ఈ బత్తుల బైరాగినాయుడి జోలికి వస్తే...
ఉత్తమ విలన్
ఏ మిస్టేక్ జరిగినా అందరూ నాలో ఉన్న రాక్షసుడిని చూడాల్సి ఉంటుంది
కాంట్రాక్టర్ బద్రీనారాయణలో రాక్షసుడు కనిపించాలంటే ‘మిస్టేక్’ కనిపించాలి. బద్రీనారాయణ పాత్ర వేసిన షాయాజీ షిండే మాత్రం... తన నటనలో చిన్న మిస్టేక్ లేకుండా వెండితెరపై రాక్షసత్వాన్ని పండించి ‘గ్రేట్ విలన్’ అనిపించుకోగలరు.
‘ఏం నిల్చొని మాట్లాడుతున్నావు? కూర్చోవయ్యా.
ఏం తీసుకుంటావు?’...
ఇవి బత్తుల బైరాగి నాయుడి మాటలు. ఆహా... ఆ మాటల్లో ఎంత మర్యాద ఉంది!
‘రౌడీ వెధవలు మనకు ఎందుకు చెప్పు’
ఇవి కూడా బైరాగి నాయుడి మాటలు. ఆహా... రౌడీయిజం మీద ఎంత మంట!
‘ఒక్క ఓటు వేసి మీరు నన్ను మరిచిపోయినా... నేను మాత్రం మిమ్మల్ని జీవితాంతం మరిచిపోను’... ఇవి కూ....డా బైరాగి నాయుడి మాటలే.... ఆహా... ఎంత విశ్వాసం!!
కానీ... బైరాగినాయుడిలో భూతద్దం వేసి వెదికినా... మర్యాద కనిపించదు. రౌడీయిజం మీద అపారమైన ప్రేమ తప్ప వ్యతిరేకత కనిపించదు. తనను గెలిపించిన ప్రజల పట్ల పొరపాటున కూడా విశ్వాసం కనిపించదు.
‘ఠాగూర్’ సినిమాలో బద్రీనారాయణ, ‘వీడే’ సినిమాలో బత్తుల బైరాగి నాయుడు పాత్రలు షాయాజీ షిండే విలనిజానికి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే.
సొంతగొంతు కంటే... అరువు గొంతుతో మరింత ఎక్కువగా భయపెట్టగలడనేది ‘వీడే’ సినిమాతో రుజువు అయినా... ఆయన సొంతగొంతుతోనే మనకు ఎక్కువగా భయపడడం అలవాటైంది.
సరే... ఆ గొంతులో పలికే ముక్కల ముక్కల తెలుగు సంగతి ఎలా ఉన్నా... ఆ కళ్లలో పలికే భావాలు చాలు... విలనిజం చిరునామా చెప్పడానికి!
తెలుగు ప్రేక్షకులకు ‘మన ఇలనే’ అన్నంతగా దగ్గరైన... షాయాజీ షిండే... ఎక్కడి వారు?
ఒక్కసారి అలా మహారాష్ట్ర వరకు వెళ్లొద్దాం...
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టారు షిండే. డిగ్రీ తరువాత ‘మహారాష్ట్ర గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్’లో వాచ్‌మెన్‌గా చేరారు. నెల జీతం 165 రూపాయలు. ఉద్యోగం చేస్తున్నా మనసంతా నాటకాలపైనే ఉండేది.
‘నేను నటుడిని కాగలనా?’ అని మనసులో ఒక ప్రశ్న.
‘కావాలంటే ఏంచేయాలి?’ అనేది మరో ప్రశ్న.
‘మంచి నటుడు కావాలంటే ఏంచేయాలి?’ అని ఒక పెద్దాయనను అడిగినప్పుడు....
‘మందుకొట్టే అలవాటు ఉందా?’
‘సిగరెట్ తాగే అలవాటు ఉందా?’ అని అడిగాడు.
‘అప్పుడప్పుడు తాగుతాను’ అని జవాబు ఇచ్చారు షిండే.
‘‘చెడు అలవాట్లేమీ లేకుంటేనే మంచి నటుడివి కాగలవు’ అని విలువైన సలహా ఇచ్చాడు ఆ పెద్దాయన.
ఇక అప్పటి నుంచి...
‘శరీరంపై శ్రద్ధ చూపాలి. యోగా చేయాలి’ ‘కొత్త జీవితం మొదలు పెట్టాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నారు షిండే. అంతే కాదు...
‘నటన’ గురించి తెలుసుకోవడానికి ఎందరితోనో మాట్లాడేవాడు. నటనకు సంబంధించి ఎన్నో పుస్తకాలను చదివేవాడు. దాదర్‌స్టేషన్ సమీపంలో ఒక పుస్తకాల దుకాణంలో కనిపించిన భరతముని ‘నాట్యశాస్త్ర’ పుస్తకాన్ని కూడా వదల్లేదు. ‘అభినయ సాధన్’లాంటి మరాఠీ పుస్తకాల నుంచి కూడా నోట్స్ తయారు చేసుకునేవాడు. ఇంట్లో వాళ్లు మాత్రం...
‘వీడికేమైనా పిచ్చా’ అనుకునేవాళ్లు.
‘ధార్మియ’ అనే మరాఠీ నాటకంలో షిండే చేసిన హిజ్రా పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది.
స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది. షిండేను నిజమైన హిజ్రా అనుకున్నారు చాలామంది. ఈ హిజ్రా పాత్రతో ప్రముఖల దృష్టిలో పడిన షిండేకు ఎన్నో మరాఠీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. 2000 సంవత్సరంలో వచ్చిన ‘భారతి’ అనే తమిళ సినిమాలో ప్రఖ్యాత కవి సుబ్రమణ్య భారతిగా నటించి... దక్షిణాది సినీ పరిశ్రమకు దగ్గరయ్యారు.
‘ఠాగూర్’ సినిమాలో ‘బద్రీనారాయణ’గా నటించడంతో తెలుగు చలన చిత్రసీమకు ‘షాయాజీ షిండే’ రూపంలో సరికొత్త విలన్ పరిచయం అయ్యాడు.