తెలుగు సినిమాల్లో జాతర ఎపిసోడ్స్ ప్రేక్షకులను థియేటర్స్‌కు వచ్చేలా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది జాతర జోరు బాగా కనిపించింది. కొన్ని చిత్రాల్లో జాతర ఎపిసోడ్స్ కీలకంగా నిలవగా, కొన్ని చిత్రాలు జాతర నేపథ్యంలోనే సాగాయి. సినిమా హిట్‌కి జాతర ఓ కారణంగా నిలిచింది. ఇక 2024లో వెండితెరపై జాతర హైలైట్‌గా నిలిచిన తెలుగు చిత్రాల గురించి తెలుసుకుందాం.
అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ సినిమా ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తోంది. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను మించిందని ఈ సినిమా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ఇంకా ప్రదర్శితమవుతోంది. దీంతో ‘పుష్ప: ది రూల్’ వసూళ్లు ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఈ సినిమా విజయానికి ఓ ముఖ్య కారణం జాతర ఎపిసోడ్ అన్నది కొందరి అభిప్రాయం.
ఈ ఎపిసోడ్‌లో కొత్త గెటప్‌లో అల్లు అర్జున్ నటన, దర్శకుడు సుకుమార్ టేకింగ్, కొరియోగ్రాఫర్ విజయ్ నృత్యరీతులకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ జాతర ఎపిసోడ్ లుక్‌తోనే ఈ సినిమా క్లైమాక్స్‌లోనూ అల్లు అర్జున్ ఫైట్ ఉండటం విశేషం. ఈ ఎపిసోడ్‌ని దాదాపు మూడు నెలలు డిజైన్ చేసుకుని, నెల రోజుల పాటు, భారీ బడ్జెట్‌తో చిత్రీకరించారని తెలిసింది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ స్వరకర్త. మరో సంగీత దర్శకుడు సామ్‌సీఎస్ ఈ జాతర ఎపిసోడ్‌కు ఆర్‌ఆర్ అందించారని తెలిసింది. ఇక ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన ‘దేవర’లోనూ జాతర ఎపిసోడ్ హైలైట్ అయింది.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ తండ్రీ కొడుకుగా (తండ్రి దేవర, కొడుకు వర పాత్రల్లో ఎన్టీఆర్ నటించారు) నటించిన ఈ సినిమా తొలి భాగం ‘దేవర పార్టు 1’ సెప్టెంబరు 27న విడుదలైంది. ఈ సినిమాలో జాతర నేపథ్యంలో వచ్చే రెండు సన్నివేశాలు (ఒక సన్నివేశం దేవరతో, మరొక సీన్ వరతో) కథను మలుపు తిప్పుతాయి. ఇలా జాతర ఎపిసోడ్స్ ‘దేవర పార్టు 1’లో కీలకంగా కనిపిస్తాయి. అలాగే జాతర సమయంలో ‘వీరాధి వీరుల తిరునాళ్ల జరుపుకోవాల... రారా వీర’ అంటూ లిరిక్స్‌తో సాగే ‘ఆయుధ పూజ’ పాట కూడా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.
‘దేవర’ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. అలాగే ఈ ఏడాది వచ్చిన హిట్ మూవీస్‌లో ‘క’ చిత్రం ఒకటి. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రంతో సుజీత్ – సందీప్ ద్వయం దర్శకులుగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోని జాతర ఎపిసోడ్ కథకు కీలకంగా ఉంటుంది. అలాగే ‘ఆడు ఆడు ఆడు... అమ్మోరే మురిసేలా ఆడు’ అంటూ వచ్చే జాతర పాట ప్రేక్షకులను అలరించింది. ‘పుష్ప: ది రూల్’ సినిమా జాతర ఎపిసోడ్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు సామ్ సీఎస్‌యే ‘క’ సినిమాకు స్వరకర్త. ఇలా జాతర ఎపిపోడ్స్‌తో కథ మలుపు తిరిగిన సినిమాలు కొన్నైతే, జాతర నేపథ్యంలోనే మరికొన్ని సినిమాలు తెలుగు తెరపైకి వచ్చాయి.
యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ ఫిల్మ్ ‘పొట్టేల్’ ఈ కోవలోకే వస్తుంది. తెలంగాణలోని ఓ ఊర్లో పుష్కరానికి ఒకసారి జరిగే జాతర నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. జాతర నేపథ్యమే కాకుండా చదువు ప్రాముఖ్యతను కూడా తెలిపేలా దర్శకుడు సాహిత్ మోత్ఖురి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అలాగే నూతన నటీనటులు సందీప్ సరోజ్, త్రినాథ్ వర్మ, ఈశ్వర్ రచిరాజు, పెండ్యాల యశ్వంత్ తదితరులు నటించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ హిట్ ఫిల్మ్‌గా నిలిచింది.
నూతన దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన ఈ సెమీ పీరియాడికల్ ఫిల్మ్ పురుషోత్తంపల్లి అనే గ్రామంలో జరిగే సంఘటనలు, రాజకీయాలు, స్నేహం నేపథ్యంలో ఉంటుంది. పన్నెండేళ్లకొకసారి పురుషోత్తంపల్లిలో జరిగే భరింకాళమ్మ తల్లి జాతర ఈ సినిమాకు కీలకంగా ఉంటుంది. ఈ జాతర ఎపిసోడ్ అలరించింది. ఇంకా ధ్రువ వాయు నటించి, దర్శకత్వం వహించిన ‘కళింగ’ సినిమాలో కూడా జాతర ప్రస్తావన, జాతర సాంగ్ ఉంటాయి. ఇలా జాతర టచ్‌తో ఈ ఏడాది వచ్చిన అన్ని సినిమాలూ ఆడియన్స్ మెప్పు పొందడం విశేషం. 2024తో ఈ జాతర ఆగడంలేదు... 2025లో రానున్న చిత్రాల్లో కొన్నింటిలో ‘జాతర’ సందడి కనిపించనుంది. – ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment