
టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయాజీ షిండే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈమేరకు ఆయన అధికారికంగా ప్రకటించారు. మహారాష్ట్రకు చెందిన సాయాజీ షిండే నటుడిగా తెలుగువారికి సుపరిచితులే. టాలీవుడ్‌లో ఆయన చాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే, గత కొద్దిరోజులుగా సినిమాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని రీతిలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు.
మహారాష్ట్రలోని NCP (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)లో తాజాగా ఆయన చేరారు. అజిత్ పవార్ నేతృత్వంలో ఉండే వర్గంలో ఆయన చేరారు. ఎన్‌సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సతారా జిల్లాలోని తన సొంత నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.

జేడీ చక్రవర్తి నటించిన 'సూరి'తో తెలుగు తెరకు పరిచయమైన సాయాజీ షిండే.. 'ఠాగూర్'తో పాపులర్ అయ్యారు. చాలా సినిమాల్లో ఆయన విలన్ పాత్రలే పోషించారు. పోకిరి,అతడు, రాఖీ,నేనింతే,కింగ్,అదుర్స్ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.