నా ముందు తలదించుకొని బతకాల...
నాగిరెడ్డి అంటే మాటలా?
మాట మాటకూ మందుపాతర దట్టించి పేల్చగలడు.
పండ్లు నూరుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తించగలడు.
‘రేయ్... పో...
ఎక్కడో ఒక చోట హాయిగా బతుకు.
లేదు... ఇక్కడే బతుకుతానంటావా...
ఇల్లు ఇస్తా.
ఎకరం పొలం ఇస్తా.
నా ముందు తలదించుకొని బతకాల.
తల ఎత్తావో... నరికేస్తా!’ అంటూ ప్రత్యర్థి ముఖం మీదే పిడుగులు కురిపించగలడు..
‘ఆది’ సినిమాలో నాగిరెడ్డిగా అసమాన నటన ప్రదర్శించారు రాజన్ పి. దేవ్.
రాజన్‌ను చూస్తే... మన ఊళ్లోనో, మరో చోటో కనిపించే పెద్ద మనిషిలాంటి విలన్ గుర్తుకు వస్తాడు తప్ప ఎక్కడి నుంచో దిగుమతి అయిన ‘మల్లువుడ్ విలన్’ గుర్తుకురాడు.‘మన ఇలనే’ అన్నంతగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజన్ పి. దేవ్ ఈవారం మన ‘ఉత్తమ విలన్’
‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది కదా!’రాజన్ కూడా ఆ గూటి పలుకే పలికారు. రాజన్ నాన్న ఎస్.జె.దేవ్ ప్రసిద్ధ నాటకకళాకారుడు. చిన్నప్పుడు ఆటల కంటే నాటకాల మధ్యే ఎక్కువ కాలం గడిపేవాడు రాజన్. రిహార్సల్ సమయంలో పెద్ద పెద్ద నటుల నుంచి వినిపించే భారీ డైలాగులు, చిన్న రాజన్ పెదాల మీద అలవోకగా ప్రతిధ్వనించేవి.
నాన్న ఎస్.జె.దేవ్‌ను ఆదర్శంగా తీసుకొని ఎన్నో నాటకాల్లో నటించారు రాజన్. సీనియర్ రంగస్థల కళాకారుడు ఎన్.ఎన్.పిల్లై ఆధ్వర్యంలో ఎన్నో నాటకాల్లో ఎన్నో రకాల పాత్రలు పోషించారు రాజన్. నటించడం మాత్రమే కాదు... చిన్నవయసులోనే నాటకాలు రాయడం, దర్శకత్వంలాంటివి చేసేవాడు. ‘మలయాళం నాటక వేది’ పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించి ‘రాధమ్’ అనే నాటకం రాసి దర్శకత్వం చేశారు.
అయితే ఈ నాటకం పెద్ద డిజాస్టరై రాజన్‌ను ఆర్థికసమస్యల్లో కూడా నెట్టింది. వేరొకరయితే ‘నాటకాలకో దండం మీకో దండం’ అని మూటా ముల్లే సర్దుకునే వారు. పోయిన చోటే వెదుక్కోవాలనుకునే రాజన్ వెనక్కి తగ్గలేదు. ఎస్.ఎల్.పురం సదానందన్ నాటకం ‘కట్టుకుతిర’లో ప్రధాన పాత్రను పోషించారు. ఈ నాటకం వందకు పైగా ప్రదర్శనలు పూర్తి చేసుకోవడంతో రాజన్ పేరు కేరళ మొత్తం సుపరిచితం అయింది.
హరిశ్రీ థియేటర్ వారి ఒక నాటకంలో మానసిక వికలాంగుడి పాత్ర ధరించి శభాష్ అనిపించుకున్నారు రాజన్. ‘బెస్ట్ యాక్టర్’గా స్టేట్ అవార్ట్ కూడా గెలుచుకున్నారు.నాటకరంగంలో తిరుగులేని నటుడు అనిపించుకున్న రాజన్ ఆ తరువాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఫజిల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎంటె మమట్టికుట్టియమక్కు’ చిత్రంతో రాజన్ ఫిలిం కెరీర్ మొదలైంది. రాజన్ వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ‘కట్టుకుతిర’ నాటకం సినిమాగా వచ్చింది.
అయితే ఆ నాటకంలో తాను చేసిన లీడ్‌రోల్ వేరే నటుడికి దక్కడం రాజన్‌ని నిరాశకు గురిచేసింది. ఇదే విషయాన్ని ఒక ఇంటర్య్వూలో చెప్పుకున్నారు రాజన్. ఇది చదివిన ‘కట్టుకుతిర’ దర్శకుడు తన మరో చిత్రం ‘ఇంద్రజాలం’లో ‘కార్లోస్’ అనే విలన్ రోల్ రాజన్‌కు ఇచ్చాడు. ‘కార్లోస్’ పాత్రతో రాజన్ కెరీర్ మలుపు తిరిగింది. ఎన్నో చిత్రాల్లో విలన్‌గా నటించారు. విలన్ పాత్రల్లో రాజన్ ఎంత పాపులర్ అయ్యాడంటే...
‘‘ఆయన పని గట్టుకొని క్రూరమైన డైలాగులు చెప్పాల్సిన పనిలేదు. ఆ ముఖం, కళ్లు చాలు విలనిజాన్ని చాటడానికి’’ అనేవాళ్లు.క్రూరత్వంతోనే విలనీ పండుతుందనేది నిజమే అయినా కాస్త హ్యూమర్ టచ్‌తో కూడా విలనిజాన్ని పండించి తనదైన శైలిని చాటుకున్నారు రాజన్. తమిళ, కన్నడ, తెలుగు సినిమాలలో అవకాశాలు రాజన్‌ను వెదుక్కుంటూ వచ్చాయి.
తెలుగులో ‘ఖుషీ’ ‘ఆది’ ‘నాగా’ ‘దిల్’ ‘ఒక్కడు’ ‘ఆర్యా’ ‘గుడుంబ శంకర్’ ‘బాలు’ ‘బన్నీ’ ‘వీరభద్ర’ ‘యోగి’ ‘కాళిదాస్’ ‘క్రిష్ణ’... మొదలైన సినిమాలలో నటించారు. అవివీతి పోలీసు అధికారి నుంచి ఫ్యాక్షనిస్ట్ వరకు... ప్రతి పాత్రలోనూ తన మార్క్ విలనిజాన్ని చాటుకొని ‘ఉత్తమ విలన్’గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన రాజన్ పి. దేవ్ 2009లో చనిపోయారు.
చాలామంది ప్రేక్షకులకు ఆయన మలయాళ నటుడు అనే విషయం తెలియదు. మన తెలుగు విలనే అన్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘రాజన్ పి. దేవ్’ అనే ఆయన పేరు కొద్దిమందికే తెలిసి ఉండవచ్చు. అయితే ‘నాగిరెడ్డి’ ‘యం.పీ. అవతారం’ ‘కుమారస్వామి మామ’ మొదలైన పేర్లతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత విలనీయుడుగా గుర్తుండిపోతారు రాజన్ పి. దేవ్.