మేకప్‌కే నాలుగు గంటలు
వైవిధ్యానికి చిరునామా కమల్ హాసన్ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. పరిపూర్ణమైన నటనను ఇలాంటి నటుడి నుంచే ఆశించగలం. పాత్రకు జీవం పోయడానికి శాయశక్తులా ప్రయత్నించే పద్మభూషణ్ కమల్ హాసన్ ఇంతకు ముందు దశావతారం చిత్రంలో పది పాత్రలకు ప్రాణం పోసి సినీ చరిత్ర పుటల్లోకెక్కారు. ఆయన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడానికి రాజులో నాలుగైదు గంటలు మేకప్‌కే కేటాయించారు. తాజాగా మరోసారి అలాంటి అనితర సాధ్య కార్యాల్లో లీనమవుతున్నారు. ఈ విశ్వనాయకుడు తాజాగా నటిస్తున్న చిత్రం ఉత్తమ విలన్.
ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి 1980 ప్రాంతపు రంగ స్థల నటుడి పాత్ర. ఈ పాత్ర రూపం కోసం మళ్లీ ఆయన మేకప్ కోసం నాలుగు గంటలు వెచ్చిస్తున్నారు. ఈ మేకప్ కోసం ఆయన తీసుకుంటున్న శ్రద్ధ అబ్బురపరస్తుంది. వేకువ జామునే లేచి మేకప్‌కు సిద్ధం అవుతున్నారు. మళ్లీ షూటింగ్ పేకప్ అయ్యే వరకు ఆ పాత్రలోనే లీనమవుతున్నారు. కమల్ ఉత్తమ విలన్ చిత్రంపై అంచనాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. అభిమానులు కూడా కమల్ చిత్రం సంవత్సరం తరువాత వస్తుండడంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవల కమల్ ప్రయోగాత్మకమైన , కళాత్మకమైన, వైవిధ్యభరితమైన చిత్రాల మీద దృష్టి పెట్టారు. దీంతో ఆయన బడ్జెట్‌ను ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది. ఉత్తమ విలన్ చిత్రంలో పూజా కుమార్, ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరాం, ఊర్వశి తదితరులు నటిస్తుండడం ప్రత్యేకత. నటుడు అరవింద్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్ సంస్థ నిర్మిస్తోంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.