
'నాన్న కన్నా...ఆయన దగ్గరే ఎక్కువ పెరిగా'
చెన్నై: సినీనటుడు కమల్ హాసన్ బుధవారం ప్రముఖ దర్శకుడు బాలచందర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. బాలచందర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో షూటింగ్ నిమిత్తం కమల్ హాసన్ లండన్లో ఉండటంతో బాలచందర్ను చివరి చూపు చూసేందుకు అవకాశం దక్కలేదు.
చెన్నై చేరుకున్న కమల్ హాసన్ ఈరోజు ఉదయం బాలచందర్ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలచందర్ తనకు తండ్రిలాంటివారని, తన తండ్రి వద్దకన్నా ఆయన దగ్గరే ఎక్కువ పెరిగానని.. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాలచందర్ చివరిసారి 'ఉత్తమ విలన్' చిత్రంలో నటించటం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఆయన చిత్రాలను ప్రభుత్వం భద్రపరచి రేపటి తరాలకు అందించాలని కమల్ హాసన్ విజ్ఞప్తి చేశారు.