సాక్షి, న్యూఢిల్లీ : రుణభారంతో కుదేలైన విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌పై దివాలా ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు తమ సంస్థను గట్టెక్కించేందుకు , తద్వారా తమ భవిష్యత్తు భరోసాకు నడుం బిగించారు. ఆది గ్రూపు భాగస్వామ్యంతో ఉద్యోగుల కన్సార్షియం బిడ్ దాఖలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఎన్‌సీఎల్‌టీ(నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్) ద్వారా 75 శాతానికి బిడ్ దాఖలు చేస్తామని శుక్రవారం ప్రకటించింది. సంస్థ ఉద్యోగులు ఇలాంటి చొరవ తీసుకోవడం ఇదే తొలిసారని బిజినెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
భారత విమానయాన చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయమని అంటున్నారు. "ఇది నిజంగా ప్రధానమంత్రి కల 'సబ్‌కా సాథ్, సబ్ కా వికాస్ సబ్ కా విశ్వస్' ను సూచిస్తుందంటూ , ఉద్యోగుల కన్సార్షియం ఆదిగ్రూప్ జారీ చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలట్స్, జనరల్ సెక్రటరీ, జెట్ సీనియర్-మోస్ట్ పైలట్లలో ఒకరైన కెప్టెన్ అశ్వని త్యాగి, ఆది గ్రూపు ప్రతినిధులు పాల్గొన్నారు.
కంపెనీకి రుణాలిచ్చిన 26 సంస్థల తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జెట్ ఎయిర్‌వేస్‌పై 2016 నాటి ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్‌రప్టసీ చట్టం ప్రకారం కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్(సీఐఆర్‌పీ) దివాలా ప్రక్రియ పిటీషన్ దాఖలు చేసింది. ఎన్‌సీఎల్‌టీ ముంబై ధర్మాసనం ఈ పిటీషన్‌ను ఈ నెల 20న స్వీకరించగా తదుపరి విచారణ జూలై 5న జరగనుంది. భారత్‌లో దివాలా ప్రక్రియకు చేరిన తొలి విమానయాన సంస్థగా జెట్ ఎయిర్‌వేస్ నిలిచింది. ఐఆర్‌పీగా నియమితులైన ఆశీష్ చౌచారియా 90 రోజుల్లో రిజల్యూషన్ ప్రణాళికను అందజేయాలని ఎన్‌సీఎల్‌టీ ముంబై ధర్మాసనం ఆదేశించింది.
కాగా బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థలకు జెట్ ఎయిర్‌వేస్ కంపెనీ రూ.8 500 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు, వెండార్లకు కలిపి మొత్తం 25వేల కోట్ల లోనే బకాయిలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిపేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment