్లు. 2. గొంతుతోనే భయపెట్టించే విలన్లు. 3. భయపెట్టకుండానే భయపెట్టే విలన్లు. మొదటి రెండు సరే, భయపెట్టకుండానే భయపెట్టే విలన్ ఏమిటి? ఈ విలన్‌ను చూస్తే...భయపడ్డానికి పెద్దగా ఏమీ ఉండదు. పక్కా పెద్ద మనిషి తరహాలోనే ఉంటారు. మర్యాదను తు.చ తప్పకుండా పాటిస్తారు. కానీ చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేస్తారు. చాప కింద పెట్రోలన్న మాట!‘శుభాకాంక్షలు’ సినిమాలో బలరామయ్యను చూడండి...కుటుంబసభ్యులతో ఎంత ఆప్యాయంగా ఉంటాడో! కానీ ఆ ఆప్యాయత ఎప్పటి వరకు? తన మాట వినేంత వరకే. ఎప్పుడైనా ఎవరైనా అంతకుమించి ఆలోచిస్తే....‘చిన్నపిల్లలకు నీతికథలు చెప్పాలి తప్ప నీతి తప్పిన వాళ్ల కథలు చెప్పొద్దు’ అని కన్నెర్ర చేస్తాడు.ఇక్కడ ‘నీతి తప్పిన వాళ్లు’ అంటే నిజంగానే నీతి తప్పిన వాళ్లు కాదు. తనకు నచ్చని వాళ్లు. అలాంటి వాళ్లను దగ్గరికి తీస్తే ‘ఈ ఇల్లు ఆరు శవాలున్న స్మశానం కాగలదు’ అని హెచ్చరించగలడు. ఇదే విలన్ ‘కాశీ’ సినిమాలో ప్రేమతో సహా ప్రతి విషయాన్ని కరెన్సీతో కొలిచే పారిశ్రామికవేత్తగా భయపెట్టించగలడు. ఇక ‘బాషా’ సినిమాలో పొగుడుతూనే వెన్నుపోటు పొడిచే కేశవ పాత్రతో భయపెట్టించగలడు.కూల్‌గా కనిపిస్తూనే వేడి పుట్టించే విలన్ పాత్రలకు ప్రసిద్ధుడైన దేవన్ డబ్బింగ్ సినిమాలతోనే కాదు స్ట్రెయిట్ చిత్రాలతో కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. నటులు నిర్మాతలు కావడం చూస్తుంటాం. నిర్మాతలు నటులు కావడం అనేది మాత్రం అరుదుగానే జరుగుతుంది. దేవన్ మొదట నిర్మాత. ప్రేమ్‌నజీర్, మధు ప్రధాన పాత్రధారులుగా మలయాళంలో ఆయన తీసిన సినిమా ‘వెల్లమ’ బాక్సాఫీసు దగ్గర చతికిలపడటమే కాదు...ఆయన్ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. దీని నుంచి బయటపడటానికి సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. కొద్దికాలం తరువాత ‘ఓజమ్’ అనే మలయాళం సినిమాలో హీరోగా నటించే ఛాన్సు వచ్చింది. ఆ తరువాత అయిదారు సినిమాల్లోనూ హీరోగా నటించారు. అయితే వీటిలో ఎక్కువ సినిమాలు విజయవంతం కాకపోవడంతో విలన్‌గా నటించడం ప్రారంభించారు. కేవలం మలయాళంలోనే కాదు తమిళ, తెలుగు సినిమాల్లోనూ ఆయన రకరకాల పాత్రలు పోషిస్తున్నారు.నటుడిగానే కాదు ‘కేరళ పీపుల్స్ పార్టీ’ నాయకుడిగా కూడా దేవన్ కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధుడు. -
నాదసలే రఫ్ హ్యాండ్!
కృష్ణవంశీ ‘అంతఃపురం’ సినిమాలో గుర్తుండే పాత్రలలో ‘జీవీ’ పాత్ర ఒకటి.ప్రత్యర్థులను మందుపాతరతో పేల్చేయడానికి ఉచ్చు బిగించే సీన్ నుంచి, ప్రత్యర్థుల చేతిలో మేకలా బలయ్యే సీన్ వరకు అద్భుతమైన విలనిజాన్ని పండించాడు జీవీ.భారీ డైలాగులేమీ లేకపోయినా భారీ కాయంతో, పొడవాటి వెంట్రుకలతో భయపెట్టాడు. భయానకాన్ని సృష్టించడానికి అతని రెండు కళ్లు వందల ఆయుధాలయ్యాయి. ‘ఎవరీ జీవీ?’ అని అందరూ మాట్లాడుకునేంత గుర్తింపు తెచ్చుకున్న ‘జీవీ’ అసలు పేరు సుధాకర్ నాయుడు. ఈయన చిరంజీవి వీరాభిమాని∙విద్యార్థి సంఘ రాజకీయాలు, క్రికెట్ గురించి తప్ప... ‘నటన’ మీద ఎప్పుడూ ఆసక్తి చూపించలేదు సుధాకర్ నాయుడు. ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివిన సుధాకర్ ఆ తరువాత హైదరాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. రెండు సంవత్సరాల తరువాత... ఏదో అసంతృప్తి.‘ఇది కాదు... ఇంకా ఏదో చేయాలి’ అనుకున్నాడు.తరువాత యు.ఎస్ వెళ్లి ఇంటర్నేషనల్ లా మాస్టర్స్ చేశాడు. రోజూ జిమ్‌కు వెళ్లడం, జుట్టు పొడవుగా పెంచడంతో పాటు అక్కడి జీవనశైలితో మమేకమైపోయి ఇండో–అమెరికన్‌గా మారిపోయాడు. రెండున్నర సంవత్సరాల తరువాత ఇండియాకు వచ్చాడు. అమెరికా నుంచి తెచ్చిన గిఫ్ట్‌ను తనకు బంధువైన దాసరి నారాయణరావుకు ఇవ్వడానికి వెళ్లినప్పుడు... పొడవాటి జుట్టు చూసి ‘ఏంటీ ఇలా అయిపోయావు?’ అన్నారు దాసరి. ‘‘అమెరికాలో ఉన్నాను కదా’’ అని చిన్నగా నవ్వాడు సుధాకర్.‘‘అరుణ్‌బాబుతో సినిమా స్టార్ట్ చేస్తున్నాను. నటిస్తావా?’’ అడిగారు దాసరి.‘‘నాకెందుకు సార్ నటన... కోర్టులో ప్రాక్టీస్ చేయాలి’’ అని మొదట అన్నాడు గానీ దాసరి ఒప్పించడంతో ‘చిన్నా’ సినిమాతో విలన్‌గా పరిచయం అయ్యాడు సుధాకర్ నాయుడు. ఫీల్డ్‌లో సుధాకర్‌లు ఇద్దరు ముగ్గురు ఉండడంతో ‘చిరంజీవి’లోని చివరి అక్షరాలతో సుధాకర్ నాయుడికి ‘జీవీ’గా వెండితెర నామకరణం చేశారు దాసరి. ఈ సినిమా తరువాత ‘అంతఃపురం’లో నటించే అవకాశం వచ్చింది జీవీకి. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని జీవీ తెలుగులో మాత్రమే కాదు కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటిస్తూ ‘అగ్రెసివ్ విలన్’గా మంచి గుర్తింపు పొందుతున్నారు. -
హాలీవుడ్లో ఉత్తమ విలన్!
టాలీవుడ్.. కోలీవుడ్.. శాండల్‌వుడ్.. మాలీవుడ్.. బాలీవుడ్... ఈ అన్ని వుడ్‌ల వారు హాలీవుడ్ చిత్రాలు చూసి, ఇన్స్పైర్ అవుతుంటారు. కొందరు దర్శకులు అప్పుడప్పుడు ఆ సినిమాల్లోని సీన్స్‌ని ఆదర్శంగా చేసుకుని, తీస్తుంటారు కూడా. ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లనిపిస్తోంది. మన ఇండియన్ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఓ హాలీవుడ్ చిత్రం రూపొందించారట. సినిమా పేరు ‘ది హీరో’. బ్రెట్ హాలే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘ఉత్తమ విలన్’లా ఉందట. టాలీవుడ్, కోలీవుడ్‌లో రెండేళ్ల కిందట విడుదలైన కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ గుర్తుండే ఉంటుంది. కమల్ స్వయంగా కథ అందించి, నటించిన ఈ చిత్రానికి రమేశ్ అరవింద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టేకింగ్ హాలీవుడ్ రేంజ్లో ఉందనే ప్రశంసలూ దక్కాయి. ఈ ఏడాది జనవరి 21న ‘ది హీరో’ చిత్రాన్ని ‘సన్ డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శించారు. ఈ సినిమాలో మన ‘ఉత్తమ విలన్’ షేడ్స్ ఉన్నాయన్నది కొందరి అభిప్రాయం. జూన్ 9న సినిమా విడుదలకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. -
హాలీవుడ్లో రీమేక్ అవుతున్న సౌత్ సినిమా
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా రెండేళ్ల కిందట తెరకెక్కిన సినిమా ఉత్తమ విలన్, కమల్ సన్నిహితుడు, ప్రముఖ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా ఆకట్టుకోలేకపోయినా.. కమల్ నటనకు మరోసారి ప్రశంసలు దక్కాయి. ఎప్పుడో సౌత్ ప్రేక్షకులు మర్చిపోయిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఉత్తమ విలన్ సినిమా కథ ఆధారంగా హాలీవుడ్లో 'ది హీరో' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారట. త్వరలోనే తాను చనిపోతానని తెలిసిన ఓ సూపర్ స్టార్ ఆఖరి రోజుల్లో ఏం చేశాడన్న కథతో ఉత్తమ విలన్ సినిమా తెరకెక్కింది, ఇది పాయింట్‌ను తీసుకొని హాలీవుడ్ దర్శకుడు బ్రెట్ హాలే 'ది హీరో' చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతేకాదు ఈ సినిమా టైటిల్ క్రెడిట్స్లోనూ కమల్ పేరు కనిపించనుందన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో సత్తా చాటిన 'ది హీరో' జూన్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమా నిజంగా ఉత్తమ విలన్‌కు అఫీషియల్ రీమేకా.. లేక ఫ్రీ మేకా తెలియాంలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఈ టిట్లాకు తిక్క రేగితే!
ఉత్తమవిలన్ తన శత్రువును తాను ఎలా ద్వేషిస్తాడో మిగిలిన వాళ్లు కూడా అలాగే ద్వేషించాలి. తన శత్రువుపై తాను ఎలా కసితో రగిలి పోతాడో మిగిలిన వాళ్లు కూడా అలాగే రగిలి పోవాలి. లేకుంటే తేడాలు వస్తాయి. ఇళ్లు కాలిపోతాయి. ‘నెత్తి మీద టోపీ. చేతిలో పవరు... మూతి మీద మీసం ఉందని... దేవుడు...దేవుడు అని భజన చేశారు. ఏకీ సీ గోలిసే...’ అంటూ మాటలతో మంటలు రేపగలడు టిట్లా.‘టిట్లా’ అంటే మాటలా?మాటల్లోనే తూటాలు పేలుతుంటాయి!‘విక్రమార్కుడు’ సినిమాలో ‘టిట్లా’గా.... వేషంతో సహా క్రూర హావభావాలతో భయపెట్టించాడు అజయ్. ‘ఖుషి’ సినిమాలో ఈవ్ టీజర్‌గా ప్రేక్షకుల దృష్టిలో పడ్డ అజయ్ ‘ఒక్కడు’ ‘ఛత్రపతి’ సినిమాలలో ఆవేశం మూర్తీభవించిన పాత్రలలో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘విక్రమార్కుడు’ సినిమాలో ‘టిట్లా’ అనే గట్టి విలన్‌గా ప్రేక్షకుల దృష్టిలో మిగిలిపోయాడు. విజయవాడలో పుట్టి పెరిగిన అజయ్ ఎమ్సెట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆ కాలేజీ పరిసరాల్లో తరచుగా సినిమా షూటింగ్‌లు జరుగుతుండేవి. షూటింగ్‌లను ఆసక్తిగా చూసేవాడుగానీ ‘నటించాలి’ అని పెద్దగా అనుకోలేదు. ఆ తరువాత మాత్రం నటించాలనే కోరిక బలపడడంతో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. ‘కౌరవుడు’ సినిమా డైరెక్టర్, అజయ్ నాన్నకు తెలిసిన వ్యక్తి కావడంతో ఆ సినిమాలో నటించే ఛాన్సు దొరికింది. ‘పెద్దగా స్ట్రగుల్ కాకుండానే సినిమాల్లో నటించే ఛాన్సు వచ్చింది. ఇక ‘నల్లేరు మీద నడకే’ అనుకున్నాడు. అయితే తొమ్మిది నెలలు గడిచినా ఏ సినిమాలోనూ నటించే ఛాన్సు రాలేదు. ‘ఖుషి’ సినిమా సెలెక్షన్‌కు వెళ్లి, సెలెక్ట్ అయిన తరువాత మాత్రం ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రాజమౌళి ‘సింహాద్రి’ సినిమాలో చిన్న విలన్ రోల్ పోషించాడు. షూటింగ్లో పాల్గొనడానికి కేరళకు వెళ్లినప్పుడు ‘మీ సినిమాలో గుర్తుండిపోయే పాత్రలో నటించాలని ఉంది’ డైరెక్టర్‌తో రిక్వెస్ట్‌గా అన్నాడు. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆతరువాత మాత్రం ‘సై’ సినిమాలో విలన్ తమ్ముడిగా అజయ్‌కి పవర్ఫుల్ రోల్ ఇచ్చాడు రాజమౌళి. ఇక ‘విక్రమార్కుడు’ సినిమాలో చేసిన ‘టిట్లా’ పాత్రతో పెద్ద గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ‘ఉత్తమ విలన్’గా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. -
నేను పక్కా క్రిమినల్!
‘ఈ కైజర్ని చంపేవాడు ఇంకా పుట్టలేదు’ అంటూ ‘అతి«థి’ సినిమాతో ఉత్తమ విలన్ అనిపించుకున్నారు మురళీశర్మ. హిజ్రాగా నటించినా, ఒక పాత్ర కోసం గుండు కొట్టించుకున్నా...ఎప్పటికప్పుడు తన నటనలో వైవిధ్యాన్ని చూపడానికి ప్రయత్నిస్తుంటారు. స్కూల్, కాలేజీ రోజుల నుంచే నాటకాల్లో నటించేవాడు మురళీశర్మ. ముంబైలోని ‘రోషన్ తనేజాస్ యాక్టింగ్’ స్కూల్లో శిక్షణ పూర్తయిన తరువాత సహాయ దర్శకుడిగా పనిచేయడానికి దర్శకులను కలవడం మొదలుపెట్టాడు. నటన అంటే ఇష్టం ఉన్న శర్మ దర్శకత్వ శాఖ వైపు అడుగులు వేయడానికి కారణం... సరిౖయెన పాత్రలు రాకపోవడమే. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన తక్కువ కాలంలోనే మనసు నటన వైపు లాగింది. వినోద్ పాండే ‘రిపోర్టర్’ అనే సీరియల్ తీస్తున్నాడు అని తెలుసుకొని ప్రయత్నిద్దామనుకున్నాడుగానీ, గతంలో వృథా అయిన ప్రయత్నాలు గుర్తుకు వచ్చి ‘ఇది జరిగే పనేనా’ అనుకున్నాడు. అందుకే పాండే ఇంటి అడ్రస్ కనుక్కొని సరాసరి వెళ్లి కలిశాడు. అలా ‘రిపోర్టర్’ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. తొలి అడుగు పడింది. అయినప్పటికీ... నాలుగు సంవత్సరాల స్ట్రగుల్ íపీరియడ్! అయినా ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. జీటీవి సీరియల్ ‘రిష్తే’లో రామ్‌కలీ అనే హిజ్రా పాత్రను పోషించాడు శర్మ. దీని కోసం ఎందరో హిజ్రాలను కలిసి మాట్లాడి వారి సాధకబాధకాలను అవగాహన చేసుకున్నాడు. శర్మలో మంచి నటుడు ఉన్నాడు అనే విషయం రామ్‌కలి పాత్ర ఇండస్ట్రీకి చెప్పకనే చెప్పింది. ‘డయల్ 100’ సీరియల్లో చేసిన పోలీసు పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ‘ధూప్’లో ఆర్మీ ఆఫీసర్, ‘మక్బూల్’లో సీనియర్ పోలీస్ ఆఫీసర్, ‘మై హూ నా’లో కెప్టెన్ ఖాన్‌గా వెండితెరపై తనదైన గుర్తింపు తెచ్చుకున్న మురళీశర్మ హిందీ, ఇంగ్లిష్‌లతో సహా తెలుగు, తమిళ, మరాఠీ, గుజరాతీ భాషలు మాట్లాడగలరు.‘అతిథి’ సినిమాలో ‘కైజర్’గా తెలుగు తెరకు పరిచయం అయిన మురళీశర్మ పుట్టింది మన గుంటూరు జిల్లాలోనే! ‘కంత్రీ’ ‘ఊసరవెల్లి’ ‘మిస్టర్ నూకయ్య’ ‘కృష్ణం వందే జగద్గురుం’ ‘ఎవడు’...మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మురళీశర్మ ‘పట్టుదలే విజయానికి మూలం’ అనే మాటను బలంగా నమ్ముతారు. -
ఖతర్నాక్...కాలకేయ!
వెండితెర అద్భుతం ‘బాహుబలి’లో బాహుబలి, భల్లాలదేవలు ఎలా గుర్తుండి పోతారో కాలకేయుడు కూడా అలాగే గుర్తుండి పోతాడు. అతడు మాట్లాడిన ‘కిలికి’ భాష కూడా అలాగే గుర్తుండి పోతుంది. నల్లరాతి కొండలాంటి దృఢమైన శరీరం, చింత నిప్పులాంటి కళ్లు...ఈ భయానక ఆహార్యానికి తోడు భయంకరమైన కంఠంతో వెన్నులో చలి పుట్టించాడు కాలకేయుడు. ‘ప్రభాకర్’ అనే పేరు పెద్దగా తెలియకపోవచ్చుగానీ, ‘కాలకేయుడు’ అనే పేరు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులకు తెలుసు! ఎవరీ ప్రభాకర్!మహబూబ్‌నగర్ జిల్లా హస్నాబాద్‌కు చెందిన ప్రభాకర్ స్వభావరీత్యా సిగ్గరి. క్రికెట్ ఆడడం తప్ప సినిమాల్లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. నటిస్తాను అని ఎప్పుడు భవిష్యవాణిని అంచనావేయలేదు. మాంచి ఒడ్డూ పొడుగు ఉన్న ప్రభాకర్‌ను చూసి బంధువు ఒకరు... ‘‘హైదరాబాద్‌కు వచ్చేయ్... రైల్వేలో కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తాను’’ అన్నాడు. అయితే ఆరు సంవత్సరాలు గడిచినా అలాంటిదేమీ జరగలేదు. మహేష్‌బాబు ‘అతిథి’ సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు అనుకోకుండా ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించే చాన్సు వచ్చింది ప్రభాకర్‌కు. ‘మగధీర’ సినిమా కోసం నటులను వెదుకుతున్నప్పుడు డైరెక్టర్ రాజమౌళిని కలిశాడు ప్రభాకర్. ఆయన ఏమీ చెప్పలేదు. అయితే తనతో పాటు రాజస్తాన్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ ‘మగధీర’ షూటింగ్ జరుగుతోంది. రాజస్తాన్‌లో ప్రభాకర్‌ను గమనించారు రాజమౌళి. తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన తరువాత మళ్లీ ఉద్యోగ వేటలో పడ్డాడు ప్రభాకర్. ఒకరోజు రాజమౌళి నుంచి పిలుపు వచ్చింది. ‘మర్యాద రామన్న’ సినిమాలో ఒక వేషం ఇస్తున్నట్లు చల్లని కబురు చెవిలో వేశారు రాజమౌళి. చా...లా గొప్ప చాన్స్... కానీ తనకు నటన అంతగా రాదు... ఇదే విషయాన్ని రాజమౌళితో చెప్పాడు ప్రభాకర్. ‘ఫరవాలేదు’ అంటూ దేవదాస్ కనకాల దగ్గర శిక్షణ ఇప్పించడమే కాకుండా, నెలకు పదివేలు సై్టపెండ్ కూడా ఇచ్చారు రాజమౌళి. ‘మర్యాద రామన్న’ సినిమాలో వేసిన బైరెడ్డి పాత్రతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ సినిమాకు వచ్చిన రెమ్యునరేషన్‌తో అప్పులన్నీ తీర్చేశాడు. ఇక ‘బహుబలి’ సినిమాలో వేసిన కాలకేయుడి వేషం ప్రభాకర్‌ని ఎక్కడికో తీసుకువెళ్లిపోయింది. ఈ సినిమాలో ఉపయోగించిన ‘కిలికి’ భాష కోసం రోజూ తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ప్రాక్టీస్ చేసేవాడు ప్రభాకర్. ఇది మాత్రమే కాదు... కాలకేయుడిగా ప్రేక్షకులను భయపెట్టడానికి ఎన్ని రకాలుగా కష్టపడాలో అన్ని రకాలుగానూ పడ్డాడు. ఆ కృషి వృథా పోలేదు... అని కాలకేయుడి పాత్రకు వచ్చిన స్పందన చెప్పకనే చెప్పింది. -
ఈ చూపుల్లో శూలాలున్నాయి!
కొన్నిసార్లు అతని మాట పదునుగా ఉంటుంది. కొన్ని సార్లు అతని చూపు పదునుగా ఉంటుంది. వీటన్నిటికంటే కొన్నిసార్లు అతని మౌనం కూడా అత్యంత పదునుగా ఉంటుంది. సుబ్బరాజు అంటే ‘యువ విలన్’ అనేదానికి నిలువెత్తు సంతకం. ‘‘మనలో సహజమైన ప్రతిభ ఏదో ఉండాలి. అలా లేకుంటే...ఎంత గొప్ప ఇన్స్టిట్యూట్లో చదువుకున్నా...మనతో ఉండేది డిప్లొమో తప్ప ప్రతిభ కాదు’’ అంటారు ప్రసిద్ధ విలన్ ప్రాణ్. సుబ్బరాజులో ఇన్స్టిట్యూట్ వారి డిప్లొమో పవర్ కంటే, సహజ నటన అనే పవరే ఎక్కువగా ఉంది. అదే ఆయన్ను కంప్యూటర్ ఫీల్డ్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకువచ్చింది. భీమవరంలోని డీయన్ఆర్ కాలేజీలో చదువుకున్న సుబ్బరాజు, ఆ తరువాత కంప్యూటర్ కోర్సు చేసి ౖహైదరాబాద్లోని డెల్ కంప్యూటర్స్‌లో చేరారు. మంచి ఉద్యోగం, మంచి శాలరీ... అయినా మనసులో ఏదో తెలియని అసంతృప్తి. ‘వర్క్ అంటే ప్రతి క్షణం ఎంజాయ్ చేసేలా ఉండాలి. కొత్త ప్రదేశాలు తిరగాలి. కొత్త వ్యక్తులతో మాట్లాడాలి. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఆలోచించాలి... జీవితంలోని తాజాదనాన్ని ఎప్పటికప్పుడు ఆస్వాదించాలి’’ అనుకున్నారు సుబ్బరాజు.ఇంతకీ అదేమిటి? టైమ్ కోసం ఎదురుచూడడం తప్ప ఏమో ఇప్పటికైతే తెలియదు. ఆ టైమ్ రానే వచ్చింది. ఒకసారి దర్శకుడు కృష్ణవంశీ ఇంట్లోని కంప్యూటర్‌కు ఏదో సమస్య వచ్చినప్పుడు, చేయిచేసుకోవడానికి మిత్రుడితో కలిసి వెళ్లాడు సుబ్బరాజు. ఆ కొద్ది సమయంలోనే సుబ్బరాజుకు నటన అంటే ఇష్టమని తెలుసుకొని తన చిత్రంలో చిన్న పాత్ర ఒకటి ఇచ్చారు కృష్ణవంశీ. కనిపించీ కనిపించనట్లు ఉండే ఆ టెర్రరిస్ట్ పాత్ర తనకేమీ పెద్దగా గుర్తింపు తేలేదు. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి’ సినిమాలో వేసిన ఆనంద్ పాత్రతో సుబ్బరాజు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి’ సినిమాలో కిక్–బాక్సింగ్ ఛాంపియన్ రఘువీర్ (ప్రకాష్‌రాజ్) ప్రియ శిష్యుడు ఆనంద్‌గా, గురువును మోసం చేసిన శిష్యుడి పాత్రను అద్భుతంగా పోషించారు సుబ్బరాజు. ‘ఆర్య’ ‘పోకిరి’ ‘నేనున్నాను’ ‘దూకుడు’ ‘నమో వెంకటేశ’ ‘పరుగు’... ఇలా చెప్పుకుంటే పోతే సుబ్బరాజుకు పేరు తెచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. శత్రువుల తలలు తీసే ఫ్యాక్షనిస్ట్‌కు కుడిభుజంలాంటి సేవకుడి నుంచి, అమ్మాయిలను మోసం చేసే ‘చీటింగ్ లవర్’ వరకు రకరకాల పాత్రలు పోషించి ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు సుబ్బరాజు. -
నా ముందు తలదించుకొని బతకాల...
నాగిరెడ్డి అంటే మాటలా? మాట మాటకూ మందుపాతర దట్టించి పేల్చగలడు. పండ్లు నూరుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తించగలడు. ‘రేయ్... పో... ఎక్కడో ఒక చోట హాయిగా బతుకు. లేదు... ఇక్కడే బతుకుతానంటావా... ఇల్లు ఇస్తా. ఎకరం పొలం ఇస్తా. నా ముందు తలదించుకొని బతకాల. తల ఎత్తావో... నరికేస్తా!’ అంటూ ప్రత్యర్థి ముఖం మీదే పిడుగులు కురిపించగలడు.. ‘ఆది’ సినిమాలో నాగిరెడ్డిగా అసమాన నటన ప్రదర్శించారు రాజన్ పి. దేవ్. రాజన్‌ను చూస్తే... మన ఊళ్లోనో, మరో చోటో కనిపించే పెద్ద మనిషిలాంటి విలన్ గుర్తుకు వస్తాడు తప్ప ఎక్కడి నుంచో దిగుమతి అయిన ‘మల్లువుడ్ విలన్’ గుర్తుకురాడు.‘మన ఇలనే’ అన్నంతగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజన్ పి. దేవ్ ఈవారం మన ‘ఉత్తమ విలన్’ ‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది కదా!’రాజన్ కూడా ఆ గూటి పలుకే పలికారు. రాజన్ నాన్న ఎస్.జె.దేవ్ ప్రసిద్ధ నాటకకళాకారుడు. చిన్నప్పుడు ఆటల కంటే నాటకాల మధ్యే ఎక్కువ కాలం గడిపేవాడు రాజన్. రిహార్సల్ సమయంలో పెద్ద పెద్ద నటుల నుంచి వినిపించే భారీ డైలాగులు, చిన్న రాజన్ పెదాల మీద అలవోకగా ప్రతిధ్వనించేవి. నాన్న ఎస్.జె.దేవ్‌ను ఆదర్శంగా తీసుకొని ఎన్నో నాటకాల్లో నటించారు రాజన్. సీనియర్ రంగస్థల కళాకారుడు ఎన్.ఎన్.పిల్లై ఆధ్వర్యంలో ఎన్నో నాటకాల్లో ఎన్నో రకాల పాత్రలు పోషించారు రాజన్. నటించడం మాత్రమే కాదు... చిన్నవయసులోనే నాటకాలు రాయడం, దర్శకత్వంలాంటివి చేసేవాడు. ‘మలయాళం నాటక వేది’ పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించి ‘రాధమ్’ అనే నాటకం రాసి దర్శకత్వం చేశారు. అయితే ఈ నాటకం పెద్ద డిజాస్టరై రాజన్‌ను ఆర్థికసమస్యల్లో కూడా నెట్టింది. వేరొకరయితే ‘నాటకాలకో దండం మీకో దండం’ అని మూటా ముల్లే సర్దుకునే వారు. పోయిన చోటే వెదుక్కోవాలనుకునే రాజన్ వెనక్కి తగ్గలేదు. ఎస్.ఎల్.పురం సదానందన్ నాటకం ‘కట్టుకుతిర’లో ప్రధాన పాత్రను పోషించారు. ఈ నాటకం వందకు పైగా ప్రదర్శనలు పూర్తి చేసుకోవడంతో రాజన్ పేరు కేరళ మొత్తం సుపరిచితం అయింది. హరిశ్రీ థియేటర్ వారి ఒక నాటకంలో మానసిక వికలాంగుడి పాత్ర ధరించి శభాష్ అనిపించుకున్నారు రాజన్. ‘బెస్ట్ యాక్టర్’గా స్టేట్ అవార్ట్ కూడా గెలుచుకున్నారు.నాటకరంగంలో తిరుగులేని నటుడు అనిపించుకున్న రాజన్ ఆ తరువాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఫజిల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎంటె మమట్టికుట్టియమక్కు’ చిత్రంతో రాజన్ ఫిలిం కెరీర్ మొదలైంది. రాజన్ వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ‘కట్టుకుతిర’ నాటకం సినిమాగా వచ్చింది. అయితే ఆ నాటకంలో తాను చేసిన లీడ్‌రోల్ వేరే నటుడికి దక్కడం రాజన్ని నిరాశకు గురిచేసింది. ఇదే విషయాన్ని ఒక ఇంటర్య్వూలో చెప్పుకున్నారు రాజన్. ఇది చదివిన ‘కట్టుకుతిర’ దర్శకుడు తన మరో చిత్రం ‘ఇంద్రజాలం’లో ‘కార్లోస్’ అనే విలన్ రోల్ రాజన్‌కు ఇచ్చాడు. ‘కార్లోస్’ పాత్రతో రాజన్ కెరీర్ మలుపు తిరిగింది. ఎన్నో చిత్రాల్లో విలన్‌గా నటించారు. విలన్ పాత్రల్లో రాజన్ ఎంత పాపులర్ అయ్యాడంటే... ‘‘ఆయన పని గట్టుకొని క్రూరమైన డైలాగులు చెప్పాల్సిన పనిలేదు. ఆ ముఖం, కళ్లు చాలు విలనిజాన్ని చాటడానికి’’ అనేవాళ్లు.క్రూరత్వంతోనే విలనీ పండుతుందనేది నిజమే అయినా కాస్త హ్యూమర్ టచ్‌తో కూడా విలనిజాన్ని పండించి తనదైన శైలిని చాటుకున్నారు రాజన్. తమిళ, కన్నడ, తెలుగు సినిమాలలో అవకాశాలు రాజన్‌ను వెదుక్కుంటూ వచ్చాయి. తెలుగులో ‘ఖుషీ’ ‘ఆది’ ‘నాగా’ ‘దిల్’ ‘ఒక్కడు’ ‘ఆర్యా’ ‘గుడుంబ శంకర్’ ‘బాలు’ ‘బన్నీ’ ‘వీరభద్ర’ ‘యోగి’ ‘కాళిదాస్’ ‘క్రిష్ణ’... మొదలైన సినిమాలలో నటించారు. అవివీతి పోలీసు అధికారి నుంచి ఫ్యాక్షనిస్ట్ వరకు... ప్రతి పాత్రలోనూ తన మార్క్ విలనిజాన్ని చాటుకొని ‘ఉత్తమ విలన్’గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన రాజన్ పి. దేవ్ 2009లో చనిపోయారు. చాలామంది ప్రేక్షకులకు ఆయన మలయాళ నటుడు అనే విషయం తెలియదు. మన తెలుగు విలనే అన్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘రాజన్ పి. దేవ్’ అనే ఆయన పేరు కొద్దిమందికే తెలిసి ఉండవచ్చు. అయితే ‘నాగిరెడ్డి’ ‘యం.పీ. అవతారం’ ‘కుమారస్వామి మామ’ మొదలైన పేర్లతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత విలనీయుడుగా గుర్తుండిపోతారు రాజన్ పి. దేవ్. -
ఈ మున్నా నాలిక మడతెడితే...ఇక అంతే!
పోలీసుల మీద బావూజీ గుర్రుగా ఉన్నాడు. కోపంగా ఉన్నాడు. కసిగా ఉన్నాడు.తన అసహనాన్ని, కసిని, కోపాన్ని చాటుకోవాలనుకున్నాడు.‘షురూ కరో బేటా’ అన్నాడు. ఆ బేటా (కొడుకు) ఎలాంటోడు అనుకున్నారు? నాలుక మడతపెట్టి ఉరిమి చూస్తే చాలు... ఎదుటి వారికి చుక్కలు కనపడతాయి.మున్నానా మజాకా?పోలీసులతో ఈ మున్నా ఎంతలా ఆడుకున్నాడు!‘ఓడిపోయిన పోలీసోడి బెల్టుమా ఇంట్లో గేదె మెడలో వేస్తాను’ అంటూ...కాసేపు రైలు ఆట.కాసేపు విమానం ఆట.కాసేపు ఛల్ ఛల్ గుర్రం ఆట! ఎన్నెన్నో ఆటలు ఆడుకున్నాడు!!‘విక్రమార్కుడు’ సినిమాలో ‘మున్నా’ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన నటుడు అమిత్ కుమార్ తివారీ. సినిమాలు చూస్తూ పెరిగిన అమిత్‌కు ‘సినిమా యాక్టర్’ కావాలనుకోవడం తప్ప పెద్ద లక్ష్యాలంటూ ఏమీ లేవు. డిగ్రీ పూర్తికాగానే ‘యాక్టింగ్ ఫీల్డ్’లో దూకడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. నాన్న మాత్రం ‘అది తక్క’ అన్నట్లుగా మాట్లాడి బిజినెస్ చేయమన్నాడు.‘బిజినెస్ చేయడం నా వల్ల కాదు’ అంటూ తండ్రి దగ్గర మొరపెట్టుకొని, ఆయనను ఒప్పించి రంగంలోకి దిగాడు అమిత్. తెలుగులో ‘కళ’ సినిమాలో నటించే ఆఫర్ రావడంతో ముంబై నుంచి 2003లో హైదరాబాద్ వచ్చాడు అమిత్. ఈ సినిమా చేస్తున్నప్పుడు నిర్మాతలు, దర్శకులు, రచయితలను రెగ్యులర్‌గా కలిసేవాడు. అలా ‘కళ’ తరువాత ‘యువసేన’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా నుంచి అవకాశాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ‘యువసేన’లో అమిత్ చేసిన డ్యాన్స్‌కు మంచి పేరు వచ్చింది. విలన్‌కు డ్యాన్స్ ఉండడం అనేది కొత్తగా అనిపించింది. ‘విక్రమార్కుడు’ సినిమా అమిత్ తివారీకి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ సినిమాలో బావూజీ కుమారుడు ‘మున్నా’గా క్రూరత్వాన్ని పండించాడు అమిత్. ‘మున్నా’ పాత్ర ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పడానికి చిన్న ఉదాహరణ...‘విక్రమార్కుడు’ సినిమా రిలీజ్ రోజు అందరితో కలసి సుదర్శన్ థియేటర్ (హైదరాబాద్)కు వెళ్లాడు అమిత్. తెర మీద మున్నా కనిపిస్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురు కుర్రాళ్లు పైకి లేచి కాగితాలు, నాణేలు విసురుతూ బండబూతులు తిడుతున్నారు.‘ఓరి నాయనో... నా పని ఇవాల్టితో ఖతం. బయట కనిపిస్తే ఎముకల్లోకి సున్నం లేకుండా తంతారు’ అనుకున్నాడు. ఎలాగైనా సరే, అక్కడి నుంచి సేఫ్‌గా ఎస్కేప్ కావాలనుకున్నాడు. డైరెక్టర్ రాజమౌళి దగ్గరికి వెళ్లి మనసులో మాట చెప్పాడు. ‘‘మరేం ఫరవాలేదు. నీ పాత్ర పెద్ద హిట్ అనడానికి ఇదే సాక్ష్యం. ఇక్కడ తిట్టిన వాళ్లే నువ్వు బయట ఎక్కడైనా కనిపిస్తే పొగుడుతారు చూడు’’ అన్నాడు రాజమౌళి. ఆయన చెప్పినట్లే జరిగింది. సినిమా నుంచి బయటికి వచ్చిన తరువాత అమిత్‌ను గుర్తు పట్టిన ఆ కుర్రాళ్లు...‘‘సార్... ఎంత బాగా చేశారు’’ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు.‘హమ్మయ్య’ అనుకున్నాడు అమిత్. మున్నా పాత్ర ఎంత హిట్ అయిందంటే...‘విక్రమార్కుడు’ సినిమాకు ముందు ఏడెనిమిది సినిమాలు చేసిన అమిత్ ఆ తరువాత డెబ్బై సినిమాల వరకు చేశాడు. కెరీర్ యమస్పీడ్ అందుకుంది! ‘ఈ క్యారెక్టర్ ఎలా చేయాలి? సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఎలా చేయాలి? ఎలాంటి గెటప్ వేయాలి’ అని ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తుంటాడు అమిత్. పాత్రకు తగ్గట్టు బాడీని పెంచడం, తగ్గించడం చేస్తుంటాడు. ఇది మాత్రమే కాదు...సెట్లో సీనియర్ విలన్ల నటనను జాగ్రత్తగా గమనిస్తూ పాఠాలు నేర్చుకుంటాడు.‘యువసేన’ ‘విక్రమార్కుడు’ ‘లక్ష్యం’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘అత్తారింటికి దారేది’...మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమిత్ కుమార్ తివారీ కన్నింగ్, సైకో, క్రుయల్ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచాడు.‘కీప్ ట్రైయింగ్’ ‘కీప్ ఫైటింగ్’ అనేవి అమిత్ నమ్ముకున్న సూత్రాలు. ఈ సూత్రాలే అతనిలో ఆశావహ దృక్పథాన్ని పెంచి ‘ఉత్తమ విలన్’గా ప్రేక్షకుల మెప్పు పొందేలా చేశాయి. -
నా పేరు జక్కా... పెద్ద ఎదవని
‘ఈయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్లా ఉన్నాడు. నేను సంతకం పెట్టను...అంటున్నాడు’అలాగా! అదిగో జక్కా వస్తున్నాడు చూడండి...ఎడమ చేత్తో చేతిలోని సిగరెట్‌ను సై్టలిష్‌గా విసిరేసి ఆ అధికారితో జక్కా ఏమంటున్నాడో చదవండి... ‘నా పేరు జక్కా. పెద్ద ఎదవని. మా మామయ్య నా కంటే పెద్ద ఎదవ. నీకు కారుందా? సొంతబిల్డింగ్ ఉందా? ఏమీ లేని వాడివి ఉన్నవాడితో పెట్టుకుంటే... ఉండే ప్రాణాలు కూడా ఉండవు’ పొడవాటి జుత్తుతో సై్టలిష్‌గా కనిపిస్తూనే ‘కృష్ణ’ సినిమాలో ‘జక్కా’గా ప్రేక్షకులను తెగభయపెట్టించాడు ముకుల్‌దేవ్. ముకుల్‌దేవ్ పక్కా ఢిల్లీబాయ్. నాన్న పెద్ద పోలీస్ ఆఫీసర్. అమ్మ స్కూలు టీచర్. అమ్మ విషయం ఎలా ఉన్నా నాన్న మాత్రం తన కొడుకు ఏదైనా ఒక పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, యూనిఫాం ధరించాలని అనుకునేవాడు. అది సాధ్యం కాలేదుగానీ, రాయబరేలిలోని ‘ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ’లో కమర్షియల్ పైలట్‌గా శిక్షణ తీసుకున్నాడు.బాలీవుడ్ సినిమాలంటే ఇష్టపడే ముకుల్‌దేవ్, స్నేహితుల దగ్గర హీరోలను సరదాగా అనుకరించి చూపేవాడు. ఇంతకు మించి దేవ్‌కు నటన గురించి పెద్దగా తెలియదు.కమర్షియల్ పైలట్‌గా తన కెరీర్ మొదలుకాకముందే, మహేష్‌భట్ ‘దస్తక్’ సినిమాలో నటించే బంగారు అవకాశం ముకుల్‌దేవ్‌కు వచ్చింది.‘‘చాలామందిలా బాలీవుడ్లో ప్రవేశించడానికి నేనేమి కష్టపడలేదు. పాకెట్ మనీ కోసం సరదాగా యాడ్స్ చేస్తున్న సమయంలో ప్రఖ్యాత దర్శకుడు మహేష్‌భట్ కంట్లో పడ్డాను. అలా దస్తక్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్లో నాది రెడ్‌కార్పెట్ వెల్కమ్’’ అని తన బాలీవుడ్ ప్రవేశం గురించి చెబుతాడు దేవ్.‘దస్తక్’లో దేవ్ పోషించిన ఏసీపీ రోహిత్ మల్హోత్ర పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.నటనలో ఓనమాలు తెలియకపోయినా, ఒక్కో సినిమాతో తన నటనను మెరుగు పరుచుకుంటూ వెళ్లాడు ముకుల్ దేవ్.‘ఖిలా’ సినిమాలో దిలీప్ కుమార్‌తో పని చేయడం దేవ్‌కు ఒక అద్భుత అనుభవంగా మిగిలింది . ఒక నటదిగ్గజంతో నటించడం వల్ల, తనకు తెలియకుండానే పాఠాలు నేర్చుకున్నాడు దేవ్. ‘తెలుసుకోవడం ద్వారా మాత్రమే కాదు నటిస్తూ పోవడం ద్వారా కూడా నటన పట్టుబడుతుంది’ అంటాడు ముకుల్‌దేవ్. ‘దస్తక్’ సినిమాతో లక్కీచాన్స్ కొట్టేసిన దేవ్ తన కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందనుకున్నాడు.రెండు సంవత్సరాల తరువాత కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయింది.‘ఏంచేయాలా?’ అని ఆలోచిస్తున్న సమయం టీవీ రంగం ఆహ్వానం పలికింది.‘పెద్ద సినిమాల్లో నటించిన నేను...టీవీలో నటించడం ఏమిటి?’ అనుకోలేదు.‘ఇప్పుడు నా చేతిలో పని లేదు. ఆ పని టీవీ ఇస్తుంది’ అనుకొని రకరకాల సీరియల్స్‌లో నటించి టీవీరంగాన్ని ఆస్వాదించాడు ముకుల్. టీవీ రంగంలో విజయవంతమైన దేవ్‌కు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్వాగతం పలికింది. 2008లో వచ్చిన రవితేజ చిత్రం ‘కృష్ణ’లో ‘జక్కా’గా కనిపించి, తన విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు ముకుల్ దేవ్. ఏక్‌నిరంజన్, అదుర్స్, కేడీ, మనీ మనీ మోర్ మనీ, బెజవాడ, నిప్పు, భాయ్...మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు దేవ్. తెలుగు సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు తెలుగు తెలిసినవాళ్లనే అసిస్టెంట్‌గా పెట్టుకునేవాడు. దీని ద్వారా క్రమక్రమంగా తెలుగు భాష నేర్చుకునే అవకాశం ఏర్పడింది. మూడు, నాలుగు సినిమాలు పూర్తయ్యేలోపు తెలుగులో సంభాషించే లెవెల్‌కు చేరుకున్నాడు!రాహుల్ దేవ్ (అతడు, తులసీ, ఎవడు, నాయక్... మొదలైన తెలుగు చిత్రాల్లో నటించారు)కు ఈ ముకుల్‌దేవ్ స్వయాన సోదరుడు. అన్నలాగే తమ్ముడు కూడా ‘ఉత్తమ విలన్’గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. -
ఆడంగులంతా లోపలకి వెళ్లండి...
‘ఇంజినీరన్నయ్యా, నాకు సెప్పకుండా డ్యామ్ కట్టేసి దాని పేరు సెప్పుకుని నువ్వు, నీ పేరు సెప్పుకుని నీ కొడుకులు అంతా నొక్కేద్దామనుకుంటున్నారా. నేను బతికుండగా ఆ డ్యామ్ పని జరగనివ్వను’’ అంటూ బ్రహ్మన్న పాత్రలో చెప్పిన డైలాగ్‌తో తెలుగుతెరకు విలన్‌గా పరిచయం చేశారు కృష్ణవంశీ. చిత్రం శ్రీఆంజనేయం. ‘ఆడంగులంతా లోపలకి వెళ్లండి... అంటూ ‘ఔనన్నా కాదన్నా’ చిత్రంలో మంగరాజు పాత్రలో ప్రేక్షకులను భయపెట్టారు. ‘ఆరున్నర కోట్లు నీ మీద పెట్టుబడి పెడుతున్నాం...’ అన్నారు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు... ఈ చిత్రంలో పాత్ర గురించి చెబుతూ. ౖరైల్వే ప్లాట్‌ఫారమ్ మీద కళాసీ అభిమానులు ‘యాక్షన్’ అంటూ, పిళ్లా లక్ష్మీప్రసాద్ చేత ముచ్చటగా ‘ఔనన్నా కాదన్నా’ డైలాగును పెద్ద గొంతులో చెప్పించుకున్నారు. 1969లో సీతన్నపేటలో ‘విషవలయం’ నాటకంలో వీధిలో హాస్యపాత్రతో రంగస్థల జీవితం ప్రారంభించి, నాటకాలలో హీరో అయ్యారు. ఆదివిష్ణు రచించిన ‘సిద్ధార్థ’ నాటకంతో రంగస్థలం మీద గుర్తింపు తెచ్చుకున్నారు. 1973లో అత్తిలి కృష్ణారావు ‘యుగసంధ్య’ నాటకాన్ని చెన్నై ఆంధ్ర క్లబ్లో ప్రదర్శించారు. నాటకానికి వచ్చిన సినీ ప్రముఖులందరూ ప్రశంసల జల్లులు కురిపించారు. కానీ ఒక్కరూ చలన చిత్రంలో నటించే అవకాశం ఇవ్వలేదు.ఆ నాటకానికి ప్రముఖ హాస్యనటుడు రాజబాబు వచ్చారు. ప్రసాద్ నటన చూసి ముచ్చటపడి, ఆయనను మెచ్చుకుని ఊరుకోకుండా, ముద్దాడారు. ‘నీకు ఎప్పటికైనా సినిమాలలో నటించే అవకాశాలు వస్తాయి. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. ఇక్కడ అన్నీ ఉన్నాయి. వాటికి దూరంగా ఉండు’ అని చెవిలో రహస్యంగా చెప్పిన శిలాక్షరాలను ప్రసాద్ ఎన్నటికీ మర్చిపోలేదు. పిళ్లా ప్రసాద్లో చాలా కోణాలు ఉన్నాయి. రచయిత, రంగస్థల నటుడు, దర్శకుడు, రేడియో టీవీ నటుడు. ‘పిట్టలదొర’ గా వేగంగా మాట్లాడి ఉగాది పురస్కారం అందుకున్నారు. విజయవాడలో ఉన్న రోజుల్లోనే ‘కళాభారతి’ నాటక సంస్థలో జంధ్యాలతో కలిసి పనిచేశారు. ఆయన రికమెండేషన్ మీదే ‘గందరగోళం’ లో నటించే అవకాశం వచ్చింది. పిళ్లా ఫొటోలు జంధ్యాల స్వయంగా సింగీతం శ్రీనివాసరావుకి పంపారు. ‘బీగరపంధ్య’ కన్నడ చిత్రంలో హాస్యనటునిగా కన్నడ తెర మీదా కనిపించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1980లో విడుదలైన ‘గందరగోళం’ చిత్రంలో మూడో హీరోగా నట జీవితం ప్రారంభించారు. ఆ తరువాత ‘నటన’ చిత్రంలో సెకండ్ హీరోగా కనిపించారు. హీరోగా రెండు చిత్రాలలో మాత్రమే కనిపించారు. అన్నవరంలో ఏదో పనిలో ఉన్న కృష్ణవంశీ ఏదో మ్యాగజైన్లో పిళ్లా ప్రసాద్ ఫొటో చూసి ‘వీడు నా ఫ్రెంyŠ , వీడిని పట్టుకోవాలి’ అనడంతో పిళ్లాప్రసాద్ కృష్ణవంశీ చేతికి దొరికారు. ‘శ్రీఆంజనేయం’ చిత్రంలో విలన్‌గా పరిచయం చేశారు. అలా 2004లో సినీరంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వెంటనే దర్శకులు తేజ, ‘ఔనన్నా కాదన్నా’ చిత్రంలో ప్రధాన విలన్ మంగరాజు పాత్ర ఇచ్చారు. విజయవాడలోనే ఉంటూ, వస్తూ వెళ్తూ సినిమాలు చేశారు. విలన్‌గా 31 సినిమాలు పూర్తి చేసుకున్నారు. మరో రెండు సినిమాలలో కనిపించనున్నారు. బుర్ర మీసాలతోను, ఎర్రబడ్డ కళ్లతోనూ, గంభీరమైన డైలాగులతో ప్రేక్షకులను భయపెట్టిన పిళ్లా ప్రసాద్, అక్కడితో ఆగకుండా ‘వంకాయ ఫ్రై’లో కామెడీ విలన్‌గా నవ్వులు పండించారు. నగరం నిద్రపోతున్న వేళ, మిర్చి, యువసేన, అసాధ్యుడు, నేను శైలజ చిత్రాలలో ప్రధానంగా కనిపించారు. 2014, 2015 ఉత్తమ విలన్ అవార్డులు అందుకున్నారు. – సంభాషణ: డా. పురాణపండ వైజయంతి -
నాతోనే గేమ్సా?!
నన్నే మోసం చేస్తావారా? బొమ్మ పడితే వదిలేస్తా బొరుసు పడితే నరికేస్తా ఇటీవలి కాలంలో దక్షిణాది చలనచిత్రరంగంలో చెడ్డ ‘విలన్’ పాత్రలకు మంచి పేరు తెచ్చుకుంటున్న నటుడు ఆదిత్య మీనన్. ‘సింహ’ సినిమాలో గోపి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు ఆదిత్య. ఆ సినిమాలో అతనికి చాంతాడు పొడుగు, బీభత్సమైన డైలాగులేమీ ఉండవు. ‘ఎవడ్రా కొట్టింది?’ ‘వాడి పేరు తెలుసా?’ ‘మనం వచ్చిన పనేమిటి? ఈ గొడవేమిటి?’ ‘చేతికి దొరికిన వాడ్ని వదిలేశానురా’..... ఇలా పొడి పొడి డైలాగులతోనే వీర లెవెల్లో విలనిజాన్ని పండించాడు ఆదిత్య. తక్కువ మాటలతో ఎక్కువ నటనను ప్రదర్శించే ఆదిత్య నటనను గమనిస్తే, విలన్ల గురించి ప్రముఖ మాట ఒకటి చప్పున గుర్తుకొస్తుంది. ‘మా దగ్గర ప్లాన్లు తప్ప డైలాగులు లేవు. మా దగ్గర ప్రాబ్లమ్స్ తప్ప సొల్యూషన్స్ లేవు’ బాడీ అంతగా లేకపోయిన...డైలాగులు, హావభావాలతోనే భయపెట్టడం ఒక రకం. ఉదాహరణకు... రఘువరన్‌లాంటి వాళ్లు. నటనలో పస లేకపోయినా...ఒడ్డూ పొడుగుతోనే భయపెట్టడం రెండో రకం. రెండో రకం విలన్లు పెద్దగా కాలానికి నిలవరు. విలన్‌కు ఒడ్డూ పొడుగు, మంచి శరీరసౌష్ఠవం అవసరమేగానీ అవి మాత్రమే ఉత్తమ విలన్‌కు ప్రామాణికాలు కాలేవు. అందుకే...విలన్ జిమ్‌లోనే కాదు ‘మైండ్ జిమ్’లో కూడా గడపాలి. మానసిక కసరత్తు ఎంత బాగా జరిగితే నటన అంతగా మెరుస్తుంది. ఆదిత్య మీనన్ మంచి ఒడ్డూ, పొడుగు ఉన్న నటుడు. దీనికి తనలోని నటన కూడా తోడుకావడంతో విలన్ పాత్రలను సునాయాసంగా పోషించగలుగుతున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘ఉత్తమ విలన్’గా రాణించగలుగుతున్నాడు. ముంబాయిలో జన్మించాడు ఆదిత్య మీనన్. కొంత కాలం తరువాత అతడి కుటుంబం దుబాయికి వలస వెళ్లింది. దుబాయిలోని ‘అవర్ ఓన్ ఇంగ్లీష్ హైస్కూల్’లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు ఆదిత్య. పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు దుబాయిలోనే ఉన్నాడు. ఆ తరువాత కుటుంబ సభ్యులతో పాటు బెంగళూరుకు వచ్చాడు. బెంగళూరులోని ‘యం.ఎస్.రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో ఇంజనీరింగ్ చేశాడు. కాలేజీలో ‘రేడియో మిడ్డే’లో రేడియో హోస్ట్‌గా మీడియా రంగంలోకి ప్రవేశించాడు. ప్రాడక్ట్ లాంచ్, ఫ్యాషన్ షోలాంటి లైవ్ ఈవెంట్స్‌కు హోస్టింగ్ చేశాడు. ఇంజనీరింగ్ పూర్తయిన తరువాత ఈవెంట్ మేనేజర్‌గా కొంతకాలం పనిచేశాడు. ఈ సమయంలోనే ఒక థియేటర్ గ్రూపులో చేరి కొన్ని నాటకాల్లో నటించాడు. ఒకసారి ఆదిత్య నటన ప్రకాష్ బేలవాడి కంటపడింది. బెంగళూరుకు చెందిన ప్రకాష్ బేలవాడి జర్నలిస్ట్ మాత్రమే కాదు... నాటకాలు, సినిమా, టీవీలలో నటుడిగా మంచి పేరు ఉంది. సామాజిక, కళారంగాలకు సుపరిచితమైన పేరు ప్రకాష్ బేలవాడి. ఆదిత్య నటనను చూసి ‘‘ఈ కుర్రాడిలో స్పార్క్ ఉంది’’ అనుకున్నారు ప్రకాష్. అలా ప్రకాష్ తీసిన ఒక టీవి సీరియల్లో నటించే అవకాశం వచ్చింది ఆదిత్యకు. ఇదే సమయంలో ప్రముఖ కమెడియన్ యస్.కె.చంద్రు దర్శకత్వం వహించిన ‘సూర్య శిఖరీ’ టీవీ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. నాటకాల్లో నటించాడు. టీవిలో నటించాడు. ఇక వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 2001లో చెన్నైకు వెళ్లాడు ఆదిత్య. అవకాశాలు రాకో, మరే కారణమో తెలియదుగానీ చెన్నైకి వెళ్లిన తరువాత మళ్లీ బుల్లితెర మీద కనిపించాల్సి వచ్చింది. అలా రాడాన్ మీడియా వర్క్ నిర్మించిన ‘తంతిర భూమి’ సీరియల్లో నటించాడు. ఈ సీరియల్ సన్ టీవీలో ప్రసారమైంది. ఆ సమయంలోనే ప్రఖ్యాత దర్శడుకు కె.బాలచందర్ దర్శకత్వం వహించిన టీవీ సీరియల్ ‘అన్నీ’లో నటించే అవకాశం వచ్చింది. ‘ఆంజనేయ’ ‘జేజే’ సినిమాల్లో నటించే అవకాశం రావడం, ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నలుగురి దృష్టిలో పడే ఛాన్స్ దొరికింది. సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది.‘సింహ’ ‘బిల్లా’ ‘దూకుడు’ ‘ఈగ’ ‘మిర్చి’ ‘బలుపు’ ‘పవర్’ ‘లయన్’ ‘రుద్రమదేవి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆదిత్యమీనన్ మరిన్ని చెడ్డ పాత్రలతో ‘మంచి’ నటనను ప్రదర్శించి ‘ఉత్తమ విలన్’గా మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
నువ్వు మేకవన్నె పులివి రాజా!
మాట కంఠంలోనే ఆపెయ్ నీ మనసులో ఏమున్నా... అది లోనే దాచెయ్ బయటికి రానీకు. దాటి బయటికి వచ్చిందా... వస్తే? బాడీ... పార్ట్స్ పార్ట్స్‌గా విడిపోవచ్చు. అంతా మాత్రాన... మద్దాలి శివారెడ్డి అన్నీ సూటిగా చేస్తాడని కాదు. అవసరమైతే...కాళ్లు పట్టుకుంటాడు. ‘నువ్వు నా తమ్ముడిగా ఎందుకు పుట్టలేదురా? నీ కాళ్లకు దండం పెడతా!’ అంటూనే కాళ్లు లాగి అవతలి వ్యక్తిని కింద పడేయగలడు. వికటాట్టహాసం ఒకటి చేసి... ‘మంత్రి శివారెడ్డిని మళ్లీ రౌడీ శివారెడ్డిగా మార్చావు కదరా ఇది రౌడీ శివారెడ్డి పవర్’ అని తన పవర్ ఏమిటో చూపగలడు. ‘రేసుగుర్రం’ సినిమాతో మద్దాలి శివారెడ్డిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సరికొత్త విలన్ రవి కిషన్. ‘లక్’ సినిమాలో రవి కిషన్ డెరైక్టర్ సురేందర్‌రెడ్డికి బాగా నచ్చాడు. ముఖ్యంగా కళ్లు. అలా ‘రేసుగుర్రం’ సినిమాతో ‘మద్దాలి శివారెడ్డి’గా తెలుగు చిత్రసీమకు ‘ఉత్తమ విలన్’గా దిగుమతి అయ్యాడు. ‘కిక్-2’లో సోల్మాన్సింగ్ ఠాకూర్, ‘సుప్రీమ్’ సినిమాలో బీకుగా రవికిషన్ మనకు మరింత దగ్గరయ్యాడు. హీరోగా నటించడం కంటే విలన్‌గా నటించడమే కష్టం అంటారు. ఆ కష్టం రుచి ఎలా ఉంటుందో చూద్దామనుకున్నాడేమో రవికిషన్. భోజ్‌పురి ఫిల్మ్ సూపర్‌స్టార్ అయిన రవి కిషన్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో విలన్‌గా కనిపిస్తున్నాడు. రవి శరీర దారుఢ్యానికి ఆకర్షించే కళ్లు తోడై డైలాగులు బాంబుల్లా పేలుతున్నాయి. విలనిజం ఇరగ పండుతుంది. ‘రౌడీయిజం మా నాన్న దగ్గర నేర్చుకున్న. రాజకీయం నీ దగ్గర నేర్చుకున్న’ అనేది విలన్‌గా రవికిషన్ డైలాగ్. మరి నటన ఎక్కడ నేర్చుకున్నాడు? నటుడు ఎలా అయ్యాడు? ఆ స్టోరీలోకి వెళదాం పదండి.... ముంబైలోని శాంటాక్రాజ్లో ఒక చిన్న ఇంట్లో పుట్టాడు రవి. తండ్రికి చిన్న డైరీ బిజినెస్ ఉండేది. అన్నదమ్ముల మధ్య గొడవ రావడంతో ఆ వ్యాపారం మూతపడింది. అప్పుడు ఆయన తన మకాంను సొంతూరు ఉత్తరప్రదేశ్‌లోని జోన్పూర్కు మార్చాడు. చదువు మీద రవికి ఎంత మాత్రం ఆసక్తి ఉండేది కాదు. మరోవైపు చూస్తే...ఇంట్లో పేదరికం. దీపావళిలాంటి పెద్ద పండగలకు కూడా కొత్త బట్టలు కొనే స్థోమత ఉండేది కాదు. రవికి ఒక లక్ష్యం అంటూ ఉండేది కాదు. ‘గూండాగా మారుతానేమో’ ‘చనిపోతానేమో’ ‘నాకు పిచ్చిపడుతుందేమో’ ఇలా ఏవో పిచ్చి పిచ్చిగా ఆలోచించేవాడు. ఆరోజుల్లో అమితాబ్ బచ్చన్ సినిమాలు బాగా చూసేవాడు. ఆ సినిమాలు రవిని బాగా ప్రభావితం చేశాయి. ‘నా వెనకాల ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. చదువు లేదు. టీచర్ లేడు. సినిమానే నా గురువు’ అనుకున్నాడు. ఆ గురువే తనకు నటనలో కూడా పాఠాలు నేర్పించింది. పదిహేడు సంవత్సరాల వయసులో తల్లి ఇచ్చిన ఐదొందల రూపాయలు తీసుకొని ముంబైకి వెళ్లిపోయాడు. పాత ఫ్రెండ్ హృదయ్షెట్టి రూమ్‌లో ఉన్నాడు. అతడే రవిని ఎందరో దర్శకులకు పరిచయం చేశాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో, తినడానికి భోజనం లేకుండా ఎన్ని రోజులు పస్తులు ఉన్నాడో తెలియదుగానీ బి-గ్రేడ్ ఫిల్మ్ ‘పీతాంబర్’లో నటించే అవకాశం వచ్చింది. ‘తేరే నామ్’ సినిమాతో రవి కిషన్‌కు కాస్త గుర్తింపు వచ్చింది. అందులో పూజారి పాత్ర వేశాడు. ఆ తరువాత కూడా పెద్ద గుర్తింపు లేదు. డబ్బులు లేవు. ఈ సమయంలోనే ఒక భోజ్‌పురి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ‘భోజ్‌పురి సినిమా నాకు గౌరవాన్ని, గుర్తింపును, డబ్బును ఇచ్చింది. నన్ను సూపర్‌స్టార్‌ని చేసింది’ అని భోజ్‌పురి మీద కృతజ్ఞత చాటుకున్న రవికిషన్ ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు.తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ విలన్‌గా గుర్తింపు పొందుతున్నాడు.