ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా
అచంచలమైన ఆత్మస్థైర్యంగల నటి ఆండ్రియా సొంతం. ఎవరో ఏదో అనుకుంటారని తన వ్యక్తిత్వానికి అతీతంగా నడుచుకునే స్త్రీకాదు. ముక్కుసూటి ప్రవర్తన ఈమె నైజం. బహుముఖ ప్రజ్ఞ ఇందుకు ఒక కారణం కావచ్చు. మలయాళ యువ నటుడితో ప్రేమ వ్యవహారం, యువ సంగీత దర్శకుడితో రొమాన్స్ అంటూ...కోరుకున్న జీవితాన్ని అనుభవించే ఆండ్రియా ఎప్పటికీ సంచలన తారనే. ఒక్కసారి నటిస్తే చాలని ఆశించే చాలామందికి హీరోయిన్లు మధ్య విశ్వనాయకుడు కమలహాసన్ సరసన మూడుసార్లు నటించే లక్‌ను దక్కించుకున్న ఆండ్రియాతో చిన్న భేటీ...
ప్రశ్న: నటుడు కమలహాసన్‌తో వరుసగా చిత్రాలు చేశారు. ఆయన నుంచి ఏమి నేర్చుకున్నారు?
జవాబు: ఒక్కో చిత్రంలో నేనాయన నుంచి చాలా నేర్చుకున్నాను. కమలహాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. నేను సినీరంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో కమలహాసన్ సరసన నటించే అవకాశం వస్తే అది ఒక్క సీన్ అయినా ఒప్పేసుకుని నటించమని ఒక దర్శకుడు సలహా ఇచ్చారు. అయితే కమలహాసన్ చిత్రాల్లో ఒక్క సన్నివేశంలో నటించినా అది అద్భుతంగా ఉంటుంది. అందువలన ఆయన అవకాశం ఇస్తే ఎలాంటి సందేహం లేకుండా ఎస్ అంటాను.
ప్రశ్న: మీలో మంచి గాయని ఉన్నారు. చాలా చిత్రాల్లో పాడారు. అలాంటిది ఉత్తమ విలన్ చిత్రంలో పాడలేదే?
జవాబు: మీరు చాలా చిత్రాల్లో పాడారు. ఈ చిత్రంలో వద్దు అని కమల్ అన్నారు. ఆయనే అలా అంటే నేనెలా పాడగలను.
ప్రశ్న: ఏ విషయాల ప్రాతిపదికపై చిత్రాలు ఎంపిక చేసుకుంటారు?
జవాబు: మొదట చిత్రానికి పని చేసే టీమ్ ఎవరన్నది తెలుసుకుంటాను. ఆ తరువాత చిత్ర కథ ఏమిటి? అందులో పాత్ర సంతృప్తికరంగా ఉందా? అన్న విషయాలపై దృష్టి సారిస్తాను. అలాగే చిత్రానికి దర్శకుడు ఎవరన్నది చూస్తాను.
ప్రశ్న : సినిమా గురించి అర్థం చేసుకుంది?
జవాబు: నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నాకేమి అర్థం కాలేదు. షూటింగ్ స్పాట్‌లో నా పాత్ర చిత్రీకరణ పూర్తి అయితే చాలు అక్కడ నుంచి వెళ్లిపోతాను. ఆ తరువాత నాకంటూ ఒక చిన్న జీవితం ఉంది. అంతేకాని పుస్తకాలు చదువుతాను లాంటి కాకమ్మ కథలు చెప్పను. నాకు సంబంధించినంతవరకు నటన అనేది ఒక వృత్తి అంతే.
ప్రశ్న: ఎలాంటి చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నారు?
జవాబు: మణిరత్నం చిత్రాల్లాంటి పూర్తి ప్రేమ కథా చిత్రాల్లో నటించాలనుంది. నేనింత వరకు అలాంటి చిత్రం ఒక్కటి చేయలేదు.
ప్రశ్న: ఏ భాషల్లో నచ్చిన పాత్రలు లభిస్తున్నాయి.
జవాబు: కరెక్ట్‌గా చెప్పాలంటే మలయాళంలో గ్లామర్ పాత్రలే చేయాలని ఒత్తిడి చేయరు. అదే విధంగా తెలుగులోనూ మంచి ఆదరణ, గౌరవం లభిస్తోంది. అలాంటి చిత్రాల్లో నటించడం సంతోషంగా ఉంది.
ప్రశ్న: మీ గురించి తరచూ వదంతులు ప్రచారం అవుతున్నాయి. బాధగా లేదా?
జవాబు: మొదట్లో కొంచెం బాధనిపించేది. ప్రస్తుతం అలాంటి వదంతులు తగ్గాయిలెండి.
ప్రశ్న: ప్రస్తుతం కథానాయికుల పరిస్థితి?
జవాబు: నిజం చెప్పాలంటే తమిళంలో సీనియర్ కథానాయికల గురించి నాకు తెలియదు గాని ఇప్పుడు భారతీయ సినిమాలో హీరోయిన్ల వయసు పెరుగుతున్న కొద్దీ ప్రాధాన్యత తగ్గుతూ పోతుంది. హాలీవుడ్‌లో అలా కాదు. అక్కడ వయసు పెరుగుతున్న కొద్ది గిరాకీ పెరుగుతుంది.