ఎత్తండ్రా పాడా... కొట్టండ్రా డప్పు!
‘ఏ స్పాట్ పెట్టినా / ఏ గేమ్ ఆడినా
భగవతిదేరా పైచేయి/ ఎత్తండ్రా పాడా
కొట్టండ్రా డప్పు’
భగవతి స్పాట్ పెడితే చచ్చినట్టే. పాడె ఎత్తాల్సిందే. డప్పు కొట్టాల్సిందే!
‘రణం’ సినిమాలో ‘భగవతి’ బాగా పాపులర్ అయ్యాడు. ‘ఎవరీ భగవతి?’ అనే ఆసక్తిని పెంచాడు.
దిట్టంగా కనిపించే మలయాళ నటుడు బీజూ మీనన్ ‘భగవతి’ పాత్రకు ప్రాణం పోశాడు. ‘రణం’ సినిమాలో ఆవేశం, కోపం, ప్రత్యక్షహింసకు నిలువెత్తు కటౌట్‌లా కనిపించిన బీజూ మీనన్ ‘ఖతర్నాక్’ సినిమాలో మాత్రం చాప కింద విషంలాంటి లాయర్ పాత్రలో...‘పోలీసులకు తెలివిగా స్పిన్ బౌలింగ్ చేసే కిలాడి కావాలి.వాడి ఒంట్లో 420 క్రిమినల్ గ్రూప్ బ్లడ్ ఉండాలి’లాంటి డైలాగులతో మెప్పించాడు.
∙∙
మలయాళం టీవి సీరియల్స్‌తో తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించాడు బీజూ మీనన్. ‘పుత్రన్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో విలన్, సెకండ్ హీరోగా నటించాడు. హీరోగా నటించిన చిత్రాలలో ఎక్కువ భాగం పరాజయం పొందాయి. సురేష్ గోపితో కలిసి ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించాడు.డబ్బుల కోసం ఎడాపెడా నటించే నటుడు కాదు బీజూ.
2007–2010 మధ్యలో ఒకేరకమైన పోలీసు పాత్రల్లో నటించాల్సివచ్చింది. చివరికి ఒక దశలో విరక్తి వచ్చినంత పనైంది.‘‘ఇక నేను పోలీసు పాత్రల్లో నటించను’’ అని బహిరంగంగా ప్రకటించాడు కూడా.ఎవరూ పోలీసు పాత్రలు ఆఫర్ చేయకుండా పనిగట్టుకొని తలవెంట్రుకలు, గెడ్డం పెంచాడు!ఒక పాత్రను నిండుగా పండించడానికి తన జీవితంలో నుంచి ఇన్‌పుట్స్ తీసుకుంటాడు.ఉదాహరణకు పోలీసు పాత్రలో కోపాన్ని ప్రదర్శించే సన్నివేశాల్లో... తన తండ్రి హావభావాలను గుర్తుతెచ్చుకునేవాడు. వాళ్ల నాన్న పోలీసు. కోపంగా ఉన్నప్పుడు... ఆయన ఇంట్లో ప్రదర్శించిన కోపం బీజూ మైండ్‌లో ఫిక్సయిపోయింది.
ఇక ‘రోల్ లెంత్’ అనేదానిపై బీజూకు ఎలాంటి భ్రమలు లేవు.‘‘పాత్ర నిడివి పెద్దగా ఉంటేనే పేరొస్తుంది అనే మాటను నేను నమ్మను. ఎంత పెద్ద పాత్రలో నటించావు, ఎంత చిన్నపాత్రలో నటించావు అనేదాని కంటే... ఇచ్చిన పాత్రకు ఎంత న్యాయం చేశావు అనేది ముఖ్యం’’ అంటాడు బీజూ.టెక్నాలజీ మారినట్లే... నటుడు అనేవాడు కూడా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ ఉండాలి అనే బీజూ మూసా పాత్రలు కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యం కనిపించే పాత్రల్లో నటించడానికి ఇష్టపడతాడు.
‘‘నటన అనేదానికి అవకాశం ఉందంటే అది హీరోనా, విలనా, సెకండ్ హీరోనా. చిన్నపాత్ర... అనేది చూడను’’ అంటున్న బీజూ మీనన్ ఏ పాత్రలో అయినా ఇమిడిపోయే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.