సైలెంట్ విలన్!
‘ఆయన ఎవరనుకుంటున్నారు?‘‘సాక్షాత్తు ఎంపీగారి కుమారుడు, యూత్ లీడర్... ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారా?’’‘‘తప్పు చేసిన వాడిని జైల్లో వేయక మెడలో దండలు వేసి ఊరేగిస్తారా?’’చట్టంతో వారికి పనిలేదు. రూల్స్‌తో వారికి పనిలేదు. వారికి తెలిసిందల్లా వాటిని తమ దారిలోకి తెచ్చుకోవడం. అవి దారిలోకి వస్తే రాష్ట్రాన్ని సైతం అమెరికాకు అమ్ముకునే తెలివితేటలు ఉన్నాయి ఈ తండ్రీకొడుకులకు. అందుకే ఆ యూత్‌లీడర్ ఏమంటున్నాడో చూడండి.‘‘నన్ను లోపలెయ్యడానికి వాడెవ్వడు.మా నాన్నతో ఢిల్లీతో మాట్లాడించి వాడ్ని ట్రాన్సఫర్ చేయిస్తానంతే’’
‘రక్షణ’ సినిమాలో యూత్‌లీడర్ కావచ్చు. ‘నువ్వు నేను’ సినిమాలో మాటలు లేకుండా హీరోహీరోయిన్లను వెంటాడే రౌడీ కావచ్చు.... ఏ పాత్ర చేసినా బెనర్జీకి బారెడు డైలాగులు ఉండవు. దీనికి జవాబు అడిగితే ఆయన దగ్గర స్పష్టమైన సమాధానం లేకపోవచ్చుగానీ... భయపెట్టించడానికి బారెడు డైలాగులు మాత్రమే అక్కర్లేదని బెనర్జీ నటన పరిచయం ఉన్నవాళ్లకు అర్థమవుతుంది.చిన్న డైలాగుల్లో సైతం లోతైన నటనను ప్రదర్శించడంలో తనదైన మార్క్ సృష్టించుకున్నారు బెనర్జీ.
సినిమాల్లోకి వెళ్లాలని, నటుడు కావాలని బెనర్జీ పెద్దగా ఎప్పుడూ అనుకోలేదు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే... ఒక నీటి ప్రవాహంలా ఎటంటే అటు వెళ్లారు. మద్రాస్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ చదివి మధ్యలోనే వదిలేశారు. ఒక కంపెనీ బ్రాంచ్ మేనేజర్‌గా విజయనగరంలో ఆరు సంవత్సరాలు పనిచేశారు. అక్కడ మంచి స్నేహితులను సంపాదించుకున్నారు. వారి సలహా వల్లో ఏమోగానీ ఆ తరువాత సినిమా ఫీల్డ్‌కు వెళ్లారు.
యు.విశ్వేశ్వర్రావు దగ్గర ఒక సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేశారు. అసిస్టెంట్‌గా విధులు నిర్వహించడంతో పాటు ఆ సినిమాలో నటించారు కూడా. అలా తొలి సినిమాతోనే అసిస్టెంట్ డైరెక్టర్‌తో పాటు నటుడు అయ్యారు.‘థర్టీఇయర్స్ ఇండస్ట్రీ’ అనిపించుకున్నారు.‘అది చేస్తా’, ‘ఇది చేస్తా’, ‘ఇరగదీస్తా’ ఇలాంటి ఆడంబరపు మాటలేవీ బెనర్జీ నోటి నుంచి వినిపించవు. అలవి కాని స్వప్నాలు కూడా ఆయనలో కనిపించవు. ఆయన మాటల్లో లోతు కనిపిస్తుంది. అడపాదడపా ఇలాంటి కవితలు కూడా వినిపిస్తాయి.
‘ప్రపంచం ఒక మధుశాల జీవితం అనేది ఒక మత్తు ఒకడికి చనిపోవాలనే మత్తు. ఒకడికి బతకాలనే మత్తు. ఒకడికి సంపాదించాలనే మత్తు. ఒకడికి ప్రేమ మత్తు. నేను కొద్దిగానే తాగా. నా మత్తు పొద్దుటి కల్లా దిగిపోతుంది. ఆ మత్తు మాత్రం జీవితం వెళ్లిపోయేవరకు ఉంటుంది’. ఆయనలోని తాత్వికత మాట ఎలా ఉన్నా.... తక్కువ మాటలతో ఎక్కువ భయపెట్టే విలన్‌ల వరుసలో బెనర్జీ తప్పనిసరిగా ఉంటారు.