మిషన్‌ మేకోవర్‌ | Tollywood young heroes who are supporting in new look | Sakshi
Sakshi News home page

మిషన్‌ మేకోవర్‌

Published Sun, Jun 23 2024 12:15 AM | Last Updated on Sun, Jun 23 2024 5:19 AM

Tollywood young heroes who are supporting in new look

సినిమా కథకు తగ్గట్లుగా డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్‌ చేయడమే కాదు... క్యారెక్టరైజేషన్‌కు సరిపోయేట్లు హీరోల ఆహార్యం కూడా ఉండాలి... గెటప్‌ కుదరాలి. అప్పుడే సిల్వర్‌ స్క్రీన్‌పై కథ ఆడియన్స్‌కు మరింత కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. ఇలా కనెక్ట్‌ కావడం కోసం కొందరు హీరోలు మేకోవర్‌ మిషన్‌ను స్టార్ట్‌ చేశారు. ఇప్పటికే ‘తండేల్‌’ కోసం నాగచైతన్య, ‘స్వయంభూ’కి నిఖిల్, ‘స్వాగ్‌’కి శ్రీవిష్ణు వంటి హీరోలు మేకోవర్‌ అయ్యారు. త్వరలో సెట్స్‌కి వెళ్లడానికి మిషన్‌ మేకోవర్‌ అంటూ రెడీ అవుతున్న హీరోల గురించి తెలుసుకుందాం.

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సిల్వర్‌ స్క్రీన్‌పై మహేశ్‌బాబును సరికొత్తగా చూపించాలని రాజమౌళి ఫిక్స్‌ అయిపోయారు. ఇందుకు తగ్గట్లుగానే మహేశ్‌ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. మేకోవర్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జనవరిలో మహేశ్‌ విదేశాలకు వెళ్లొచ్చారు. ఈ సినిమాలో మహేశ్‌ లుక్, గెటప్‌ కంప్లీట్‌ డిఫరెంట్‌గా ఉండేలా రాజమౌళి ప్లాన్‌ చేశారని తెలుస్తోంది.

ఈ చిత్రకథను ఇప్పటికే పూర్తి చేశారు విజయేంద్రప్రసాద్‌. పాటల పని కూడా ఆరంభించారు సంగీతదర్శకుడు కీరవాణి. ఈ ఫారెస్ట్‌ యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీ చిత్రీకరణ ఈ ఏడాదిలోనేప్రారంభం కానుందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ ఆగస్టు 9న మహేశ్‌బాబు బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ సినిమా చిత్రీకరణ గురించిన అప్‌డేట్‌ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలని అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. కేఎల్‌ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. 
 
 కొత్త సినిమా మేకోవర్‌ అంటే చాలు... ఎన్టీఆర్‌ రెడీ అనేస్తారు. ఈసారి దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌కు ఎన్టీఆర్‌ ఓకే చెప్పారు. ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభిస్తామని ఇటీవల మేకర్స్‌ వెల్లడించారు. అయితే ఈ గ్యాప్‌లో ఈ సినిమా కోసం మేకోవర్‌ అయ్యేలా ఎన్టీఆర్‌ ప్లాన్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్‌. వీలైనంత త్వరగా ఈ సినిమా తొలి భాగం షూట్‌ను పూర్తి చేసి, ‘డ్రాగన్‌’ మేకోవర్‌ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారట ఎన్టీఆర్‌. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికా మందన్నా, విలన్‌గా బాబీ డియోల్‌ల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. 
 
 ‘గేమ్‌ చేంజర్‌’ సినిమా షూటింగ్‌తో రామ్‌చరణ్‌ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత రామ్‌చరణ్‌ ఆస్ట్రేలియా వెళ్తారు. హాలీడే కోసం కాదు.... బుచ్చిబాబు సన దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలోని క్యారెక్టర్‌ మేకోవర్‌ కోసం వెళ్లనున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఆగస్టులోప్రారంభించనున్నట్లుగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బుచ్చిబాబు. కాగా రూరల్‌ స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో సాగే ఈ మూవీలోని గెటప్స్‌ కోసం చరణ్‌ ప్రత్యేక్ష శిక్షణ తీసుకోనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్, వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 
 
 విజయ్‌ దేవరకొండను ఇప్పటివరకు అర్బన్, సెమీ అర్బన్‌ కుర్రాడిగానే ఎక్కువగా సిల్వర్‌ స్క్రీన్‌పై చూశాం. కానీ తొలిసారి పక్కా పల్లెటూరి కుర్రాడిలా కనిపించేందుకు రెడీ అవుతున్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణిగారు’ ఫేమ్‌ రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో రూరల్‌ మాస్‌ డ్రామాగా ఓ మూవీ రానుంది. ఈ సినిమా కోసమే విజయ్‌ పల్లెటూరి మాస్‌ కుర్రాడిగా మేకోవర్‌ కానున్నారు. ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే తన కొత్త మేకోవర్‌ ఆరంభిస్తారట విజయ్‌. 

అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన గత చిత్రం ‘ఏజెంట్‌’. ఈ స్పై మూవీ కోసం అఖిల్‌ స్పెషల్‌గా మేకోవర్‌ అయ్యారు. సిక్స్‌ ప్యాక్‌ బాడీని డెవలప్‌ చేశారు. ఈ సినిమా తర్వాత అఖిల్‌ నటించాల్సిన కొత్త సినిమా గురించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ అఖిల్‌ అనే ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఫ్యాంటసీ అండ్‌ పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీలో అఖిల్‌ హీరోగా నటిస్తారని, 11వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ ట్రైబల్‌ నాయకుడిగా అఖిల్‌ కనిపిస్తారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ్రపోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి.

ఈ సినిమాలోని తన గెటప్‌ కోసమే అఖిల్‌ మేకోవర్‌ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో కాస్త పోడవాటి జుట్టుతో, సరికొత్త ఫిజిక్‌తో అఖిల్‌ సరికొత్తగా కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ మూవీ కోసమే అఖిల్‌ ఇలా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారట. దాదాపు రూ. వంద కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిలింస్‌ ఈ చిత్రాన్ని  నిర్మించనున్నాయనే ప్రచారం సాగుతోంది.  
 ఈ హీరోలే కాదు... కథానుగుణంగా మేకోవర్‌ అవుతున్న హీరోలు మరికొందరు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement